కొలువు సాధనం... ప్రయోగ జ్ఞానం!

* నైపుణ్యం పెంపు దిశగా విద్యా మండలి చర్యలు
* వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్‌ పాఠ్యాంశాల్లో మార్పులు

న్యూస్‌టుడే, పెడన గ్రామీణం: సమాజ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ విద్యను తీర్చిదిద్దడానికి ఉన్నత విద్యామండలి సన్నద్ధమయింది. పాఠ్య ప్రణాళికను సమూలంగా మార్చి ప్రయోగాలకు, ప్రాజెక్టు పనులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ప్రసుత్తం ఇంజినీరింగ్‌ వార్షిక విద్యలో థియ‌రీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటోందని విద్యామండలి గమనించి ఐఐటీ ఆచార్యులు డాక్టరు కృష్ణయ్య నేతృత్వంలో కమిటీని నియమించింది. దేశీయంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే విద్యార్థులను తయారు చేయాలన్న సంకల్పంతో ముందుడుగు వేస్తోంది.
ప్రస్తుతం సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో జాబ్‌ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నైపుణ్యాలు అందించాలనేది లక్ష్యంగా నిర్దేశించింది. ప్రస్తుతం ఒక సబ్జెక్టుకు నాలుగు క్రెడిట్‌లు ఇస్తున్నారు. ఒక లేబొరేటరీ సబ్జెక్టుకు రెండు క్రెడిట్‌లు ఇస్తున్నారు. ఈ విధానంలో విద్యార్థులకు ప్రయోగ జ్ఞానం సరిపడినంత లేక కొలువు సాధనలో విఫలం అవుతున్నారు. జేఎన్‌టీయూ పరిధిలో ఇంజినీరింగ్‌లో 8 సెమిస్టర్లలో ఒక్కొక్క సెమిస్టర్‌లో 6 థియరీ పేపర్లు, 2 లేబొరేటరీ పేపర్లు ఉంటాయి. మొత్తం నాలుగేళ్ల కోర్సులో 200 క్రెడిట్లు ఉన్నాయి. వీటిలో 180 క్రెడిట్లు వస్తే విద్యార్థి ఉతీర్ణత సాధించినట్లు లెక్క. దేశవ్యాప్తంగా 600పైగా ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉంటే, వీటిలో 10 లక్షల మంది విద్యార్థులు ఏటా బయటకు వస్తున్నారు. వీరిలో 1.50 లక్షల మంది మాత్రమే ప్రాంగణ ఎంపికల ద్వారా ఇంజినీరింగ్‌ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధిస్తున్నారు.
జిల్లాల్లో ........
జేఎన్‌టీయూ పరిధిలో శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న 8 జిల్లాల్లో 216 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2.40 లక్షల మంది ఇంజినీరింగ్‌ విద్య చదువుతున్నారు. జిల్లాలో నాలుగు అటానమస్‌ కళాశాలలతోపాటు మరో 35 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. గుడ్లవల్లేరు, విజయవాడ పీవీపీ సిద్ధార్థ, వీఆర్‌ సిద్ధార్థ, మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాలలు స్వయంప్రతిపత్తి సాధించాయి. మొత్తం కళాశాలల్లో ఏడాదికి 25 వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు బయటకు వస్తున్నారు.
వచ్చే ఏడాది నుంచి పాఠ్య ప్రణాళిక మార్పు...
ఇంజినీరింగ్‌లో అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికను మార్చాలని యోచిస్తున్నారు. 2018-19 సంవత్సరంలో మొదటి ఏడాది పాఠ్యప్రణాళికను, ఆపై ఏడాది రెండో ఏడాది పాఠ్య ప్రణాళికను ఇలా వరుసగా మార్చే అంశాన్ని పరిశీలించనున్నారు. థియరీ విభాగంలో భారం తగ్గించి విద్యార్థులను ఒత్తిడి నుంచి దూరం చేయాలని యోచిస్తున్నారు. ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ దానికి సరిపడే నైపుణ్యాలు కొరవడుతుండటంతో కొత్త విధానం ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్యా మండలి జరిపిన ఇంజినీరింగ్‌ విద్య పాఠ్య ప్రణాళిక అభివృద్ధి కమిటీ (ఇంజినీరింగ్‌ కరిక్యులం డెవలప్‌మెంట్‌ కమిటీ)లో ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. డిజైన్లు రూపొందించే పద్ధతిలో ఇంజినీరింగ్‌ విద్య శిక్షణ ఉండాలన్న అంశం చర్చకు వచ్చింది. ఈ మేరకు సమగ్ర వివరాలను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అధ్యాపకులకు సెట్‌...
విశ్లేషణ సామర్థ్యం పెంపు, ప్రయోగాలు, డిజైన్‌ డెవలప్‌మెంట్‌, క్రియాత్మంగా బోధించే పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న భావన సమావేశంలో వ్యక్తమయింది. విద్యార్థులకు తప్పనిసరిగా 170 నుంచి 180 క్రెడిట్‌లు ఉండాలని సమావేశం అభిప్రాయపడింది. విద్యార్థులు సమస్యల్ని ఎదరుర్కొనేలా పాఠ్య ప్రణాళిక ఉండాలని భావిస్తున్నారు. అధ్యాపకులకు స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్టు నిర్వహించాలన్న అంశాన్ని చర్చించారు. సబ్జెక్టుకు, లేబోరేటరీకి సమాన క్రెడిట్‌లు ఇవ్వడం, లేదా లేబొరేటరీకి క్రెడిట్‌లో పెంచటమా? అనే విషయంపై ఇంకా కొలిక్కి రాలేదు.
ప్రయోగ జ్ఞానం కొరవడి...
ఇంటర్మీడియట్‌ కార్పొరేట్‌ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు ఏమాత్రం ప్రయోగ జ్ఞానం ఉండటం లేదని ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. ఇంటర్‌స్థాయిలో లేబొరేటరీ ముఖం చూడకుండా వచ్చేయడం వల్ల ఇంజినీరింగ్‌లోనూ ఇబ్బంది ఎదురవుతోంది. ఇంజినీరింగ్‌లోనూ థియరీకే ప్రాధాన్యత ఇచ్చి మమ అనిపిస్తున్నారు. ఈ చర్యల కారణంగా విద్యార్థులకు ఫిజిక్సు, కెమిస్ట్రీ ప్రయోగాల్లో అవగాహన కొరవడుతోంది.
మంచి ప్రయత్నం
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది. విద్యార్థులకు చక్కటి ప్రయోగ జ్ఞానం అందించటానికి అవకాశం ఉంటుంది. క్రెడిట్స్‌ ఎలా ఇవ్వాలన్న అంశాన్ని కమిటీ చర్చిస్తోంది. విద్యార్థులకు మేలు చేసే ప్రక్రియ ఇది. వచ్చే ఏడాది నుంచి అమలయ్యే అవకాశం ఉంది.

- ఏబీ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌, వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాల, నందమూరు

Posted on 03-10-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning