మనసుకు చేయండి రీఛార్జ్‌ !

* ఒకటే వాతావరణం.
* ఒకే తరహా పని.
* ఏళ్లతరబడి చేస్తున్నా ఎలాంటి మార్పు లేదు.
* ఉద్యోగం అంటే విసుగు.. నిరాసక్తత.

చాలా మందిలో కనిపించే భావనలివి. ఇందుకు ప్రధాన కారణం ప్రేరణ లేకపోవడం. ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం. ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు ఆ ఉద్యోగం చేయలేని పరిస్థితికి తలెత్తవచ్చు. ఎంత బాగా పని చేసినా.. మంచి ఫలితాలు వచ్చినా సంతృప్తి కలగకపోవచ్చు. అందువల్ల ఉద్యోగులకు నిత్యం ప్రేరణ అవసరం. ప్రేరణ.. ఎక్కడా లభించదు. ఎవరూ ఇవ్వరు.

మనసుకు సంబంధించిన దీన్ని ఎవరికి వారే సాధించాలి. ఇందుకు కావాల్సిందల్లా ఆలోచనల్లో కాస్త మార్పు. కొన్ని మంచి అలవాట్లు. ప్రేరణకు.. ఆత్మవిశ్వాసానికి పరస్పర సంబంధం ఉంటుంది. ఈ రెండింటిలో ఏది తగ్గినా మరోటి లోపిస్తుంది. అందుకే వృత్తి జీవితంలో ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. మిమ్మల్ని మీరు నమ్మకుంటే.. ఇతరులు చివరకు సంస్థ కూడా మీపై విశ్వాసాన్ని కోల్పోతుంది. అందువల్ల వైఫల్యాలకు బెదరకుండా మీ నైపుణ్యాలు, ప్రతిభ, ప్రత్యేకతలను పూర్తిస్థాయిలో చూపండి. అప్పుడు తప్పకుండా ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఫలితాలు మెరుగవుతాయి. ఒకే తరహా పని చేస్తున్నా మీకంటూ కొన్ని లక్ష్యాలు తప్పకుండా ఉంటాయి. వాటిని సరిగ్గా గుర్తించాలి. అప్పుడే వాటిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించ గలుగుతారు. వీటిపై స్పష్టత లేకుంటే మీ ఉన్నతాధికారులు / పర్యవేక్షకులను అయినా అడిగి తెలుసుకోవాలి.
ప్రత్యేకత ప్రద‌ర్శించండి:
పనిలో ప్రత్యేకత చాటాలంటే నైపుణ్యాలు, ప్రతిభతో పాటు తపన ముఖ్యం. తపన ఉంటే చాలు.. అత్యుత్తమ నైపుణ్యాలు, ప్రతిభ, ప్రత్యేకత ఇలా అన్నీ మీకు అబ్బుతాయి. వీలైనంత త్వరగా మీరు వాటిని ఎలాగైనా సాధిస్తారు. అవసరమైతే మళ్లీ చదివేందుకు, కొత్త విషయాలు నేర్చుకొనేందుకు కూడా సిద్ధపడుతారు. తపన లేకుంటే ఇవన్నీ అతి కష్టం అనిపిస్తాయి. ఒక పని చేస్తే దానిపై విమర్శలు సహజం. వాటిని సానుకూలంగా స్వీకరించాలి. వీటిని ప్రతికూలంగా తీసుకొంటే లోపాలు తెలియడం.. తెలుసుకోవడం కష్టమవుతుంది. లోపాలను గుర్తించేందుకు విమర్శ లాగా మరేదీ ఉపయోగపడదు. ఎంతబాగా పని చేసినా విమర్శలు వస్తున్నాయంటే.. మిమ్మల్ని విమర్శించే వారు, మీ ఉన్నతాధికారి/పర్యవేక్షకుడు లేదా సహోద్యోగికి మీ ప్రతిభ, నైపుణ్యాలపై అంచనాలు ఎక్కువగా ఉన్నట్టే లెక్క. ఆ అంచనాలకు తగ్గట్టు పని చేసేందుకు నిత్యం శ్రమించాలి.
స‌వాళ్లకు సిద్ధంగా ఉండండి:
ఒక పని/వృత్తిలో సవాళ్లు లేకుంటే విసుగు పుట్టడం సాధారణం. విసుగు దూరం కావాలంటే పనిలో సవాల్‌ ఉండాలి. అప్పుడే మరింత బాగా పని చేసేందుకు మీ మనసు సిద్ధమవుతుంది. సవాళ్లను అధిగమించినపుడు సంతృప్తి కలుగుతుంది. ఒకవేళ సవాళ్లే లేకుంటే మీకు మీరు సృష్టించుకోవాలి. ఉద్యోగంలో కాస్త ఓపిగా ముఖ్యమే. ఇది లేకుంటే ప్రేరణ దూరమవుతుంది. ఓపిక ఉంటే వైఫల్యాలు ఎదురైనపుడు వాటిని పాఠాలుగా స్వీకరించగలుగుతారు. మళ్లీ అలాంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తపడుతూ మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది.అన్నిసార్లూ స్వయం ప్రేరణ కష్టం. ఇది సులభం కావాలంటే మంచి పుస్తకాలు చదవాలి. స్వయం కృషితో సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థానాలకు చేరిన ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోవాలి. నిత్యం నిరుత్సాహ పరిచేవారికి కాస్త దూరంగా ఉండాలి.
ఆరోగ్యం ముఖ్యం:
ఒత్తిడి.. ఇది చాలా ప్రమాదం. ఆరోగ్యం నుంచి ఆలోచనల దాకా అన్నింటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీన్ని జయించాలి. సమయానికి పనులు పూర్తి చేయడం, అనవసర చిక్కులకు దూరంగా ఉంటే ఒత్తిడి దరి చేరదు. వృత్తి జీవితంలో ఎదిగేందుకు వీలుగా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే వీటిని సకాలంలో అమల్లోకి తీసుకురావాలి. వాటిని అమలు చేయకుంటే కొన్నాళ్లకు కొత్త ఆలోచనలు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మొత్తానికి మన కలలు సాకారం కావాలంటే ఎప్పటికప్పుడు మనసును కొత్త ఆలోచనలు, నైపుణ్యాలతో రీచార్జ్‌ చేస్తూ ఉండాల్సిందే..

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning