కాస్త ఎక్స్‌ట్రాలు చేయండి..!

‘ఈసారి క్యాంపస్‌ ఇంటర్వ్యూలో నీకే జాబ్‌! నీక్కాకపోతే ఇంకెవరికి వస్తుంది ..!’ - స్నేహితులు అలా అంటుంటే వూహల్లో తేలిపోయాడు ఆకాశ్‌. అవును మరి! ఈ నాలుగేళ్లూ క్లాస్‌లో ఫస్ట్‌ కాబట్టి.. అత్యధిక జీతమిచ్చి అతణ్ని కంపెనీలు ఎగరేసుకుపోతాయన్నది అందరి అభిప్రాయం. కానీ ఆ రోజు జరిగింది వేరు. క్లాసులో జస్ట్‌ ‘ఎబౌ యావరేజ్‌’ అనిపించుకున్న ఆదర్శ్‌ జాబ్‌ కొట్టేశాడు! ఓ పెద్ద ఐటీ కంపెనీలో ఏడాదికి పదిహేను లక్షల జీతంతో ఎంపికయ్యాడు. మొదట్నుంచీ ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకున్న తనకి కాకుండా.. ఆదర్శ్‌కి ఆ అవకాశం ఎలా వచ్చింది? అతడి సీవీ చూశాక గానీ ఆకాశ్‌కి అసలు విషయం అర్థం కాలేదు.. ఆదర్శ్‌లో ఉన్న ఆ ‘ఎక్స్‌ట్రా’ ఏమిటో..! ఏడాదికో ఇంటర్న్‌షిప్‌, దాదాపు ఐదు ఆన్‌లైన్‌ కోర్సుల సర్టిఫికెట్లు.. ఇవన్నీ చూస్తుంటే కళ్లు చెదిరిపోయాయి ఆకాశ్‌కి!

అదో ఎమ్మెన్సీ సంస్థ. అక్కడ మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి కోసం ఇంటర్వ్యూలు. తనవంతు కోసం ఎదురుచూస్తున్న నళిన్‌లో నిమిషనిమిషానికీ ఆందోళన! 2:1 లెక్కన తీసుకుంటారట. చివరిగా.. అతడితోపాటూ ఇంకొక్కరే మిగిలారు. అయితే అతను.. లేకపోతే తాను! అతణ్ని పలకరించాడు నళిన్‌. మాట్లాడుతూనే యథాలాపంగా అన్నట్టు అతడి ‘బయో’ చూశాడు. చదివిన కాలేజీ, గ్రేడ్‌లూ, ఇదివరకు పనిచేసిన కంపెనీలో అతడి బాధ్యతలూ అన్నీ చకచకా స్కాన్‌ చేశాడు. అన్ని స్థాయుల్లోనూ తనకంటే తక్కువే. తనది దాదాపు మూడు టీంలని నిర్వహించిన మేనేజర్‌ స్థాయి!! కాకపోతే ఇతడికి స్పోర్ట్స్‌లో ఏవో పతకాలూ, సంగీతంలో ఎంతో ప్రవేశం ఉందని రాసుకున్నాడు. ‘మరీ చిన్నపిల్లల్లా ఆటలూ, సంగీతం వచ్చు అని రాసుకోవడమేంటీ!’ అని నవ్వుకున్నాడు నళిన్‌. ఆ ఇంటర్వ్యూలో విజయం తనదేననుకున్నాడు. పది నిమిషాల తర్వాత బయటకొస్తున్నప్పుడే అర్థమైపోయింది తాను ఎంపిక కాలేదని. కానీ తరుణ్‌ మాత్రం రెండో దశ ఇంటర్వ్యూకి వెళ్లడం చూశాడు. తనకన్నా తక్కువస్థాయి ఉండీ అతడెలా సెలెక్ట్‌ కాగలిగాడు? తరుణ్‌లో బయోలో ఉన్న క్రీడలూ, సంగీతం.. ఓ మెరుపులా కళ్లముందు మెదిలాయి నళిన్‌కి.

అటు ఆదర్శ్‌, ఇటు తరుణ్‌ ఇద్దరిలో ఉన్న ఆ లక్షణాన్నే ఎక్స్‌.క్యూ అంటున్నారు.. నేటి కార్పొరేట్‌ పండితులు. ఐక్యూ, ఈక్యూ తెలుసు.. ఇదేమిటీ ఎక్స్‌క్యూ అంటారా? ఇది ‘ఎక్స్‌ట్రా కోషంట్‌’. ప్రతి అంశంలోనూ అందరికంటే కాస్త ఎక్స్‌ట్రాగా ఉండే లక్షణం ఇది. అంటే, కెరియర్‌పరంగా కాస్త అతిచేయడం అన్నమాట! నేటి సంస్థలు దీన్ని రెండురకాలుగా కోరుకుంటున్నాయి. కొత్తవాళ్లలోనైతే మామూలు గ్రేడ్‌లూ, మార్కులతోపాటూ.. నేటితరం కార్పొరేట్‌ వాతావరణానికి అనుగుణమైన అనుభవం, అదనపు నైపుణ్యాలు ఉండాలని చూస్తున్నాయి. ఇప్పటికే స్థిరపడ్డవాళ్లలోనైతే చక్కటి జీవనశైలిని, వికాసాన్ని ప్రతిబింబించే అభిరుచుల్నీ ఆశిస్తున్నాయి. కాస్త వివరంగా చూద్దామా?

సెంటురాసుకున్నంత ఇష్టంగా, క్రీము రాసినంత గమ్మత్తుగా మన సీవీకి ఈ రెండురకాల ఎక్స్‌ట్రాలని కలుపుకోవాలి. అదే ఎక్స్‌.ట్రా అంటే!!

అతికి జై..
ఏడాదిపొడవునా ఇంటర్న్‌లు : టెన్త్‌లో 99.9999 మార్కులు తెచ్చుకున్నామా, ఇంటర్‌లోనూ అదరగొట్టామా, ఎమ్సెట్‌లో టాప్‌ కొట్టామా.. ఐటీలో ఉద్యోగం సాధించామా? అనుకుంటే ఇప్పుడు సరిపోదు. మీరు కంపెనీలోకి రాగానే పెద్దగా కష్టంలేకుండా అక్కడ కలగలసిపోయేటంత నైపుణ్యాలు కోరుకుంటున్నాయి. సాధారణంగా మూడో ఏడాది ఓ నెల, నాలుగో ఏడాది రెండునెలలు ఇంటర్న్‌గా చేస్తాం అందరం. కానీ దానికన్నా ప్రతి ఏడాది సెలవుల్లోనూ మనం ఎందుకు ఇంటర్న్‌గా వెళ్లకూడదు? కార్పొరేట్‌ వాతావరణం మనకి ఎంతగా పరిచయముంటే.. పని సంస్కృతి మనకి ఎంతగా అలవాటైతే అంతగా మనకి కొత్త సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయి. ఇందుకు ఎన్నో సంస్థలు నేరుగా అవకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థల తరఫున ఇలా ఇంటర్న్‌షిప్‌లు అందించే ఏజెన్సీలూ ఉన్నాయి! ఒక్క ఫోన్‌తో మీరు ఏదో ఒక కంపెనీలో మొదటి ఏడాది నుంచే ఇంటర్న్‌ కావొచ్చు. కాస్త వెతకండి..
‘మూక్స్‌’ : ఒకప్పుడు ఆన్‌లైన్‌ కోర్సులంటే కొన్నింటికే పరిమితమని అనుకునేవారు. కానీ ఇప్పుడు సముద్రం నుంచి సౌరవిద్యుత్తుదాకా అన్ని నైపుణ్యాలూ ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. ఇందుకోసం మ్యాసివ్‌ ఓపన్‌ ఆన్‌లైన్‌ కోర్సు (మూక్‌)లు ఎన్నో ఉన్నాయి. మీరు మెకానికల్‌ విద్యార్థి అయితే యాప్‌ తయారీ నేర్చుకోవచ్చు, ఐటీలో ఉంటే మెకానికల్‌కి సంబంధించి క్యాడ్‌ నేర్చుకోవచ్చు, పోనీ మీది కామర్స్‌ రంగం అనుకుంటే మీ అర్హతలతో పనిలేకుండా అత్యాధునిక సిమ్యులేటర్‌ సాఫ్ట్‌వేర్‌లతో విర్చువల్‌ శాటిలైట్‌ తయారు చేయొచ్చు, క్లాసుల్లో పోగ్రామింగ్‌ పాఠాలు బోర్‌కొడితే పైథాన్‌తో యానిమేషన్‌లోకి వెళ్లొచ్చు. చెప్పొచ్చేదేమిటంటే.. మీ రంగంకంటే విభిన్నమైన నైపుణ్యాలని మీ సొంతం చేసుకోవడాన్ని నేటి కార్పొరేట్‌ సంస్థలు వేచి చూస్తున్నాయి. అలాంటి ఎక్స్‌ట్రా మాస్టర్లకే ఎర్రతివాచీ పరుస్తున్నాయి.
సాఫ్ట్‌గా : ఒకప్పుడు చక్కగా రాయడం, చదవడం, మాట్లాడటం వంటి భాషా నైపుణ్యాలనే సాఫ్ట్‌ స్కిల్స్‌ అనుకునేవారు. ఇప్పుడు వాటి పరిధి పెరిగింది. మానసికశాస్త్రం, మేనేజ్‌మెంట్‌ తత్వం కూడా దీనికిందకే వస్తుంది. ఇవన్నీ ఏదోరకంగా సంస్థకి ఉపయోగపడేవే. ‘ఈ హెచ్‌ఆర్‌ వాళ్లతో ఎంత తలపోటో!’ అనుకుంటున్నారా? ఓసారి హెచ్‌ఆర్‌ సైకాలజీయో, పర్సనల్‌ అడ్మినిస్ట్రేషనో చదివి చూడండి. ‘ఐటీ రంగంలో ఎందుకింత ఎగుడుదిగుళ్లు?’ అనుకుంటున్నారా ఆరువారాలపాటు ‘గ్లోబల్‌ ఎకనామిక్స్‌’లో సర్టిఫికెట్‌ కోర్సు చేయండి. మీకో స్పష్టత వస్తుంది. మీ బహుముఖ ప్రజ్ఞ సంస్థలకీ నచ్చుతుంది. మనం సువాసనల సబ్బుతో స్నానం చేస్తాం.. మరి అదనంగా అత్తరెందుకు రాస్తాం? ఫోమ్‌తోనో, క్రీమ్‌తోనో షేవింగ్‌ చేస్తాం.. అయినా ఆ ఫేస్‌క్రీమ్‌లో, ఫేస్‌ వాషో ఎందుకు? ఎందుకంటే అవన్నీ అసలుతోపాటు కొసరుగా విలువని పెంచుతాయికాబట్టి. మనల్ని ఆకర్షణీయంగా మారుస్తాయి కాబట్టి. కెరీర్‌ విషయంలోనూ అంతే. సెంటురాసినంత ఇష్టంగా, క్రీము రాసినంత గమ్మత్తుగా మన సీవీకి ఈ రెండురకాల ఎక్స్‌ట్రాలని కలిపేసుకోవాలి. అదే ఎక్స్‌.ట్రా అంటే!!

అభిరుచులకీ జై..
నేటి కార్పొరేట్‌ సంస్థలు ఉద్యోగుల విషయంలో పఠిస్తున్న నయామంత్రం.. అభిరుచులు! క్రీడలూ, సంగీతం, చిత్రలేఖనం.. ఇవి కూడా ముఖ్యమైన అర్హతలుగా మారిపోయాయి. ఆటా,పాటా ఏదైనా సరే తక్షణం మీ సీవీలో చేర్చండి. రాకపోతే నేర్చుకోండి. ఇంతకీ వీటికి ఎందుకింత ప్రాధాన్యం? మనసుపెట్టి మనం లీనమైపోయే ఏ కళైనా.. మనలో ‘ఔటాఫ్‌ బాక్స్‌’ ఆలోచనని రేకెత్తిస్తుంది. దాని ప్రభావం మన పనితీరుపైనా పడుతుంది. కెరియర్‌లోనూ అద్భుతాలు చేయిస్తుంది. బిల్‌గేట్స్‌ నుంచి అజీం ప్రేమ్‌జీ దాకా ఇలా తమకంటూ మంచి కళాభిరుచి ఉన్నవాళ్లే! మనం చూసిన రెండో ఉదాహరణలో మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయికి తరుణ్‌కి ఎంపిక చేసుకుంది కేవలం ఈ అర్హతతోనే! ఓ కళ లేదా మంచి అభిరుచి మనల్ని కేవలం సృజనకారులుగా మాత్రమే చేసి వూరుకోదు. మిగతావాళ్లకన్నా ఎక్కువ మానసిక ప్రశాంతతని సొంతం చేస్తుంది. ముఖ్యంగా వీటి ప్రభావం మనల్ని అనారోగ్యాల నుంచి దూరం చేస్తుందని.. నేటి కార్పొరేట్‌ ప్రపంచం నమ్ముతోంది! ఆఫీసుకి వచ్చినంత సేపు ఉత్సాహంగా, కొత్త సృజనతో, ఉత్తేజంగా పనిచేయాలనే ఏ సంస్థయినా కోరుకుంటుంది కదా! వాటన్నింటిని ఇచ్చే శక్తి కళకీ, క్రీడకీ ఉంది. అందుకే ఈరకం ఎక్స్‌ట్రాలకీ అంత ప్రాధాన్యం!!

Posted on 26-11-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning