బృందంలో మీరెక్కడ?

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ రాత పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి. ‘ఇంటర్వ్యూలో ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు ఇచ్చేశాను. ఇక ఉద్యోగం ఖాయం’ అనుకున్న ఒక అభ్యర్థికి ఆఫర్‌ లెటర్‌ రాలేదు. ఆశ వదులుకోలేక ఆ కంపెనీ హెచ్‌ఆర్‌ని కలిశాడు. మీలో గ్రూప్‌ డైనమిజం లేదు. బృంద చర్చలో చురుగ్గా లేకపోవడంతో ఎంపిక కాలేదని చెప్పారు. దానికి అతడు ఆశ్చర్యపోయాడు.

ఇప్పుడు కంపెనీలు తమకు కావాల్సిన లక్షణాలు అభ్యర్థుల్లో ఉన్నాయో లేదో తెలుసుకోడానికి రకరకాల పద్ధతులు పాటిస్తున్నాయి. బృందచర్చలు అందులో ప్రధానమైనవి.
బృంద చర్చలు (గ్రూప్‌ డిస్కషన్స్‌) ప్రాంగణ నియామకాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ చర్చలు ఎందుకు జరుగుతాయి? ఒక కీలకమైన అంశంపై వివిధ కోణాల్లో ఆలోచించి, అభిప్రాయాలను వ్యక్తం చేసి, స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవడాకే.
ప్రాంగణ నియామకాల్లో జరిగే బృంద చర్చ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో అభ్యర్థులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ నిర్దేశిత లక్ష్యంతో చర్చ సాగిస్తారు. ఇందులో నిరభ్యంతరంగా ఆలోచనలను వ్యక్తం చేయవచ్చు. ఒక అభ్యర్థి మరొక అభ్యర్థితో సంభాషించడమే కాకుండా బృందంలో చర్చించే వీలు ఉంటుంది. అభ్యర్థులు ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తూ చర్చను ఒక క్రమపద్ధతిలో కొనసాగించాలి. చర్చించాల్సిన అంశాన్ని ముందుగానే తెలియజేస్తారు. అయిదు నిమిషాల తర్వాత చర్చ మొదలవుతుంది. ప్రతి అభ్యర్థీ తన పరిజ్ఞానం మేరకు అనుభవాలను జోడించి విశ్లేషిస్తూ చర్చించాలి.
ప్రాధాన్యం ఎందుకని?
బృంద చర్చ అనేది ఒక సంఘీభావ నైపుణ్యం. ఒక వ్యక్తి విద్యార్థి అయినా, ఇంజినీర్‌ అయినా, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ అయినా బృంద చర్చల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఉన్నతస్థాయిని చేరుకోవచ్చు.
కొద్దికాలం నుంచి నియామకాల్లో బృంద చర్చల ప్రాధాన్యం పెరిగింది. దీన్ని ముఖ్యంగా...
* సమస్యా పరిష్కారానికి
* విధాన నిర్ణయానికి
* వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. సమస్యా పరిష్కారానికి, కీలక విధాన నిర్ణయాలు చేయడానికి బృందచర్చ చక్కటి మార్గం.
* ఉద్యోగంలోకి లేదా వృత్తి విద్యలోకి ఒక అభ్యర్థి ప్రవేశిస్తున్నప్పుడు అతడి వ్యక్తిత్వాన్ని అంచనావేయడానికి కూడా ఇది సాయపడుతుంది.
* సాధారణంగా బృందంలో 6 నుంచి 8 మంది ఉంటారు. చర్చాంశం ఒక అభిప్రాయం లేదా సమస్య కావచ్చు.
* చర్చ జరిగేటప్పుడు అభ్యర్థుల విభిన్న నైపుణ్యాలను ఎంపిక విభాగం సభ్యులు పరిశీలిస్తారు. ఇతరులను ఒప్పించే శక్తి, ఆత్మస్థైర్యం, అభిప్రాయాలను తార్కికంగా క్రమపద్ధతిలో విశ్లేషించడం, ఇతరులకు అవకాశం ఇవ్వడం, వారి మాటలకు స్పందించడం వంటి సహజ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాలి.
అన్నీ గమనించండి..
బృంద చర్చల్లో పాల్గొనాలంటే మొదట సబ్జెక్టు నాలెడ్జ్‌ అవసరం. జాతీయ, అంతర్జాతీయ, సామాజిక, ఆర్థికాంశాలు, శాస్త్రీయ, పర్యావరణ విశేషాలు, మన చుట్టూ జరిగే విషయాలపై అవగాహన ఉండాలి. ఇందుకు వార్తాపత్రికలు, మ్యాగజీన్‌లు చదవాలి. టీవీలో వచ్చే కార్యక్రమాలను చూడాలి. అనేక పరిణామాలను అనుసరించడానికి అంతర్జాలాన్ని కూడా ఉపయోగించుకోవాలి.
విషయ పరిజ్ఞానంతోపాటు భావవ్యక్తీకరణకూ ప్రాధాన్యం ఉంటుంది. ధైర్యంగా మాట్లాడటం, అభ్యర్థులందరినీ ఒప్పించడం, సరైన పదజాలాన్ని ఉపయోగించడం కూడా కీలకమే. శ్రవణ నైపుణ్యం చాలా అవసరం. చర్చ జరిగేటప్పుడు సరిగ్గా వినాలి. సందర్భోచితంగా స్పందించాలి. స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడితే బృంద సభ్యులను ప్రభావితం చేసి విజేతగా నిలుస్తారు. కంటి చూపు, శరీర భంగిమ, హావభావాలు, ముఖకవళికలు తదితరాలన్నింటిపైనా దృష్టి ఉంచి మసలుకోవాలి.
చొరవ చూపాలి
బృంద చర్చలో ప్రత్యేకంగా నాయకుడిని ఎన్నుకోవడం ఉండదు. చర్చించాల్సిన అంశాన్ని ప్రకటించగానే కాలయాపన చేయకుండా చొరవతో చర్చను నడిపించడం తక్షణావసరం కాబట్టి ఎవరో ఒకరు ప్రారంభించవచ్చు. అలా మొదలైన తర్వాత పాటించాల్సిన పద్ధతులను వివరించాలి. సమయపాలన, ప్రతి సభ్యుడి భాగస్వామ్యాన్ని తెలియజేస్తూ అందరూ చర్చపైనే దృష్టిని కేంద్రీకరించేలా చూడాలి.
మీరు నాయకులేనా?
బృంద చర్చలో పాల్గొనేటప్పుడు సహజ నాయకత్వ లక్షణాలను బేరీజు వేస్తారు. అనుకూలత, విశ్లేషణ, స్థిమితంగా ఉండటం, ఆత్మస్థైర్యం, వివేకం, నిర్ణయాత్మకశక్తి, సహనం అనేవి కొన్ని నాయకత్వ లక్షణాలు. చర్చ ప్రారంభానికి సుముఖత చూపి, చర్చకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తూ, సభ్యులందరి అభిప్రాయాలను క్రోడీకరిస్తూ అవసరమైన వివరణ ఇవ్వడం ద్వారా నాయకత్వ లక్షణాలను ప్రదర్శించవచ్చు. అర్థవంతమైన ముగింపు వైపు నిర్ణీత సమయంలో చర్చను తీసుకెళ్లడం కూడా నాయకుల పాత్రే.
విజయానికి కావాల్సినవి
* బృంద లక్ష్య సాధనకు సంసిద్ధంగా ఉండటం
* సభ్యులతో అన్యోన్యత.
* చర్చాసరళిపై అవగాహన
* పరస్పర సహకార, సానుకూల వాతావరణాన్ని కల్పించడం
* భావ ప్రకటన మెలకువలు ఉండటం
* నిష్పక్షపాతంగా పాల్గొనడం
* నాయకత్వ భాగస్వామ్యం
మీరు ఫ్రెండ్లీనా?
చర్చలో పాల్గొనేటప్పుడు అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. చర్చ సాగించేటప్పుడు గుర్తించాల్సిన కొన్ని అంశాలు...
* తన కంటే ముందు మాట్లాడిన అభ్యర్థులు చెప్పిన విషయాలను గుర్తుంచుకోవాలి.
* స్పష్టమైన వైఖరితో ఉండాలి.
* చర్చ లక్ష్యాన్ని గ్రహించి తన దృష్టి కోణాన్ని ప్రతిపాదించాలి.
* ఇచ్చిన అంశంపైనే దృష్టి కేంద్రీకరించాలి.
చర్చ మొక్కుబడిగా, గంభీరంగా, నిరుత్సాహంగా జరగకుండా ఉత్తేజకరమైన స్నేహశీల వాతావరణంలో సాగితే మంచి ఫలితాలు వస్తాయి. చర్చలో విభిన్న భావధోరణులు ఉన్నవారు పాల్గొంటారు. విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు నైపుణ్యంతో సానుకూలతను తీసుకురావాలి. అభిప్రాయ భేదాలనే తప్ప వ్యక్తులతో విభేదాలు పాటించకుండా సామరస్యాన్ని పెంపొందించాలి.
అర్థవంతంగా.. ముగింపు
నిర్ణీత కాలపరిమితిలో చర్చకు ఒక అర్థవంతమైన ముగింపును ఇవ్వాలి. సభ్యులందరూ చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకొని సంక్షిప్త వివరణతో చర్చను ముగించాలి. సభ్యుల మధ్య అంగీకారం కుదిరిన అంశాలను, విభేదాల వివరాలను తెలియజేస్తూ ఒకరు చర్చను ముగించవచ్చు.

- కె.రాజారాం, సాఫ్ట్‌స్కిల్స్ ట్రెయిన‌ర్‌
అర్థవంతమైన చర్చల తర్వాతే ఆమోదం! - విన్‌స్టన్‌ ఎస్‌. చర్చిల్‌
అర్థవంతమైన చర్చల అనంతరం మాత్రమే నా అభిప్రాయాన్ని ఆమోదించాలని నేను కోరుకుంటాను. నిలబడి మాట్లాడటానికి ధైర్యం కావాలి. కూర్చుని వినడానికి సహనం ఉండాలి. మనిషి తాను బయటకు చెప్పిన మాటలకు బానిస. తాను వెల్లడించని మాటలకు అధిపతి.

Posted on 13-12-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning