ఇంజినీరింగ్‌ విద్య గమ్యమెటు?

* ప్రక్షాళనకు తరుణమిదే...

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడిన యువతే ఇప్పుడు దేశానికి అతిపెద్ద సమస్య! జాతికి పెట్టని కోటగా మారవలసిన యువతే, బలహీనతగా పరిణమిస్తున్న ఈ వైనం ఆందోళన కలిగిస్తోంది. ఇదే మూస పద్ధతి కొనసాగితే వచ్చే పదేళ్లలో దేశంలో సాంకేతికంగా సిసలైన నైపుణ్యాలున్న యువత బొత్తిగా కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల తీరుతెన్నులను విశ్లేషించిన ‘అస్పైరింగ్‌ మైండ్స్‌’ అనే సంస్థ- ఆధునిక సవాళ్ల నేపథ్యంలో దేశంలోని యువజనానికి ఉద్యోగాలు పొందగల సామర్థ్యాలపై నివేదిక సమర్పించింది. అద్భుతమైన ‘జీపీఏ’తో ఇంజినీరింగ్‌ విద్యను ముగించిన విద్యార్థులను కూడా అనేక కంపెనీలు నైపుణ్యాలు లేవన్న కారణంతో తిరస్కరిస్తున్న వివరాలను వెల్లడించింది. మరీ ముఖ్యంగా దేశంలోని ద్వితీయ, తృతీయ స్థాయి పట్టణాల్లో ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించిన విద్యార్థులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే పదేళ్లలో ఇంజినీరింగ్‌ విద్యారంగానికి గడ్డు పరిస్థితి తప్పదు.
నైపుణ్యాలు నాస్తి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008-10 మధ్యకాలంలో ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో తెలుగునాట సాంకేతిక విద్యపై అందరూ భారీ ఆశలు పెంచుకున్నారు. బెంగళూరు తరవాత హైదరాబాద్‌ను అతిపెద్ద కేంద్రంగా చేసుకొని వివిధ కంపెనీలు భారీగా ఉద్యోగావకాశాలు కల్పించాయి. పదోతరగతి తరవాత ఇంటర్మీడియట్‌లో ఎంపీసీలో చేరే విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది. వీరంతా ఇంజినీరింగ్‌ విద్యపై మక్కువ చూపడంతో కళాశాలలతోపాటు కోర్సులూ భారీగా పెరిగాయి. అయితే కళాశాలలు పెరిగాయేగానీ అందులో అర్హులైన అధ్యాపకులు లేని పరిస్థితి! లక్షల రూపాయలు వెచ్చించి ఇంజినీరింగ్‌ విద్య చదివినా ఎలాంటి నైపుణ్యాలు అందని దురవస్థ విస్తరించింది. ఫలితంగా పెద్దయెత్తున ఇంజినీరింగ్‌ పట్టభద్రులు చిన్నాచితకా ఉద్యోగావకాశాల కోసమూ ఎదురు చూసే దుస్థితి తలెత్తింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకం 2008లో అమల్లోకి వచ్చాక- వివిధ సేవా సంస్థలు సైతం కళాశాల నిర్వహణలోకి వచ్చాయి. అప్పటిదాకా విద్యార్థులు లేక వెలవెలబోయిన కళాశాలలు సర్కారీ సొమ్ముతో రంగులద్దుకున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలిలో చక్రం తిప్పే అధికారులతో జతకట్టిన ఎంతోమంది అనుమతులు పొందగలిగారు. విద్యార్థులను ఎలాగోలా ఆకర్షించి కళాశాలల్లో చేర్పించి ప్రభుత్వం చెల్లించే ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’తో చాలాచోట్ల యాజమాన్యాలు దందా కొనసాగించాయి. అనేక కళాశాలలు విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టించి కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము సొంతం చేసుకున్నాయి. కానీ విద్యార్థుల సామర్థ్యం డొల్లగానే మిగలడంతో అనేక అనుమానాలు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ‘టాస్క్‌ఫోర్సు’ కమిటీని ఏర్పాటు చేసి కళాశాలల్లో తనిఖీలు చేపట్టింది. దాంతో వందలాది ఇంజినీరింగ్‌ కళాశాలల బండారం బయటపడింది. సరైన అధ్యాపకులు లేకుండా తూతూ మంత్రంగా తరగతులు నిర్వహిస్తున్న వైనం, కనీస మౌలిక సదుపాయాలైనా కల్పించకుండా తరగతులు నిర్వహిస్తున్న విడ్డూరం తేటతెల్లమైంది. విద్యా ప్రమాణాలు పాటించని కళాశాలలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 201 ఇంజినీరింగ్‌ కళాశాలలకు మాత్రమే అఖిల భారత సాంకేతిక విద్యామండలి 2017-18 విద్యా సంవత్సరానికి అనుమతి ఇచ్చింది. ఈ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం మొత్తంగా 90,001 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ‘కన్వీనర్‌’ కోటాకింద 66,847 సీట్లు ఉండగా- 54,583 విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. అలాగే ప్రతి ఏటా యాజమాన్య కోటా సీట్లకు విపరీతమైన గిరాకీ ఉండేది. కానీ, ఈసారి 20,054 సీట్లలో 12,264 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. మరోవంక గడచిన కొన్నేళ్లుగా విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యపై అనాసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వివిధ కళాశాలల యాజమాన్యాలు అనేక కోర్సులు రద్దు చేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రాంతంలో మూడేళ్లనాటితో పోలిస్తే ఈ విద్యాసంవత్సరం సుమారు 90వేల సీట్లు తగ్గిపోవడానికి కారణమిదే. ఆంధ్రప్రదేశ్‌లో 2017-18 విద్యా సంవత్సరంలో 321 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 1,67,583 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 307 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లోని 1,63,043 సీట్లకుగాను 15.3శాతం సీట్లు భర్తీ కాకుండానే మిగిలిపోయాయి. విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ తరగతులు ప్రారంభం అయ్యాక పాతిక శాతం విద్యార్థులు బదిలీ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని వెళ్ళిపోయారు.
తగ్గుతున్న మక్కువ
ఇంజినీరింగ్‌ విద్యలో ప్రధానంగా సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఈఈఈ, ఐటీ, ఎంఈ విభాగాలకు తొలినుంచీ అధిక ప్రాధాన్యం ఉంది. ఈ కోర్సుల్లో చదివిన వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయన్న నమ్మకమే అందుకు కారణం. కానీ ఈసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సులకు సైతం చెప్పుకోదగిన స్థాయిలో ఆదరణ లభించకపోవడం గమనార్హం. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సుముఖత చూపడం లేదు. పోటీ ప్రపంచానికి అవసరమైన నాణ్యమైన విద్య అందించడంలో దాదాపు ప్రైవేటు కళాశాలలూ విఫలమవుతుండటమే అందుకు కారణం. సంపన్న శ్రేణికి చెందిన వేలాది విద్యార్థులు ఇతర ప్రైవేటు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో చదివేందుకే ఉత్సాహం చూపుతున్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ఇతర సంస్థల్లో ప్రవేశాలకోసం పోటీపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఐఐటీ, ఎస్‌ఐటీ వంటి సాంకేతిక విద్యా సంస్థల్లో సుమారు 34,895 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చేరేందుకు జెఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌ పరీక్షలకు దేశంలో సుమారు 11.50లక్షల మంది విద్యార్థులు ఏటా పోటీ పడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులు పోటీపడి పరీక్షలు రాస్తే అందులో 6,700 మంది సీట్లు సాధించగలుగుతున్నారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో చదివేందుకూ తెలుగునాట విద్యార్థులు బాగానే పోటీ పడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ విద్యా ప్రమాణాలు పాతాళానికి చేరిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్న పరిణామాలివి.
దేశంలో ఏటా ఎనిమిది లక్షల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు డిగ్రీలు పుచ్చుకొని బయటికి వస్తున్నారు. వీరిలో 40శాతం మాత్రమే వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. మిగిలిన 60శాతం అంటే సుమారు అయిదు లక్షల మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. తెలంగాణలో 2015-16 విద్యా సంవత్సరంలో 84.41శాతం విద్యార్థులు ఇంజినీరింగ్‌ పట్టా తీసుకోగా- అందులో కేవలం 42.56 శాతం మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారు. కిందటి విద్యా సంవత్సరంలో (2016-17) ఇది మరింత కోసుకుపోయి 35.43 శాతం వద్ద నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో 2015-16 విద్యా సంవత్సరంలో 80.18 శాతం విద్యార్థులు ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకున్నారు. వారిలో 44.37 శాతం విద్యార్థులు మాత్రమే అనేక సంస్థల్లో ఉద్యోగాలు పొందగలిగారు. కిందటేడు అది మరింత క్షీణించి కేవలం 38.69 శాతం దగ్గరే నిలిచింది. కేవలం పేరుకు మాత్రమే చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ పట్టా పొందుతున్నారని, వారికి ఎలాంటి నైపుణ్యాలూ అలవడటం లేదని రుజువు చేస్తున్న ఉదాహరణలివి. దేశంలో ఇంచుమించు 95శాతం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎంతమాత్రం నైపుణ్యాలు లేవని, కేవలం అయిదు శాతం మందే కనీస స్థాయి ‘ప్రోగ్రామ్‌’కి అవసరమైన ‘కోడ్‌’ రాయగల స్థితిలో ఉన్నారని ‘అస్పైరింగ్‌ మైండ్స్‌’ నివేదిక వెల్లడించింది. దేశ విద్యావిధానంలో సమూల ప్రక్షాళన ఆవశ్యకతను సూచిస్తున్న పరిణామాలివి.
నాణ్యత ప్రమాణాలు పాటించని ఇంజినీరింగ్‌ కళాశాలలను నిర్మొహమాటంగా మూసివేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి సైతం నిర్ణయం తీసుకుంది. భర్తీకాని సీట్ల శాతం ఏటా పెరిగిపోతున్న కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 800 ఇంజినీరింగ్‌ కాలేజీలను మూసివేసేందుకు రంగం సిద్ధం చేసింది. మూసివేతకు సిద్ధమైన కళాశాలల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ముందు వరుసలో ఉండటం గమనార్హం!
భవిష్యత్తు ప్రశ్నార్థకం
చాలామంది బీటెక్‌ డిగ్రీతోనే చదువు మానేసి ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్నారు. పై చదువులు అభ్యసించి నైపుణ్యాలు సంపాదిద్దామని ఎవరూ తాపత్రయపడటం లేదు. బహుశా అందుకేనేమో 2014-15 విద్యాసంవత్సరంలో దేశంలో 7.48శాతం మాత్రమే ఎంటెక్‌లో చేరగా, పీహెచ్‌డీ కోర్సుల్లో కేవలం 1.69శాతం మాత్రమే ప్రవేశం పొందారు. మెజారిటీ విద్యార్థులు పరిశోధన దిశగా అడుగులు వేయడం లేదు. ఇప్పుడున్న కళాశాలల్లో అర్హులైన అధ్యాపకుల సంఖ్య అత్తెసరుగానే ఉంటోంది. ఫలితంగా అనేకమంది విద్యార్థులు పాఠ్యాంశాలపై అవగాహన సంపాదించలేకపోతున్నారు. కేవలం బట్టీయం చదువులకే పరిమితమవుతున్నారు. దాంతో ఇంజినీరింగ్‌ రంగానికి అత్యవసరమైన సృజనాత్మకతను అందిపుచ్చుకోలేకపోతున్నారు. కనీస స్థాయి భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు కూడా లేని విద్యార్థులు ఇంజినీరింగ్‌ కాలేజీలనుంచి పెద్దయెత్తున బయటకు వస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంపై బొత్తిగా పట్టు లేకపోవడంతోపాటు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లోనూ ఈ విద్యార్థులు ప్రావీణ్యత సాధించలేకపోతున్నారు. దీనివల్ల లక్షల సంఖ్యలో విద్యార్థులు చిన్నపాటి ఉద్యోగాలకోసమూ వెంపర్లాడే పరిస్థితి నెలకొంది. ప్రాంగణ నియామకాలు కేవలం పేరున్న కళాశాలల్లోనే మాత్రమే జరుగుతున్నాయి. మిగిలిన కాలేజీల్లోని విద్యార్థులకు ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉండటం లేదు. ఇప్పటికైనా సాంకేతిక విద్యావిధానంలో సమూల సంస్కరణలు తీసుకురావాలి. లేనిపక్షంలో మున్ముందు దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కేవలం తమ పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా బహుళ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకుంటే తప్ప ఉద్యోగ మార్కెట్‌ విసురుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం కుదిరే పనికాదు. అందుకోసం బోధన పద్ధతులను సృజనాత్మకంగా మార్చడంతోపాటు- ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగిన విధంగా కోర్సులనూ ప్రక్షాళించాలి. విద్యార్థులకు ఉద్యోగ భద్రత కల్పించే స్థాయి విద్యను అందించడంపై కళాశాలలన్నీ దృష్టిపెట్టాలి. ఆ మేరకు ప్రభుత్వమూ కార్యాచరణ సిద్ధం చేయాలి. కాలానుగుణంగా మారని, దారితప్పిన కళాశాలలపై గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పుడే దేశంలో ఇంజినీరింగ్‌ విద్యకు మంచిరోజులు వస్తాయి.

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌ ీ

Posted on 22-09-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning