మ్యాట్‌లో ముందడుగు

ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పీజీడీఎం, ఎంబీఏ కోర్సుల్లో చేరడానికి నిర్వహించే మ్యాట్‌ (మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌) ప్రకటన వెలువడింది. ఈ ఏడాది డిసెంబరు 3న ఆఫ్‌లైన్‌ (పేపర్‌ ఆధారితం), డిసెంబరు 9న ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ ఆధారితం) పరీక్షలు జరగబోతున్నాయి. జాతీయస్థాయిలో జరిగే ఈ మ్యాట్‌ సన్నద్ధత ప్రణాళిక ఏ తీరులో ఉండాలి?

మ్యాట్‌కు తయారవ్వటానికి అభ్యర్థులకు అక్టోబరులో మరో వారం రోజులు, నవంబరులో 30 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే సుమారు 35 రోజుల్లో సన్నద్ధతను పూర్తిచేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత ఎక్కువగా పఠనానికీ, అభ్యాసానికీ సమయం కేటాయించటం తప్పనిసరి. అయితే ... ప్రాథమికాంశాలను నేర్చుకోవడానికి ఒక వారం మించి సమయాన్ని కేటాయించరాదు.

200 ప్రశ్నలను 150 నిమిషాల్లో పూర్తిచేయాలంటే... ఒక్కో ప్రశ్నకు కనీసం ఒక నిమిషం కూడా లేదు. కాబట్టి సమయ నిర్వహణ కీలకమన్న విషయం స్పష్టంగా గ్రహించాలి. చివరి అంశంగా పేర్కొన్న ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అంశాన్ని చూస్తే, దీనికి పెద్దగా సమయం అవసరం లేదు. మిగతా అంశాలను మాత్రం కచ్చితంగా, వేగంగా పూర్తిచేయాల్సి ఉంటుంది. సన్నద్ధత నుంచే వ్యూహాన్ని అనుసరిస్తే వేగంగా మంచి స్కోరును సాధించే ఆస్కారం ఉంటుంది.
సన్నద్ధత రెండు దశల్లో జరగాలి- ప్రాథమిక అంశాలపై పట్టు (మేథమేటికల్‌ స్కిల్స్‌, డేటా అనాలిసిస్‌, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అంశాలకు మాత్రమే), మాదిరి ప్రశ్నపత్రాలను పూర్తి చేయడం.
లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌
ఇందులో కాంప్రహెన్షన్‌, జంబుల్డ్‌ పారాగ్రాఫ్స్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ (ఖాళీల పూరణ) తదితర అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి. కాంప్రహెన్షన్‌ మినహా మిగతా అంశాలు, గ్రామర్‌ యూసేజ్‌లపై ఆధారపడి ఉన్నాయి.
కాంప్రహెన్షన్‌లో ఆర్థిక, సామాజిక తదితర అంశాలను ఇస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ తదితర వ్యవస్థల నివేదికలను ఇస్తున్నారు. ఇందులో ‘రచయిత ఏం చెప్పాలనుకుంటున్నారు?’, ‘మొత్తం సారాంశం ఏమిటి?’... ఇలా అడుగుతున్నారు. ఇందుకు అభ్యర్థులు నిత్యం ప్రముఖ ఆంగ్ల దినపత్రికల్లో వచ్చే సంపాదకీయాలను పరిశీలించి.. ఏం చెప్పాలనుకుంటున్నాడు? సంబంధిత అంశం ఏ సమస్యను లేవనెత్తింది? ఏ పరిష్కారాన్ని చూపింది.. ఇలా పలు కోణాల్లో అర్థం చేసుకోవాలి.
మిగతా అంశాలకు వ్యాకరణ ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా సెంటెన్స్‌ కరెక్షన్‌కు సంబంధించి సబ్జెక్ట్‌- వెర్బ్‌ అగ్రిమెంట్‌ చాలా కీలకం. అలాగే గ్రామర్‌ నియమాలకే పరిమితం కాకుండా వాటి వాడకాన్నీ తెలుసుకోవాలి. గ్రామర్‌ పుస్తకాలను చదవడం ద్వారా నియమాలనూ, నిత్యం దినపత్రికలను చదవడం ద్వారా వాడకాన్నీ అర్థం చేసుకోవచ్చు.
మేథమేటికల్‌ స్కిల్స్‌
అరిథ్‌మెటిక్‌ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రాథమిక అంశాలను తెలుసుకోవాలి. అయితే సూత్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టరాదు. తార్కికంగా ఆలోచిస్తూ సమాధానం రాబట్టే పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఉదాహరణకు- 2015లో అడిగిన ప్రశ్నను పరిశీలించండి.
* ఒక ఎన్నికలో 47% ఓట్లు పొందిన అభ్యర్థి, 540 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఒకవేళ చెల్లని ఓటు ఒక్కటి కూడా లేని పక్షంలో మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? ఎన్నికలో ఇద్దరే పాల్గొన్నారు.
దీనికి సూత్రాల ఆధారంగా లెక్క చేయడం వల్ల సమయం వృథా. దీన్ని తార్కిక జ్ఞానంతో చేయాలి. ఓడిన అభ్యర్థి 47% ఓట్లు పొందాడంటే గెలిచిన అభ్యర్థి కచ్చితంగా 53% ఓట్లు పొంది ఉంటాడు. వీరిద్దరి మధ్య తేడా 540. అంటే, అది ఆరు శాతానికి సమానం. అంటే 100% ఓట్లు 9000 అన్నమాట. ఇలా తార్కికంగా సమస్యలను సాధించగల పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.
డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ
అరిథ్‌మెటిక్‌ అంశాల్లో నేర్చుకున్న శాతాలు, సరాసరి, నిష్పత్తులు ఇందులో కూడా ప్రాథమిక అంశాలుగా ఉపయోగపడతాయి. ఇందులో ఎక్కువ సాధన అవసరం. అభ్యర్థులు సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలను సాధన చేయడం ద్వారా ఇందులో విజయం సాధించవచ్చు. ముఖ్యంగా టేబుల్స్‌, బార్‌గ్రాఫ్స్‌, పైచార్టులను ఇందులో అడుగుతున్నారు. వేగంగా సూక్ష్మీకరణాలను (సింప్లిఫికేషన్‌) చేయడం ద్వారా ఈ అంశంలో గరిష్ఠంగా స్కోర్‌ సాధించవచ్చు. రోజూ సాధ్యమైనన్ని ఎక్కువ బాడ్‌మాస్‌ ఆధారిత ప్రశ్నలను చేయడం ద్వారా ఈ విభాగం తేలిక అవుతుంది.
ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌
బ్లడ్‌ రిలేషన్స్‌, ర్యాంకింగ్‌, పజిల్స్‌, స్టేట్‌మెంట్స్‌-అసంప్షన్స్‌, ఆర్గ్యుమెంట్స్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నపత్రాలనే నేరుగా సాధన చేయడం; దీంతోపాటు నిత్యం నిర్ణీత సంఖ్యలో ప్రశ్నలను సాధన చేస్తూ వెళితే ఇందులో మంచి స్కోరు సాధ్యం అవుతుంది. ఈ అంశానికి సంబంధించి ప్రాథమికాంశాలు అంటూ ఉండవు. నేరుగా అభ్యాసం చేయాలి. పరీక్ష పూర్తి అయ్యేవరకూ కూడా క్రమం తప్పకుండా సాధన చేయాల్సిన విభాగమిది.

ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌
పూర్తిగా కరెంట్‌ అఫైర్స్‌ విభాగం. జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక, సాంఘిక, అవార్డులు, క్రీడలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ముఖ్య సంఘటలను చదవాలి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, వాటి విజయాలకు సంబంధించిన గణాంకాలు, ముఖ్య క్రీడా పోటీలు- విజేతలు, పెద్ద క్రీడల వేదికలు-లోగోలు (ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ తదితరాలు), అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలతో భారత్‌ కుదుర్చుకున్న ఒప్పందాలు-వాటి పరిణామాలు, అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపగల వివిధ దేశాల పరిణామాలు (ఉత్తరకొరియా అణుపరీక్షల లాంటివి)... వంటివి చదవడం ద్వారా ఇందులో మంచి స్కోరు సాధించవచ్చు.
అభ్యర్థులు కేవలం అధ్యయనానికే పరిమితం కాకుండా నిత్యం ఒక మాదిరి ప్రశ్నపత్రాన్ని సాధన చేయాలి. స్కోరును పరిశీలించుకుంటూ వెళ్లడం ద్వారా తరచూ తప్పులు చేస్తున్న విభాగాలు ఉంటే, వాటిని సరిచేసుకోవాలి. అప్పుడే మంచి స్కోరుతోపాటు కోరుకున్న కళాశాలలో సీటు దక్కించుకోవచ్చు.

మ్యాట్‌ స్కోరు ద్వారా ప్రవేశాలను కల్పించే కొన్ని ప్రముఖ కళాశాలలు
* అమిటీ యూనివర్సిటీ- దిల్లీ
* ఆసియా పసిఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌- దిల్లీ
* బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ- నోయిడా
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌- జయపుర
* ఎంఐటీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌- పుణె
* గీతం యూనివర్సిటీ- విశాఖపట్నం
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌- హైదరాబాద్‌

- పి.గోపాల‌కృష్ణ‌, కౌటిల్య కెరియ‌ర్స్‌


Posted on 23-10-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning