ప్రాంగణ నియామకాల్లో ‘ఒప్పంద’ సంస్థలు

* ఆఖరిదశలోనే అసలు కంపెనీల ప్రవేశం
* శ్రమ, ఖర్చు తగ్గించుకునేందుకే..
* సాధారణ కళాశాలల్లో చేరిన ప్రతిభావంతులకూ ప్రయోజనం

ఈనాడు - హైదరాబాద్‌: ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు కళాశాలలకు వెళ్లే ఐటీ కంపెనీలు ఎంపిక ప్రక్రియలో కొత్త విధానాలకు తెర తీస్తున్నాయి. తమకు కావాల్సిన నైపుణ్యాలున్న అభ్యర్థులను గుర్తించి, ఎంపిక చేసేందుకు ఒప్పంద (థర్డ్‌ పార్టీ) సంస్థలను నియమించుకుంటున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలు ఒక కళాశాలలో వందల మందికి రాత పరీక్ష, ముఖాముఖిలు నిర్వహిస్తే చివరకు వారికి అవసరమైన పది మంది కూడా దొరకడం లేదు. దీంతో పలు కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది. కీలకమైన స్థానాల్లో ఉన్న నిపుణుల సమయం వృథా అవుతోంది. శ్రమ సరేసరి. దీనికి భిన్నంగా కోనీ లాంటి కొన్ని ఐటీ పరిశ్రమలు వేరే సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
ఒప్పంద సంస్థలు హైరింగ్‌ పొటెన్షియల్‌ అసెస్‌మెంట్‌ (హెచ్‌పీఏ) పేరిట విద్యార్థులకు రాత పరీక్ష, ముఖాముఖి నిర్వహిస్తున్నాయి. అవసరమైతే నాలుగైదు కళాశాలల వారిని ఒక చోటకు చేర్చి, పరీక్షలు నిర్వహించి, ఈ ప్రక్రియను పూర్తి చేస్తాయి. కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించి ఐటీ కంపెనీలకు ఎంపికైనవారి జాబితాను ఇస్తున్నాయి. ప్రస్తుతం మూడు, నాలుగో శ్రేణి కళాశాలలకు ఐటీ పరిశ్రమలు ప్రాంగణ నియామకాలకు వెళ్లడం లేదు. థర్ట్‌ పార్టీ సంస్థల వల్ల ఆ కళాశాలల్లోని ప్రతిభావంతులు కూడా పరీక్షలు రాసి మంచి వేతనాలు ఇచ్చే కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక అయ్యేందుకు అవకాశం ఉంది. కొన్ని కళాశాలలు ఇప్పటికే ఆ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని రాత పరీక్షలు నిర్వహించి.. ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యేందుకు విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నాయి. ‘ఖర్చులు తగ్గించుకునేందుకు ఐటీ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి...అందులో భాగంగానే హైరింగ్‌ కంపెనీలను ఎంచుకునేందుకు కొన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి’ అని సన్‌టెక్‌ కార్ప్‌ సీఈఓ వెంకట్‌ కాంచనపల్లి చెప్పారు. ఐటీ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలంటే విద్యార్థులకు ప్రాంగణ నియామకాలకు ముందు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కళాశాలలు దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(విట్‌) తన పరిధిలోని 202 ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని విద్యార్థులకు అంచనా పరీక్ష నిర్వహించి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఇటీవలే ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని ఆయన తెలిపారు.


Posted on 26-11-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning