చదువులమ్మ ఒడిలోనే ఐటీ శిక్షణ

* ఇంజినీరింగ్ కళాశాలల్లో సాఫ్ట్‌వేర్ శిక్షణ కేంద్రాలు
* పెరుగుతున్న పరిశ్రమలు-కళాశాలల అనుసంధానం
* కళాశాలలు చిత్తశుద్ధి చూపిస్తే విద్యార్థులకు ప్రయోజనం

ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే అప్పగించిన ప్రాజెక్టులో పనిచేసే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకే ఐటీ సంస్థలు గత కొద్ది సంవత్సరాల నుంచి ఉద్యోగాలిస్తున్నాయి. ఇదే లక్ష్యంతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఐటీ సంస్థలు కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యేక శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతున్నాయి. కళాశాలల యాజమాన్యాలు సైతం స్థలాన్ని సమకూర్చుతున్నాయి. ఇది ప్రచార్భాటానికి కాకుండా విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా చిత్తశుద్ధి చూపితేనే లక్ష్యం నెరవేరుతుందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో పరిశ్రమలు లేదా సంస్థలు తమ పరిశోధనలను విశ్వవిద్యాలయాల్లోనే చేస్తుంటాయి. విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూనే మరో వైపు పరిశోధనల్లో భాగస్వాములవుతారు. ఇక్కడా పరిశ్రమలు - విద్యాసంస్థల అనుసంధానం పెరగాలని విద్యావేత్తలు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. పరిశోధనలకు కాకున్నా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పలు ఐటీ పరిశ్రమలు నవకల్పన (ఇన్నోవేషన్) కేంద్రాలను ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో చేరే విద్యార్థుల ప్రతిభ, ఎంసెట్ ర్యాంకులు, కళాశాలల యాజమాన్యాల చిత్తశుద్ధి తదితర వాటిని పరిశీలించి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఒరాకిల్, విప్రో, క్లిక్ తదితర కంపెనీలు ఈ దిశగా కేంద్రాలను నెలకొల్పుతున్నాయి. యాజమాన్యాలు కంప్యూటర్లతో కూడిన ఒక ప్రయోగశాలను కేటాయిస్తే పరిశ్రమలు విద్యార్థులకు శిక్షణ ఇస్తాయి. బీటెక్ రెండో సంవత్సరం నుంచి ఈ శిక్షణ మొదలవుతుంది. అందుకు విద్యార్థుల నుంచి రుసుము వసూలు చేస్తారు. కొన్ని కళాశాలలు తామే సొంతగా భరిస్తున్నాయి. శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలిస్తాయి. పరిశ్రమల నుంచే మార్గదర్శకులు(మెంటార్లు) వచ్చి అవసరమైన శిక్షణ ఇచ్చి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచుతారు.
దేశవ్యాప్తంగా కేంద్రాలు
మైక్రోసాఫ్ట్ దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ సెంటర్(మిక్) పేరిట 100 కళాశాలల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15-20 కళాశాలల్లో ఉన్నాయి. విప్రో, ఒరాకిల్, టెక్ మహీంద్ర, ఐబీఎం కంపెనీలు సైతం కళాశాలల్లో శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతున్నాయి. నెల రోజుల క్రితమే క్లిక్ అనే అంతర్జాతీయ సంస్థ మొదటి డేటా అనలిటిక్స్ కేంద్రాన్ని హైదరాబాద్‌లోని వీజేఐటీలో ఏర్పాటు చేసింది. డేటా అనలిటిక్స్‌లో విద్యార్థులతో పాటు అధ్యాపకులకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. కొన్ని పరిశ్రమలు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) పేరిట శిక్షణతోపాటు పరిశోధన చేసేలా కేంద్రాలను ప్రారంభిస్తున్నాయి. ఇటీవలే ఐడియా ల్యాబ్స్, ఈ2 ల్యాబ్స్ సంస్థలతో హైదరాబాద్‌లోని రెండు, విశాఖపట్టణంలోని మరో కళాశాల సైబర్ సెక్యూరిటీపై కేంద్రాలను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
స్వయంప్రతిపత్తి కళాశాలల్లో అధికం
జేఎన్‌టీయూహెచ్ పరిధిలో దాదాపు 30 స్వయంప్రతిపత్తి హోదా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. వాటిల్లో 70 శాతం కళాశాలల్లో ఏదో ఒక ఐటీ పరిశ్రమ శిక్షణ కేంద్రాలను నెలకొల్పాయని జేఎన్‌టీయూహెచ్ పరీక్షల విభాగం సంచాలకుడు, కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు కామాక్షిప్రసాద్ చెప్పారు. ఆయా కళాశాలల సత్తాను కూడా పరిగణలోకి తీసుకుంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రముఖ కళాశాలల్లోనే ఈ కేంద్రాలున్నాయన్నారు. వారిచ్చే ధ్రువపత్రం ఆధారంగా మాత్రమే ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేయరని, కొంత ప్రాధాన్యం ఉండొచ్చన్నారు. కొన్ని కళాశాలలు ఈ కేంద్రాలను ప్రవేశాల సమయంలో ప్రచారం కోసం వాడుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ఓ ప్రముఖ కళాశాలలో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటు చేసినా మొదట్లో ఉన్నంతగా శిక్షణ ఇప్పుడు నడవడం లేదని తెలిసింది.

Posted on 26-12-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning