ఏ విద్యార్థికైనా ఈ ఐదూ అవసరం

విద్యాపరంగా అద్భుత ప్రతిభ ఉన్నా విద్యార్థులు నేడు రాణించటం కష్టంగా మారుతోంది. గణితం, సైన్స్‌లలో రాయటంలో అపారంగా ప్రతిభ ఉన్నా అది సమగ్రం కాదు. ఈ పోటీ ప్రపంచంలో ఉన్నతంగా ఎదగాలంటే సాఫ్ట్‌స్కిల్స్‌గా వ్యవహరించే నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే. వీటిని అభ్యర్థుల నుంచి ఆశించే నియామక సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇవి ప్రస్తుత పరిస్థితుల్లో కళాశాలల విద్యార్థులూ, పట్టభద్రులూ, ఉద్యోగార్థులకూ ఎంతో ముఖ్యమైనవి!

కాలంతోపాటు మారుతున్న ప్రపంచంలో నూతనంగా వస్తున్న మార్పులను స్వీకరించటం సాఫ్ట్‌ స్కిల్స్‌ పరిధిలోకే వస్తుంది. నేర్చుకోవాలనే తపన, వాటిని జీవితంలో ఎదుగుదలకు, వివధ రంగాల్లో ఉపయోగించగలిగే నేర్పు ఉండాలి. విద్యార్థులకు కావాల్సిన అయిదు ప్రధాన నైపుణ్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. బృందంలో పని
ఉద్యోగం చేసే ప్రాంతంలో సైతం ఇతరుల సహకారం తీసుకోవటం ఉత్తమం. బృందాలుగా ఏర్పడి చేయాల్సిన ప్రాజెక్టుల్లో ఈ నేర్పు ఆవశ్యకం. ఇతరులతో కలసి పనిచేస్తే వారు ఎత్తిచూపే తప్పుల వల్ల మనం మరింతగా మెరుగుపడవచ్చు. అయితే వీటిని సవాళ్లుగా తీసుకోవాలి. ప్రతికూల దృక్పథంతో చూడకూడదు. విమర్శకులు ఉన్నప్పుడే లోపాలను సవరించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఎవరి సాయం లేకుండా నేను పనిచేసుకోగలను అన్న ధీమా ఉండకూడదు. జీవితంలో ఎదగటానికి పరస్పర సహకారం కీలకం. క్రీడలు, విద్యేతర అంశాల్లో ఇది తప్పనిసరి. క్రికెట్‌ మ్యాచ్‌ గెలవాలంటే కెప్టెన్‌ ఒక్కడే బాగా ఆడితే సరిపోదు. టీం సభ్యులందరూ ఆడితేనే విజయం సాధిస్తారు. కళాశాల స్థాయి నుంచే ఈ నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి; వృద్ధి చేసుకోవాలి.
2. భావ వ్యక్తీకరణ
ఇతరులతో సంభాషణను ఎలా కొనసాగించాలో నేటి యువతకు తెలియదని చాలామంది అంటుంటారు. ప్రశ్నలను అడగటంలోనూ, ఉత్సాహంగా వినటంలో, ఎదుటివారి కళ్ళలోకి చూసి మాట్లాడే విషయంలోనూ వారు విఫలమవుతున్నారని చెబుతుంటారు. విస్తృతంగా వ్యాపించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలు ప్రపంచంలోని యువతను ఏకం చేస్తున్నాయని కొందరి అభిప్రాయం. అయితే వీటి వల్ల ముఖాముఖి పరిచయాలు, టెలిఫోన్‌ సంభాషణలూ తగ్గిపోయాయని చాలామంది వాదిస్తున్నారు. కళాశాలల్లోని విద్యార్థులు కేవలం తమలో తామే కాకుండా ప్రొఫెసర్లతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. దీని వల్ల వారి నుంచి విలువైన సలహాలను, సూచనలను పొందవచ్చు. ఇవి జీవితంలో ఎదగటానికి ఉపయోగపడతాయి. ఈ నైపుణ్యం లేకపోతే కళాశాల దశలో, ఉద్యోగ ఇంటర్వ్యూల్లో మెరుగైన ఫలితాలను సాధించలేరు. ఈ లోపం ఉన్నవారు దీన్ని అధిగమించాలంటే అధ్యాపకులతో భ¼యం లేకుండా మాట్లాడే చొరవ చూపాలి. సబ్జెక్టులో సందేహాలు వస్తే తమ ప్రొఫెసర్లతో సంభాషిస్తూ వాటిని నివృత్తి చేసుకుంటూవుండాలి. ఇంటర్న్‌షిప్‌ సైతం కమ్యూనికేషన్‌ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు చక్కని మార్గం.
3. సమస్యల పరిష్కారం
విద్యార్థులకు జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని తట్టుకోవటానికి ఇతరుల సహాయం ఎల్లప్పుడూ లభిస్తుందని భావించకూడదు.ఎవరికి వారే సొంతంగా సృజనాత్మకంగా వాటిని పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. నూతన పద్ధతుల్ని నేర్చుకోనివారు, నేర్చుకోవాల్సిన అంశం నుంచి పక్కదారి పట్టినవారు భవిష్యత్తులో వచ్చే ఆపదలను గట్టెక్కటంలో ఇబ్బందులు పడతారు. దీన్ని అధిగమించేందుకు విద్యార్థులు ప్రయోగాత్మక విధానంలో అభ్యసించాలి. ప్రతికూల పరిస్థితులను నూతన విధానాల ద్వారా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. తరచుగా చర్చా గోష్ఠులు, సైన్స్‌ ఒలింపియాడ్‌ వంటి వాటిల్లో పాల్గొనాలి.
4. సమయ పాలన
విద్యాభ్యాస సమయంలోనే సమయపాలన చాలా అవసరం. నియమిత వ్యవధిలో జరిగే పరీక్షల్లో దీని ప్రయోజనం అపారం. విద్యా, ఉద్యోగ దశల్లో అధ్యాపకులు/ అధికారులు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయటానికి సమయ నిర్వహణ ఆవశ్యకం. సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవటానికి, ప్రాధాన్యం ఆధారంగా పనుల్ని పూర్తిచేయటానికి సమయపాలనను మెరుగుపర్చుకుంటూ ఉండాలి. ఉద్యోగులు ఏకకాలంలో అనేక ప్రాజెక్టులను చాకచక్యంగా చక్కని పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాన్ని సాధించేందుకు పాఠశాల, కళాశాలల స్థాయి నుంచే వివిధ పనుల బాధ్యతలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌, స్వచ్ఛంద సేవ, ఇతర అవకాశాల వల్ల కూడా పనుల ప్రాధాన్యక్రమం, వాటి నిర్వహణలో సమర్థత, అనుభవం అలవడతాయి.
5. నాయకత్వ లక్షణాలు
బృందంలో పనిచేస్తున్నప్పుడు సభ్యుడిగానే కాదు, కొన్నిసార్లు నాయకుడిగా కూడా ఉండాల్సి రావచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. కళాశాలలో కానీ, ఉద్యోగంలో కానీ అకస్మాత్తుగా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల నాయకత్వ లక్షణాల్ని పెంపొందించుకోవాలి. నియామక సంస్థలు ఎప్పుడూ నాయకత్వ పటిమ ఉన్నవారి కోసం వెతుకుతాయి. వీటిని పెంచుకునేందుకు విద్యార్థులు పాఠశాల, కళాశాల స్థాయుల నుంచే ప్రయత్నించాలి. ఆటల్లో కెప్టెన్‌గా అవకాశం వస్తే దాన్ని వదులుకోకూడదు. విద్యార్థి సంఘాల్లోనూ, విద్యేతర అంశాల్లోనూ చురుకుగా పాల్గొనాలి.

Posted on 02-10-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning