ఉపాధికి ఊతం.. పరిశ్రమకు ప్రాణం

* కేంద్రీయ పరికరాల రూపకల్పన సంస్థ ఘనత
* ఏటా 12 వేల మందికి శిక్షణ
* 95% మందికి ఉద్యోగాలు

మనుషులు లేకుండా కంప్యూటర్లు, రోబోలతో విధుల నిర్వహణ. ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ల గొప్పతనమిది. ఖర్చు తగ్గించుకునేందుకు ఇప్పుడు ఐటీ సంస్థలన్నీ అనుసరిస్తున్న ఈ విధానాన్ని 22 ఏళ్ల కిందటే హైదరాబాద్‌లో ప్రారంభించిన ఘనత కేంద్రీయ పరికరాల రూపకల్పన సంస్థ (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌- సీఐటీడీ)ది. పరిశ్రమల అవసరాలు తీర్చేందుకు ఏర్పాటై ఇప్పుడు సాంకేతిక విద్యలో ఆశాజ్యోతిగా నిలుస్తోంది.
దేశంలో పరిశ్రమలకు మానవవనరులను, సాంకేతిక సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 1968లో ఐక్యరాజ్యసమితి పరిశ్రమల అభివృద్ధి సంస్థ (యునిడో), ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌వో)ల సహకారంతో సీఐటీడీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం బాలానగర్‌లో 10 ఎకరాలు కేటాయించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1970లో సీఐటీడీ ప్రారంభమైంది. అప్పటి నుంచి పరిశ్రమలకు ఉద్యోగులను, కార్మికులను, సాంకేతిక నైపుణ్యాన్నీ అందిస్తోంది. ఏటా 12 వేల మందికి శిక్షణ ఇస్తోంది. పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌, బీటెక్‌ విద్యార్హత ఉన్నవారికి ఇక్కడ 16 రకాల కోర్సులున్నాయి. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ, ఇతర సంస్థలు నిర్దేశించిన కోర్సుల్లోనూ శిక్షణ ఇస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపన, యంత్రాలపై అవగాహన, ఉత్పత్తుల రూపకల్పన సేవలందిస్తోంది.
చదువుతోపాటే కొలువు
ఇక్కడ చదువుకున్నవారిలో 95 శాతం మంది చదువు పూర్తవగానే ఉద్యోగాలు పొందుతున్నారు. మిగిలినవారు స్వయం ఉపాధివైపు వెళ్తున్నారు. మెకానికల్‌, ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ, ఆటోమోబైల్‌, ఏరోనాటికల్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సీఐటీడీ పూర్తిగా ఉపాధి ఆధారిత కోర్సులను నిర్వహిస్తోంది. ఇక్కడ విద్యార్థులు కోర్సులో సగం కాలం విధిగా పరిశ్రమలకు వెళ్లి పని చేయాలి. ఎన్నో సంస్థలు శిక్షణ సమయంలోనే విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. సీఐటీడీలోని శాంసంగ్‌ సాంకేతిక పాఠశాలలో శిక్షణార్థులు నెల రోజులు సర్వీసు కేంద్రాల్లో పనిచేసి ఉద్యోగాలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 4లక్షల మందికి పైగా ఇక్కడ శిక్షణ పొందారు.
ప్రత్యేకతలు
* కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు పరికరాలను తయారుచేస్తుంది.
* రక్షణ, వైమానిక సంస్థలకు రోబోలను రూపొందించింది.
* హిందుస్తాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ సంస్థ హెలికాప్టర్ల విడిభాగాలను ఇక్కడే తయారు చేయిస్తోంది.
* క్యాడ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌), క్యామ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌), స్పెన్సర్‌, నానో టెక్నాలజీ సేవలందిస్తోంది.
* ఆటోమేషన్‌, ఇంజినీరింగ్‌ విభాగాన్ని 1995లో ప్రారంభించింది.
* శివకాశిలో బాణసంచా తయారీకి వాడే యంత్రాలన్నీ సీఐటీడీలోనే తయారవుతాయి.
* అంకుర పరిశ్రమలకు ఆలంబనగా ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసింది.
సీఐటీడీలో కోర్సుల వివరాలు
పదో తరగతి అర్హత గలవారికి డిప్లొమా ఇన్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (డీసీఈసీ), డిప్లొమా ఇన్‌ ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు. కాలపరిమితి మూడేళ్లు.
డిప్లొమా ఇన్‌ టూల్‌, డై, మౌల్డ్‌ మేకింగ్‌ కోర్సు. కాలపరిమితి నాలుగేళ్లు
* ఐటీఐ తత్సమాన అర్హతగల వారికి అడ్వాన్స్‌ సీఎన్‌సీ మెషినిస్ట్‌ కోర్సు (సంవత్సరం), మాస్టర్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ క్యాడ్‌/క్యామ్‌ (ఆరు నెలలు), మాస్టర్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ కంప్యూటర్‌ ఎయిడెడ్‌ టూల్‌ ఇంజినీరింగ్‌ (6 నెలలు) కోర్సులున్నాయి.
* డీఎంఈ, ఎల్‌ఎంఈ, డీటీడీఎం, డీపీఈ అర్హతగల వారి కోసం పోస్టు డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ కోర్సు. ఏడాది కాలపరిమితితో నడుపుతోంది.
* బీఈ, బీటెక్‌ అర్హతగల వారి కోసం ఎంటెక్‌, ఎంఈ, పీజీ డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నారు. ఎంఈ మెకానికల్‌ క్యాడ్‌/ క్యామ్‌, ఎంఈ మెకానికల్‌ టూల్‌ డిజైన్‌, ఎంఈ మెకానికల్‌ డిజైన్‌ ఫర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌. ఇవి రెండేళ్ల కాలపరిమితి గల కోర్సులు. వీటిని ఉస్మానియా విశ్వవిద్యాలయం సహకారంతో నిర్వహిస్తున్నారు.
* ఎంటెక్‌ మెకాట్రానిక్స్‌. జేఎన్‌టీయూ సహకారంతో నిర్వహిస్తున్నారు. కాలపరిమితి రెండేళ్లు.
* పీజీ ఇన్‌ టూల్‌, డై, మౌల్డ్‌ డిజైన్‌, పీజీ ఇన్‌ మెకాట్రానిక్స్‌, పీజీ ఇన్‌ వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టం కోర్సులున్నాయి. కాలపరిమితి 18 నెలలు. బీఈ, బీటెక్‌ విద్యార్థులకు మాస్టర్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ మెకాట్రానిక్స్‌ పేరిట ఆరు నెలల కోర్సును అందిస్తోంది.
నైపుణ్య శిక్షణ
భారత్‌లో తయారీ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ నైపుణ్య అర్హత విధానం కింద పలు స్వల్పకాలిక కోర్సులను నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ సహకారంతో సెల్‌ఫోన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాల మరమ్మతుల్లో మూడు నెలల శిక్షణ ఇస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఈఎస్‌డీపీ కోర్సును నెల నుంచి మూడు నెలల పాటు పారిశ్రామికవేత్తలకు రెండు వారాల కోర్సులను నిర్వహిస్తున్నారు. 35 మంది బోధన, 105 మంది బోధనేతర సిబ్బందితో ఈ కేంద్రం నడుస్తోంది. అత్యాధునిక యంత్రాలు, కంప్యూటర్లపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది విద్యార్థులకు హాస్టల్‌ వసతి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ బోధనరుసుముల పథకం, కొన్ని కోర్సుల్లో ఎస్టీ, ఎస్టీలకు రాయితీలు ఉన్నాయి.
ఉద్యోగం గ్యారంటీ - ఐశ్వర్య, విద్యార్థిని
బీటెక్‌ ఈసీఈ పూర్తి చేసి ఇక్కడ చేరాను. కళాశాలలో నేర్చుకున్న దానికంటే ఎన్నో రెట్లు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన వస్తోంది. ఉద్యోగం ఖాయంగా సాధిస్తా.
ఆసియాలోనే ఉత్తమం - సుజాయత్‌ ఖాన్‌, ముఖ్య సంచాలకుడు
పరిశ్రమల అవసరాలే ప్రాతిపదికగా ఏర్పాటయిన ఈ సంస్థ ఆసియాలోనే అత్యుత్తమం. విదేశీ విద్యార్థులు కూడా చదువుతున్నారు. ఇక్కడ శిక్షణ పొందినవారందరికీ ఉద్యోగాలొస్తున్నాయి. మా కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది.
నవ్యతే విజయరహస్యం - జి.సనత్‌కుమార్‌, ఉపసంచాలకుడు
మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా మార్పులే మా విజయరహస్యం. భవిష్యత్తు అవసరాలను ఊహించి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. ఉస్మానియా, జేఎన్‌టీయూల సహకారంతో కోర్సులు నిర్వహిస్తున్నాం.


Posted on 20-11-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning