గేట్‌-2018.....తుదివరకూ ప్రేరణ

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) ఇంజినీరింగ్‌ విద్యార్థులు రాసే పరీక్షల్లో ముఖ్యమైనది. ఈ పరీక్ష సన్నద్ధత విషయంలో విద్యార్థులకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనవాటిని నివృత్తి చేసే కథనమిది!

గేట్‌కు తయారయ్యే విద్యార్థులు సాధారణంగా చేసే తప్పులేంటి?
జ: గేట్‌ సిలబస్‌ పరంగా ఏయే అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలో గుర్తించకపోవడం ప్రధాన తప్పిదం. కాబట్టి మార్కులు ఎక్కువ వచ్చే సబ్జెక్టులపై దృష్టిపెట్టడం ముఖ్యం.
ఇతర తప్పిదాలు...
* సన్నద్ధత విషయంలో ప్రేరణ కోల్పోవడం. చదివే సమయంలో ఏదైనా విషయంలో ఉదాహరణకు- కొన్ని ప్రశ్నలకు సమాధానాలను రాబట్టడంలో విఫలమైనప్పుడు, సామాజిక, కుటుంబపరమైన సమస్యలు ఎదురైనప్పుడు మనస్తాపానికి గురై ప్రేరణను కోల్పోతారు.
* సాధన లోపం. చాలా ముఖ్యమైన గత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయకపోవడం
* అనేక మెటీరియళ్ళను సాధన చేయడం. ఈ పొరపాటు చేస్తూ ఒక ప్రామాణిక పాఠ్యపుస్తకాన్నే చివరివరకూ కొనసాగించాలనే విషయాన్ని విస్మరించడం.
* పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.
కఠిన సబ్జెక్టులను సాధన చేయడమెలా?
జ: మొదట కఠినమనే ఆలోచన నుంచి బయటపడాలి. అలా అనిపించే సబ్జెక్టు నుంచి గతంలో అడిగిన ప్రశ్నలను పరిశీలించడం ద్వారా వాటిని అర్థం చేసుకుని సాధన చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. సాధారణంగా చాలామంది విద్యార్థులు కఠినంగా అనిపించిన సబ్జెక్టులకోసం తర్ఫీదు పొందుతారు. ఈ సమయంలో ఒక తరగతినీ వదలకుండా శ్రద్ధగా విని సబ్జెక్టును సరైన విధంగా అర్థం చేసుకుని సాధన చేయాలి. లేదా ఒక ప్రామాణిక పాఠ్యపుస్తకాన్ని ఎంచుకుని అందులోని ప్రాథమిక అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని అనేక న్యూమరికల్‌ ప్రశ్నలను సాధన చేయాలి. ఎక్కువ మాదిరి పరీక్షలను సాధన చేయడం ద్వారా కూడా కఠినమనుకునే సబ్జెక్టులను సులభం చేసుకోవచ్చు.
సన్నద్ధతలో పరీక్ష సమయం వరకూ ప్రేరణ (మోటివేషన్‌)ను కొనసాగించడమెలా?
జ: గేట్‌లో ఉత్తమ ర్యాంకును సాధించడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఉత్తమ ర్యాంకును సాధించాలనే బలమైన కాంక్ష నిరాటంకంగా ప్రేరణను కలిగిస్తుంది. అభ్యర్థి స్థాయిలోని సీనియర్లు ఉత్తమ ర్యాంకులను సాధించగలిగినప్పుడు తాను కూడా కష్టపడితే అలాంటి ఫలితాలనే సాధించగలననే నమ్మకం విద్యార్థికి మంచి ప్రేరణను ఇస్తుంది.
ఏరోజు సాధన చేసిన విషయాలను అదేరోజు పడుకునే ముందు బేరీజు వేసుకోవడం ద్వారా పురోగతిని సాధించవచ్చు. కఠినమైన విషయాలను సహాధ్యాయులతో చర్చించడం ద్వారా ఆ విషయాలు సులభంగా అర్థం చేసుకోవడమే కాకుండా ఇంకొంత నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. మాదిరి పరీక్షలు రాసినపుడు మంచి మార్కులు సాధిస్తే మంచి ప్రోత్సాహం కలుగుతుంది. తద్వారా సాధించగలమనే విశ్వాసం పెరుగుతుంది. తక్కువ మార్కులు వచ్చినా తప్పులు పునరావృతం కాకూడదనే పట్టుదల పెరుగుతుంది. వీటన్నింటి ద్వారా ప్రేరణా కొనసాగుతుంది.
చాలామంది గేట్‌లో విఫలం కావడానికి గల కారణాలేంటి?
జ: ప్రాథమిక అంశాలపై సరైన అవగాహన పెంచుకోకుండా, ప్రశ్నల కఠినత్వాన్ని అర్థం చేసుకోకుండా విద్యార్థులు ప్రశ్నలను సాధన చేయడం, దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా పరీక్ష సమయానికి కొన్ని నెలలు/ వారాల ముందే సాధన మొదలుపెట్టడం, సిలబస్‌లో కొన్ని అంశాలను కఠినంగా భావించి సాధన చేయకపోవడం వంటి కారణాల రీత్యా చాలామంది గేట్‌లో విఫలమవుతుంటారు. కానీ ఈ అంశాలన్నీ గేట్‌ ప్రశ్నపత్రం పరంగా చాలా విలువైనవి.
ఎంతసేపూ సాధనపైనే నిమగ్నమవడం, సాధన చేసిన అంశాలను పునశ్చరణ చేయాలనే అంశాన్ని విస్మరించడం కూడా ఒక కారణమే. గేట్‌ వంటి పోటీపరీక్షల్లో పునశ్చరణకు చాలా ప్రాముఖ్యముంది. ఇవే కాకుండా పరీక్ష ముందుకానీ రాసే సమయంలోకానీ ఒత్తిడికి లోనవడం, పరీక్ష సమయంలో ఒకే ప్రశ్నపై ఎక్కువ సమయాన్ని వృథా చేయడం వల్ల మిగతా వాటికి సమయం సరిపోకపోవడం కూడా కారణాలే. ఒక్కోసారి ప్రాంగణ నియామకాలు ఎంపికవడం వల్ల.. లేదా వేరే ఉద్యోగావకాశం రాగానే పరీక్ష సన్నద్ధతను కొనసాగించలేకపోతుంటారు.
ఈ పరీక్ష ప్రశ్నలను ఎలా తయారు చేస్తారు?
జ: సాధారణంగా గేట్‌ ప్రశ్నలు ప్రాథమికాంశాలపైనే ఉంటాయి. ఐఐటీ అధ్యాపకులు ప్రాథమిక అంశాలపై విద్యార్థుల అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలను రూపొందిస్తారు. కొన్ని ప్రశ్నలు ఎంతో సులువుగా అనిపించినా ప్రశ్నపత్ర రూపకర్తలు విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా ఈ ప్రశ్నల రూపకల్పన చేస్తారు. ఉదా: బహుళైచ్ఛిక ప్రశ్నల్లో నాలుగు ఆప్షన్లూ సరైనవిగానే అభ్యర్థి భ్రమపడేలా ఇస్తారు.
గతంలో ఎప్పుడూ స్పృశించని అంశాలపైనా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశాన్నీ తోసిపుచ్చలేం. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలను ప్రామాణిక పాఠ్యపుస్తకాల నుంచి యథావిధిగా లేదా కొద్దిపాటి మార్పులతో రూపొందిస్తుంటారు.
ఈ పరీక్ష సన్నద్ధతకు కోచింగ్‌ అవసరమా?
జ: విద్యార్థి తన విషయపరిజ్ఞాన స్థాయినిబట్టి కోచింగ్‌ తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో తమ అధ్యాపకులు, సీనియర్లు, సహవిద్యార్థుల సలహాను తీసుకోవడం మేలు. విద్యార్థులకు కోచింగ్‌ ఏది చదవాలి? ఏది చదవకూడదు అనే విషయంలో దిశానిర్దేశం చేస్తుంది. కోచింగ్‌ సంస్థ అందించే మెటీరియల్‌ ఈ విషయంలో చాలా ఉపయోగపడుతుంది.
అనుభవజ్ఞుల మార్గదర్శకంలో నేర్చుకోవడం ద్వారా కఠినమైన విషయాలను సులభతరం చేసుకోవచ్చు. కోచింగ్‌ సంస్థల్లో వివిధ స్థాయుల విద్యార్థులు ఉండటం వల్ల అభ్యర్థిలో మంచి పోటీతత్వం నెలకొంటుంది. మంచి సంస్థలు విద్యార్థికి గేట్‌లో విజయం సాధించిన తరువాత కూడా తన ర్యాంకు ఆధారంగా సరైన నిర్ణయం (ఉన్నతవిద్య/ ఉద్యోగం) తీసుకోవడంలో సాయపడతాయి.
లోతైన విషయపరిజ్ఞానమున్న విద్యార్థులు ప్రామాణిక పాఠ్యపుస్తకాలను చదివి అందులోని ప్రశ్నలను సాధన చేసి, ఆ పరిజ్ఞానంతో గత ప్రశ్నపత్రాలను పరిష్కరించగలిగితే కోచింగ్‌ అవసరం లేకుండానే పరీక్షలో విజయం సాధించవచ్చు. తక్కువ సమయంలో మంచి ర్యాంకును సాధించడంలోనూ కోచింగ్‌ తోడ్పడుతుంది.
అభ్యర్థులకు ఉపయోగపడే పాఠ్యపుస్తకాలు, వెబ్‌సెట్లు్ల..?
జ: ఐఐటీ, ప్రముఖ అంతర్జాతీయ అధ్యాపకులు రాసిన ప్రామాణిక పాఠ్యపుస్తకాలను చదవడం ద్వారా తగిన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ఉదా: ఇంజినీరింగ్‌ మేథమేటిక్స్‌ సాధన కోసం బి.ఎస్‌. గ్రేవల్‌, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌ కోసం ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌ వంటివి.
మార్కెట్‌లో దొరికే చాలా పుస్తకాలను అధ్యయనం చేయడం కంటే ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో ప్రామాణిక పాఠ్యపుస్తకాన్ని ఎంచుకోవడం ఉత్తమం.NPTEL వెబ్‌సైట్‌లో ఎంపిక చేసిన వీడియోలు, మెటీరియళ్లను అనుసరించడం ద్వారా ప్రాథమిక అంశాలపై కూలంకష అవగాహన పెంచుకోవచ్చు.
గేట్‌లో 50 కంటే ఎక్కువ మార్కులను సాధిస్తే కలిగే ప్రయోజనాలేంటి?
జ: పోటీతత్వం, పరీక్ష కఠినత్వంపై ఆధారపడి గేట్‌ మార్కులు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఒక అభ్యర్థి 50 కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే..
* పీఎస్‌యూల్లో మౌఖిక పరీక్షకు ఎంపికవుతారు.
* ఐఐఎస్‌సీ/ ఐఐటీ/ ఎన్‌ఐటీ తదితర ప్రఖ్యాత సంస్థల్లో ఉన్నత విద్య (ఎంటెక్‌/ ఎంఎస్‌) ప్రవేశం, పరిశోధన విద్య (పీహెచ్‌డీ)లకు ప్రవేశం పొందవచ్చు.
* ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నతవిద్య (ఎంఎస్‌)కు ప్రవేశం పొందవచ్చు.
ఒకవేళ తక్కువ మార్కులు సాధిస్తే..?
జ: గేట్‌లో తక్కువ మార్కులు వచ్చాయని అధైర్యపడాల్సిన అవసరం లేదు. వీరికి కూడా అనేక అవకాశాలుంటాయి. ఎంటెక్‌ చేయడమే ఉద్దేశం అయితే కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ప్రముఖ కళాశాలల్లో ఉపకార వేతనంతో కూడిన ప్రవేశాన్ని పొందవచ్చు. తరువాతి రెండు సంవత్సరాల్లో మళ్లీ గేట్‌కు సన్నద్ధమై పీఎస్‌యూల్లో ఉద్యోగంకానీ, ప్రఖ్యాత సంస్థల్లో పీహెచ్‌డీ ప్రవేశం కానీ పొందవచ్చు.
కొన్ని ప్రఖ్యాత సంస్థలు- ఐఐటీలు, బిట్స్‌ పిలానీ వంటివి ఎంటెక్‌ ప్రవేశాలకు తమ సొంత ప్రవేశపరీక్షలను, కొన్ని పీఎస్‌యూలు ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహిస్తాయి. ఈ సన్నద్ధత వీటికీ ఉపయోగపడుతుంది.

- వై.వి.గోపాల‌కృష్ణ‌మూర్తి, ఎండీ, ఏస్ ఇంజినీరింగ్ అకాడ‌మీ

Posted on 18-09-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning