కొత్త నైపుణ్యాలుంటేనే కొలువు!

* ఐటీ అభ్యర్థులు, ఉద్యోగులకూ ఇదే వర్తింపు.. లేకపోతే వేటే
* ఎక్స్‌పెరిస్‌ ఐటీ-మాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా సర్వే

దిల్లీ: యాంత్రీకరణ, డిజిటలీకరణ వైపు సాగుతున్న ఐటీ రంగంలో ఉపాధి పొందాలనుకుంటున్న, పొందుతున్న వారు కూడా తాజా నైపుణ్యాలను అధ్యయనం చేయాలి. అప్పుడే ఉద్యోగానికి భరోసా ఉంటుంది, సరికొత్త అవకాశాలు లభిస్తాయి. లేదంటారా.. వేటు పడే అవకాశాలుంటాయని మరో సర్వే వెల్లడించింది.
ఐటీ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కొత్త ఉద్యోగావకాశాలు తక్కువగానే ఉంటాయని ఒక సర్వే పేర్కొంది. యాంత్రీకరణ, డిజిటలీకరణ వల్ల సంప్రదాయ ఐటీ ఉద్యోగాలపై అధిక ప్రభావం పడుతోందని తెలిపింది. ఈనెల నుంచి 2018 మార్చి వరకు ఐటీలో కొత్త నియామకాలు మరింత తగ్గుతాయని ఎక్స్‌పెరిస్‌ ఐటీ-మాన్‌పవర్‌గ్రూప్‌ ఇండియా విడుదల చేసిన ‘ఎక్స్‌పెరిస్‌ ఐటీ ఉద్యోగాల భవిత’ సర్వే అంచనా వేస్తోంది. కంపెనీల్లో ఉన్న నిపుణులను తగిన విధంగా సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఆయా సాంకేతికతలపై ఉన్న ఆసక్తికి అనుగుణంగా వారిని వేర్వేరు విభాగాల్లోకి మారుస్తున్నారని, అవసరమైతే శిక్షణ ఇప్పించి మరీ కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. నూతన నియామకాలు అధికంగా కింది-మధ్యస్థాయి వరకే ఉంటాయని, సీనియర్‌ పదవుల్లో వారిని తొలగించే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 500 ఐటీ సంస్థల నిర్వాహకుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందించినట్లు ప్రకటించింది.
శిక్షణ పొందిన కొత్త వారికి అవకాశం
అపూర్వమైన వేగం, కచ్చితత్వం, ఖర్చుకు తగిన సామర్థ్యం వంటివి వ్యాపారాల మనుగడకు కీలకంగా మారాయని ఎక్స్‌పెరిస్‌ మాన్‌పవర్‌గ్రూప్‌ ఇండియా అధ్యక్షుడు మన్‌మీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో సరికొత్త సాంకేతికతలు అభ్యసించిన యువతకు ఐటీ రంగంలో ఉపాధి లభిస్తుందని తెలిపారు. దేశీయంగా ఐటీ నియామకాలపై సానుకూలత ఉన్నా, ఎక్కువమందిని నియమించుకోవడం కంటే, అధిక నైపుణ్యాలున్న వారిని ఎంపిక చేసుకునేందుకే కంపెనీలు ప్రాధాన్యమిస్తాయని వివరించారు. తమ ఉద్యోగుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై కంపెనీలు దృష్టి సారించాయని తెలిపారు. ఉద్యోగాలకు అవసరమైన తాజా నైపుణ్యాలపై శిక్షణ పొందిన తాజా అభ్యర్థులకు అవకాశం ఇస్తామని పలు సంస్థల ప్రతినిధులు తెలిపారని సింగ్‌ వెల్లడించారు. ఇందువల్ల నియామకం జరిపిన వెంటనే ప్రాజెక్టుల్లో వారిని వినియోగించుకునే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో అనిశ్చితి ఉన్నందున, ఖాతాదారులను తరచు సంప్రదిస్తూ ఉండటం, డెలివరీ సామర్థ్యాలను మెరుగు పరచుకోవడం, మార్కెట్‌కు అనుగుణమైన వ్యూహాల వంటివి ఐటీ రంగ ఉన్నతికి దోహద పడతాయని చెప్పారు. ఐటీ దిగ్గజ సంస్థల ఉద్యోగుల తొలగింపు ఆలోచనలు ఐటీ పరిశ్రమ ఇప్పటివరకు చూడని స్థాయిలో ఉండే అవకాశం ఉంది. రాబోయే 6-12 నెలల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది
నైపుణ్యాలు పెంచుకోవాలి
ఉద్యోగం కోల్పోకుండా ఉండాలంటే, రాబోయే 6-12 నెలల్లో కొత్త నైపుణ్యాలు అభ్యసించడంపై ఐటీ ఉద్యోగులు దృష్టి పెట్టాలని సూచించింది. అత్యధిక గిరాకీ కలిగిన అత్యున్నత నైపుణ్యాలు నేర్చుకుంటే, ఉద్యోగానికి ఢోకా ఉండదని వివరించింది. సేవ లాగా సాఫ్ట్‌వేర్‌ అందించడం, క్లౌడ్‌ ఆధారిత ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) సాఫ్ట్‌వేర్‌, కృత్రిమ మేథ(ఏఐ) వంటివి నేర్చుకోవాలని సర్వే సూచించింది.

Posted on 11-10-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning