మౌలికాంశాలు మరవొద్దు!

సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు మరో మంచి అవకాశం వచ్చింది. గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగాల్లో 277 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. సామాజిక హోదాతో పాటు ఆకర్షణీయమైన వేతనం లభించే ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువ. విజేతగా నిలవాలంటే తగిన అధ్యయన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి.

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల రాతపరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. రెండు నెలల సమయంలో పరీక్ష జరిగే అవకాశముంది. వెంటనే చదవడం మొదలుపెట్టి సమయాన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలి. సిలబస్‌లో ఎటువంటి మార్పులూ లేవు. అందిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది రాత పరీక్ష. రెండోది ఇంటర్వ్యూ. రాత పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ, పేపర్‌-2 సివిల్‌ ఇంజినీరింగ్‌ (డిగ్రీస్థాయి). రెండో పేపర్‌ ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.
గత పరీక్షలను పరిశీలిస్తే మౌలికాంశాలకు సంబంధించి వస్తున్న ప్రశ్నలు కొంత కఠినంగా ఉంటున్నాయి. పరీక్ష హాలులోకి కాల్‌క్యులేటర్‌ అనుమతి లేదు. కానీ, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ మాదిరి న్యూమరికల్‌ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి 2, 3, 5, 10 వంటి సంఖ్యల స్క్వేర్‌ రూట్స్‌, ఇన్‌వర్స్‌ ఆఫ్‌ రూట్స్‌ గుర్తుంచుకోవడం అవసరం. టీఎస్‌పీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఇంజినీరింగ్‌ ప్రశ్నపత్రాల్లోని న్యూమరికల్‌ ప్రశ్నలను సాధన చేయడం ప్రయోజనకరం.
వెయిటేజీ ప్రకారమే!
ఇంజినీరింగ్‌ సబ్జెక్టుకు సంబంధించి సాలిడ్‌ మెకానిక్స్‌, బిల్డింగ్‌ మెటీరియల్స్‌, ఆర్‌సీసీ, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌- హెచ్‌ఎం, ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, హైవే ఇంజినీరింగ్‌ల్లో ఎక్కువ మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. ఈ అధ్యాయాలకు ప్రాధాన్యమివ్వాలి. తక్కువ వెయిటేజీ ఉన్న అధ్యాయాల్లోని ప్రాథమికాంశాలను క్షుణ్ణంగా చదవడం ద్వారా మార్కులను పొందవచ్చు.
జనరల్‌ స్టడీస్‌పై పట్టు ఎలా?
2015 ఏఈఈ ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే ప్రశ్నలు సరళంగా, నేరుగా వచ్చాయి. కానీ 2017లో లోతైన అవగాహన ఉన్నవారు మాత్రమే సమాధానం రాసేవిధంగా కఠినమైన, విశ్లేషణాత్మక ప్రశ్నలు వచ్చాయి. అందుకని సబ్జెక్టుపై లోతైన అవగాహన పెంపొందించుకోవాలి.
కరెంట్‌ అఫైర్స్‌, తెలంగాణ భౌగోళిక అంశాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళలు, సాహిత్యం, వాస్తుశైలి, సామాజిక అంశాలు, తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, జనరల్‌ సైన్స్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. కరెంట్‌ అఫైర్స్‌లో .హైదరాబాద్‌ మెట్రో, టి-హబ్‌, గ్లోబల్‌ ఆంత్రపెన్యూర్‌షిప్‌ వంటి విశేషాలపై ప్రశ్నలు రావచ్చు. తెలంగాణ ప్రాంతీయ అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి.
తెలంగాణ నదీవ్యవస్థ, ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, పంటలు, ఖనిజ వనరులు, అడవులు, నేలలతీరు మొదలైన అంశాలపై అభ్యర్థికి లోతైన అవగాహన అవసరం.1956 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఉద్యమ తొలిదశ ప్రారంభం నుంచి సంఘటనలు, ఉద్యమంలో కేసీఆర్‌, జేఏసీ పాత్ర తదితరాలపై దృష్టిసారించాలి. తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా అధ్యయనం మంచిది.
చరిత్రకు సంబంధించి ఐరోపావారు భారతదేశానికి వచ్చి స్థిరపడిన కాలం నుంచి 1947 వరకు జరిగిన ప్రధాన సంఘటనలపై దృష్టిపెట్టాలి.
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి సుమారు 15-20 ప్రశ్నలు వస్తున్నాయి. ఇస్రో విజయాలు, సూపర్‌ ఫాస్ట్‌ కంప్యూటర్ల అభివృద్ధి మీద ప్రశ్నలు వస్తాయి. విటమిన్లు, మినరల్స్‌, వ్యాధులు తదితరాలపై పట్టు సాధించాలి.
పాలిటీ అధ్యయనం వర్తమాన పరిణామాల ఆధారంగా జరగాలి. రాష్ట్రపతి ఎన్నికలు, న్యాయవ్యవస్థలో పరిణామాలు, డిజిటల్‌ పరిపాలన, నీతి ఆయోగ్‌లపై దృష్టిపెడితే అధిక ప్రయోజనం. ఎకానమీలో పంచవర్ష ప్రణాళికలు, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో ప్రస్తుత మార్పులు, బడ్జెట్‌ అంశాలు, పన్ను వ్యవస్థ- జీఎస్‌టీ, ఎగుమతులు, దిగుమతులు, బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రశ్నలు వస్తున్నాయి.
పర్యావరణం, విపత్తు నిర్వహణలో గ్లోబల్‌ వార్మింగ్‌ కారణాలు, ప్రభావం, ఓజోన్‌ పొర నశించడం, కారణాలు, ప్రభావాలు, కాలుష్య కారకాలు, ఆమ్లవర్షాల ప్రభావం మీద ప్రశ్నలుంటాయి. విపత్తు నిర్వహణలో కరవు, తుపానులు, భూకంపాలు, సునామీ, నిర్వహణ చట్టంపై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.
బేసిక్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నలు పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి కాబట్టి ఆందోళన అవసరం లేదు. రాతపరీక్షలో అర్హత పొందినవారిని నోటిఫికేషన్‌లోని నిబంధనల ఆధారంగా 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది. దీనిలో అభ్యర్థి ఆలోచనా విధానాన్ని, శక్తిసామర్థ్యాలు, నీతినిజాయతీలను అంచనా వేస్తారు.
రిఫరెన్స్‌ పుస్తకాలు
* ఇండియన్‌ జాగ్రఫీ - డాక్టర్‌ కుల్లర్‌ * తెలంగాణ భౌగోళికాంశాలు - 6-10 తరగతుల పుస్తకాలు * ఆధునిక భారతదేశ చరిత్ర - తెలుగు అకాడమీ, బిపిన్‌ చంద్ర * ఇండియన్‌ ఎకానమీ- ప్రత్యోగిత దర్పణ్‌, ఇండియా సామాజిక సర్వే, ఇండియన్‌ ఇయర్‌ బుక్‌ * తెలంగాణ ఆర్థికాంశాలు - తెలంగాణ సామాజిక సర్వే * తెలంగాణ చరిత్ర తదితరాలు - తెలుగు అకాడమీ * సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ- స్పెక్ట్రమ్‌

- వై.వి.గోపాల‌కృష్ణ‌మూర్తి, ఇంజినీరింగ్ అకాడ‌మీ

Posted on 04-12-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning