అరకొర చాలదు.. అదరగొట్టాలి!

‘ప్రీమియర్‌షోకి వెళదాం మామా! ఏ.. లేదు పబ్‌కి పోదాం.. అరె వద్దు పార్టీకే సై... మ్యూజికల్‌ నైట్‌ మర్చిపోయావేంట్రా...’ క్లాస్‌ కాగానే ఈ కబుర్లలోనే పూర్తిగా మునిగిపోతే కెరియర్‌ గల్లంతే. అప్పటికప్పుడు అరకొరగా తయారై క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకి వెళితే ఇప్పుడు కుదరదు. నియామకాల ట్రెండ్‌కి తగినట్లు కోర్‌ నైపుణ్యాలు, సాఫ్ట్‌ స్కిల్స్‌పై పట్టు సాధించి అదరగొడితేనే క్యాంపస్‌ హీరో కాగలుగుతారు.


కోర్‌ నైపుణ్యాలు
ఐటీ సంస్థలను లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి విద్యార్థికీ మొదటగా, అత్యవసరంగా కావాల్సింది- సమస్యా పరిష్కార సామర్థ్యం. ఇది ఒక అల్గారిదమ్‌ రాయడానికి పునాది అవుతుంది. అల్గారిదమ్‌పై పట్టుంటే ఏదైనా టెక్నాలజీని మీడియంగా పెట్టుకుని కోడింగ్‌ను రాయవచ్చు. మామూలుగా కోడింగ్‌ రాయడానికి టెక్నాలజీ కాన్సెప్టులపై మంచి పట్టుండాలి. కోడ్‌ ఆప్టిమైజేషన్‌ చేయగలిగితే, ఐటీ సంబంధ సంస్థల్లో ఎంపిక కావొచ్చు.
సాఫ్ట్‌ సిల్క్స్‌
కోర్‌ లేదా ఐటీ నైపుణ్యాలనేవి జ్ఞానానికి సంబంధించినవి. కానీ ఉద్యోగధర్మంలో భాగంగా ఇతరులతో సంప్రదింపులు జరపాల్సి వస్తుంది. ఇందుకు సాఫ్ట్‌స్కిల్స్‌ అత్యవసరం. వీటిలో ప్రధానమైంది- టెక్నికల్‌ కమ్యూనికేషన్‌. అంటే.. ఎవరైనా మాట్లాడినప్పుడు దానిలో ఎంతవరకూ విషయాన్ని అవతలివారు గ్రహించగలుగుతున్నారు? ఆ సంభాషణలో ఎంతవరకూ సందర్భశుద్ధి ఉంది? తేలికగా అర్థమయ్యేలా ఉచ్చారణ, ధారాళత, శరీరభాష ఉన్నాయా? ప్రభావవంతంగా ఎంతవరకూ ఉంది అనేవి తెలుసుకోవడం.
నియామకాల్లో ఇదీ వరస
1. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2 కోడింగ్‌ టెస్ట్‌ 3. గ్రూప్‌ డిస్కషన్‌ 4. టెక్నికల్‌ ఇంటర్వ్యూ 5. హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ.
ఈ సంవత్సరం నుంచీ కంపెనీలు తమ భారాన్ని తగ్గించుకునేందుకు సంపూర్ణంగా ఉద్యోగార్హత ఉన్నవారిని మాత్రమే ప్రాంగణ నియామాల్లో తీసుకుంటున్నాయి. దీన్ని గ్రహించి విద్యార్థులు ప్రతి నైపుణ్య అంశమూ తమ సామర్థ్యంలో భాగమయ్యేలా చూసుకోవాలి.
కోడింగ్‌ రాయటానికి ఏదో ఒక టెక్నాలజీ వచ్చుండాలి. నియామకాల్లో ఎక్కువగా దృష్టిపెట్టేది సీ, డేటాస్ట్రక్చర్స్‌పైనే. కాబట్టి, వీటిపై పట్టు ఉండాలి. కానీ ఒక ప్రోగ్రామ్‌ను కోడ్‌ చేయాలంటే దాని లక్ష్యానికి అనుగుణంగా అల్గారిదమ్‌ను నిర్మించగలగాలి. తర్వాత సూడో కోడ్‌ రాయగలగాలి. కానీ అల్గారిదమ్‌ను బిల్డ్‌ చేయాలంటే సమస్యా పరిష్కార శక్తి తప్పనిసరి. ఇదంతా ఒక ఐటీ సర్వీస్‌ కంపెనీ స్థాయికి కావాల్సిన ప్రాథమిక, కనీస కోడింగ్‌ నైపుణ్యాలు.
ఒక ఐటీ ప్రొడక్ట్‌ సంస్థ అయితే కోడ్‌ ఆప్టిమైజేషన్‌ వచ్చుండాలి. ఇందుకు సీ/ డీఎస్‌ లాంటి టెక్నాలజీ కాన్సెప్టులపై అపారమైన అవగాహన తప్పనిసరి. అల్గారిదమ్‌, సూడో కోడ్‌లను సులువుగా బిల్డ్‌ చేయగలగాలి. ఒక ప్రోగ్రామ్‌ను సాధ్యమైనన్ని ఉత్తమ రీతుల్లో, అనేక కాన్సెప్టులను ఉపయోగించి రాయగలగాలి.
సంస్థ అంటే అందరితో కలిసి, బృందంగా పనిచేసే వాతావరణం. ఈ వాతావరణంలో అంతర్జాతీయ భాషా మాధ్యమం ఇంగ్లిష్‌. ఈ భాషా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇతరులతో సాంకేతికంగా మాట్లాడేటప్పుడు చెప్పాలనుకున్న సమాచారంలో సత్తా ఉండాలి. అది తేలికగా అర్థం చేయించాలి. ముఖ్యంగా ఒక మంచి శ్రోత అయివుండాలి.
బృందంతో పనిచేయాలంటే వైఖరి సానుకూలంగా ఉండాలి. అందరితో తేలికగా కలిసిపోయేట్టు ఉండాలి. నిజాయతీతో, పారదర్శకంగా, ఉత్సాహంగా ఉండాలి. ఇతరులకు సాయపడుతూ వాళ్లకు మార్గనిర్దేశం చేయగలగాలి. అప్పుడే త్వరగా లీడ్‌ స్థాయికి చేరే అవకాశముంటుంది.
ఇలా సాంకేతిక నైపుణ్యాలు, సాఫ్ట్‌స్కిల్స్‌తో విద్యార్థి తన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇలా ప్రయాణించగలడా అని పరీక్షించేవే ప్రాంగణ నియామకాలు!
ఆప్టిట్యూడ్‌ టెస్ట్ట్‌
దీన్ని విద్యార్థి సమస్యా పరిష్కార శక్తిని గుర్తించడానికి నిర్వహిస్తారు. దీనిలో క్వాంటిటేటివ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ, అనలిటికల్‌/ లాజికల్‌ ఎబిలిటీ, వెర్బల్‌ ఎబిలిటీ అనే మూడు విభాగాలుంటాయి.
* క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ: విద్యార్థి ఎంత త్వరగా సమస్యలోని సమాచారాన్ని గ్రహించి, దాన్ని మనసులో లెక్కించగలడనేది పరీక్షిస్తారు. ఉదాహరణకు- ‘ఒకతను రూ.1400కి సైకిల్‌ కొని రూ.1750కి అమ్మితే అతనికి ఎంతశాతం లాభం వస్తుంది?’. విద్యార్థి సమస్యను తన మనసులో ఎంత త్వరగా గ్రహించి, పరిష్కారం చూపగలడనేదాన్ని ఇక్కడ పరిశీలిస్తారు.
1. రూ.1400 కి సైకిల్‌ను కొన్నాడు (సమాచారాన్ని గ్రహించడం)
2. రూ.1750కి అమ్మాడు
3. రూ.350 లాభం.
4. రూ.1400కి రూ.350 లాభం అంటే...
లాభ శాతం? 25%.
ఈ ఆలోచనా విధానం (థాట్‌ ప్రాసెస్‌) అల్గా్గరిదమ్‌ రాయటానికి పునాది.
* రీజనింగ్‌ ఎబిలిటీ: ఒక గ్లాసులో నీళ్ళను వేగం పెంచుతూ పోస్తూ ఉంటే, ప్రతి నిమిషానికీ ఆ నీళ్ళ పరిమాణం రెట్టింపవుతుంది. మొదటి నిమిషానికి 1 మి.లీ. నిండితే రెండో నిమిషానికి రెట్టింపు అవుతుంది. అంటే 2 మి.లీ., మూడో నిమిషానికి 4 మి.లీ., నాలుగో నిమిషానికి 8 మి.లీ... ఇలా నిండుతుంది. మరి మొత్తం గ్లాసు 30 నిమిషాల్లో నిండితే, సగం గ్లాసు ఎన్ని నిమిషాల్లో నిండుతుంది?
ఈ ప్రశ్నను కాల్‌క్యులేట్‌ చేయడం కన్నా, తార్కికంగా (లాజికల్‌) ఆలోచించి పరిష్కరించాలి. ప్రతి నిమిషం రెట్టింపవుతుంది కదా? అంటే 30 నిమిషాల్లో నిండే గ్లాసు 29 నిమిషాలకు సగం నిండి ఉంటుంది. ఎందుకంటే.. తర్కం ప్రకారం ఒక్కో నిమిషంలో సగం నుంచి రెట్టింపు అంటే మొత్తం నిండుతుంది. ఇదే విశ్లేషణాత్మక/తార్కిక సామర్థ్యం.
* వెర్బల్‌ ఎబిలిటీ: దీనిలో విద్యార్థి వ్యాకరణ పరిజ్ఞానంతో పాటు అవగాహన, విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షిస్తారు. ముఖ్యంగా టెన్సెస్‌, ఆర్టికల్స్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ప్యాసేజెస్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌పై ప్రశ్నలుంటాయి.
కోడింగ్‌ టెస్టు
దీనిలో ఒక ప్రోగ్రాం అవుట్‌పుట్‌ కనుక్కోమనీ, ఎరర్‌ని గుర్తించమనీ, సూడో కోడ్‌ రాయమనీ అడుగుతున్నారు. ఇక ప్రాబ్లమ్‌ స్టేట్‌మెంట్లు ఇచ్చి దానికి ముఖ్యంగా సీ ప్రోగ్రామింగ్‌లో లేదా ఇతర జావా, పీహెచ్‌పీ, పైతాన్‌ మొదలైన టెక్నాలజీల్లో కోడ్‌ రాసి ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్‌ చేయమని అడుగుతున్నారు. ఈ కోడింగ్‌ టెస్ట్‌ అన్ని బ్రాంచీల వారికీ నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి విద్యార్థీ కోడింగ్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి.
టెక్నికల్‌ రౌండ్‌
ఈ ఇంటర్వ్యూలో మొదట సీ, డీఎస్‌, జావా మొదలైన మౌలిక కాన్సెప్టులను నిర్వచించి, దాన్ని వివరించమని అడుగుతారు. తర్వాత వాటిని ప్రోగ్రామ్స్‌లో అన్వయించే సామర్థ్యాన్ని గమనిస్తారు. పుస్తక పరిజ్ఞానం, నిజ జీవితంలో దాన్ని ఉపయోగించడం మీద ఉన్న అవగాహనను పరీక్షిస్తారు. మొత్తమ్మీద సీ, డీఎస్‌ కాన్సెప్టులు, అల్గారిదమ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, కోడింగ్‌ నైపుణ్యాలను పరీక్షిస్తారు. అకడమిక్‌ ప్రాజెక్టు పార్టిసిపేటివ్‌నెస్‌ను విశ్లేషిస్తారు.
హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ
దీనిలో విద్యార్థి సానుకూల దృక్పథం, వ్యక్తిత్వం, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తిలను పరిశీలిస్తారు. అలాగే సంస్థ విధివిధానాలకు సరిపోతారా లేదా అనేదీ పరిశీలిస్తారు. జీతభత్యాల గురించీ చర్చిస్తారు. మొత్తమ్మీద స్వతంత్రంగా రాణించగలరా అని గమనిస్తారు.ఈ అన్ని దశల్లోనూ మెరుగ్గా రాణించేలా కృషి చేస్తే నియామకాల తుది జాబితాలో పేరు ఖరారు చేసుకున్నట్టే!
గ్రూప్‌ డిస్కషన్‌
బృందచర్చలో విద్యార్థికి విషయంపై ఉన్న అవగాహన, భావవ్యక్తీకరణ, నాయకత్వ లక్షణాలను పరీక్షిస్తారు. దీన్ని రెండో రౌండ్‌గా నిర్వహిస్తారు. పదిమందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి, ఒక అంశాన్ని ఇస్తారు. దానిపై వారివారి అభిప్రాయాలను చెప్పమంటారు. సంబంధిత అంశానికి సంబంధించిన అనుకూల, వ్యతిరేక అభిప్రాయాలను ఇక్కడ పంచుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించేవి...
1. విషయం: చెప్పే పాయింట్లలో ఎంత సత్తా ఉందో, అవి ఎంతవరకూ సందర్భశుద్ధితో ఉన్నాయో చూస్తారు.
2. సందర్భం/ పదజాలం: సరైన రీతిలో పదజాలాన్ని ఉపయోగిస్తున్నారో లేదో గమనిస్తారు.
3. భావవ్యక్తీకరణ: భాష తీరు, ఉచ్చారణ, శరీరభాష ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు.
4. నాయకత్వ లక్షణాలు: బృందాన్ని ఎంతవరకూ నడిపించగలుగుతున్నారో, ఇతరులకు ఎంతవరకూ సహకరిస్తున్నారో చూస్తారు.

- వెంక‌ట్ కాంచ‌న‌పల్లి, సీఈఓ, స‌న్‌టెక్ కార్ప్‌‌
నైపుణ్యాలతో కూడిన యువశక్తి అవసరం
భారత దేశంలోని యువశక్తి మన పురోగతికి బలమైతే, వారిలోని ఉద్యోగ సంసిద్ధత లోపం బలహీనత. ఈ అద్భుతమైన యువతను మెలకువలు, నైపుణ్యాలతో కూడిన బలవత్తర శక్తిగా తీర్చిదిద్దడమే మన ముందున్న సవాలు. ఆ లక్ష్యాన్ని సాధిస్తే మన దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది.
- చంద్రజిత్‌ బెనర్జీ, డైరెక్టర్‌ జనరల్‌, భారత పరిశ్రమల సమాఖ్య్‌

Posted on 30-11-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning