కోడింగ్‌ రాస్తేనే కొలువు!

ఏ బ్రాంచి చదివారన్నది కాదు. పరిశ్రమకు తగ్గ అభిరుచి (ఆప్టిట్యూడ్‌).. బృందంతో కలగలిసి పనిచేసే వైఖరి, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు (సాఫ్ట్‌స్కిల్స్‌).. ఏదైనా కంప్యూటర్‌ భాషపై పట్టు ఉంటే చాలు! ప్రాంగణ నియామకాల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువు ఖాయం. కానీ... ఇది ముగిసిన కథ!

అభ్యర్థులకు ‘కోడింగ్‌ నైపుణ్యం’ కూడా తప్పనిసరి అంటున్నాయి... సాఫ్ట్‌వేర్‌, ఐటీ సేవల సంస్థలు. వీటిల్లో కొలువులను ఆశిస్తున్న మెకానికల్‌, సివిల్‌ తదితర బ్రాంచీల విద్యార్థులకు ఇది సవాలే మరి!
అమెరికా తదితర దేశాల నుంచి ప్రాజెక్టులు తగ్గాయి. దేశీయ ఐటీ సంస్థల్లో అవకాశాలు చిక్కాయి. ఈ ఏడాది మొత్తంగా 1.50 లక్షల ఉద్యోగాలకు మించి లభించకపోవచ్చన్నది ‘నాస్కామ్‌’ అంచనా. ఈ ప్రభావం సాధారణ ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులపై తీవ్రంగా ఉంటోంది. ఆయా సంస్థలు ఈసారి చాలా తక్కువ సంఖ్యలోనే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నట్లు కళాశాలల ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. కొలువులకు కోత పడటం విద్యార్థులకు ఒక విపత్తు అయితే... కోడింగ్‌ నైపుణ్య సాధన వారికి మరో సవాలుగా నిలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ తదితర సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తి సంస్థలు; టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌, క్యాప్‌జెమినీ తదితర సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థలు కూడా కోడింగ్‌ నైపుణ్యం కావాలంటున్నాయి. ఒకప్పుడు సంకేత భాషపై ఓ మోస్తరు పట్టున్నవారిని తీసుకుని, వారికి శిక్షణ ఇచ్చేవి. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో.. తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే, నేరుగా పనిచేయగలవారిని తీసుకుంటున్నాయి.
ప్రథమ సంవత్సరమే ప్రాధాన్యం
క్యాప్‌జెమినీ తదితర సంస్థలు ఉద్యోగార్థులకు ఒక సమస్యను ఇచ్చి... 20-30 నిమిషాల్లో దాని పరిష్కారానికి ప్రోగ్రామింగ్‌ రాయాలని అడుగుతున్నాయి. ఇంజినీరింగ్‌ అన్ని బ్రాంచీల వారికి ప్రథమ సంవత్సరం సి, సి++ భాషలను ఉపయోగించి ప్రోగ్రామింగ్‌ రాయడంపై పాఠాలున్నాయి. మెకానికల్‌, సివిల్‌ తదితర నాన్‌-సర్క్యూట్‌ బ్రాంచీలవారు తర్వాత వాటి జోలికి వెళ్లరు. అదే ఇప్పుడు వారికి సమస్యగా మారింది.
పరిస్థితి ఎలా ఉంది?
* కొన్ని ఐటీ సంస్థలు... మెకానికల్‌, సివిల్‌ వంటి నాన్‌-సర్కూట్‌ బ్రాంచీల వారిని వద్దని చెబుతున్నాయని ఎంజీఐటీ ప్రాంగణ నియామకాల అధికారి వెంకటరెడ్డి చెప్పారు.
* ఓ ప్రముఖ సంస్థ ఇప్పటివరకు సీఎస్‌ఈ, ఐటీతోపాటు ఈసీఈ విద్యార్థులనూ ఎంపిక చేసుకునేది. ఈసారి ఈసీఈ వారు వద్దని చెబుతున్నట్లు ఎంవీఎస్‌ఆర్‌ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి ప్రసన్నకుమార్‌ తెలిపారు.
* చాలా సంస్థలు గతంలో ఇతర బ్రాంచీలవారిని తీసుకుని, వేతనమిస్తూ ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చేవి. తర్వాత దానిని మూడు నెలలకు కుదించాయి. ఇప్పుడు నేరుగా ప్రాజెక్టులో పనిచేసేందుకు కోడింగ్‌ నైపుణ్యం కావాలంటున్నాయని వాసవి కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి కిశోర్‌ చెప్పారు. ఆటోమేషన్‌ కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నట్లు ఆయన విశ్లేషించారు. విద్యార్థులు కోడింగ్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఈ సవాలును అధిగమించవచ్చని చెబుతున్నారు.

Posted on 13-11-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning