భవితకు పరి'శోధనం'

* నైపుణ్యాలను పెంచడంలో సంస్థల సహకారం

పాఠ్యాంశాలను చదివేయడం, కళాశాలల్లో అందుబాటులో ఉన్న ప్రయోగశాలల్లో కొత్త విషయాలను నేర్చుకోవడం, ఉన్న వనరులతోనే డిగ్రీ పట్టా పొందడం... ఇదీ ఇప్పటి వరకు అధిక శాతం ఇంజినీరింగ్ కళాశాలల్లోని విద్యార్థుల పరిస్థితి. కానీ క్రమంగా ఇది మారిపోతోంది. ప్రముఖ సంస్థలు ఇక్కడి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు సరికొత్త తరహాలో ముందుకు రావడమే దీనికి కారణం. అనుభవజ్ఞులైన తమ ఉద్యోగులతో వారికి పాఠాలు చెప్పించడం నుంచి సృజనాత్మక ఆవిష్కరణలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.
నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 180 వరకు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి దాదాపు లక్ష వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చే వారిలో అత్యధిక శాతం విద్యార్థులకు వృత్తి జీవితానికి కావాల్సిన నైపుణ్యాలు ఉండటం లేదనే విషయాన్ని అటు కంపెనీలతో పాటు విద్యారంగంలోని నిపుణులు సైతం వివిధ సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా సేవా, ఉత్పత్తి రంగాల్లోని కొన్ని ప్రముఖ సంస్థలు విద్యార్థుల్లో పరిశోధనపై ఆసక్తి పెంచేందుకు కావాల్సిన తోడ్పాటును అందించేందుకు ముందుకొస్తున్నాయి. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు చొరవ చూపుతున్నాయి. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలతో పాటు ఇతర కళాశాలలకూ తమ సేవలను విస్తరిస్తున్నాయి.

ఒక్కొక్కరు ఒక్కోలా...
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడంలో కంపెనీలు సఫలీకృతమవుతున్నాయి. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాహూ, నోకియా, గూగుల్ లాంటి సంస్థలు కొన్నేళ్లుగా ఇలాంటి కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న పది ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఎంపిక చేసుకొని అందులో చదువుతున్న విద్యార్థులను పరిశోధన వైపు మళ్లించేలా కార్యాచరణ తయారు చేసింది. నగరంలోని ట్రిపుల్ ఐటీ, వరంగల్‌లోని ఎన్ఐటీకి ఈ జాబితాలో చోటు దక్కింది. రానున్న రోజుల్లో తమ సేవలను మరిన్ని కళాశాలలకు విస్తరించనున్నట్లు ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. ఎక్కువ కళాశాలలకు విస్తరించడంతో పాటు వీలైనంత మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చేందుకు ఈ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కళాశాల స్థాయిలో జరిగే వివిధ కార్యక్రమాల్లోనూ వీరు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో జరిగే టెక్నోఫెస్ట్‌ల్లోనూ తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. విజయవంతమైన ఆవిష్కరణలను ఉత్పత్తులుగా తీసుకొచ్చేందుకు సైతం కంపెనీలు సాయమందిస్తున్నాయి. ఏడాదిలో కొన్ని రోజుల పాటు కళాశాలల కోసం కేటాయించి ఆ సమయంలో వివిధ పోటీలను నిర్వహించడం, నిపుణుల సహకారమందించడం లాంటివి చేస్తున్నాయి.

విదేశాల్లో ఎప్పటి నుంచో...

కళాశాలలు, కంపెనీలు కలిసి పరిశోధనలు చేయడం విదేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాల్లో ఆయా కంపెనీలు అక్కడి కళాశాలల్లో తమ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నాయి. అదే విధానాన్ని మన దగ్గరా అందిపుచ్చుకుంటున్నారు. సంవత్సరానికొకసారి ఆయా కళాశాలల్లో పూర్తి స్థాయిలో రెండు మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు వారికి అవసరమైన వివిధ సమాచారాన్ని సీడీలు, వీడియోల రూపంలో అందిస్తున్నాయి. దీంతో పాటు అంతర్జాలాన్ని ఉపయోగించుకొని నిపుణులతో పాఠాలు సైతం చెప్పిస్తున్నాయి. కళాశాలల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సాఫ్ట్‌వేర్‌లను అందిస్తున్నాయి. కేవలం విద్యార్థులకే కాకుండా అధ్యాపకుల్లో ఉన్న నిపుణతకు మెరుగుపెట్టి మరింత మెరుగ్గా రాణించేందుకు సహకరిస్తున్నాయి.
ఐటీ శాఖ సైతం...

రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోనూ ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన జరుగుతోంది. ఇందుకోసం నెదర్లాండ్స్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా నగరంలోని ఐఐటీ, ట్రిపుల్ఐటీ, బిట్స్‌పిలానీలతో పాటు వరంగల్‌లోని ఎన్ఐటీని హబ్ ఇన్‌స్టిట్యూట్‌లుగా గుర్తించారు. ఇవి కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులకు శిక్షణ అందించడంతో పాటు వారిలో నైపుణ్యాలను పెంపొందించేలా కార్యాచరణ రూపొందించారు.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning