కొలువులకు కావాలి... కొత్త నైపుణ్యాలు!

వృత్తివిద్యా కోర్సులు అందించే కళాశాలల్లో ప్రాంగణ నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక తీరు రానురానూ క్లిష్టంగా మారుతోంది. ఈ విద్యాసంవత్సరం నుంచీ కొత్తగా మార్పులూ వచ్చాయి. వాటిని విద్యార్థులు ఆకళింపు చేసుకోవాలి. ఆన్‌ క్యాంపస్‌ అయినా, ఆఫ్‌ క్యాంపస్‌ అయినా.. ఈ ప్రక్రియను విద్యార్థులు తేలిగ్గా తీసుకోకూడదు. భవితకు బాట వేసుకునే ఈ సందర్భంలో చిత్తశుద్ధితో దీటుగా తయారవ్వాలి! అవకాశాలు అందిపుచ్చుకోవాలి!

ప్రాంగణ నియామకాలను ఈ సంవత్సరం మొదటి సెమిస్టర్లో వివిధ సంస్థలు నిర్వహించాయి. గత సంవత్సరం వరకూ నిర్వహించినదానికి భిన్నంగా ఈసారి ఎంపిక ప్రక్రియ స్థాయి పెరిగింది. కోడింగ్‌ నైపుణ్యం ఉన్నవారు మాత్రమే విజయం సాధించారు. ఆ నైపుణ్యం కొరవడిన మిగిలిన విద్యార్థులు రెండో సెమిస్టర్లో జరిగే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌పై తగిన శ్రద్ధ పెట్టటం తప్పనిసరి. కోర్సు చివరి సంవత్సరంలో ఉన్నవారికి వివిధ సంస్థలు ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తాయనేది తెలిసిందే. ఈ సంవత్సరం నుంచీ ఐటీ పరిశ్రమకు సంబంధించిన సంస్థలు ముఖ్యంగా ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, కోడింగ్‌ టెస్ట్‌, బృందచర్చ (గ్రూప్‌ డిస్కషన్‌), టెక్నికల్‌, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. విద్యార్థి నైపుణ్యాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని ప్రతి విభాగమూ నిశితంగా పరీక్షిస్తుంది.

అప్పట్లో ఎలా ఉండేవి?
2013 వరకూ కొన్ని ముఖ్య ఐటీ సేవల సంస్థలు ప్రాంగణ నియామకాల్లో ముఖ్యంగా ఒక ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించేవి. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ద్వారా సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని పరీక్షించేవి. అది రాత పరీక్ష అవటం వల్ల ఫార్ములాలు, షార్ట్‌కట్‌ల ఆధారంగా విద్యార్థులు జవాబులు రాయగలిగేవారు. అంటే సంస్థలు ఆశించిన ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ఎబిలిటీ లేకపోయినా ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో ఎంపికై తర్వాతి దశకు (షార్ట్‌లిస్ట్‌) వెళ్ళగలిగేవారు. ఇక హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థిలో సరైన దృక్పథం, నేర్చుకునే సామర్థ్యం లాంటి లక్షణాలు ఉన్నాయో లేదో గమనించేవారు. అయితే సామర్థ్యం (ఎబిలిటీ) సంపూర్ణంగా లేకపోయినా, మామూలుగా జవాబులు చెప్పినా ఎంపికైన సందర్భాలు లేకపోలేదు. ఎంపికైన విద్యార్థులు సంస్థలో చేరిన తర్వాత వారు ఉద్యోగానికి సిద్ధమయ్యేందుకు మూడు దశల్లో నియామకానంతర (పోస్ట్‌ రిక్రూట్‌మెంట్‌) శిక్షణను ఇచ్చేవారు.
* సీ ప్రోగ్రామింగ్‌, డేటా స్ట్రక్చర్స్‌, అల్గారిదమ్స్‌, డేటా బేస్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లైఫ్‌ సైకిల్‌ మీద మొదటి దశ శిక్షణ ఇచ్చేవారు.
* ప్రాజెక్ట్‌/డొమైన్‌ ఆధారిత సాంకేతికతల్లో అంటే.. జావా, ఎంఎస్‌.నెట్‌, టెస్టింగ్‌, మెయిన్‌ ఫ్రేమ్స్‌ మొదలైనవాటిల్లో రెండోదశ శిక్షణ ఇచ్చేవారు.
* మూడో దశలో సాఫ్ట్‌స్కిల్స్‌పై తర్ఫీదు ఇచ్చేవారు.
ఈ శిక్షణ మొత్తం వ్యవధి ఆరు నెలల వరకూ ఉండేది. నియామకం తర్వాత జరిగే శిక్షణ కాబట్టి వారికి ఈ ఆరునెలలూ జీతం కూడా ఇవ్వాల్సివచ్చేది. సంస్థలో ఉండే సాంకేతిక సిబ్బందితో శిక్షణ ఇప్పించేవారు. ఇదంతా కంపెనీకి ఖర్చు. శిక్షణ పూర్తయ్యాక సంబంధిత ప్రాజెక్టుల్లోకి తీసుకునేవారు. శిక్షణలో కానీ, తర్వాత కానీ పనితీరు సరిగా లేకపోతే వారిని తొలగించేవారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు సైతం పని ఒత్తిడిని తట్టుకోలేక తమకు తామే మానివేసేవారు. ప్రతి సంస్థా ఫ్రెషర్లను తీసుకునేటప్పుడు రెండు నుంచి మూడు సంవత్సరాల బాండ్‌ అడుగుతాయి. మొత్తమ్మీద 2013 వరకూ జరిగిన ఎంపిక ప్రక్రియలో 1 నుంచి 100 స్కేల్‌ ప్రతిభలో 30 వరకూ ప్రతిభ ఉన్నవారిని ఎంపిక చేసుకుని నియామకానంతర శిక్షణతో 100 వరకూ తీసుకువచ్చేవారు.

తర్వాత ఎలా మారాయి?
2013 నుంచి 2016 వరకూ జరిగిన ప్రాంగణ నియామకాల్లో కొన్ని ముఖ్యమైన సంస్థల్లో గ్రూప్‌ డిస్కషన్‌ (జీడీ), సాంకేతిక (టెక్నికల్‌) ఇంటర్వ్యూలను చేర్చారు. ఎందుకంటే... గతంలో హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలోనే కమ్యూనికేషన్‌, ప్రెజెంటేషన్‌, లీడర్‌షిప్‌ లక్షణాలను పరిశీలించేవారు. హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ వన్‌ టూ వన్‌ అవటం వల్ల సమయం ఎక్కువ పట్టేది. అందుకే జీడీని ఒక బృందానికి నిర్వహించి, సమయం వృథా కాకుండానూ, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో సరైన ధోరణి, నేర్చుకునే ఆసక్తి లాంటి లక్షణాలమీద శ్రద్ధ పెట్టేలానూ చేశారు. కానీ జీడీలో కూడా అప్పుడప్పుడూ ఇంగ్లిష్‌లో నాలుగు పాయింట్లు మాట్లాడినా చాలు, తర్వాతి దశకు చేర్చేవారు. విషయ పరిజ్ఞానం, సామర్థ్యం సంపూర్ణంగా లేకున్నా తీసుకునేవారు. ఇక సాంకేతిక ఇంటర్వ్యూని చేర్చడానికి ముఖ్య ఉద్దేశం- సీఎస్‌ఈ, ఐటీ విద్యార్థులకు సీ/డీఎస్‌/డీబీఎంఎస్‌/ఓఎస్‌/సీఎన్‌/ఎస్‌డీఎల్‌సీ కాన్సెప్టుల మీద ఎంత పట్టు ఉందనేది తెలుసుకోవటం. అలా అయితే సంస్థలు అలాంటివారికి మొదటి దశ పోస్ట్‌ రిక్రూట్‌మెంట్‌ శిక్షణను మినహాయించవచ్చు. ఖర్చును తగ్గించవచ్చు. కానీ సాంకేతిక ఇంటర్‌వ్యూల్లో కాన్సెప్టును దాటి కోడింగ్‌ వరకూ వచ్చిన దాఖలాలు ఎక్కువగా లేవు. 100 స్కేల్‌ ప్రతిభలో 40 వరకూ ప్రతిభ ఉన్నవారిని తీసుకుని, 100కి పెంపొందించేవారు. ఇలా సంక్షోభ సమయాలు వచ్చినపుడల్లా సంస్థలు ప్రాంగణ నియామకాల్లో నియామకానంతర శిక్షణల భారం తగ్గించుకోవడానికి ఎంపిక ప్రక్రియను కష్టతరం చేస్తూ వచ్చాయి. తొలిరోజు నుంచీ ఉద్యోగానికి సిద్ధమయ్యే మానవ వనరులను ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు మొగ్గు చూపాయి.

ఐటీ కంపెనీల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థికి కోడింగ్‌ ఆప్టిమైజేషన్లో నైపుణ్యం ఉండాలి. మెరుగైన భావవ్యక్తీకరణ, సరైన ధోరణి, ఉద్యోగార్హ నైపుణ్యాలూ అవసరం.

ముందే మేలుకోవాలి!
ఈ సంవత్సరం నుంచీ కంపెనీలు ఇలా తమ భారాన్ని తగ్గించుకునేందుకు సంపూర్ణంగా ఉద్యోగార్హత ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాయి. దీన్ని విద్యార్థులు గ్రహించి ప్రతి నైపుణ్య అంశమూ తమ సామర్థ్యంలో భాగమయ్యేలా పెంపొందించుకోవాలి.
ముందస్తు అవగాహన: విద్యార్థి దశలోనే తమ ప్రాధాన్యాలను గుర్తించాలి. ప్రతి ఒక్కరిలో సామర్థ్యం ఉంటుంది. దాన్ని ఎంతవరకూ ఉపయోగించగలరో గుర్తించాలి.
లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం: లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి సమయం, సందర్భం రావాలి. ఎవరికైనా తమ కెరియర్‌ ప్రయాణంలో ఒక కచ్చితమైన రంగంపై ఆసక్తి ఏర్పడినప్పుడే లక్ష్యం ఏర్పడుతుంది. అప్పటివరకు ఒక ప్రణాళిక ప్రకారం విద్యార్థి తన కెరియర్‌ను ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
ప్రణాళిక: నెగ్గటానికి అతి ముఖ్యమైన అంశం ప్రణాళిక అని అందరికీ తెలిసిందే. ప్రతి స్థాయిలోనూ లక్ష్యాలను నిర్దేశించుకుని టైంటేబుల్‌ను తయారు చేసుకోవాలి. దాన్ని నిలకడగా పాటించేలా జాగ్రత్త వహించాలి.
మూల్యాంకనం (పర్ఫార్మెన్స్‌ ఇవాల్యుయేషన్‌): చదువుతూపోతే ఏ విద్యార్థికైనా తన ప్రతిభ తనకు తెలియదు. అందుకే ఒక నిర్దిష్ట వ్యవధుల్లో మూల్యాంకనం అవసరం. విద్యార్థి తాను సిద్ధమవుతున్న దానికి అనుగుణంగా తయారు చేసుకుని, పరీక్షలు రాయాలి. వారానికి రెండు పరీక్షలు ఉంటే, దానికి తగ్గ సిలబస్‌కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. అలా దినదినాభివృద్ధికి వీలు కలుగుతుంది.
వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం: విద్యాసంస్థల్లో, మండల, జిల్లా.. ఇలా వివిధ స్థాయుల్లో నిర్వహించే ఈవెంట్లలో వీలున్నప్పుడల్లా పాల్గొనాలి. ఒకదాని తర్వాత ఒక మెట్టు ఎక్కుతూ పరిధి పెంచుకోవాలి. లింక్‌డ్‌ ఇన్‌ లాంటి ప్రొఫెషనల్‌ నెట్‌ వర్క్‌లో చేరి మెంటార్స్‌ను సంపాదించాలి.
సామాజిక కార్యకలాపాలు: ప్రతి విద్యార్థి సమాజాభివృద్ధికి చేతనైనంత సాయం చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థి నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి కూడా. అంతే కాదు; బాధ్యతగల ఉద్యోగిగా, పౌరుడిగా తయారవ్వటానికి ఇవి దోహదపడతాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తన ప్రొఫైల్‌ను నైపుణ్యాలు, వైఖరులవారీగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని ఒక వేదికను తయారుచేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థిదే. ఉద్యోగ నైపుణ్యాలను గణనీయంగా పెంచుకోగలిగితే విజయం చేరువ అయినట్టే!

ధీమా.. ప్రేరణ!
ప్రతి విద్యార్థీ చదువుతున్న సమయంలోనే ఉద్యోగం సంపాదించే అవకాశం ప్రాంగణ నియామకాల రూపంలో వస్తుంది. ఇది మినహా మిగతా ఏ కెరియర్‌ ఆప్షన్లు అయినా చదువు పూర్తయిన తర్వాత వచ్చేవే. కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి.
* ప్రాంగణ నియామకాలకు జరిపే సన్నద్ధత ద్వారా మౌలిక నైపుణ్యాలు, ఆప్టిట్యూడ్‌, కమ్యూనికేషన్‌, టెక్నికల్‌, పర్సనాలిటీ అంశాలపై పట్టు సాధించవచ్చు.
* మౌలిక నైపుణ్యాలపై పట్టు సాధిస్తే ఉన్నత కెరియర్‌ అవకాశాల కోసం చేసే సన్నద్ధత సులువవుతుంది.
* చదువుతున్నపుడే ఒక ఉద్యోగపు ఆఫర్‌ చేతిలో ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తులో మెరుగైన కెరియర్‌ లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి స్ఫూర్తి వస్తుంది.
* విద్యాభ్యాసం ముగియకముందే ఉద్యోగం సాధిస్తే కుటుంబ సభ్యులూ, స్నేహితులూ, సమాజం నుంచి గుర్తింపు పొందవచ్చు.
* కోర్సు ముగుస్తున్నపుడు ఉద్యోగసాధనను లక్ష్యంగా పెట్టుకోక తాత్సారం చేస్తే చదువు పూర్తయ్యాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
* ఇక నైపుణ్యం కచ్చితంగా అభివృద్ధి కావాలంటే మొదటి సంవత్సరం నుంచీ శ్రద్ధగా తయారవ్వాలి.

ఈ ఏడాది మాటేంటి?
ఈ సంవత్సరం ఉద్యోగ మార్కెట్లో సంక్షోభం వల్ల కంపెనీలు ప్రాంగణ నియామక ప్రక్రియను వినూత్నంగా మల్చుకున్నాయి. కోడింగ్‌ సామర్థ్యాన్ని పరీక్షించడంతో మొదలుపెట్టాయి. దీనివల్ల మొదటి విద్యాసంవత్సరం తర్వాత కోడింగ్‌ జోలికి పోని కంప్యూటరేతర బ్రాంచీల విద్యార్థులు అత్యధికులు విఫలమయ్యారు. సీఎస్‌ఈ /ఐటీ విద్యార్థులు కూడా ఇదివరకటి సంవత్సరాల కన్నా ఎక్కువ శాతం నెగ్గలేకపోయారు. ఈ కోడింగ్‌ సామర్థ్యం ఉండాలంటే ప్రతి నైపుణ్య అంశంలో ఎలాగోలా షార్ట్‌ లిస్ట్‌ అవ్వడం కుదరదు. ప్రతి ఒక్క స్కిల్‌లో నేర్పు ఉన్నపుడు మాత్రమే తర్వాతి దశకు వెళతారు. ఎందుకంటే... అప్లికేషన్‌ ఆఫ్‌ మైండ్‌, విజువలైజేషన్‌, థాట్‌ ప్రాసెస్‌, న్యూమరికల్‌- అనలిటికల్‌ సామర్థ్యాలు ఉంటేనే విద్యార్థికి ఆప్టిట్యూడ్‌ ఉన్నట్టు. ఆ సమస్యా పరిష్కార నైపుణ్యాలు ఉంటేనే అల్గారిదమ్స్‌ మీద పట్టు లభిస్తుంది. ఆ పట్టు ఉంటేనే ఏదైనా టెక్నాలజీని మీడియంగా వాడి కోడింగ్‌ రాయవచ్చు. ఆఖరిగా ఐటీ ప్రొడక్ట్‌ కంపెనీ ఎంపిక ప్రక్రియలో అయితే అభ్యర్థికి కోడింగ్‌ ఆప్టిమైజేషన్లో నైపుణ్యం ఉండాలి. ఇంకోవైపు అభ్యర్థిలో మెరుగైన భావ వ్యక్తీకరణ, తగిన ప్రవర్తన, సరైన ధోరణి, ఉద్యోగార్హ నైపుణ్యాలు అవసరం. ఈ సామర్థ్యాలు నూరుశాతం ఉండాలి. అంటే ఈ సంవత్సరం నుంచీ కంపెనీలు తమ భారం తగ్గించుకోవడానికీ, ఎంపికైన తర్వాత వారు పెంపొందించుకునే సామర్థ్యం ముందే కలిగివున్నవారిని మాత్రమే తీసుకుంటున్నాయి. అందుకే కోడింగ్‌ని పరీక్షించటం మొదలుపెట్టాయి. దీనివల్ల సంస్థలకు నియామకానంతర శిక్షణ భారం తగ్గుతుంది. జాబ్‌ రెడీ ప్రొఫైల్‌ ఎంపిక వల్ల సమయం కలిసివస్తుంది. శిక్షణ సమయంలో ఇవ్వాల్సిన జీతం కూడా అవసరం రాదు. అంతా పొదుపే!

Posted on 26-11-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning