ఇంజినీరింగ్‌తోపాటే సర్టిఫికేషన్ కోర్సులు

* ఈ ఏడాది 50వేల మందికి శిక్షణ
* నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రణాళిక

ఈనాడు-అమరావతి: విద్యార్థులు ఇంజినీరింగ్‌తోపాటే ప్రముఖ ఐటీ సంస్థల సర్టిఫికేషన్ కోర్సుల్లో ఒకేసారి ఉత్తీర్ణులయ్యేలా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా గూగుల్, ఉడాసిటీ, అమెజాన్ సహా అమెరికాకి చెందిన విశ్వవిద్యాలయాలతో ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది సుమారు 250 ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 50వేల మంది విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులు అందించనుంది. దీనికయ్యే వ్యయంలో సగం నైపుణ్యాభివృద్ధి సంస్థే భరించనుంది. సర్టిఫికేషన్ కోర్సులకున్న గిరాకీ దృష్ట్యా... వీటిని సిలబస్‌లో భాగంగా చేయాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్ని కోరింది. ఇప్పటికే కొన్ని వర్శిటీలు సుముఖత చూపాయి. గూగుల్ సంస్థ శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సుల గ్లోబల్ హెడ్ జోస్‌లీన్ బెకర్, ఉడాసిటీ ఇండియా విభాగం ఎండీ ఇషాన్‌గుప్తా డిసెంబరు 6న విజయవాడకు వచ్చారు. ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకులతో 7వ తేదీన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సర్టిఫికేషన్ కోర్సులకు విద్యార్థుల్ని సన్నద్ధం చేయటం, వీటిని ఇంజినీరింగ్ సిలబస్‌లో భాగంగా చేయటంపైనే ప్రధానంగా చర్చించనున్నారు.
మూడో ఏడాది నుంచే...
ఇంజినీరింగ్‌లో మూడో ఏడాది నుంచే సర్టిఫికేషన్ కోర్సులకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతి కళాశాలలోను కోర్సుల్ని సమన్వయం చేసేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన మెంటార్ ఒకరుంటారు. వీరు విద్యార్థులు చదువుతున్న బ్రాంచి, వారి ఆసక్తికి అనుగుణంగా సర్టిఫికేషన్ కోర్సు ఎంపికలో సాయపడతారు. వర్క్‌షాపుల నిర్వహణ, ఆన్‌లైన్ బోధన సహా అన్ని వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. కళాశాలల్లోని బోధకులకు అవసరమైన సాంకేతిక శిక్షణ ఇప్పిస్తారు. నాలుగో ఏడాది అసలైన సర్టిఫికేషన్ కోర్సు ఉంటుంది. ప్రతి విద్యార్థి నైపుణ్యాలపై సంబంధిత సంస్థ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా మార్గదర్శకం చేస్తుంది. సంతృప్తికరంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు.
ఉపయోగం ఏంటి?
ఈ సంస్థలు అందించే కోర్సులన్నీ బాగా డిమాండ్ ఉన్నవి. గూగుల్ వంటి సంస్థలిస్తున్న సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేస్తే... ఉద్యోగం లభించే వీలుంటుంది. వచ్చే దశాబ్ద కాలంలో యాప్‌లు సహా ఆండ్రాయిడ్ డెవలపర్లు పది లక్షల మంది అవసరమవుతారని గూగుల్ సంస్థ అంచనా. సర్టిఫికేషన్ కోర్స్ పూర్తిచేసిన వారికి ఆయా సంస్థలు అవకాశమున్నచోట నేరుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. వాటి క్లయింట్లకు సిఫారసు చేస్తాయి.
సర్టిఫికేషన్ కోర్సులు..
గూగుల్: అసోసియేట్ ఆండ్రాయిడ్ డెవలపర్, మొబైల్ వెబ్ స్పెషలిస్ట్, ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్, ప్రొఫెషనల్ డేటా ఇంజినీర్
ఉడా సిటీ: మెషీన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఫ్రండ్ ఎండ్ ఫుల్ స్టేక్
అమెజాన్: అనలటిక్స్ అండ్ బిగ్ డేటా, క్లౌడ్ ఆర్కిటెక్ట్
యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్: పైతాన్
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా: ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్
ఆటోడెస్క్ సర్టిపోర్ట్ ఇన్‌కార్పోరేషన్: ఆటోక్యాడ్
డీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: కేటియా
ఎన్‌పీటీఈఎల్ వెబ్ స్టూడియో: ప్రాబ్లం సాల్వింగ్ త్రూ ప్రోగ్రామింగ్ ఇన్ సి

Posted on 07-12-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning