ఉద్యోగాల తీరు మార్చేస్తోంది మరమేధ!

ఐఫోన్‌లో మీకొచ్చిన కాల్‌ వివరాలను అప్పుడప్పుడు ఓ అందమైన వాయిస్‌ అందిస్తోందా! ‘అదిరింది’ (మెర్సెల్‌-తమిళంలో) సినిమా ప్రమోషన్‌లో వాడిన చాట్‌బోట్‌ అనుభవం గుర్తుందా! ఇంటర్‌నెట్‌లో ఇష్టమైన డిజైన్‌ దుస్తులు ఎంచుకుంటే ఆన్‌లైన్‌లోనే కొలతలు తీసుకొని కుట్టించి ఇస్తున్నారు తెలుసా! ఇదంతా... కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ప్రయోగ ఫలితమే! ఉద్యోగాల తీరుతెన్నులు మార్చేస్తున్న మరమేధ మాయ! ఆన్‌లైన్‌లో మనుషుల కొలతలు తీసుకోవడమేంటి... విడ్డూరం కాకపోతే అనిపించినా... అది నిజమే! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో పనిచేసే కెమెరాలు మీ కొలతలను కచ్చితంగా లెక్కగట్టేస్తాయి.

కంప్యూటర్లను కనుక్కోవడం ఒక విప్లవాత్మకమైన సాంకేతిక అభివృద్ధి. దానికున్న అపారమైన సామర్థ్య వినియోగ శక్తి రోజురోజుకీ ఎన్నో వినూత్నమైన ఆవిష్కరణలకు దారితీస్తోంది. అందులో భాగంగానే మనుషుల్లాగా వివేకంతో పనిచేసే కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) కంప్యూటర్లను రూపొందిస్తున్నారు. గత అయిదు నుంచి పది సంవత్సరాల్లో డేటా మైనింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి బిగ్‌-డేటా ఆధారిత కృత్రిమ మేధకు సంబంధించిన టెక్నాలజీల ఆవిష్కరణలు జరిగాయి. ఇది అంతర్జాలంలో భారీ స్థాయిలో డేటాబేస్‌ల అభివృద్ధికి దోహదపడింది. ఈ భారీ డేటాబేస్‌లను సైనిక, రక్షణ, వైద్య, హెల్త్‌కేర్‌, ఫార్మసీ, జన్యుశాస్త్రం, జినోమ్‌ల అభివృద్ధి వంటి సంక్లిష్ట రంగాల్లో విశ్లేషణలకు ఉపయోగిస్తున్నారు. కొన్ని విశ్లేషణలు జరిగే సమయంలో కంప్యూటర్లు మనుషుల్లాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరమని భావించి కృత్రిమ మేధను అభివృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ వినియోగం భారీ స్థాయిలోనే ఉండబోతోందని నిపుణులు, వ్యాపార వేత్తలు అంచనా వేస్తున్నారు.
కావాల్సిన అర్హతలు
ప్రధానంగా ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు డిగ్రీ ఉంటే చాలు. ఇంజినీరింగ్‌ డిగ్రీకి ప్రాధాన్యం ఉంటుంది. అదే మధ్యస్థాయి, పైస్థాయి ఉద్యోగాలకు పీజీ లేదా డాక్టరేట్‌ ఉండాలి. దాంతోపాటు ఈ కింది అంశాల్లో నైపుణ్యాలు అవసరం.
* కంప్యూటర్‌ టెక్నాలజీ
* గణితంలోని ప్రతి శాఖపై మంచి పట్టు (బీజగణితం, ప్రాబబిలిటీ, కాలిక్యులస్‌, లాజిక్‌, అల్గారిథమ్స్‌)
* గ్రాఫిక్‌ మోడలింగ్‌
*కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ (జావా, పైథాన్‌ వంటివి)
* న్యూరల్‌ నెట్‌వర్క్స్‌
* భౌతిక శాస్త్రం
* రోబోటిక్స్‌
* కాగ్నిటివ్‌ సైన్స్‌
పరిశోధనకూ అవకాశాలు
వివిధ రంగాల్లో రకరకాల అంశాల్లో పరిశోధనకు అవకాశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని...
* ఎక్స్‌పర్ట్‌ సిస్టమ్స్‌ - ఫ్లైట్‌ ట్రాకింగ్‌, క్లినికల్‌ సిస్టమ్స్‌
* నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ - గూగుల్‌ నౌ ఫీచర్‌, స్పీచ్‌ రికగ్నిషన్‌, ఆటోమాటిక్‌ వాయిస్‌ అవుట్‌పుట్‌
* న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ - పాటర్న్‌ రికగ్నిషన్‌ (ఫేస్‌, వాయిస్‌, హ్యాండ్‌ రైటింగ్‌)
* రోబోటిక్స్‌ - ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌
* లాజిక్‌ సిస్టమ్స్‌ - కన్సూ్యమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్స్‌
కోర్సులను అందిస్తున్న కొన్ని సంస్థలు
దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, సంస్థలు కృత్రిమ మేధకు సంబంధించి వివిధ రకాల కోర్సులను అందిస్తున్నాయి.
* యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ - ఎంటెక్‌ (ఏఐ)
* యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియమ్‌ ఇంజినీరింగ్‌ సైన్సెస్‌, డెహ్రాడూన్‌ - ఎంటెక్‌ (ఏఐ)
* ఐఐటీ బాంబే - పీజీ డిప్లొమా (11 నెలలు ఆన్‌లైన్‌లో)
* ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ - 15 వారాల సర్టిఫికెట్‌ కోర్సు (వారాంతాల్లో తరగతులు)
* ఏఐ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రామచంద్రాపురం, హైదరాబాద్‌ - సర్టిఫికెట్‌ కోర్సులు
* అనలిటిక్‌ పాత్‌, హైదరాబాద్‌ - డిప్లొమా
* ఉడాసిటీ నానోడిగ్రీ - ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బెంగళూరు
* జెక్‌ లాబ్స్‌ - ఆరిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ట్రెయినింగ్‌
* మై టెక్ట్రా - మెషీన్‌ లెర్నింగ్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బెంగళూరు
* జెన్‌రేస్‌ - ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ ట్రెయినింగ్‌, బెంగళూరు
* నోబెల్‌ప్రోగ్‌, నోయిడా - ఏఐలో అన్ని రకాల స్వల్పకాలిక కోర్సులు
* ఎస్‌ఆర్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌, హైదరాబాద్‌ - సర్టిఫికెట్‌ కోర్సులు.
ఎలాంటి ఉద్యోగాలు?
* ఎంట్రీ స్థాయి నుంచి పైస్థాయి వరకు పలు రకాల ఉద్యోగాలను ఏఐ రంగం కల్పిస్తోంది.
* సాఫ్ట్‌వేర్‌ అనలిస్ట్‌, డెవలపర్‌
* కంప్యూటర్‌ సైంటిస్ట్‌, ఇంజినీర్‌
* అల్గారిథమ్‌ స్పెషలిస్ట్‌
* రిసెర్చ్‌ సైంటిస్ట్‌, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌
* మెకానికల్‌ మెయిన్‌టెనెన్స్‌ ఇంజినీర్‌
* మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీర్‌
* రోబోటిక్స్‌ టూల్స్‌ ఉపయోగించే సర్జికల్‌ టెక్నీషియన్‌
* కృత్రిమ అవయవాల, వినికిడి యంత్రాల, కృత్రిమ దృశ్య ఉపకరణాల వినియోగం తెలిసిన హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్‌
* మిలటరీ, విమానయాన రంగాల్లో ప్రవేశం / నైపుణ్యం కలిగి సిమ్యులేటర్స్‌, డ్రోన్‌ వినియోగం తెలిసిన ప్రొఫెషనల్స్‌
* డిజిటల్‌ మ్యూజిక్‌, గ్రాఫిక్‌ ఆర్ట్‌ డిజైనర్‌
* ఆర్కిటెక్ట్‌
* మెషీన్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పర్ట్‌
* డేటా మైనింగ్‌ అనలిస్ట్‌
ఈ రంగం కొత్తది కావడం, లేబొరేటరీ వ్యవస్థ ఖర్చుతో కూడుకోవడంతో కోర్సు ఫీజు కాస్త అధికంగానే ఉంటుంది. కోర్సులో చేరక ముందే ఫ్యాకల్టీ, ల్యాబ్‌ తదితరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సంతృప్తికరమైన సమాచారం అందిన తర్వాతే చేరడం మంచిది. నియామకాలకు సాయం చేసే శిక్షణ సంస్థల్లో చేరడం మేలు. కోర్సు పూర్తి చేస్తే సరిపోదు. తగిన నైపుణ్యాన్ని సొంతం చేసుకొని ప్రదర్శించగలిగితేనే ఉద్యోగాలు వస్తాయి.
అనేక రంగాల్లో...
వివిధ రంగాల్లో కృత్రిమ మేధ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. వీటిని పరిశీలిస్తే రకరకాల ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది.
గేమింగ్‌: చదరంగం, వివిధ రకాల జూదాలు (పోకర్‌), గడులు నింపే ఆట (టిక్‌-టాక్‌-టో) వంటి ఆటల్లో ఎన్నో రకాలుగా ప్రాబబిలిటీ ఆధారిత ఆలోచన ఉంటుంది. వీటి అభివృద్ధిలో కృత్రిమ మేధ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇది వేగంగా ఉద్యోగాలను కల్పిస్తున్న రంగం.
నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌: మనుషులు మాట్లాడే తీరును అర్థం చేసుకుని, మనుషుల స్థాయిలో సంభాషించగలిగిన కంప్యూటర్‌ వ్యవస్థ ఇది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. బిజినెస్‌ ప్రాసెసింగ్‌, డెవలప్‌మెంట్‌ రంగాల్లో ఈ వ్యవస్థ వినియోగం పెరుగుతోంది.
ఎక్స్‌పర్ట్‌ సిస్టం: కంప్యూటర్‌, సంబంధిత సాఫ్ట్‌వేర్‌, ప్రత్యేక డేటాబేస్‌ ఆధారంగా నిపుణుల్లాగే ఆలోచించి సలహాలు, సూచనలు అందించే కృత్రిమ మేధ ఏర్పాటు ఇది. ఇక్కడ కూడా కొత్త నిపుణుల అవసరం ఉంది.
విజన్‌ సిస్టం: దృశ్య రూపంలో ఉన్న ఇన్‌పుట్‌ను అర్థం చేసుకొని, అన్వయించి స్థూలంగా ఫలితాలను ఇస్తుంది. ఇందులో కూడా కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తే...
గూఢచారి వ్యవస్థకు సంబంధించిన చిత్రాల ఆధారంగా ఆ ప్రదేశాన్ని భౌతికంగానో లేదా మ్యాప్‌లోనో గుర్తిస్తారు.
రోగ లక్షణాలను కచ్చితంగా నిర్ణయించడానికి వైద్యులకు ఉపయోగపడుతుంది.
పోలీస్‌ శాఖలో ఫోరెన్సిక్‌ చిత్రకారుడు గీసిన చిత్రం వివరాల ఆధారంగా దోషుల ముఖాన్ని కంప్యూటర్‌ గుర్తుపడుతుంది.
స్పీచ్‌ రికగ్నిషన్‌: వివిధ మాండలికాల్లో (యాసల్లో) పలికిన పదాలను విని, గుర్తించి, ఆ భాషలోకి అన్వయించి వాక్యాలకు అర్థం చెప్పగలిగిన కంప్యూటర్‌ వ్యవస్థలు. ఇవి మనిషి చేసే శబ్దంలోని మార్పులను పసిగట్టి మనిషిని కూడా గుర్తిస్తాయి.
హ్యాండ్‌ రైటింగ్‌ రికగ్నిషన్‌: కంప్యూటర్‌ తెర లేదా ప్రత్యేక బోర్డుపై స్టైలస్‌ అనే పరికరంతో రాస్తే ఆ పదాలను పసిగట్టి చేతిరాతను గుర్తించే వ్యవస్థ.
వివేకం కలిగిన రోబోట్‌: మనుషుల ఆదేశాలను అనుసరించి పనిచేసే రోబోట్‌ వ్యవస్థ ఇది. గాలి, వేడి, చలనం, ధ్వని, ఒత్తిడి వంటి వాటిని ఇవి గ్రహిస్తాయి. అధిక సామర్థ్యం ఉన్న సెన్సార్లు, ప్రాసెసర్లు, భారీ మెమొరీల సాయంతో ఈ కంప్యూటర్‌ వ్యవస్థ వివేకాన్ని ప్రదర్శిస్తుంది. పరిస్థితులకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటుంది. తప్పులను సరిదిద్దుకునే సామర్థ్యం వీటికి ఉంటుంది.
కృత్రిమ మేధ అంటే ఏమిటి?
తెలివైన, వివేకంతో కూడిన నిర్ణయాలను సొంతంగా తీసుకోడానికి అవసరమైన సామర్థ్యాన్ని, కొన్ని ప్రోగ్రామ్‌ల సాయంతో కంప్యూటర్లలో అభివృద్ధి చేసే ఇంజినీరింగ్‌ విజ్ఞానాన్ని కృత్రిమ మేధ అంటారు. ఇవి మనుషుల మేధను పరిశీలించి అనుకరిస్తాయి. వారిలాగా సమస్యలను వివేకంతో పరిష్కరిస్తాయి. కేవలం అనుకరణ మాత్రమే కాదు సాధారణ వివేకానికి సవాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించే శక్తిని సృష్టించడం కూడా కృత్రిమ మేధ లక్ష్యమే. అసాధారణ పరిస్థితుల్లో మనుషులు ఆలోచించలేని రీతిలో కూడా కంప్యూటర్ల మేధకు పనిపెట్టాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో మనుషుల ఆలోచనా ధోరణి, నేర్చుకునే పద్ధతి, నిర్ణయాలు తీసుకునే తీరు, ఆచరణ, అనుకరణకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ల అభివృద్ధి కృత్రిమ మేధ రంగంలో జరుగుతోంది.

- నీల‌మేఘ‌శ్యాం దేశాయి, ACE ఇంజినీరింగ్ క‌ళాశాల
సామాజిక అంతరాలను తగ్గించే ఏఐ
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ వల్ల ఉద్యోగుల విధి విధానాల్లో చాలా మార్పులు వస్తాయి. వ్యాపారాలకు, సమాజానికి మెరుగైన అనుభవాలను ఈ రంగం అందిస్తుంది. సామాజిక అంతరాలను తగ్గిస్తుంది. దీనివల్ల 2035 నాటికి మన దేశ జాతీయోత్పత్తికి దాదాపు రూ.62 లక్షల కోట్లు జతవుతుంది.
- యాక్సెంచర్‌, సాంకేతిక దిగ్గజ సంస్థ


Posted on 27-12-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning