ఇంజినీరింగ్‌ సెమిస్టర్‌ పరీక్షా సమయమిది

ఇంజినీరింగ్‌ విద్యాభ్యాసంలో కీలక ఘట్టం- సెమిస్టర్‌ పరీక్షలు. రెండు, మూడు, నాలుగు సంవత్సరాల మొదటి సెమిస్టర్‌ విద్యార్థులు నవంబర్‌లో జరిగే సెమిస్టర్‌ పరీక్షలకు సరైన రీతిలో ఒక పద్ధతి ప్రకారం సిద్ధమవ్వాల్సిన తరుణమిది.

బీటెక్‌/బి.ఇ. నాలుగో సంవత్సరం వారు ఇటు తమ చదువులకూ, అటు ప్రాంగణ నియామకాలకూ సంసిద్ధులవ్వాలంటే చక్కని సమయ నిర్వహణ, ప్రణాళిక అవసరమవుతాయి. అంటే మిగిలిన సంవత్సరాలవారికి ఎక్కువ సమయం ఉంటుందని కాదు. సగటు మార్కుల శాతం పెంచుకోవడానికి ఈ పరీక్షల అవసరం చాలా ఉంటుంది.
జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల విద్యార్థులు జాగ్రత్తవహించాల్సిన ముఖ్య అంశం ఒకటుంది. వీరికి ప్రశ్నపత్ర విధానం మారింది. ఈ మార్పు వల్ల ప్రతి సబ్జెక్టులో అన్ని అధ్యాయాల్లోనూ పూర్తిగా సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఇదివరకు ఏదేని అయిదు ప్రశ్నలకు విపులంగా సమాధానాలు రాసే విధానముండేది. దీనివల్ల ఒకటి లేదా రెండు అధ్యాయాలను పూర్తిగా చదవకపోయినా ఫర్వాలేదనే పరిస్థితి ఉండేది. కానీ గత రెండు సంవత్సరాల కాలంలో విశ్వవిద్యాలయాలు నిర్వహించే పరీక్షవిధానంలోకానీ ప్రశ్నల నాణ్యతలోకానీ కొంతస్థాయి వరకూ మార్పులు వచ్చాయి.
ఈ మారిన విధానంలో విద్యార్థులకు అన్ని అధ్యాయాల్లోనూ సమగ్రంగా, సంతృప్తికరంగా తయారు కావడం అత్యంత ఆవశ్యకం.
తయారీ ప్రణాళిక
సెమిస్టర్‌ ప్రారంభం కావడానికి ముందే ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. పైగా మొదటి అంతర్గత పరీక్షలు కూడా ముగిశాయి. ఒకవేళ ఏదైనా కారణంగా చేసి ఉండకపోతే ఇప్పటికీ సమయం మించిపోలేదు. ముందుగా తెలుసుకోవాల్సింది ఏమంటే.. సెమిస్టర్‌ తరగతులు ముగిసిన తరువాతి కాలం విద్యార్థి నియంత్రణలో ఉండదు. వెనువెంటనే రెండో విడత అంతర్గత పరీక్షలు, ప్రయోగశాలల పరీక్షలు, విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రయోగశాలల పరీక్షలు, చివరిగా థియరీ పరీక్షలు ఒకదానివెంట ఒకటి ముంచుకొస్తాయి. వీటిలో రెండో విడత అంతర్గత పరీక్షలు ఎక్కువ ఒత్తిడిని కలిగించే అవకాశముంది. ఒకేరోజు రెండు సబ్జెక్టుల పరీక్షలు రెండు కంటే ఎక్కువ అధ్యాయాల నుంచి సిద్ధమై రాయాల్సి ఉంటుంది. పైగా రెండు పరీక్షల మధ్య విరామం కూడా రెండు గంటలే. కాబట్టి చివరి నిమిషంలో తయారు కావచ్చు అనుకోవడం తగదు.
1. టైంటేబుల్‌ తయారీ: ప్రతిరోజూ కనీసం మూడు నుంచి నాలుగు గంటల సమయాన్ని సన్నద్ధతకు కేటాయించాలి. ప్రతిరోజూ కనీసం రెండు సబ్జెక్టులు చదవాలి. అధ్యాపకులు ఇచ్చే అసైన్‌మెంట్లకు సమాధానాలను స్వయంగా రాయడం దీనికి అతి సులభమైన మార్గం. ఇతరుల అసైన్‌మెంట్లు కాపీ చేయడం, పాఠ్యపుస్తకాలను చూసి తిరిగిరాయడం సరికాదు. తరగతిలో అధ్యాపకులు చెప్పిన పాయింట్లు, సొంతంగా తయారు చేసుకున్న పాయింట్ల ఆధారంగా అసైన్‌మెంట్లు రాయడం మేలు. ఇది సులభం, శ్రేయస్కరం. సాధారణంగా అధ్యాపకులు ఇచ్చే ప్రశ్నలు గత సంవత్సర ప్రశ్నపత్రాల నుంచి/ వాటి ఆధారంగా తయారు చేసినవి అయివుంటాయి. కాబట్టి వీటిని చదవడం పరీక్షల సన్నద్ధతే అవుతుంది. సెలవులు, ఆదివారాలను పూర్తిస్థాయి పునశ్చరణకు వినియోగించాలి.
2. రికార్డులు రాయడం: సాధారణంగా ప్రయోగ పరీక్షల ముందు రికార్డులు రాయడమనే ప్రక్రియ ఉంటుంది. ఇది సరి కానే కాదు. ఇప్పటినుంచే రోజువారీ పద్ధతిలో రికార్డులు రాయాలి. వీలైనంత త్వరగా వెనుకటివి ముగించి, ఇకముందు జరగబోయే ప్రయోగాలకు రాసే స్థితిలో ఉండాలి. దీనివల్ల సమయం మిగలడమే కాకుండా అనవసరమైన శారీరక శ్రమ తగ్గించుకోవచ్చు.
3. ప్రయోగశాలల పరీక్షలకు..: ప్రయోగం అంటే సొంతంగా చేసి, ఫలితాలను తీసుకుని, అర్థం చేసుకోవడం. అర్థమైన అంశాన్ని బట్టీ పట్టనవసరం లేదు. కాబట్టి ప్రయోగం చేయటమంటే.. దానికి సంబంధించిన పరీక్షకు సిద్ధం కావడమే. పరీక్షలో కూడా బట్టీపట్టి రాయకుండా ప్రయోగం చేసేటపుడు ఎలా చేశారన్న విషయాన్ని ఒక పద్ధతి ప్రకారం రాస్తే సమాధానం నాణ్యంగా ఉంటుంది; ప్రయోగం తిరిగి చేయడం కూడా సులువు. ఒత్తిడికి లోనుకాకుండా ఆశించిన ఫలితాలను రాబట్టుకోవడమే కాకుండా మౌఖిక పరీక్షలోనూ చక్కగా సమాధానాలను చెప్పగలరు.
4. గత ప్రశ్నపత్రాలకు సమాధానాలు: ప్రతి సబ్జెక్టులోనూ మునుపటి ప్రశ్నపత్రాలను సేకరించి వాటికి నిర్దిష్టమైన సమాధానాలను సిద్ధం చేసుకోవాలి. వీటిని పాయింట్ల రూపంలో చేసుకోవాలి. ఒకవేళ చిత్ర రూపంలో చూపించగలిగే అవకాశం ఉంటే.. బొమ్మ వేసుకుంటే రాయడం సులువవుతుంది. రాత నిడివి కూడా తగ్గుతుంది.
ఉదాహరణకు- ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్స్‌ అనే సబ్జెక్టులో ‘కమ్యూనికేషన్‌ వ్యవస్థ మౌలిక విభాగాల గురించి రాయండి’ అనే ప్రశ్న ఉందనుకుంటే.. వివిధ విభాగాల నమూనా ఒక బొమ్మ రూపంలో వేసి, చూపిస్తే సమాధానం నాణ్యంగా ఉంటుంది. అంతేకాదు.. ఏం రాయాలి, ఎంతవరకూ రాయాలి అన్న అంశాలపైనా స్పష్టత ఏర్పడుతుంది. మొదటివారంలోనే ఈ ప్రశ్నలు- సమాధానాలను సిద్ధం చేసుకుంటే రెండోవారం నుంచి సంసిద్ధత, పునశ్చరణలకు కేటాయించవచ్చు.
ఈ సమాధానాలను ఒక బృందంగా కొందరు విద్యార్థులు కలిసి తయారు చేసుకుంటే సమయం కలిసి వస్తుంది. పనిని విభజించుకుని ముగించుకోవచ్చు. అయితే బృంద సభ్యులను ఎంచుకోవడంలో జాగ్రత్త అవసరం. స్నేహితుడు హితుడు, సహకారి కావాలి కానీ గుదిబండ కారాదని గుర్తుంచుకోండి. అధ్యాపకులతో ఈ సమాధానాల నాణ్యతను పరిశీలింప¾జేసుకుంటే ఇంకా మంచిది.
5. ఇతర వ్యాపకాలకు దూరం: ఈ నాలుగు వారాలపాటు ఉపయోగపడని ఇతర వ్యాపకాల నుంచి దూరంగా ఉండాలి. వాట్సాప్‌, చాటింగ్‌, మ్యూజిక్‌ చానళ్లు బద్ధశత్రువులని గుర్తించాలి. ఇవి తెలియకుండానే సమయాన్ని హరించేస్తాయి. సినిమాలు, సామాజిక మాధ్యమాలు వంటివాటికి కూడా దూరంగా ఉండాలి. ఫేస్‌బుక్‌ దుర్వినియోగమవుతోందని చెప్పిన ఆ సంస్థ వ్యవస్థాపకుడి మాటలను ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఒక్క నెలరోజులపాటు కొంచెం కష్టమనిపించినా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కేవలం ఉత్తీర్ణత ధ్యేయంగా కాకుండా ఉత్తమశ్రేణిని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా సంసిద్ధులు కావాలి!

నీల‌మేఘ‌శ్యామ్ దేశాయి, ఏస్ ఇంజినీరింగ్ క‌ళాశాల

Posted on 30-10-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning