అంతర్జాతీయ స్థాయికి నిట్‌ ఖ్యాతి

* ‘ఈనాడు’ ముఖాముఖిలో నూతన డైరెక్టర్‌ రమణారావు

ఈనాడు, వరంగల్‌, నిట్‌ క్యాంపస్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యా సంస్థకు ఏడాదికి పైగా పూర్తి స్థాయి సంచాలకుడు లేరు. బోధన, పరిశోధన, ఇతర అంశాల్లో పలు సమస్యలను ఎదుర్కొంది. విద్యార్థులు సైతం తమకు డైరెక్టర్‌ కావాలని పలు మార్లు బహిరంగంగానే డిమాండ్‌ చేశారు. ఆందోళనలు నిర్వహించారు. ఎట్టకేలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ అంశంపై దృష్టిసారించింది. ఆచార్య ఎన్‌వీ రమణారావును సంచాలకుడిగా నియమించింది. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఎన్‌ఐటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమంటూ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు.
తొలి ప్రాధాన్యం దేనికి?
డైరెక్టర్‌: ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య బోధకుల కొరతే. 434 పోస్టులకు 220 ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తే విద్యా ప్రమాణాలు బాగా మెరుగవుతాయి. దీనిపై దృష్టి పెడతాను.
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. మీ విద్యా సంస్థ ఎలాంటి తోడ్పాటునందిస్తుంది?
డైరెక్టర్‌: వరంగల్‌ అభ్యున్నతికి సాయ శక్తులా కృషి చేస్తాం. ఏ పరిశోధన జరిపినా పైలెట్‌ ప్రాజెక్టుగా ఓరుగల్లునే ఎంపిక చేస్తాం.
ఇప్పటి వరకు డైరెక్టర్లుగా పనిచేసినవారంతా ఎన్‌ఐటీ, ఐఐటీలకు చెందిన వారే. తొలిసారి జేఎన్‌టీయూహెచ్‌కి చెందిన మీరు బాధ్యతలు స్వీకరించారు. ఎలా అనిపిస్తుంది?
డైరెక్టర్‌: చాలా ఆనందంగా ఉంది. నేను ఉస్మానియాలో బీటెక్‌, ఐఐటీ దిల్లీలో ఎంటెక్‌, లండన్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశా. జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో 30 దేశాలకుపైగా పర్యటించా. అక్కడ ఎందరో మేధావులతో చర్చించా. సాంకేతిక అంశాలను అవగతం చేసుకున్నా. ఆ అనుభవం నాకెంతో ఉపకరిస్తుంది. ఎన్‌ఐటీ వరంగల్‌కు పూర్తి స్పష్టతతో వచ్చా.
కొన్నేళ్లుగా విద్యార్థుల ఆవిష్కరణలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. దీన్ని ఎలా అధిగమిస్తారు?
డైరెక్టర్‌: ఎన్‌ఐటీ లాంటి జాతీయ విద్యా సంస్థల్లోకి మంచి ప్రతిభగల విద్యార్థులు వస్తారు. ఇక్కడ నిధులకు కొదవ లేదు. పరిశోధనలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులను ప్రోత్సహించడమే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం. వారిలో పోటీతత్వం తీసుకొస్తే ఎన్నో ఆవిష్కరణలు చేయగలరు. ప్రతి వారిలో నైపుణ్యం దాగుంటుంది. అది సరైన సమయంలో వెలికితీస్తే జీవితంలో వాళ్లు ఉన్నత స్థితిని చేరుకుంటారు.
స్పష్టతతో వచ్చానన్నారు.. ఎలాంటి అంశాలు గమనించారు?
డైరెక్టర్‌: ఎన్‌ఐటీలో నేను గమనించిన సానుకూలాంశాలు అనేకం ఉన్నాయి. దీనిపై నోట్సు తయారుచేసుకున్నా. ప్రతిభావంతులైన అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణ. సౌకర్యాలు, నిధులు, పరిశోధనలకు వూతమివ్వడానికి అవసరైన ఆర్థిక సాయం అందించే సంస్థలు, వరంగల్‌ లాంటి సౌకర్యవంతమైన నగరం, స్వీయ‌ నిర్ణయాలు తీసుకోగల వెసులుబాటు... ఇవన్నీ గొప్ప ఆస్తులే.
మీ ఆలోచనకు తగ్గట్టుగా ఈ సంస్థను తీర్చిదిద్దడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకెళతారు?
డైరెక్టర్‌: ఇక నుంచి ప్రతి విభాగానికి సంబంధించిన పూర్తి సమాచారం తెప్పించుకుంటా. ఆయా శాఖాధిపతులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారి బలాబలాలేంటో తెలుసుకంటా. ప్రతి వారం సమీక్ష సమావేశం ఏర్పాటుచేసి, దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించి నాణ్యతను పెంపొందించే ప్రయత్నం చేస్తా.
కొత్త కోర్సులు ప్రవేశపెట్టే ఆలోచన ఉందా?
డైరెక్టర్‌: విద్యా సంస్థల్లో జరిగే పరిశోధన స్థానిక అవసరాల దృష్ట్యా సాగాలి. అప్పుడు ఆ పరిశోధనలు ఫలితాలు ఇస్తాయి. ఉదాహరణకు ఇటీవల వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన జరిగింది. ఇప్పటివరకు ఎన్‌ఐటీలో టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు లేదు. భవిష్యత్తులో స్థానిక అవసరాల దృష్ట్యా అలాంటి కోర్సులను ప్రవేశపెట్టే స్వేచ్ఛ ఈ సంస్థకు ఉంది. ఆ దిశగా పరిశీలిస్తాం.
మీరు వివిధ దేశాలు పర్యటించారు. ఆ అనుభవంతో ఎన్‌ఐటీకి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తారు?
డైరెక్టర్‌: ఎప్పుడూ బావిలో కప్పల్లా ఒకేచోట పనిచేసి ఇదే గొప్ప అనుకోవడం నా పద్ధతి కాదు. సివిల్‌ ఇంజినీరింగ్‌ నిపుణుడిగా అనేక భారీ ప్రాజెక్టులకు పనిచేశా. అంతేకాకుండా విద్యావేత్తగా పలు దేశాల్లో పర్యటించిన అనుభవంతో నేను గ్రహించింది ఏమిటంటే.. మన ఆలోచన వినూత్నంగా ఉండాలి. ఎప్పుడూ సమస్య చుట్టూ తిరగకుండా ఔట్‌ ఆఫ్‌ బాక్స్‌ థింక్‌ చేయాలి. అప్పుడు పరిష్కారాలు లభిస్తాయి. నాకున్న అనుభవంతో అంతర్జాతీయ ఫండింగ్‌ ఏజెన్సీలతో మాట్లాడి పలు ప్రాజెక్టులు రాబట్టేందుకు కృషి చేస్తా.
విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏంటి?
డైరెక్టర్‌: ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగుంటుంది. విద్యార్థులకు ప్రోత్సాహం, సమన్వయం, కలివిడితనం ఎంతో ముఖ్యం. సువిశాల దృక్పథం ఎంతో అవసరం. ఆలోచనా ధోరణి అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. ఒంటరిగా కాకుండా జట్టుగా పనిచేస్తే విజయాలు సొంతమవుతాయి.

Posted on 24-10-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning