కొలువుల కోడింగ్‌.. అవుతున్నారు కింగ్‌

* సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు

న్యూస్‌టుడే, భానుగుడి సెంటర్‌ (కాకినాడ): నైపుణ్యం ఉన్నవారికి సాఫ్ట్‌వేర్‌ రంగం అవకాశాల బాట ఎప్పుడూ వేస్తూనే ఉంటుంది. ఈ ఏడాది జాబ్‌ మార్కెట్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగం అగ్రస్థానంలో నిలిచినట్లు తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ఆంగ్ల పరిజ్ఞానం, రీజనింగ్‌, లాజికల్‌ థింకింగ్‌ ఉన్నవారికి సంస్థలు ప్రాధాన్యతనిస్తున్నట్లు సర్వేలో పేర్కొంది. సాంకేతికపరంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నవారికి ఈ రంగంలో కొలువు ఖాయం. పలువురు విద్యార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ఏటా వేలాది విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ కొలువులను సొంతం చేసుకుంటున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ విభాగాల విద్యార్థులకు బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌, జావా స్క్రిప్ట్‌ స్కిల్స్‌ను ఉద్యోగ అవకాశం కల్పించే సంస్థలు చూస్తున్నాయి. సంస్థలకు సంబంధించిన టాస్క్‌లను అప్పగించి, వాటిని ఏవిధంగా పరిష్కరిస్తున్నారన్న అంశాలను పరిగణలోకి తీసుకొన్న తర్వాతే ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తున్నాయి. విద్యార్హతతోపాటు ఆంగ్ల కాంప్రహెన్షన్‌, రీజనింగ్‌లో నైపుణ్యాలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
నూతన పోకడలు
ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌ రంగం తమ కొలువుల ఎంపిక విధానంలో మార్పు తీసుకువచ్చాయి. ఎన్‌ఐటీ, మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. మొదట అధ్యాపకులకు శిక్షణిస్తే తద్వారా విద్యార్థులకు టెక్నాలజీవైపు దృష్టి సారిస్తారన్నది ఈ కార్యక్రమాల ఉద్దేశం. మరోవైపు ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేదా? అనేది పరిశీలిస్తున్నాయి. ఉదాహరణకు కొత్తగా వచ్చిన ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డాటా ఎనలైటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, సాఫ్ట్‌ కంప్యూటింగ్‌, స్టాటిస్టిక్స్‌ విత్‌ ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైథాన్‌ వంటి ఆధునిక సాంకేతిక నేటి విద్యార్థులు ఏవిధంగా అందిపుచ్చుకుంటున్నారో పరీక్షిస్తున్నాయి.
ఏటా ఆరు వేల మందికి అవకాశం
ఏటా వేలాది విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. వీరిలో కొద్ది మంది సాఫ్ట్‌వేర్‌ కొలువులు సాధిస్తున్నారు. మిగతావారు బ్యాంకింగ్‌, ఇతర పారిశ్రామిక రంగాలను నమ్ముకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలను నమ్ముకున్న విద్యార్థులు బీటెక్‌ పూర్తిచేసేలోపు ఆ రంగంలో స్థిరపడుతుండగా మిగతావారు ప్రత్యేక కోర్సులను అభ్యసిస్తూ తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొంటూ సాఫ్ట్‌వేర్‌ కొలువులను సాధిస్తున్నారు.
కంపెనీలకు కావాల్సిన విధంగా శిక్షణివ్వాలి
విద్యార్థులు తమ చదువుతోపాటు ప్రాక్టికల్స్‌పై దృష్టిసారించాలి. ఆయా విద్యా సంస్థలు విద్యతోపాటు ఉద్యోగాలు పొందటంపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఉదాహరణకు కాకినాడ జేఎన్టీయూ కళాశాలలో వారానికి రెండురోజులపాటు ఒక్కో విద్యార్థికి 72 గంటల క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌ (సీఆర్‌టీ) తరగతులను నిర్వహిస్తోంది. కంపెనీ స్పెసిఫిక్‌ ట్రైనింగ్‌(సీఎస్‌టీ)ను సెప్టెంబరులో నిర్వహిస్తోంది. ఇలా ఏడాదిలో పూర్తిస్థాయి శిక్షణిచ్చి 100 శాతం ఉద్యోగాలు పొందేలా విద్యార్థులను సిద్ధం చేస్తోంది. ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల జీతం విద్యార్థులు సాధించేలా చేస్తోంది. సీఆర్‌టీ శిక్షణలోనే ఆప్టిట్యూడ్‌, ఎనలైటిక్స్‌, వెర్బల్‌, కోడింగ్‌, డీకోడింగ్‌, నాన్‌వెర్బల్‌ అంశాలపై శిక్షణిస్తారు. ఇందుకోసం ప్రత్యేకించి నిపుణులైన అధ్యాపకులను రప్పించి తరగతులు నిర్వహిస్తారు. ఈ విధానాన్ని మిగతా కళాశాలలు అందిపుచ్చుకుంటే జిల్లా విద్యార్థులు మరిన్ని అవకాశాలు ఈ రంగంలో సాధించే అవకాశం ఉంటుంది.
సీఆర్‌టీ శిక్షణ వల్లే.. - నిఖిత, బీటెక్‌ ఆఖరి సంవత్సరం, జేఎన్‌టీయూ
ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా సీఆర్‌టీ తరగతుల్లో ప్రత్యేకంగా శిక్షణివ్వటం వల్ల ఉద్యోగాలకు సులువుగా ఎంపికయ్యేందుకు మార్గం సుగమం అవుతోంది. ప్రస్తుతం నేను రెండు కంపెనీలకు అర్హత సాధించాను. వీటిలో ఎక్కువ జీతం ఇస్తున్న మ్యాథ్స్‌లాయిడ్‌ కంపెనీవైపు మొగ్గు చూపుతున్నాను.
సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి... - ప్రపూత్‌, బీటెక్‌ ఆఖరి సంవత్సరం, జేఎన్‌టీయూ
సీఆర్‌టీతోపాటు సీఎస్‌టీ శిక్షణలో కంపెనీలకు మా దగ్గర్నుంచి ఏం కావాలో నేర్పుతుండటంతో ఇంటర్వ్యూలను సులువుగా ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం నేను ఎల్‌అండ్‌టీ కంపెనీకి ఎంపికయ్యాను. ఏడాదికి రూ.7 లక్షల ప్యాకేజీ వస్తుంది. బీటెక్‌తోపాటు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలను నేర్పటం వల్లే ఈ ఉద్యోగం సాధించగలిగాను.
బీటెక్‌ పట్టా ప్రామాణికం కాదు - చంద్రశేఖర్‌, జేఎన్టీయూ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌
ప్రస్తుతం కంపెనీలు కేవలం బీటెక్‌ పట్టా ఒక్కటే ఉద్యోగానికి కొలమానంగా భావించడం లేదు. సంస్థలకు సంబంధించిన సమస్యలను విద్యార్థి ఏవిధంగా పరిష్కరిస్తాడో చూస్తున్నాయి.కోడింగ్‌, డీకోడింగ్‌, జావా స్కిల్స్‌, డాటా ఎనలైటిక్స్‌, ప్రోగ్రామింగ్‌ వంటి అంశాలపై విద్యార్థులకు ఎంతవరకు పట్టు ఉందన్న అంశాలను చూస్తున్నాయి. ప్రస్తుతం మిగతా వాటికంటే సాఫ్ట్‌వేర్‌ రంగం వేగంగా పరుగెత్తుతోంది.

Posted on 29-10-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning