పరిణితితోనే ప్రాంగణ విజయం

* సంస్థల ఆకాంక్షల మేరకు నైపుణ్యాలు అవసరం

రాష్టంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సుమారు వేల మంది ఇంజినీరింగ్ చివరి సంత్సరం చదువుతున్నారు...వారికి ఈ విద్యా సంవత్సరం ఆశించిన స్థాయిలో ప్రాంగణ ఎంపికలు జరగలేదు...దీంతో ఉద్యోగం వస్తుందా అన్న మీమాంసలో విద్యార్థులు పడిపోయారు...ఈ నేపథ్యంలో ప్రాంగణ ఎంపికల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి...మారుతున్న అవసరాలకు సంస్థలు అభ్యర్థుల నుంచి ఏమి ఆశిస్తున్నాయి...ఏ నైపుణ్యాలను వారి నుంచి కోరుకుంటున్నాయి...ఈ ఏడాది జరిగిన ప్రాంగణ ఎంపికలు నేర్పుతున్న పాఠాలే ప్రవేశ ద్వారాలు...వీటిపై అవగాహనకు వచ్చి...అందుకు అనుగుణంగా పరిణితి సాధించడమే ఇప్పుటి కర్తవ్యం...అందుకు నిపుణులు ఏమి చెబుతున్నారు...దీనిని బట్టి ప్రాంగణ ఎంపికలో నెగ్గుకురావడానికి అభ్యర్థులు తమను తాము ఎలా మలుచుకోవాలే తెలిపేదే ఈ కథనం...
ఎంపిక విధానం మార్చుకున్న సంస్థలు...
నాస్ కామ్ ఈ విద్యాసంవత్సరం ఎనిమిదో సెమిస్టర్‌లో మాత్రమే ప్రాంగణ ఎంపికలు నిర్వహించాలని సూచించింది. అందుకు భిన్నంగా కొన్ని కళాశాలలో ముందుగా ప్రారంభమైనా ఫలితం ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం సంస్థలన్నీ జస్టు ఇన్ టైమ్ హైరింగ్ విధానంపై దృష్టి పెడుతున్నాయి. ఈవిధానం ప్రకారం ఇంజినీరింగ్ విద్యార్థి నాలుగో సంవత్సరం పూర్తిచేసిన తరువాత అతనిని ఎంపిక చేసుకుంటారు. ఎంపిక చేసుకునే వ్యక్తి తక్షణమే విధులలో చేరేలా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జిల్లాలో దశల వారీగా ఈ విధానంలో విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు సంస్థలు అడుగులు వేస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం సంస్థలు అన్ని కళాశాలల్లో ఉన్న విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కోక్యూబ్స్, ఆస్పైరింగ్ మైండ్స్, ఈలిట్మస్ వంటి ఏజన్సీల సాయంతో ఎంపిక చేసుకుంటున్నాయి. కేంద్రీకృత ఎంపిక విధానం ద్వారా పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈవిధానంతో అన్ని కళాశాలలోని నైపుణ్యం ఉన్న విద్యార్థులకు అవకాశాలు ఇస్తున్నామన్న భావన సంస్థలు కలగ చేస్తున్నాయి. దీంతో కూడా కొంతమేర జిల్లాలో ఉద్యోగ ఎంపికలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిభకు గీటురాళ్లుగా చూస్తున్నదేమిటి...?
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండి అతని నైపుణ్యం సంస్థకు ఉపయోగపడుతుందన్న నమ్మకం ఉంటేనే ఎంపిక చేసుకుంటున్నాయి. నైపుణ్యాలను వెలికితీయడానికి ప్రతి సంవత్సరం కొత్త పరీక్షలు పెడుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం పరిశీలిస్తే కొత్తగా బిజినెస్ ఇంగ్లిష్, ఈమెయిల్‌రైటింగ్ అనే అంశాలలో కూడా విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఈరెండింటిలో రాణించలేకపోయారని నిపుణులు చెబుతున్నారు. బృంద చర్చలు, ఆన్‌లైన్ పరీక్షలు వంటి వాటిలో ఎంతమేర సామర్థ్యాలు ఉన్నాయి అనే అంశం కూడా సంస్థలు పరీక్షిస్తున్నాయి. వీటితో ఏమాత్రం వెనకబడినా సంస్థలు ఎంపిక చేసుకోవడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే...నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నాయి.
మరి విద్యార్థుల ముందున్న అవకాశాలేమిటి...?
బీటెక్ పూర్తిచేయగానే కలిసి వస్తే ప్రాంగణ ఎంపికల ద్వారా ఈ సంస్థలలో ఉద్యోగంలో చేరాలి. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలు రాకుంటే ఉన్నతవిద్యపై దృష్టి సారించాలి. గేట్ పరీక్షకు సిద్ధమవ్వాలి.. గేట్ ద్వారా ఉన్నతవిద్యను అభ్యసించవచ్చు. లేదా పీఎస్‌యూ(పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్) సంస్థలలో గేట్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలలో కూడ చాలా ఖాళీలు ఉన్నాయి. చాలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. వాటికి సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయం వృథా చేయకుండా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇవికాకుండా బ్యాంకింగ్, ఆర్థికరంగ సంస్థలలో కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్ పోస్టులు ఏర్పాటు చేశారు. అటు వైపు కూడా ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తయినా ఖాళీగా ఉండకుండా డాట్‌నెట్, మైక్రోసాఫ్ట్, ఐబీఎమ్, ఒరాకిల్ వంటి సర్టిఫికేషను కోర్సులు చేయడం మంచిదని వారు చెబుతున్నారు.

నిపుణుల సూచనలు, సలహాలు ఇవి...
నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా ఆంగ్లం, బిజినెస్ ఇంగ్లిష్, ఈమెయిల్‌లో రాయడంపై దృష్టిసారించాలి.
ఆన్‌లైన్ విధానంలో స్వీయ శిక్షణతో పాత పేపర్లను సాధన చేస్తూ తర్ఫీదు పొందాలి. తప్పులను సరిదిద్దుకోవాలి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాకపోయినా నిరాశ చెందకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక రంగ సంస్థలు, బ్యాంకింగ్ రంగాలపై దృష్టి సారించాలి. అవసరమైన శిక్షణ తీసుకోవాలి. సమయం వృథా చేయకూడదు.
గేట్ పరీక్ష రాస్తే ఉపయోగం. మంచి ర్యాంకు వస్తే ఉన్నతవిద్య చదువొచ్చు. లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో చేరడానికి అర్హత సాధించొచ్చు.
ప్రముఖ సంస్థలు అవకాశమిచ్చే ఇంటర్న్‌షిప్‌లను సద్వినియోగం చేసుకోవాలి. సంస్థ ఇచ్చిన ప్రాజెక్టు వర్కులో నైపుణ్యం, సామర్థ్యం చూపితే ఉద్యోగం ఇవ్వడానికి అవకాశముంటుంది.
పరిశ్రమలు స్థాపించేలా విద్యార్థులు దృష్టిపెట్టాలి. ఆవిధంగా చేస్తే మరికొంత మందికి ఉద్యోగాలు ఇచ్చిన వారవుతారు.
బీటెక్ పూర్తవగానే ఖాళీగా ఉండకుండా క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీస్, డేటా సెక్యూరిటీస్, డేటా అనాలసిస్ వంటి సర్టిఫికేషన్ కోర్సులపై పట్టు సాధించాలి. వీటితోపాటు ఎస్ఏపీ కోర్సు చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఉద్యోగం వచ్చే వరకు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి
- కోగంటిమోహనరావు, ప్రిన్సిపల్, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల
ప్రస్తుత మాంధ్యం పరిస్థితులలో ఉద్యోగాలు బాగా తగ్గాయి. ఈ పరిస్థితులలో నిరుత్సాహ పడకుంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకునే దిశగా విద్యార్థులు ఆలోచించాలి. ప్రాంగణ ఎంపికలే కాకుండా ఇంజినీరింగ్ విద్యార్థులకు చాలా అవకాశాలు ఉన్నాయి. కావాల్సింది నైపుణ్యాలే. ఆంగ్లభాష, భావవ్యక్తీకరణ, భాష వ్యక్తీకరణ, లాజికల్ థింకింగ్ వంటి వాటిలో పూర్తిస్థాయిలో పట్టుఅవసరం.

సర్టిఫికేషను కోర్సులు చేస్తే భవిష్యత్తు
- ఎన్.వి.సురేంద్రబాబు, ఉపాధి అధికారి, ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ప్రస్తుతం బీటెక్ ఆధారంగా ఉద్యోగాలు రావటం కష్టంగా మారింది. బీటెక్‌తో పాటే సర్టిఫికేషను కోర్సులు చేస్తే పుష్కలంగా అవకాశాలున్నాయి. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీస్, డేటా అనాలసిస్ వంటి సర్టిఫికేషను చేసిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంది. బిజినెస్ ఇంగ్లిషు అంశంపై దృష్టి సారించాలి.

సంస్థల విధానంలో ఉద్యోగాలు తగ్గాయి
- కోట సాయికృష్ణ, ఉపాధి అధికారి, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల
ప్రస్తుతం సంస్థలు జస్ట్ ఇన్ టైమ్ హైరింగ్ విధానంపై ఆసక్తి చూపుతున్నాయి. ఈవిధానం ప్రకారం బీటెక్ పూర్తయిన తరువాత అందరికీ ఓచోట పరీక్ష నిర్వహించి అన్ని కళాశాలల విద్యార్థుల్లోనుంచి నైపుణ్యం ఉన్న కొంతమందిని ఎంపిక చేసుకుంటారు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడానికి ఏజన్సీలను ఆశ్రయిస్తున్నాయి. ఈ విధానంతో అన్ని కళాశాలల వారికి అవకాశాలు వస్తాయి కానీ ఎక్కువమంది ఎంపికయ్యే అవకాశాలు తగ్గుతాయి. విద్యార్థులు గేట్, ప్రభుత్వ రంగ సంస్థల వైపు దృష్టిపెట్టాలి.

- కృష్ణా,న్యూస్‌టుడే
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning