దూసుకెళ్లే మిలెనియల్స్‌!

* బహుళ నైపుణ్యాలతో నేటి యువత
* సహస్రాబ్ది తరం నిర్ణయాత్మక పాత్ర

తాను చేసిన పొరపాటుపై ఆన్సర్‌ రాయడానికి ఆపసోపాలు పడుతున్నాడు తరుణ్‌. ఏం రాస్తే ఏం ముంచుకొస్తుందోనని ఆందోళన. పక్కనే సీనియర్‌ ఉన్నాడు. కానీ అడగడానికి అహం అడ్డు వస్తోంది. అంతకు ముందు ఆన్‌లైన్‌లో ఫైల్‌ అప్‌లోడ్‌ చేయడానికి ఆ సీనియర్‌ అష్టకష్టాలు పడుతుంటే తాను అవహేళన చేయడంతో ఆయన అప్‌సెట్‌ అయ్యాడు. ఉద్యోగంలో చేరి వారం కాకముందే కలీగ్స్‌తో కోరి కష్టాలు తెచ్చుకున్నాడు. క్యాంపస్‌ల నుంచే పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాల్లో చేరి ప్రవర్తనాపరమైన లోపాలతో తరుణ్‌లాంటి మిలెనియల్స్‌ ఇలా ఇబ్బందులు పడుతున్నారు. యువతరం ఉద్యోగాల్లో చేరే ముందే అక్కడి అనుభవజ్ఞులతో కలిసిమెలిసి ఎలా పనిచేయాలనే నైపుణ్యాలను కాలేజీ దశలోనే నేర్పించాలని ఇండస్ట్రీల్లోని ట్రెయినింగ్‌ విభాగాలు సూచిస్తున్నాయి.
ఈతరం ఉద్యోగులను మిలెనియల్స్‌గా పరిశ్రమలు వ్యవహరిస్తున్నాయి. 1980 నుంచి 2000 మధ్యకాలంలో జన్మించిన వారందరినీ సామాజిక శాస్త్రవేత్తలు, మనోవైజ్ఞానికులు కూడా మిలెనియల్స్‌ అనే అంటున్నారు. 2000వ సంవత్సరం తర్వాత వీరు సంస్థల్లో కీలక స్థానాలను ఆక్రమించి నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు. కాబట్టి వీరిని సహస్రాబ్ది తరం అంటున్నారు. ఈతరం ముందు తరాల కంటే ఎక్కువ చదువుకుంది. అన్ని రంగాలతోనూ పరిచయం కలిగిఉంది. వీరిలో అధికభాగం బహుముఖ ప్రజ్ఞాశాలులు. వీరు వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని లక్షణాలుగా కలిగి ఏకత్వానికి పాటుపడేవారుగా ఉంటారని ఒక సర్వే వెల్లడించింది.
ఈతరం ఆఖరి సంవత్సరాల్లో జన్మించినవారు 2020 ప్రాంతంలో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచే వీరు ఏయే లక్షణాలను పెంపొందించుకోవాలి, ఏయే అంశాలపై దృష్టిపెడితే విజయవంతంగా ఉద్యోగ జీవితాన్ని సాగించవచ్చో తెలుసుకుందాం.
మనస్తత్వ శాస్త్రవేత్తల మాటల్లో...
ముందుగా మనస్తత్వ శాస్త్రవేత్తలు మిలెనియల్స్‌ గురించి ఏమంటున్నారో చూద్దాం.
* ప్రయోగాలు, పరిశోధన పద్ధతుల ద్వారా బృందంతో కలిసిపోయి స్వతంత్రంగా పనిచేస్తూనే సామూహిక నిర్ణయాలు తీసుకుంటారు.
* తమకి తెలియని అంశాలను ఎప్పటికప్పుడు గూగుల్‌ వంటి సెర్చింజిన్లలో వెదకడం ద్వారా వేగంగా నేర్చుకుంటారు. అన్వేషణ, అనుభవం, ప్రయోగం వీరి ఆయుధాలు.
* సంప్రదాయేతర పద్ధతుల్లో (ఇన్‌ఫార్మల్‌) నేర్చుకోడానికి ఇష్టపడతారు.
* ఆచార్యులతో కలిసిపోయి సత్సంబంధాలను, సామరస్య పూర్వకంగా నేర్చుకునే ధోరణిని అలవర్చుకుంటారు. గురువుల పట్ల వీరికి గౌరవంతో కూడిన మైత్రీభావం ఉంటుంది.
మిలెనియల్స్‌ నేర్చుకునే తీరు!
* సామాజిక మాధ్యమాల ద్వారా విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు.
* మైక్రో లెర్నింగ్‌ అంటే.. చిన్న చిన్న వీడియోలు, సంక్షిప్త సందేశాలు, ఈ-మెయిల్స్‌, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నేర్చుకుంటారు.
* పాఠ్యాంశాలను గేమిఫికేషన్‌ ద్వారా నేర్చుకుంటారు. దాంతో ఆత్మవిశ్వాసం, పోటీతత్వం, సమయస్ఫూర్తి, ప్రతిభా పాటవ ప్రదర్శన, వ్యక్తిగత సామర్థ్యాల మెరుగు, ఎటువంటి సందర్భాలనైనా ఎదుర్కోవడం వంటి లక్ష్యాలను సాధిస్తారు.
* దీర్ఘ, స్వల్పకాలిక లక్ష్యాలను మెంటార్స్‌ సాయంతో సాధిస్తారు.
అనుభవ తరంతో కలిసిపోవాలంటే?
‘వేడి’ ప్రధానంగా ఉండే ఈ మిలెనియల్స్‌ తరం ‘వాడి’గా ఉండే అనుభవ తరంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగులను మన అభిరుచుల మేరకు ఎన్నుకోవడం సాధ్యం కాదు. ఎన్నో వైవిధ్యాలతో కూడిన పలు బృందాలు ఎదురవుతాయి. అందరితోనూ ఏదో ఒక సందర్భంలో కలిసి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి మిలెనియల్స్‌ ఆ తరం అనుభవాలను తమకు మార్గదర్శకాలుగా భావించి విలువలతో కూడిన లక్ష్యసాధనకు అవసరమైన పద్ధతులను, మెలకువలను, మానవసంబంధ నిర్వహణా సామర్థ్యాలను నేర్చుకోవాలి. అవసరమైనచోట అనుభవతరానికి మనస్ఫూర్తిగా ప్రశంసలు అందజేయాలి.
తరాల మధ్య అంతరం తగ్గేదిలా!
* వివరణాత్మకంగా జరిగే చర్చలకు సహనం అనే సాధనం ప్రధానమని నవతరం గుర్తించాలి.
* విషయ పరిజ్ఞానం ఎంత ఉన్నా అనుభవం పాలు కలవనిదే నాణ్యమైన ఫలితం దక్కదని తెలుసుకోవాలి.
* అనుభవానికి, విజ్ఞానానికి ఉన్న అనుబంధాన్ని గ్రహించాలి.
* సీనియర్లు పాటించే విలువలను అర్థం చేసుకుని ఆచరించాలి. అది అనుకరణ అయినా తప్పులేదు.
* వారు ఆచరించే యాజమాన్య మెలకువలను, పద్ధతులను నేర్చుకోవాలి.
* విశ్వాసం, పరస్పర గౌరవాలతో కూడిన కృతజ్ఞతా భావాన్ని అలవర్చుకోవాలి.
* కొత్త తరం తమకు తెలిసిన ఆధునిక టెక్నాలజీ విషయాలను సీనియర్లతో పంచుకోవాలి. పరస్పర విషయ మార్పిడి సుహృద్భావ వాతావరణంలో జరిగే విధంగా చూడాలి.
* ఉద్యోగం చేసే విధానం దశలవారీగా మారుతుంది. మొదటిదశలో కేవలం చెప్పిన పని చేసే ఉద్యోగి ఉంటే, రెండో దశలో కిందిస్థాయికి, పైస్థాయికి మధ్య సమన్వయం చేసే మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ ఉంటుంది. పైస్థాయిలో తమ అనుభవంతో దిశానిర్దేశం చేసే సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ఉంటుంది. ఆయా స్థాయుల్లో పనితీరుని కొత్తతరం అర్థం చేసుకొని వ్యవహరించాలి. కిందిస్థాయిలో తాము చేసేదే అసలు పని అనుకుంటూ అహంభావాన్ని ప్రదర్శించకూడదు.
* ఎదుగుదల, ఉన్నతి అనేవి హఠాత్తుగా జరిగిపోవు. బండరాయిని శిల్పి చెక్కినంత శ్రద్ధగా, ఓపిగ్గా కెరియర్‌ను సీనియర్ల సాయంతో మలచుకోవాలని నవతరం గుర్తించాలి.
చేరబోయే ముందు ఇవి చూసుకోవాలి
సంస్థలు అభ్యర్థులను బేరీజు వేసినట్లు అభ్యర్థులు కూడా సంస్థలను పరిశీలించుకోవాలి. దానికి జీతం ఒక్కటే ప్రామాణికం కాదు. ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలి.
* తమ శక్తి సామర్థ్యాలకు, అభివృద్ధికి సరైన అవకాశాలు సంస్థలో లభిస్తాయో లేదో చూసుకోవాలి.
* అదనపు శిక్షణ, మెలకువల పెంపు, ఉద్యోగుల అభివృద్ధి తదితరాలను సంస్థ ఆలోచిస్తుందా అనేది తెలుసుకోవాలి.
* వేతనేతర ప్రోత్సాహకాలకు సమప్రాధాన్యం ఇచ్చే సంస్థలు విశ్వసించదగినవి.
* పరపతి గలిగిన సంస్థలు ఉద్యోగుల విలువను పెంచుతాయి.
* భిన్న సంస్కృతులకు చెందిన సహోద్యోగుల వాతావరణం ఉండాలి.
* లాభాలతోపాటు విలువలను కూడా సంస్థలు పాటించాలి.
* వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణమైన లక్ష్యాలను కలిగి ఉన్న సంస్థలను వెతుక్కోవాలి.
* ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇచ్చే సంస్థలై ఉండాలి.
కళాశాలల బాధ్యత
కేవలం పాఠ్యపుస్తకాల్లోని అంశాలతో పరీక్షలే లక్ష్యంగా పనిచేయడం వల్ల ప్రయోజనం లేదు. పరిశ్రమల అవసరాలను గమనించి తగిన నైపుణ్యాలను విద్యార్థుల్లో కళాశాలలు పెంపొందించాలని ట్రెయినింగ్‌ విభాగాలు సూచిస్తున్నాయి.
* విద్యార్థి స్వతంత్రంగా నేర్చుకోడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాలి.
* పరిశ్రమల ట్రెయినింగ్‌ లేదా ఇతర విభాగాల అధిపతులను ఆహ్వానించి కొత్త తరం ఉద్యోగాల్లోకి ప్రవేశించే ముందు నేర్చుకోవాల్సిన విషయ లేదా ప్రవర్తనాపరమైన అంశాలను చెప్పించాలి.
* ఉద్యోగ నిర్వహణ నైపుణ్యాలను పెంచుకోడానికి విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, బ్లాగ్‌లు, యాప్‌ల వంటివాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అధ్యాపకులు తెలియజేయాలి. బృందాలుగా చేసి చిన్న చిన్న ప్రాజెక్టులు అప్పగించి పనిచేయడం అలవాటు చేయాలి.
* బృందంలో పనిచేసేటప్పుడు ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొని లక్ష్యంవైపు ఎలా సాగాలో నేర్పాలి.
* వృత్తిపరమైన విలువలతోపాటు, మానవతా దృక్పథాన్ని, సామాజిక బాధ్యతను విద్యార్థుల్లో పెంపొందించాలి.
* నవతరంలో నాయకత్వ లక్షణాలను వృద్ధిచేసే కార్యక్రమాలు నిర్వహించాలి.
* భావవ్యక్తీకరణ మెలకువలను నేర్పడానికి తగిన శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలి. ఫీడ్‌బ్యాక్‌ పద్ధతిలో ఫలితాలను శాస్త్రీయంగా విశ్లేషించాలి.
* విద్యార్థి వైవిధ్యమైన నైపుణ్యాలను కలిగి ఉండటం, సాంకేతిక నైపుణ్యాల అనువర్తనలో సమయస్ఫూర్తితో మెలగడం వంటి వాటిని కూడా కళాశాల దశలోనే నేర్పించగలగాలి.
ఉద్యోగ విజయానికి 5 మార్గాలు
1 స్పష్టమైన భావవ్యక్తీకరణ, ఓపిగ్గా వినడం, సహనంతో కూడిన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి.
2 బృందంలో పనిచేసే నేర్పును, వివిధ యాజమాన్య నైపుణ్యాలను అలవర్చుకోవాలి.
3 తమ లక్ష్యాలకు అనుగుణంగా మెంటార్స్‌ను వెతుక్కునే సామర్థ్యం ఉండాలి.
4 సమయానుసారం ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని తమ నిర్ణయాలను సవరించుకోగలగాలి.
5 మిలెనియల్స్‌ తమ సామర్థ్యంపై అవగాహన లేకుండా ప్రతి రెండు సంవత్సరాలకు పదోన్నతి పొందాలని ఆశిస్తుంటారు. అలాకాకుండా విషయ పరిజ్ఞానాన్ని పొందుతున్నామా లేదా అని పరిశీలించుకోవాలి. మెంటార్స్‌ సాయంతో భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలి.

- డాక్ట‌ర్ పి. శ్రీనివాస్ రావు, టెక్నిక‌ల్ ట్రెయినింగ్‌, లెర్నింగ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ Cyient Ltd
అభిరుచికి తగిన ఉద్యోగమే మేలు!
మీ అభిరుచికి అనుగుణమైన ఉద్యోగాన్ని వెతుక్కోండి. కళాశాలలో ఉన్నప్పుడే భావవ్యక్తీకరణపై పట్టు సాధించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించి ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోండి.
- వారెన్‌ బఫెట్‌
దాదాపు సగం మిలెనియల్సే!
8.6 కోట్లకు పైగా మిలెనియల్స్‌ 2020 కల్లా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సంఖ్యలో 45 నుంచి 50 శాతానికి సమానం.
- ఫోర్బ్స్‌


Posted on 11-12-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning