ఇప్పుడు ట్రెండింగ్‌ ఇన్ఫోసెక్‌!

‘మీకు పది లక్షల రూపాయల లాటరీ తగిలింది’ అని ఒక సేవా సంస్థ పంపిన ఈ-మెయిల్‌ చూసిన అఖిల్‌ ఆనందానికి అవధుల్లేవు. వ్యక్తిగత, బ్యాంకుఖాతా వివరాలు మెయిల్‌లో ఇచ్చిన లింక్‌లో నమోదు చేసి, ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ. 1000 ఫలానా అకౌంట్‌కు పంపమని ఆ ఎలక్ట్రానిక్‌ సందేశ సారాంశం. అరగంటలో ఆ పని పూర్తిచేసేశాడు. ఇక వచ్చే డబ్బుతో ఏం చేయాలో ప్లాన్లు వేయడం మొదలుపెట్టాడు.

మరుసటి రోజు మొబైల్‌కి ఒక ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. తన బ్యాంకులోని సొమ్మంతా ఏదో రాష్ట్రంలోని, ఎవరిదో ఖాతాలోకి జమ అయినట్లు. గుండె జారిపోయింది. బ్యాంక్‌కి పరుగులు తీశాడు. అంతా ఆన్‌లైన్‌లో జరిగిపోయింది. తామేమీ చేయలేం, పోలీసులను సంప్రదించమని సిబ్బంది చెప్పారు. వస్తుందో, రాదో తెలియని డబ్బు కోసం అదేపనిగా పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నాడు అఖిల్‌.
ఆధునిక టెక్నాలజీ ద్వారా అన్ని పనులు ఆన్‌లైన్‌లో సులువుగా జరిగిపోతున్నప్పటికీ సమాచారానికి భద్రత లేకుండా పోయింది. దీంతో ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనేది ఎన్నో రకాల ఉద్యోగాల, కోర్సుల ఆవిర్భవానికి కారణమైంది. ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది.
కంప్యూటర్‌ టెక్నాలజీ, నెట్‌వర్క్‌ల సంయోగం ద్వారా సమాచారాన్ని క్షణాల్లో సరఫరా చేయడం సాంకేతికంగా ఒక విప్లవాత్మక మార్పు. కానీ ఆ సౌలభ్యంతోపాటు అనేక రకాలుగా టెక్నాలజీ దుర్వినియోగం అవుతోంది. అందుకే ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.
ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అంటే ఏమిటి?
‘ఇన్ఫోసెక్‌’ అనే చిట్టి పేరు కలిగిన ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ రూపంలో ఉన్న సమాచారాన్ని భద్రపరచడానికి అవసరమైన పద్ధతులను అన్వేషిస్తుంది. వాటిని గుర్తించి, అభివృద్ధి చేస్తుంది. అంటే అనధికారికంగా సమాచారాన్ని సంగ్రహించడం, వినియోగించడం, ఇతరులకు పంపిణీ చేయడాన్ని నివారిస్తుంది. అనైతిక, చట్ట విరుద్ధమైన చర్యల నుంచి సమాచారానికి రక్షణ కల్పిస్తుంది.
సమాచారం లేదా డేటా ఎలాంటి పరికరంలోనైనా ఉండవచ్చు. ఈ రక్షణ ప్రక్రియలో సీఐఏ అనే మూడు మౌలికాంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ‘సి’ (కాన్ఫిడెన్షియాలిటీ) సమాచార గోప్యతకు, ‘ఐ’ (ఇంటిగ్రిటీ) సమాచార సమగ్రతకు, ‘ఎ’ (అవైలబిలిటీ) సమాచార లభ్యతకు సూచికలు. గోప్యత అంటే అర్హత లేనివారికి సమాచారం లభించకుండా చేయడం, సమగ్రత అంటే రవాణా ప్రక్రియలో సమాచారం ఎక్కడ ఎలాంటి మార్పులకూ గురికాకుండా ఉండటం. మూడోదైన లభ్యత అంటే కోరుకున్న సమయానికి సమాచారం అందుబాటులో ఉండటం. ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఈ మూడు మౌలికాంశాలను లక్ష్యాలుగా పరిగణిస్తుంది. వాటికి హామీ ఇచ్చే అల్గారిథమ్‌ను (క్రమసూత్ర పద్ధతులు), ప్రోగ్రామ్‌లను అభివృద్ధి పరుస్తుంది. సమాచార భద్రత స్థాయుల గురించి పటం ద్వారా తెలుసుకోవచ్చు.
డిజిటల్‌ సమాచారం ఎంత భద్రం?
కంప్యూటర్లలో సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందనుకోవడం భ్రమ. అల్గారిథమ్‌, దాని ఆధారంగా రాసిన ప్రోగ్రామ్‌లకు సంభావ్యతా సిద్ధాంతం ఆధారంగా ఉంటుంది. కాబట్టి వాటి వివరాలను గణితాన్ని ఉపయోగించి ఇతర మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు. భద్రతా వలయాన్ని ఛేదించవచ్చు. అందుకే కంప్యూటర్‌ లేదా డిజిటల్‌ వ్యవస్థలో సంపూర్ణ భద్రత అసాధ్యం. అందుకే వీలైనంత తక్కువ సమయంలో ఆన్‌లైన్‌ వ్యవహారాలు ముగించడానికి పాస్‌వర్డ్‌లతోపాటు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వంటి వాటిని వాడుతున్నారు.
ఉప రంగాలు - నైపుణ్యాలు
ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీకి సంబంధించిన నైపుణ్యాలను ప్రధానంగా ఈ కింది ఉప రంగాలుగా లేదా ప్రత్యేకాంశాలుగా నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్‌నెట్‌ సెక్యూరిటీ: అంతర్జాలంలో సమాచార భద్రతకు సంబంధించిన మెలకువలు, నైపుణ్యాలను అభ్యర్థులు నేర్చుకుంటారు. ముఖ్యంగా రవాణాలో ఉన్న సమాచారానికి రక్షణ ఇవ్వడం, ఆటంకాలు లేకుండా చేయడం వీరి కర్తవ్యం.
సైబర్‌ సెక్యూరిటీ: ఇంటర్‌నెట్‌ వేదికగా ఇతరుల సమాచారంపై దాడి, ధ్వంసం చేయడం వంటి వాటి నుంచి భద్రత కల్పించే మెలకువలు, నైపుణ్యాలను ఈ అభ్యర్థులు నేర్చుకుంటారు. అత్యధిక ఉద్యోగావకాశాలు ఉన్న రంగం ఇది.
కంప్యూటర్‌ సెక్యూరిటీ: ఈ ఉపరంగంలో రవాణాలో లేని లేదా కంప్యూటర్‌లో నిక్షిప్తమై ఉన్న సమాచారానికి నిపుణులు రక్షణ ఇస్తారు. పటిష్ఠమైన పాస్‌వర్డ్‌ల అభివృద్ధి, ఆథెంటికేషన్‌, యాక్సెస్‌ కంట్రోల్‌ వంటి సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ ఉంటుంది. వైరస్‌ల వల్ల సమాచార సమగ్రతకు ముప్పు ఏర్పడకుండా యాంటీ వైరస్‌ ప్రోగ్రామ్‌లను పెంపొందించడం నేర్చుకుంటారు.
మొబైల్‌ సెక్యూరిటీ: ఈ రంగంలోనే సమాచారానికి ఎక్కువగా భద్రత లేకుండా పోయింది. మొబైల్‌ ద్వారా అన్ని సౌకర్యాలు కలుగుతున్నప్పటికీ, మొబైల్‌ నంబర్‌ ఇంటర్‌నెట్‌లో అందిరికీ అందుబాటులో ఉండటంతో భద్రత ఇబ్బందికరంగా మారింది. అందుకే అభ్యర్థులకు మొబైల్‌ ఆధారిత సేవలను ఉపయోగించడం, ఇతర టూల్స్‌, యాప్‌ల అభివృద్ధికి కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తారు.
నెట్‌వర్క్‌ సెక్యూరిటీ: కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లను చొరబాటుదారుల నుంచి రక్షించడానికి అవసరమైన టూల్స్‌, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఉపకరణాల అభివృద్ధి గురించి ఈ రంగంలో నేర్చుకుంటారు. ఫైర్‌ వాల్‌, రౌటర్‌ వంటి టెక్నాలజీల అభివృధ్ధి, నిర్మాణం, వినియోగం, నిర్వహణ ఈ రంగానికి సంబంధించినదే.
అనేక దారుల్లో అభద్రత
సమాచారానికి రకరకాల మార్గాల్లో ప్రమాదం వాటిల్లుతుంది.
* వివిధ వైరస్‌లతో సాఫ్ట్‌వేర్‌ను ధ్వంసం చేయడం
* మేధో సంపత్తిని దొంగిలించడం
* పాస్‌వర్డ్‌ ఆనవాళ్లను సంగ్రహించడం
* సమాచారాన్ని అనుమతి లేకుండా సేకరించడం
* సమాచారాన్ని ధ్వంసం చేయడం
* ఫిషింగ్‌ (మన ప్రమేయం లేకుండానే ఈ-మెయిల్‌ను సంపాదించి పదే పదే మెయిల్స్‌ పంపడం)
ఇవే కాకుండా, రోజురోజుకీ కొత్త పద్ధతుల్లో సమాచారానికి ప్రమాదం కలిగిస్తున్నారు. వీటన్నింటినీ ఎదుర్కొనే ప్రక్రియలోనే అనేక రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి.
ముఖ్యమైన సర్టిఫికేషన్‌లు
* ఎథికల్‌ హ్యాకింగ్‌ (సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌)
* సిస్కో నెట్‌వర్కింగ్‌ (సీసీఎన్‌ఏ)
* మైక్రోసాఫ్ట్‌ సంస్థ ద్వారా ఎంసీఎస్‌ఈ సర్టిఫికెట్‌ కోర్సు
* ఇసాకా సంస్థ ద్వారా సర్టిఫైడ్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌.
ఎలాంటి ఉద్యోగాలు?
మన నిర్లక్ష్యం, అలసత్వాల వల్లే సమాచారానికి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే భద్రత కల్పించే ఉద్యోగులు పలు అంశాల్లో నైపుణ్యాన్ని సంపాదించాలి. సంస్థ రక్షణ నియమాలు, ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ నిర్వహణ, సమాచార ఆస్తుల రక్షణ, మానవ వనరుల భద్రత, ఆథెంటికేషన్‌, సమాచార సేకరణ-నిర్వహణ వివరాలు, చట్టపరమైన జాగ్రత్తల వంటి అంశాల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలి. కొన్నేళ్లుగా ఈ రంగంలో ఏటా దాదాపు 20% పైగా ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. 2024 వరకూ ఇదే రీతిన వృద్ధి ఉంటుందని ఒక సర్వే వెల్లడైంది.
ఈ రంగంలో ఉండే ఉద్యోగాల్లో కొన్ని...
* నెట్‌వర్క్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌
* సిస్టమ్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌
* నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌
* డేటా అనలిస్ట్‌
* ఇన్‌ఫర్మేషన్‌ సిస్ట్టమ్‌ సెక్యూరిటీ మేనేజర్‌
ఎవరు అర్హులు?
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో కెరియర్‌ను కోరుకుంటే ఈ కింది అర్హతలు ఉండాలి.
* కనీసం డిగ్రీ. ఇంజినీరింగ్‌ అయితే ప్రాధాన్యం.
* అల్గారిథమ్‌, ప్రోగ్రామ్‌లు అభివృద్ధి చేయాలంటే గణితంలో నంబర్‌ థియరీ తెలిసి ఉండాలి. క్రిప్టోగ్రఫీ వంటి కొన్ని విభాగాల్లో 300 పైగా అంకెలున్న ప్రైమ్‌ నంబర్స్‌తో రిమైండర్‌ అరిథ్‌మెటిక్‌ థియరీపై ఆధారపడిన లెక్కలు ఉంటాయి. రింగ్స్‌, ఫీల్డ్స్‌ వంటి పాఠ్యాంశాలపై పట్టు ఉండాలి.
* ప్రయోగశాలల్లో అభ్యాసం చేసి మెలకువలు పెంపొందించుకోవాలి.
* ఈ రంగంలో ఒకటి లేదా రెండు ప్రాజెక్టులు చేసి ఉండటం మంచిది.
* లినక్స్‌, యూనిక్స్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల నిర్మాణంపై మంచి పట్టు ఉండాలి.
* ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌

అదనంగా...
* ఈ రంగంలో ఇతరులతో సత్సంబంధాలు
* సదస్సుల్లో పాల్గొనడం
* చేరాలనుకుంటున్న సంస్థ పనితీరు పట్ల సమగ్ర అవగాహన
* గాఢమైన అభిరుచి
* నిరంతర విద్యార్థిగా మెలగడం
* ఇతరులతో సహకరించగలిగే తత్వం ఉండాలి.

- నీల‌మేఘ‌శ్యామ్ దేశాయ్‌, ACE ఇంజినీరింగ్ క‌ళాశాల‌‌
అన్ని స్థాయుల్లోనూ సమర్థులు అవసరం
భద్రత కేవలం సేవా సంబంధమైన వినిమయ వస్తువు కాదు. పటిష్ఠమైన సమాచార భద్రతా వ్యవస్థ రూపకల్పన, నిర్మాణం, నిర్వహణల సమాహారమే ఈ ప్రక్రియ. అందుకే అన్ని స్థాయుల్లోనూ సమర్థులైన ఉద్యోగుల అవసరం ఈ రంగానికి ఉంది.
- బ్రూస్‌ స్నెయిర్‌, అమెరికన్‌ క్రిప్టోగ్రాఫర్‌,
చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, ఐబీఎం రెసిలియన్ట్‌


Posted on 13-12-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning