సాఫ్ట్‌గా తొలగించేస్తున్నారు!

* ఐటీ ఉద్యోగానికి కొరవడిన భరోసా
* ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి
* వేతనాలు ఎక్కువున్న సీనియర్లపై ప్రభావం
* పనితీరు బాగోలేదంటూ జూనియర్లనూ..
* కార్మిక చట్టాలను పట్టించుకోని ఐటీ సంస్థలు
* ఆందోళనలో ఉద్యోగులు

ఈనాడు - హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి 20 ఏళ్ల అనుభవముంది. ప్రాజెక్టుల ప్రోగ్రామ్‌లు రాయడం, నిర్వహించడంలో మంచి సమర్థత ఉంది. రెండువారాల క్రితమే ఆయన పనితీరు మెచ్చుకుని కంపెనీ ఏకంగా ‘ఏ’ గ్రేడ్‌ ఇచ్చింది. రెండు రోజుల క్రితం ఉద్యోగం వదిలివెళ్లాలని మానవ వనరుల విభాగం నుంచి కబురొచ్చింది. ‘‘మీ పనితీరు బాగాలేదు. అందుకే ‘డీ’ గ్రేడ్‌ ఇస్తున్నాం’’ అని చెప్పారు.
నగరంలో ఆఫ్‌షోర్‌ కార్యాలయమున్న ఓ కంపెనీలో ఒకేసారి 14 మందిని తొలగించారు. ఇదేంటని అడిగితే పనితీరు బాగాలేదన్నారు. కానీ, వారందరికీ రక్షితమైన బీ, సీ గ్రేడ్‌ ఉంది. హెచ్‌ఆర్‌ సిబ్బంది గంటలోగా రాజీనామా చేయాలని చెప్పడంతో బయటకు వచ్చేశారు.
ఐటీ ఉద్యోగం అంటే రూ.వేలు, లక్షల్లో వేతనాలంటూ గొప్పగా చెప్పుకొంటారు. 20 ఏళ్లుగా యువ ఇంజినీర్లు, ఐటీ కోర్సుల పట్టభద్రులకు ఉద్యోగాలిచ్చే కల్పతరువుగా కొనసాగింది. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు సంక్షోభాల ప్రభావం ఈ రంగంపై పడింది. ఇప్పుడు మళ్లీ ఐటీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఐటీ నిపుణులు బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. సాంకేతిక కారణాలతో గతంలో ఏటా 5శాతం ఉండే తొలగింపులు ఈ ఏడాది రెండింతలయ్యాయి. గత తొమ్మిది నెలల్లో హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారిలో ‘పనితీరు బాగాలేదు’ అంటూ పదిశాతం ఉద్యోగులను తొలగించారని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది 12-15 శాతం వరకు వెళ్లే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. వేతనాల రూపంలో ఆర్థిక భారం, అంతర్జాతీయ రక్షణాత్మక ధోరణులు, నూతన ప్రాజెక్టులపై సందిగ్ధత, కొత్త టెక్నాలజీలంటూ కారణాలెన్నో తెరపైకి వస్తున్నాయి.
మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది..
ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగించేందుకు గ్రేడింగ్‌ను సాకుగా చూపిస్తుంటారు. ప్రాజెక్టు మేనేజర్లకు నచ్చితే ఒక రేటింగ్‌.. లేకుంటే మరో రేటింగ్‌ ఇస్తుంటారు. నాలుగు కేటగిరీల్లో ఎంత శాతం మందికి రేటింగ్‌ ఇవ్వాలన్నది ముందుగానే నిర్ణయం జరిగిపోతుంది. ఆ మేరకు ప్రాజెక్టు లీడర్లు, మేనేజర్లు వ్యవహరిస్తుంటారు. ‘‘నా ప్రాజెక్టు కింద దాదాపు 100 మంది పనిచేస్తున్నారు. వీరంతా టెక్నాలజీలో అనుభవజ్ఞులే. కానీ, కంపెనీ గ్రేడింగ్‌ ఇవ్వడంలో కొన్ని విధానాలు సూచిస్తుంది. ఇందులో భాగంగా పది మందికి తప్పనిసరిగా ‘డీ’ ఇవ్వాల్సిందే. వీరు నిపుణులు కారని కాదు.. కానీ, తప్పనిపరిస్థితిలో ఏమీ చేయలేం’’ అని ఓ ఐటీ సంస్థలో ప్రాజెక్టు లీడర్‌గా పనిచేస్తున్న నిపుణుడు పేర్కొన్నారు. ‘‘ఉద్యోగుల అవసరమున్నప్పుడు కేటగిరీలు, గ్రేడింగ్‌లను పరిగణనలోకి తీసుకోరు. ఏమాత్రం ఇబ్బందులు వచ్చినా చివరి వ్యక్తి బలవ్వాల్సిందే’’ అని హైదరాబాద్‌లోని ఐటీ నిపుణుడు తెలిపారు. తక్కువ రేటింగ్‌ ఉన్న ఉద్యోగులు తమ పనితీరు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలని, నూతన టెక్నాలజీ నేర్చుకోవాలని చెబుతున్నారు.
సీనియర్లొద్దు.. జూనియర్లే ముద్దు..
ఐటీ రంగంలో అనుభవం మేరకు సీనియర్లకు వేతనాలు ఎక్కువే. ఏడాదికి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఉంటున్నాయి. ఎవరినైనా తొలగించాలనుకుంటే కంపెనీలు ముందుగా ఆర్థిక పరమైన లెక్కలు చూసుకుంటున్నాయి. ‘‘మా సంస్థలోని ఒక ప్రాజెక్టులో ఎక్కువ వేతనంపై పనిచేస్తున్న ఇద్దరిని తొలగించారు. వారి స్థానంలో ఇద్దరు కొత్త ఇంజినీర్లు వచ్చారు. వీరిద్దరి వేతనం ఒక సీనియర్‌ వేతనంతో సమానంగా ఉంది’’ అని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తెలిపారు. కొన్ని సందర్భాల్లో సీనియర్లను ఇంటికి పంపించినప్పటికీ.. నూతన ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. భవిష్యత్తు అవసరాల కోసమని కొన్ని యూనిట్లు, వ్యాపారాలను ఐటీ సంస్థలు నిర్వహించేవి. ఇవన్నీ నష్టాలు వచ్చినప్పటికీ కొనసాగించేవారు. ఇతర విభాగాల లాభాలను మళ్లించేవారు. ఇప్పుడు నష్టాల విభాగాలను మూసివేయడంతో ఉద్యోగాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది.
ప్రాజెక్టుల్లో ఉన్నవారినీ..
గతంలో ప్రాజెక్టుల్లో లేనివారు, డీ గ్రేడింగ్‌ వచ్చిన వారిపై కత్తి వేలాడేది. ప్రతి కంపెనీలో కొందరు ఉద్యోగులు ఎప్పుడూ బెంచిపై ఉంటారు. మూణ్నెల్లపాటు బెంచిపై ఉంటే భయం. ఇక ఆర్నెల్లంటే ఇంటికి వెళ్లాల్సిందే. ఒకవేళ ఉద్యోగులను తొలగించాలనుకున్నా ఇలాంటి నిపుణులను టార్గెట్‌ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రాజెక్టులో ఉన్నవారినీ పంపిచేస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లో దాదాపు పదివేల మందిని ఉద్యోగాల నుంచి తీసివేశారని ఐటీ నిపుణుల సంఘాలు చెబుతున్నాయి. ‘‘ఆటోమేషన్‌తో నలుగురు చేసే పని ఒకరే చేయాల్సి వస్తుంది. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ టాస్క్‌లు ఆటోమేటెడ్‌గా అప్‌గ్రేడ్‌ అవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు మరింత ప్రమాదాలను సూచిస్తోంది’’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ట్రంప్‌ ప్రభావం దేశీయ, విదేశీ కంపెనీలపై పెద్దగా లేదు. కానీ, అక్కడ నిపుణులైన పట్టభద్రులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌ తదితర దేశాలు రక్షణాత్మక ధోరణి అవలంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని తొలగింపులు ఉండే అవకాశముంది’’ అని నిపుణులు చెబుతున్నారు.
కార్మికచట్టాల అమలు ఏదీ..?
ఐటీ సంస్థల్లో కార్మిక చట్టాల అమలు కాగితాలపైనే ఉంటోంది. ఉద్యోగిని తొలగించేందుకు కనీస నిబంధనలు పాటించడం లేదు. ఉదయం వరకు పనిచేసిన ఉద్యోగికి సాయంత్రం ఉద్యోగం ఉంటుందో వూడుతుందో తెలియడం లేదు. ఫోన్‌కాల్‌ చేసి గంటలోపు ఉద్యోగం మానేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. చెప్పినట్టు చేస్తే ప్యాకేజీ ఇస్తామని లేకుంటే కుదరదని చెబుతున్నారు. కనీస చట్టాల అమలు లేకపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1000 మందికి పైగా నిపుణులు కార్మికశాఖకు ఫిర్యాదు చేశారు.
తొలగింపుపై శ్వేతపత్రంవిడుదల చేయాలి -ప్రవీణ్‌, ఫోరం ఫర్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌
ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇష్టానుసారంగా తొలగిస్తున్నాయి. కార్మిక చట్టాల్లోని నిబంధనలు పాటించడం లేదు. పదేళ్ల నుంచి పనిచేస్తున్న సిబ్బందిని వివిధ కారణాలతో ఇంటికి పంపిస్తున్నారు. హైదరాబాద్‌లోనే వేలాది మందిని తొలగించారు. లాభాలు వస్తున్నా కంపెనీలు ఎందుకు తొలగిస్తున్నాయో చెప్పాలి.
ఉత్పత్తి ఆధారితకంపెనీలు రావాలి -సందీప్‌కుమార్‌, తెలంగాణ ఐటీ అసోసియేషన్‌
70శాతం అమెరికా, బ్రిటన్‌ దేశాల ప్రాజెక్టులపై ఆధారపడుతున్నాం. అక్కడి కంపెనీలు రక్షణాత్మక ధోరణి అవలంబిస్తున్నాయి. ఐటీ ఉత్పత్తి ఆధారిత కంపెనీలు రావాలి. సీనియర్లు కొత్త టెక్నాలజీ నైపుణ్యాలు నేర్చుకోవడంతో సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ విషయంలో సరైన టెక్నాలజీ ఎంచుకోవాలి. సీనియర్‌ ఉద్యోగులు స్టార్టప్‌ రంగంలోకి అడుగు పెడితే భవిష్యత్తు తరాలకు ఉద్యోగాల భరోసా లభిస్తుంది.
ఇదీ స్వరూపం..
హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు దాదాపు 1500
ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు 4.3 లక్షలు
ఏటా ఎగుమతులు రూ.85,470 కోట్లు
ఈ ఏడాదిలో ఉద్యోగుల తొలగింపులు దాదాపు 10 శాతం

Posted on 14-09-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning