చూపంతా ‘కృత్రిమ మేధ’ మీదే..!

* కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థుల ఆసక్తి
* పెరిగిన పరిశోధనలు
* ఆటోమేషన్‌కు ఉజ్వల భవిత ఉందంటున్న నిపుణులు

ఈనాడు - హైదరాబాద్‌: మనిషిలాగే ఆలోచించి.. అత్యంత వేగంగా, కచ్చితత్వంతో పనులు చేసే మెషీన్లకు ఆదరణ పెరుగుతూ ఉండటంతో ఈ రంగంలో పరిశోధనలమీదా ఆసక్తి అధికమవుతోంది. ‘కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌’ అంశాలు ఇప్పుడు కంప్యూటర్‌సైన్స్‌ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థుల్లో ఎక్కువమంది ఈ రంగంలో పరిశోధనలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇందులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థుల్లో మూడో వంతుకుపైగా కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ల రంగంలోనే ఉండటమే ఇందుకు నిదర్శనం.
యంత్రానికి మనిషి మేధస్సును సమకూర్చడమే మెషిన్‌ లెర్నింగ్‌.. ఈ పక్రియలో యంత్రం మనిషి కూడా చేయలేని పనులు చేస్తుంది. దీనికి ఉదాహరణ రోబో. విస్తృత సమాచారాన్ని వడపోసి విశ్లేషించడంలాంటి పనులతో పాటూ ఇటీవల పలు నైపుణ్యరంగాల్లోనూ రోబోలు ప్రవేశించడం తెలిసిందే. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఆటోమేషన్‌వైపు మళ్లుతున్నాయి. ఇటీవలే సౌదీ అరేబియా ఓ రోబోకు పౌరసత్వం ఇవ్వడం చర్చనీయాంశమైంది. మొత్తానికి కృత్రిమే మేధ, మెషిన్‌ లెర్నింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన సాగుతోంది. మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ (గణిత సూత్రాల)పై ఆధారపడి ఉంటుంది. భారీ మొత్తంలో వచ్చే సమాచారాన్ని విశ్లేషించి చెప్పడం లాంటివి కేవలం బిగ్‌ డేటా, డేటా మైనింగ్‌ లాంటివాటితోనే సాధ్యమవుతుంది.
జేఎన్‌టీయూహెచ్‌లో 30 మంది..
జేఎన్‌టీయూహెచ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 18 మంది శాశ్వత బోధనా సిబ్బంది ఉన్నారు. వారి వద్ద ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ విధానంలో 70 మంది పీహెచ్‌డీ చేస్తున్నారు. వారిలో 30 మంది కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌లకు సంబంధించిన పరిశోధన అంశాలనే ఎంచుకున్నారు. ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయం ఎంటెక్‌లో కొద్ది సంవత్సరాల క్రితమే కృత్రిమ మేధకు సంబంధించిన పాఠ్యాంశాలను చేర్చించింది. దాంతో ఎంటెక్‌లోకి వచ్చిన తర్వాత విద్యార్థులు ఈ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోనూ ఇదే పరిస్థితి. భవిష్యత్తులో ఆటోమేషన్‌ గణనీయంగా పెరగనుండటంతో తాము ఈ రంగంలోనే పరిశోధనలు సాగిస్తున్నామని పీహెచ్‌డీ విద్యార్థులు చెబుతున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ పరిజ్ఞానం అన్ని రంగాల్లోనూ వినియోగిస్తున్నందున రెండుమూడు రంగాల వారు కలిసి పరిశోధన చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని కంప్యూటర్‌ సైన్స్‌ సీనియర్‌ ఆచార్యుడు కామాక్షి ప్రసాద్‌ తెలిపారు.
విద్యా సంస్థల్లోనే అధిక అవకాశాలు
పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత ఎక్కువగా విశ్వవిద్యాలయలు, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బోధనా వృత్తి చేపట్టాలని పీహెచ్‌డీ విద్యార్థులు భావిస్తున్నారు. దేశంలో పరిశోధన సంస్థలు తక్కువ. కంపెనీలు సైతం పీహెచ్‌డీ చేసిన వారిని కొద్ది సంఖ్యలోనే తీసుకుంటాయి. విద్యాసంస్థల్లోనే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఐఐటీల్లో పీహెచ్‌డీ చేసిన వారు అమెరికాలాంటి దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.
చేతి గడియారం ఉంటే చాలు..-ఎం.కిరణ్‌కుమార్‌, పరిశోధక విద్యార్థి, జేఎన్‌టీయూహెచ్‌
ఓ భారీ భవనం కూలిపోయింది. శిథిలాల కింద సజీవంగా ఉన్నవారిని గుర్తిస్తే రక్షించే చర్యలు తీసుకోవచ్చు. అలాంటప్పుడు మనిషి హృదయ స్పందనలు, శ్వాస, కదిలికలు తెలిస్తే అతను బతికే ఉన్నాడని చెప్పొచ్చు. ప్రత్యేకమైన చేతి గడియారంలోని సెన్సార్ల ద్వారా ఆ వివరాలను తెలుసుకుంటే వారిని కాపాడవచ్చు. ప్రయోగశాల స్థాయిలో ఈ చేతిగడియారం తయారు చేశాం. వర్సిటీలోని ఆచార్యులు కామాక్షిప్రసాద్‌ తదితరులు మార్గదర్శకత్వం చేశారు. విశ్వవిద్యాలయం కేంద్ర ప్రభుత్వానికి దీనిపై నివేదిక కూడా పంపింది.
పాక్‌ ఉగ్రవాదులు చొరబడితే..-టి.మన్యం, పీహెచ్‌డీ విద్యార్థి, జేఎన్‌టీయూహెచ్‌
శత్రుదేశ సైనికులు లేదా ఉగ్రవాదులు భారత్‌ భూభాగంలోకి వస్తే సెన్సార్లు వెంటనే మన సైనికులకు సమాచారం ఇస్తాయి. అయితే ఆ సెన్సార్లనూ ఏమార్చే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. శత్రువులు దానిద్వారా సెన్సార్లను అడ్డుకుంటే.. తీవ్ర నష్టం జరుగుతుంది. అలా జరగకుండా.. ఎక్కడ సెన్సార్లను పనిచేయకుండా చేశారో గుర్తించే దిశగా పరిశోధన చేస్తున్నాం. ఒక్క రక్షణరంగంలోనే కాదు.. వైద్యం వంటి అత్యవసర రంగాల్లోనూ సెన్సార్ల అవసరం ఎక్కువగానే ఉంటుంది.

Posted on 03-11-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning