ఇంజినీరింగ్‌... ఎన్ని దారులు?

ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించదల్చినవారి కోసం ఇంటర్‌ తర్వాత జాతీయ, రాష్ట్రస్థాయుల్లో వివిధ ప్రవేశపరీక్షలున్నాయి. అన్నిటినీ అందరూ రాయాల్సిన అవసరం లేదు. విద్యార్థులు తమ ప్రతిభకు అనుగుణమైన కొన్ని పరీక్షలను ఎంచుకుని, వాటిపైనే దృష్టి కేంద్రీకరించటం మేలు. ఈ సందర్భంగా ఏ అంశాలు పరిశీలించాలి? ఎలా ముందుకు సాగాలి?

ఇంటర్మీడియట్‌ పూర్తిచేయబోతున్న ఎంపీసీ విద్యార్థులు గత సంవత్సరాల్లాగే ఎక్కువ పరీక్షలు రాయాల్సిన అవసరం ఏర్పడుతోంది. బైపీసీ విద్యార్థులకు ఇప్పుడు ‘నీట్‌’ అనే ఒకే పరీక్షతో వారి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. బాగా చదివే విద్యార్థులు ఇంకా అదనంగా ఎయిమ్స్‌, జిప్‌మర్‌ అనే రెండు పరీక్షలను మాత్రమే రాయాల్సి ఉంటుంది.
కానీ ఎంపీసీ విద్యార్థులకు ఈ ఏడాది కూడా జాతీయస్థాయి ఉమ్మడి పరీక్ష లేదు. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌, జేఈఈ-మెయిన్స్‌, బిట్‌శాట్‌, మహి, ఎంసెట్‌-ఏపీ, ఎంసెట్‌-టీఎస్‌, ఐఎస్‌ఐ, వీఐటీ, గీతం, ఎస్‌ఆర్‌ఎం, కేఎల్‌సీఈ, విజ్ఞాన్‌, నెస్ట్‌.. ఇలా కనీసం 20 వరకూ పరీక్షలున్నాయి. ప్రవేశపరీక్షలంటే దరఖాస్తు చేసుకోవటం, తయారవడం, పరీక్ష రాయడం.. ఇవన్నీ మామూలే కదా?
అయితే ప్రతి విద్యార్థీ ఆలోచించుకోవాల్సిన అంశం- 45 రోజుల్లో 20 పరీక్షలను రాయడమంటే కనీసం 3 రోజులకోసారి పరీక్ష! వీటిలో పరీక్ష పరీక్షకూ వ్యత్యాసం ఉంది. వాటిని గమనించి వేటిలో రుణాత్మక మార్కులు ఉన్నాయో, వేటిలో లేవో ఏ పరీక్షకు ఎన్ని ప్రశ్నలు ఉంటాయో అర్థం చేసుకోవడానికి కనీసం కొంత సమయం అవసరమవుతుంది.
అన్ని పరీక్షలకూ దరఖాస్తు చేసుకుని, రాయాలంటే ఎంతో శ్రమా, ఒత్తిడీ తప్పదు. అది అవసరం కూడా లేదు. ఆచరణీయ మార్గం ఏమిటంటే... తమ ప్రతిభను సరిగా అంచనా వేసుకుని దానికి అనుగుణంగా కొన్ని ప్రవేశపరీక్షలను ఎంచుకోవడం!
విద్యార్థుల ప్రతిభ అనగానే చాలామంది ఆలోచించే అంశం- వారి పదో తరగతి మార్కులు లేదా గ్రేడ్‌. కానీ అది సరికాదు. ఎందుకంటే పదో తరగతిలో 10వ గ్రేడ్‌ పాయింట్‌ సాధించి పోటీ పరీక్షల్లో వెనుకంజలో ఉన్న విద్యార్థుల శాతం చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో ఎక్కువ ప్రావీణ్యం చూపించే విద్యార్థుల్లో పదో తరగతిలో 9.2 నుంచి 9.6 వరకు సాధించినవారే చాలా ఎక్కువ. అందుకని వారి ప్రతిభను పదో తరగతి మార్కుల ఆధారంగా కాకుండా వారు చదువుతున్న సంస్థల్లో పోటీ పరీక్షల్లో సాధిస్తున్న మార్కుల ఆధారంగానే నిర్ణయించుకుంటే బాగుంటుంది.
చేరబోయే బ్రాంచిపై స్పష్టత!
ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచిలో చేరాలనే విషయంలో కూడా విద్యార్థి సొంత అవగాహన పెంచుకోవటం ఉత్తమం. బ్రాంచి గురించి ఇప్పటినుంచే నిర్ణయించుకోగలిగితే దానికి అనుగుణంగా తయారీ విధానం మార్చుకునే అవకాశం ఉంది. విద్యార్థులు తమ బలం, బలహీనత రెండింటినీ గుర్తించకుండా సమాజంలో ఏ బ్రాంచికి గిరాకీ ఉందో అటువైపునకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది సరైన విధానం కాదు. .
ఉదా: నేడు అత్యధిక శాతం విద్యార్థులు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ బ్రాంచి కావాలని కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌లో ఉద్యోగం లేకుండా ఉన్నవారిలో ఈసీఈ విద్యార్థులు చాలామంది ఉన్నారు. దీనికి కారణం- విద్యార్థి తన బలహీనతలను గుర్తించకుండా బ్రాంచిని ఎన్నుకోవడమే. భౌతికశాస్త్రంలో ప్రాథమిక అంశాలపై పట్టులేని విద్యార్థి ఈసీఈ బ్రాంచి తీసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
* మేథమేటిక్స్‌ బాగా చేయగలిగితే కంప్యూటర్‌సైన్స్‌ లాంటి కోర్సులకు మొగ్గు చూపవచ్చు.
* భౌతికశాస్త్రంపై పట్టు ఉన్నవారికి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ (ఈఈఈ) లాంటి బ్రాంచిలు తగినవి.
* కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ల్లో ప్రావీణ్యం ఉన్నవారు మెకానికల్‌ లేదా సివిల్‌ లాంటి బ్రాంచిలను ఎంచుకుంటే వారు జీవితంలో స్థిరపడే అవకాశాలు ఎక్కువ.
ప్రతి బ్రాంచిలోనూ అవకాశాలు అధికంగానే ఉంటాయి. కానీ విద్యార్థి తన ప్రతిభ చాటుకునే అవకాశం ఉన్న బ్రాంచిని తీసుకున్నపుడు తొలి 10 శాతంలో నిలిచే అవకాశం ఉంటుంది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వెంటనే ఉద్యోగం సాధించే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి.
ఇంజినీరింగ్‌ మాత్రమేనా?
అయితే ఎంపీసీ విద్యార్థులు ఇంజినీరింగ్‌ మాత్రమే చేయాలని ఏమీ లేదు. బేసిక్‌ సైన్సెస్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసినవారికి కూడా అవకాశాలు చాలా ఎక్కువే. వీరు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో (ఉదా: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌) ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌ చేయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే నెస్ట్‌ ద్వారా కూడా దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందడానికి అవకాశముంది. వీటిలో కోర్సులు చేసినవారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది.
జేఈఈ మెయిన్‌ లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ల్లో ఇంజినీరింగ్‌ కోర్సులకు తోడు ఆర్కిటెక్చర్‌కు కూడా దరఖాస్తు చేసుకోవడం మేలు. నేడు ఇంజినీరింగ్‌కు సమానంగా ఆర్కిటెక్చర్‌కు కూడా అవకాశాలున్నాయి. అయితే ఆవైపు వెళ్తున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ కోణంలో చూస్తే ఆర్కిటెక్చర్‌ చేసినవారికి ఉద్యోగ సాధన అవకాశాలు ఎక్కువని చెప్పొచ్చు. ఈ విద్యార్థులు సొంతంగా ప్రాక్టీసు పెట్టుకున్నా కూడా బాగానే స్థిరపడవచ్చు.
మొదట తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, కళాశాలలపై విద్యార్థులు సరైన అవగాహన ఏర్పరచుకోవాలి. వాటిలో చేరటానికి రాయాల్సిన ప్రవేశ పరీక్షల్లో అనుగుణమైన కొన్నింటిని ఎంపిక చేసుకోవాలి. వాటిపై పూర్తి శక్తియుక్తులు కేంద్రీకరించి సాధన చేయాలి. ఇలా చేస్తే ప్రవేశపరీక్షల్లో మెరుగైన మార్కులతో మంచి సీటు సాధించి, ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసుకున్నట్టే!

ఈ పరీక్షలు చాలు
ఎంపీసీ విద్యార్థులు ఎక్కువగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దాని నమూనా పరీక్షలో 360కు 110పైగా మార్కులను (రాసిన అన్ని పరీక్షల్లోనూ) విద్యార్థి సాధిస్తూ ఉంటే జాతీయస్థాయి సంస్థల్లో ఆ విద్యార్థి సీటు సాధించడానికి అవకాశం ఎక్కువ. ఆ విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, బిట్‌శాట్‌, ఎంసెట్‌-ఏపీ, టీఎస్‌లకు తోడు ఏవైనా రెండు స్వయం ప్రతిపత్తి గల విద్యాలయాలకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.
ఈ రెండూ కూడా విద్యార్థి తాను ఏదో ఒక సంస్థలో సీటు సాధిస్తాననే మానసిక ధైర్యాన్ని కలుగజేయడానికి మాత్రమే. ఇది చెప్పడానికి గల శాస్త్రీయత ఉంది. జేఈఈ- మెయిన్‌ మొత్తం 14 లక్షల మంది వరకూ రాస్తున్నారు. వారిలో 2,20,000 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తున్నారు. సుమారుగా 1/7వ వంతు అంటే సుమారుగా 15%.
పైన పేర్కొన్న 110 మార్కులు జేఈఈ మెయిన్‌ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడానికి సరిపోతుంది. అంటే యావత్‌ భారతదేశంలోని 12వ తరగతి విద్యార్థుల్లో తొలి 15 శాతంలో ఉంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జేఈఈ మెయిన్‌, బిట్‌శాట్‌, ఎంసెట్‌ రెండు రాష్ట్రాల్లో యూనివర్సిటీ క్యాంపస్‌ సీటు సాధించుకోవడానికి కావాల్సిన ర్యాంకు కచ్చితంగా సాధిస్తారనడంలో సందేహం లేదు. అందువల్ల ఈ విద్యార్థులు ఒక ఆరు పరీక్షలను ముఖ్యంగా తీసుకుని వాటికి తయారు కాగలిగితే సరిపోతుంది. కన్పించిన ప్రతి రాతపరీక్షకూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
రిజర్వేషన్‌ లేకుండా జేఈఈ మెయిన్‌లో 360 మార్కులకు 100లోపు మార్కులు సాధిస్తున్న విద్యార్థి పైనచెప్పిన సంస్థల్లో సీటు సాధించుకునే అవకాశం దాదాపు లేదని చెప్పవచ్చు. అంటే సగటు విద్యార్థి ఎంసెట్‌ ద్వారా విశ్వవిద్యాలయేతర కళాశాలలతో ప్రారంభించి తాను పొందడానికి అవకాశమున్న కొన్ని విద్యాసంస్థలను ఎంచుకోవచ్చు. అంటే ఈ విద్యార్థులు ఎంసెట్‌- ఏపీ, టీఎస్‌లకు తోడు కనీసం 4 డీమ్డ్‌ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవడం మేలు. ఎన్‌ఏఏసీ ఏ+ అక్రిడిటేషన్‌ ఉన్నాయో లేదో తెలుసుకుని వాటిల్లో ఫీజు కూడా తెలుసుకుని, అవి కుటుంబ పరిస్థితులకు దోహదపడతాయో లేదో గమనించి ఎంచుకోవడం సముచితం.
ఒకవేళ ఈ జేఈఈ మెయిన్‌లో 60 మార్కుల్లోపు లేదా ఎంసెట్‌లో 50 మార్కుల్లోపు ఉన్న విద్యార్థులైతే ఈ స్వయం ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాల్లో ర్యాంకింగ్‌లో బాగా తక్కువగా ఉన్న సంస్థలను ఎంచుకోవడం మంచిది. అలా ఎంచుకుని పోటీపరీక్షలకు ప్రాధాన్యమిచ్చి తయారు కాగలిగితే కనీసం తాను కోరిన బ్రాంచిలో చేరడానికి అవకాశం ఉంటుంది.
ఇంటర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు!
పట్టికలో పేర్కొన్న 20 ప్రవేశపరీక్షల్లో ఇంటర్మీడియట్‌ మార్కులకు అధిక ప్రాధాన్యం శస్త్రలోనూ, కొంతమేర ప్రాధాన్యం ఏపీ-టీఎస్‌ ఎంసెట్‌లలోనూ ఉంది. ఇంటర్‌కు ఏమంత ప్రాముఖ్యం లేదనే ఉద్దేశంతో దానిపై శ్రద్ధ చూపించకపోతే ప్రాథమిక అంశాలపై పట్టు ఏర్పడదు. దాంతో ప్రవేశపరీక్షల్లో వైఫల్యం పొందే ప్రమాదం ఏర్పడుతుంది.
ఇంటర్‌ పరీక్షలు అయినా, ప్రవేశపరీక్షలైనా విద్యార్థికి ఉన్న సమయం ఇప్పటి నుంచి జనవరి మాసాంతం వరకే
ఇంజినీరింగ్‌ ఆశావహులకు తొలి పోటీ పరీక్ష... ఏప్రిల్‌ 8న జరగబోయే జేఈఈ మెయిన్స్‌. ఇంటర్‌ పరీక్షలు తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15కూ, ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 14వ తేదీకీ పూర్తవుతాయి. దీని ప్రకారం... పరీక్షల తర్వాత 20 రోజులు విద్యార్థి పూర్తి సిలబస్‌ మీద గ్రాండ్‌ టెస్టులు రాసుకుని తప్పులు సరిచేసుకోవడానికి సరిపోతుంది. అంటే ఇంటర్‌ పరీక్షలు అయినా, ప్రవేశపరీక్షలైనా విద్యార్థికి ఉన్న సమయం ఇప్పటి నుంచి జనవరి మాసాంతం వరకేనని చెప్పవచ్చు. సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు ఈ సమయంలో జూనియర్‌ ఇంటర్‌ సిలబస్‌పై పోటీ ప్రవేశపరీక్షలకు తయారు కావడం కాకుండా ఆ సమయాన్ని సీనియర్‌ ఇంటర్‌ సిలబస్‌లో పోటీపరీక్షలకు తయారుకావాలి. దీనివల్ల ఇంటర్మీడియట్‌కూ, ప్రవేశపరీక్షలకూ సమాంతరంగా తయారైనట్లు అవుతుంది. ఫిబ్రవరి నెల పూర్తిగా ప్రాక్టికల్‌ పరీక్షలకూ, ఇంటర్‌ సిలబస్‌ సన్నద్ధతకూ మాత్రమే ఉపయోగించగలగాలి. ఇలా చేస్తే సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకున్నవారవుతారు!


పి.వి.ఆర్‌.కె.మూర్తి, శ్రీ గాయ‌త్రి విద్యాసంస్థ‌లు


Posted on 13-11-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning