కొత్త టెక్‌లు కావాలి!

ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకోకపోతే పరిశ్రమలు మీవైపు కన్నెత్తి కూడా చూడవు. ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉంది ఇకచాలు అనుకుంటే కుదరదు. తాజా టెక్నాలజీలు తెలుసుకోవాల్సిందే. బీటెక్‌లతోపాటు కంప్యూటర్‌ లింక్‌ ఉన్న ఏ డిగ్రీ వారైనా నేర్చుకోదగిన సరికొత్త టెక్నాలజీలు కొన్ని...

డాటా సైన్స్‌
డాటా సైన్స్‌ పరిశ్రమ కొన్నేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. బిగ్‌ డాటాకు ప్రాముఖ్యం పెరుగుతోంది. ఎన్నో కంపెనీలు దీనిలో పరిజ్ఞానమున్న, సమాచార విశ్లేషణలో నిష్ణాతులైన ఉద్యోగుల కోసం వెతుకుతున్నాయి. ఆర్‌- లాంగ్వేజ్‌ను స్టాటిస్టికల్‌ విశ్లేషణ, విజువలైజేషన్‌ల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. అనలిటిక్స్‌లో కీలకమైన ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ఎస్‌ఏఎస్‌ను నేర్చుకోవటం ఉత్తమం. కశాండ్రా డాటాబేసెస్‌ గురించి అవగాహన పెంచుకోవటం లాభదాయకం.
డాటా విజువలైజేషన్‌
మాటల్లో కాదు, చేతల్లో చూపించండి’ అనే సామెత సాంకేతిక ప్రపంచానికీ వర్తిస్తుంది. డాటా విజువలైజేషన్‌.. అనలిటిక్స్‌, ఇతర డాటా నైపుణ్యాలతో కలిసి ముందుకుసాగుతుంది. ఒక్కసారి సమాచారాన్ని సేకరించి, అమరిస్తే దాన్ని ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో డాటా విజువలైజేషన్‌ది ప్రముఖపాత్ర. డాటా మోడల్స్‌ను తయారుచేయటానికి డయాగ్రమ్‌లు, టెక్స్ట్‌, సింబల్స్‌ ఉపయోగిస్తారు. ఆ రకంగా కష్టతరమైన అంశాలు సులభతరమైన విజువల్‌ కమ్యూనికేషన్‌గా మారతాయి.
యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డిజైన్‌
యాప్స్‌, ప్రోగ్రామ్‌లు, వెబ్‌సైట్ల రూపకల్పనలో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డిజైన్‌ కీలకం. వీటిని వినియోగదారులు సులువుగా తెలుసుకునేందుకు, వారిని ఆకట్టుకునేందుకు, మంచి అనుభూతిని మిగిల్చేలా చేసేందుకు ఈ యూఐ ప్రధానం. వినియోగదారుల అభిరుచులను అంచనా వేసి, వాటికి అనుగుణంగా ప్రోటోటైప్‌లను తయారుచేయటంలో, వాటిని మెరుగుపరచటంలో యూఐ నిపుణులు ప్రధానం. దీని కోసం ఫ్రంట్‌ ఎండ్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, కమ్యూనికేషన్‌ లాంటి నైపుణ్యాలు అవసరం.
మొబైల్‌ డెవలప్‌మెంట్‌
స్మార్ట్‌ఫోన్ల, ట్యాబ్లాయిడ్‌ల వాడకం పెరుగుతోంది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్లలో మొబైల్‌ యాప్స్‌కు గిరాకీ బాగా ఉంది. వీటిని తయారుచేసే నిపుణుల్ని కంపెనీలు ఆకర్షిస్తున్నాయి. వినియోగదారులు సులువుగా వినియోగించుకునేందుకు నూతన అప్లికేషన్లనూ, మొబైల్‌ ఫ్రెండ్లీ వెబ్‌సైట్లనూ రూపొందించటం అవసరం. క్రాస్‌ ప్లాట్‌ఫాం డెవలప్‌మెంట్‌ సామర్థ్యం ఉంటే వివిధ రకాల డివైజ్‌లకోసం యాప్స్‌ను ప్రవేశపెట్టవచ్చు. ఇంకా యూఎక్స్‌, యూఐ, ఏజైల్‌ మెథడాలజీలు వంటి కీలక నైపుణ్యాలను తెలుసుకోవాలి.
క్లౌడ్‌, డిస్ట్రిబ్యూటెడ్‌ కంప్యూటింగ్‌
గతంలో ఉన్న ఆన్‌డివైజ్‌ సాఫ్ట్‌వేర్‌, స్టోరేజ్‌ వంటివి ఇంకా వినియోగంలో ఉండగానే క్లౌడింగ్‌లో నూతన పద్ధతులు చాలా వచ్చాయి. సమస్యల్ని పరిష్కరించటానికి అనేక కంప్యూటర్లను ఒకదానితో ఒకటి కలిపే డిస్ట్రిబ్యూటెడ్‌ కంప్యూటింగ్‌కు దాదాపు అన్ని కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డిస్ట్రిబ్యూటెడ్‌ కంప్యూటింగ్‌లకు సంబంధించిన నైపుణ్యాలు, రెండింటిలోనూ తగినంత నైపుణ్యాలున్న ఉద్యోగులను చాలా కంపెనీలు కోరుకుంటున్నాయి. డాటాబేస్‌ మేనేజ్‌మెంటులో ఉపయోగించే ఎస్‌క్యూఎల్‌ను, క్లౌడ్‌ ఆధారిత అప్లికేషన్ల అభివృద్ధిలో కీలకమైన రుబీ, జావాస్క్రిప్ట్‌, పైథాన్‌ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లను నేర్చుకోవటం ఉత్తమం.
సైబర్‌ సెక్యూరిటీ
ఒక కంపెనీకి చెందిన సమాచారానికి పటిష్ఠమైన భద్రత తప్పనిసరి. సమాచారం చోరీకి గురైతే అంతిమంగా ఆ సంస్థ తన వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతుంది. ఈ కారణంగా సైబర్‌ భద్రత ఎవర్‌గ్రీన్‌ నైపుణ్యాల్లో ఒకటిగా మారింది. అందుకే సైబర్‌ నిపుణులకు ఎల్లప్పుడూ మంచి గిరాకీ ఉంటోంది. ఈ రంగంలో ఎదగటానికి జనరల్‌ ప్రోగ్రామింగ్‌, ఫైర్‌వాల్స్‌ పరిజ్ఞానం, స్క్రిప్టింగ్‌ లాంగ్వేజీల్లో ప్రావీణ్యం, నెట్‌వర్కులూ, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌పై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి.

Posted on 12-12-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning