ఉపాధికి నానో మార్గాలు!

ఏళ్ల కొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన పన్లేదు... ఆ మాటకొస్తే కాలేజీకెళ్లే వూసే లేదు...లక్షల్లో ఫీజుల మాటే లేదు...
కంప్యూటరే క్లాస్‌రూమ్‌.. ఆన్‌లైన్‌ ట్యూటరే అసలైన గురువు...
నెల నుంచి ఏడాది వరకు వీడియోల రూపంలో చదువు...
కోర్సు పూర్తవగానే ఉద్యోగం రెడీ ... ఇది నానో డిగ్రీల మహిమ...
డిగ్రీ పట్టా చేతికందగానే జీవితంలో సెటిలైపోవాలని తపిస్తున్న విద్యార్థులు ఎంచుకుంటున్న నయా ట్రెండ్‌.

నానో.. పేరులోనే ఉంది పొట్టిదనం. సూటిగా చెప్పాలంటే నాలుగు వారాల నుంచి ఏడాది కాలవ్యవధి మించకుండా ఉంటుందీ కోర్సు. రోజుకు ఒకటి నుంచి నాలుగు గంటల వరకు వీడియో పాఠాలుంటాయి. సంప్రదాయ విశ్వవిద్యాలయాలు అందించే కోర్సుల కాలవ్యవధికన్నా తక్కువ. అమెరికాలో ఉన్న అధ్యాపకుడు ఆదిలాబాద్‌లో ఉన్న విద్యార్థికి పాఠాలు చెబుతాడు. జర్మనీ గురువు ఏలూరు కుర్రాడికి ప్రాక్టికల్‌ పాఠాలు బోధిస్తాడు. అన్నీ ఆన్‌లైన్‌లోనే.. ప్రపంచమే వేదిక. వీటినే మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సులు (ఎమ్‌ఓఓసీ) అంటున్నారు. కంప్యూటర్‌ సంబంధిత నైపుణ్యాలకు పెద్దపీట వేస్తూ సత్వర ఉపాధి కల్పనే లక్ష్యంగా రూపొందడమే నానో డిగ్రీల ముఖ్య ఉద్దేశం. ఆన్‌లైన్‌ కోర్సుల నిర్వహణలో ముందున్న ‘ఉడాసిటీ’ ఈ సరికొత్త కోర్సులకు రూపకల్పన చేసింది. వీటి హవా ఎంతగా ఉందంటే ఉడాసిటీలో ఇండియా నుంచి ఒక్క నెలలోనే నాలుగువేలమంది రిజిస్టర్‌ చేసుకునేంత.
ఉచిత కోర్సులెన్నో
వెబ్‌ డిజైనింగ్‌ నుంచి కృత్రిమ మేధస్సుతో రోబోలు రూపొందించడం దాకా నానో డిగ్రీలతో సర్వం నేర్చేసుకోవచ్చు. కోర్సుల్ని బిగినర్‌, ఇంటర్మీడియట్‌, అడ్వాన్స్‌డ్‌ అని మూడు రకాలుగా విభజించారు. వెబ్‌ డెవలప్‌మెంట్‌, మొబైల్‌ డెవలప్‌మెంట్‌, డేటా సైన్స్‌ అండ్‌ అనాలిసిస్‌, సెల్ఫ్‌డ్రైవింగ్‌కార్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, వర్చువల్‌ రియాలిటీ, డిజిటల్‌ మార్కెటింగ్‌ బాగా ప్రాచుర్యంలో ఉన్న డిగ్రీలు. ఒక్కోదానికి కాలవ్యవధి నెల నుంచి ఏడాదివరకు ఉంటుంది. ఫీజు రూ.6 వేలతో మొదలై అత్యధికంగా రూ.70వేల వరకూ ఉంటుంది. ఉడాసిటీ, ఈడీఎక్స్‌, కోర్స్‌ఎరా, ఉడెమీలాంటి కొన్ని సంస్థలైతే ప్రారంభస్థాయి కోర్సుల్లో చాలా వాటిని ఉచితంగానే అందిస్తున్నాయి. ఆ వెబ్‌సైట్లలోకి వెళ్లి మన పేరుతో రిజిస్టర్‌ చేసుకుంటే చాలు.
అవకాశాలు పుష్కలం..
ఆన్‌లైన్‌ కోర్సులు.. అక్కడెక్కడో ఉండి అంతర్జాలం ద్వారా బోధించే గురువులు. ఈ నానో డిగ్రీ చేస్తే కొలువుకు అవకాశం ఉంటుందా? అన్నది చాలామంది సందేహం. ఆ బెంగే అక్కర్లేదంటున్నాయి సంస్థలు. ఈ కోర్సులు నిర్వహిస్తున్న అత్యధిక సంస్థల ఫౌండర్లు ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా ఉన్నవారే. పైగా గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ఐబీఎంలాంటి దిగ్గజ సంస్థలతోపాటు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రాలాంటి దేశీయ కంపెనీలతో ప్లేస్‌మెంట్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కోర్సులు పూర్తవగానే కొలువులు దక్కేలా ఒప్పందాలు కూడా ఉన్నాయి. పట్టభద్రుల నైపుణ్యాలకు మెరుగులు పెట్టేలా ఈ నానోడిగ్రీల కోర్సులు రూపొందిస్తున్నారు. కొన్ని సంస్థలైతే కోర్సుల్లో చేరే విద్యార్థులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నాయి. ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఈఎంఐ అవకాశం సైతం ఇస్తున్నాయి. ఇన్నిరకాల ప్రయోజనాలు ఉన్నాయి గనకే భారతీయ విద్యార్థులు లక్షల్లో నానో డిగ్రీలవైపు మళ్లుతున్నారు.
ఇవి ఉచితం
* ఫ్రంట్‌ ఎండ్‌ వెబ్‌ డెవలపర్‌
* డేటా అనలిస్ట్‌
* ఐఓఎస్‌ డెవలపర్‌
* ఫుల్‌ స్టేక్‌ వెబ్‌ డెవలపర్‌
* బిజినెస్‌ అనలిస్ట్‌
* మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌
* సెల్ఫ్‌డ్రైవింగ్‌ కార్‌ ఇంజినీర్‌
* వీఆర్‌ డెవలపర్‌
* డిజిటల్‌ మార్కెటర్‌
* రోబోటిక్స్‌ ఇంజినీర్‌
* ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలపర్‌
* డిస్క్రిప్టివ్‌ స్టాటిస్టిక్స్‌
* సాఫ్ట్‌వేర్‌ డిబగ్గర్‌
* వెబ్‌ టూలింగ్‌ అండ్‌ ఆటోమేషన్‌
* సోలార్‌ ఎనర్జీ
* సైబర్‌ సెక్యూరిటీ
* ఆగ్మెంటెడ్‌ రియాలిటీ
* ఫ్రంట్‌ ఎండ్‌ వెబ్‌ డెవలపర్‌
చదువుల సంస్థలివి
ఉడాసిటీ: ‘గూగుల్‌ ఎక్స్‌’ వ్యవస్థాపకుడు సెబాస్టియన్‌ థ్రన్‌ 2012లో ఉడాసిటీ ప్రారంభించాడు. భారత్‌ నుంచి అత్యధికమంది విద్యార్థులు చేరుతోంది ఇందులోనే. 190 దేశాల్లో లక్షా అరవై వేల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. గూగుల్‌, అమెజాన్‌, ఐబీఎంలతో ఉద్యోగాల ఒప్పందం ఉంది. పద్దెనిమిది వందలకుపైగా కోర్సులు అందిస్తోంది.
https://in.udacity.com
ఈడీఎక్స్‌: హార్వర్డ్‌ యూనివర్సిటీ, ఎంఐటీ యూనివర్సిటీల భాగస్వామ్యంతో ఐదేళ్ల కిందట మొదలైంది. ఎంఐటీ, హార్వర్డ్‌, బర్కిలీ, ది యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకులే పాఠాలు బోధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోటిమంది చేరారు. 1300 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
https://www.edx.org/
కోర్స్‌ఎరా: స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆండ్రూ ఎన్‌జీ, డాఫ్నే కొల్లర్‌లు ఫౌండర్లు. ఫిబ్రవరి 27నాటికి 24మిలియన్ల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. 180 కేటగిరీల్లో 2వేల కోర్సులున్నాయి.
https://www.coursera.org/
ఉడెమీ: 2010లో ఎరెన్‌ బాలీ టర్కీలోని ఓ చిన్న పల్లెటూరిలో ప్రారంభించాడు. తర్వాత అతడికి భారతీయ అమెరికన్‌ గగన్‌ బియానీ జత కలిశాడు. టెక్నాలజీతోపాటు ఇతర విభాగాల్లోనూ కోర్సులు అందిస్తోంది.
https://www.udemy.com/
ట్రీహౌజ్‌: 222 కోర్సులు నిర్వహిస్తున్నారు. లక్షా ఎనభైవేలమంది రిజిస్టర్‌ చేసుకున్నారు. 28వేల నిమిషాల నిడివి ఉన్న వీడియోల్ని ఉచితంగా అందుబాటులో ఉంచారు. షయ్‌ హోవ్‌ సృష్టికర్త.
https://teamtreehouse.com/
నోవోఎడ్‌: స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అమీన్‌ సబేరీ, పీహెచ్‌డీ విద్యార్థి ఫర్నాజ్‌ రోనఘి కలిసి నాలుగేళ్ల కిందట ప్రారంభించారు. టెక్నాలజీ కోర్సులతోపాటు ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఫైనాన్స్‌, బిజినెస్‌ల్లో కూడా కోర్సులు అందిస్తోందీ సంస్థ.
https://novoed.com/
ఐవర్సిటీ: జర్మనీ యూనివర్సిటీకి చెందిన జోనాస్‌ లీప్‌మన్‌, హేన్స్‌ క్లోపర్‌ 2011లో ప్రారంభించారు. లక్షాపదిహేను వేల మంది రిజిస్టర్‌ యూజర్లున్నారు. ప్రపంచవ్యాప్తంగా నలభై ఒక్క యూనివర్సిటీలతో ఒప్పందం ఉంది.
https://iversity.org/

Posted on 27-11-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning