ఎంబీఏ..ఇంజినీరింగ్‌..!

* స్వరూపం మార్చుకుంటున్న మేనేజ్‌మెంట్‌ కోర్సులు
* పాఠ్య ప్రణాళికలో కృత్రిమ మేధ, బిగ్‌డేటా అనలిటిక్స్‌, రోబోటిక్స్‌లకు స్థానం
* రెండేళ్ల క్రితమే ఐఐటీలు, ఐఐఎంలలో ప్రవేశం
* అదేబాటలో హెచ్‌సీయూ, మరికొన్ని బిజినెస్‌ స్కూళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఎంబీఏ..ఇంజినీరింగా..సౌండే కొత్తగా ఉందే అనుకుంటున్నారు కదూ. నిజమే..మున్ముందు మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఇదే తరహాలో ఉండబోతున్నాయి? విద్యార్థులకు సంప్రదాయ పాఠ్యాంశాలకు అదనంగా సంకేతిక దన్ను అందించడమే లక్ష్యంగా..తమ స్వరూపాన్ని మార్చుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఇప్పటికే ఆటోమేషన్‌...కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, ఏఈ) వంటి అంశాల ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు చివరకు ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోనూ ఇంజినీరింగ్‌ పాఠ్యాంశాలను అనుసంధానం చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనిస్తున్న ఐఐటీలు, ఐఐఎంలు అన్ని రంగాల్లో గణితం అవసరాన్ని పసిగట్టాయి. ఐఐటీలు ఇప్పటికే బీటెక్‌ గణితం, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌) గణితం కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ హైదరాబాద్‌ కూడా దీన్ని ప్రారంభించింది. సమీప భవిష్యత్తులో ఆటోమేషన్‌...కృత్రిమ మేధ, రోబోటిక్స్‌కు భారీ డిమాండ్‌ రానుందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లు మార్పులకు శ్రీకారం చుట్టాయి. పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఎంబీఏతో సమానం)లో ఇంజినీరింగ్‌ అంశాలైన కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, బిగ్‌డేటా ఎనలిటిక్స్‌ తదితర అంశాలను చొప్పిస్తున్నాయి.
* సాంకేతిక దన్ను అందిండచమే లక్ష్యం
దేశంలో ఐఐటీలు, ఐఐఎంల తర్వాత ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌(రెండేళ్ల కోర్సు)ను హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌, చుట్టుపక్కల ఉన్న ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లు సైతం ఇదే బాటపట్టాయి. ‘ఎంబీఏ పూర్తి చేసిన వారు తర్వాత కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తారు. వారికి సాంకేతికతపై కొంతవరకైనా అవగాహన లేకుంటే కష్టం. అందులోనూ మానవ వనరులపై ఎంతో ప్రభావం చూపనున్న ఆటోమేషన్‌పై పరిజ్ఞానం ఎంతో అవసరం. అప్పుడే వారు సరైన నిర్ణయం తీసుకోగలరు’ అని జేఎన్‌టీయూహెచ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌(ఎస్‌ఎంఎస్‌) మాజీ సంచాలకుడు ఆర్యశ్రీ అభిప్రాయబడ్డారు.
* రుసుములు భారీగా...
ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ లాంటి కోర్సులకు ఐఐఎంలు, బిజినెస్‌ స్కూళ్లు శ్రీకారం చుట్టినా రుసుములు మాత్రం భారీగానే ఉంటున్నాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌(ఐఎస్‌ఐ, కోల్‌కతా), ఐఐఎం కోల్‌కతా, ఐఐటీ ఖగర్‌పూర్‌ సంయుక్తంగా పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌(రెండేళ్ల కోర్సుకు) నాలుగు సెమిస్టర్లకు కలిపి రూ.22 లక్షల వరకు రుసుము వసూలు చేస్తున్నాయి. బిజినెస్‌ స్కూళ్లలోనూ రుసుము రూ.10 లక్షలకుపైగానే ఉంది.
* విద్యా సంస్థలు...
* కోర్సులు... పాఠ్యప్రణాళిక
* హెచ్‌సీయూ: రెండేళ్ల ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ను 2017-18 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది.
* ఐఐఎం బెంగళూరు: ఎంబీఏ కోర్సులో కృత్రిమ మేధను ఐచ్ఛిక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది.
* ఐఐఎం కోల్‌కతా: కృత్రిమ మేధ అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చారు.
* ఐఐఎం కోజికోడ్‌: కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ విభాగాలను ఐచ్ఛికంగా ప్రవేశపెట్టారు.
* సింబయాసిస్‌ హైదరాబాద్‌ ప్రాంగణం: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంబీఏ కోర్సులో కృత్రిమ మేధ(ఏఐ), బిగ్‌డేటా అనలిటిక్స్‌లను ప్రవేశపెట్టబోతోంది.
* విద్యార్థుల నుంచి భారీ డిమాండ్‌
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది నుంచి ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సును ప్రవేశపెట్టాం. మొత్తం 30 సీట్లుండగా దాదాపు 850 మంది దరఖాస్తు చేశారు. దాదాపు 20 మంది వరకు తెలుగు విద్యార్థులే ప్రవేశాలు పొందారు. వచ్చే ఏడాది మరింత పోటీ పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. సెమిస్టర్‌కు రుసుం రూ.లక్ష ఉంది. పేద విద్యార్థులకు విశ్వవిద్యాలయం ఉపకార వేతనం అందిస్తుంది.

- రాజశేఖర్‌, డీన్‌, మేనేజ్‌మెంట్‌ విభాగం, హెచ్‌సీయూ
* వచ్చే ఏడాది నుంచి సిలబస్‌లో మార్పు
సమాచారం విప్లవం పెరిగిపోతున్న నేపథ్యంలో ఏదేని అంశాన్ని విశ్లేషించి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి బిగ్‌డేటా అనలిటిక్స్‌ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వ్యాపార నిర్ణయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఎంబీఏ సిలబస్‌లో దాన్ని చేరుస్తున్నాం.
- రవీంద్ర కుమార్‌ జైన్‌, అకడమిక్‌ డీన్‌, సింబియాసిస్‌ హైదరాబాద్‌ ప్రాంగణం

Posted on 26-09-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning