పట్టుకో... కొత్త ట్రెండ్‌!

* కొత్త సంవత్సరం..
* సరికొత్త ఉత్సాహం!
* కొత్త ఆశలు..
* సరికొత్త లక్ష్యాలు!

వాటిని సాధించడానికి... సోషల్‌ మీడియాలో శపథం చేయండి! మొబైల్‌పై ఒట్టు పెట్టుకోండి! అన్ని రంగాల్లో ఆటోమేషన్‌ వేగంగా విస్తరిస్తోంది. మనుషులు, మరమనుషులు కలీగ్స్‌గా కలిసి పనిచేయాల్సిన కాలం దగ్గరపడింది. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే కంపెనీలు మిమ్మల్ని ఆదిమానవుల జాబితాలో జమకట్టేస్తాయి. నిజాయతీగా మీ నైపుణ్యాలను లెక్కకట్టండి. మారుతున్న మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ కొత్త వర్క్‌ఫోర్స్‌లో మీ స్థానాన్ని కాపాడుకోండి!
డిగ్రీ పూర్తి చేసుకొని ఇంకొద్ది రోజుల్లో ఉద్యోగంలో సెటిలవ్వాలని ప్రయత్నాలు ప్రారంభించారా... అయితే ప్రస్తుత డెవలప్‌మెంట్స్‌ కొన్నింటి గురించి మీరు తెలుసుకోవాలి. వాటి ప్రభావం వెంటనే ఉండకపోయినా, రాబోయే రోజుల్లో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2018లో అవి మీ టాలెంట్‌కి టెస్ట్‌లు పెట్టబోతున్నాయి.
* ముందుగా చెప్పుకోవాల్సిన డెవలప్‌మెంట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. 2017లో ఈ టెక్నాలజీ జాబ్‌ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపడం మొదలు పెట్టింది. రైల్వేస్టేషన్లలో ఆటోమేటిక్‌ వెండింగ్‌ మిషన్లు, సినిమా హాళ్లలో, ఫుడ్‌కోర్టుల్లో ఆర్డర్లు అందుకునే కియోస్క్‌లు దీనికి సంబంధించినవే. కొత్త సంవత్సరంలో ఇలాంటివి ఇంకెన్నో చూడబోతున్నాం.
* మొబైల్‌ ఇప్పటికే ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు ఆ మొబైల్‌ నుంచే జాబ్‌ అప్లికేషన్స్‌ పంపడం ప్రారంభమైంది. సరికొత్త టెక్నాలజీ సాధనాలను అభ్యర్థులు ఎంతవరకు ఉపయోగిస్తున్నారో తెలుసుకోడానికి కంపెనీలు మొబైల్‌ జాబ్‌ అప్లికేషన్‌ విధానాలను ప్రవేశపెడుతున్నాయి.
* శ్రమసాంద్ర రంగాల్లోకీ టెక్నాలజీ వేగంగా ప్రవేశిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలోకి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా హెల్త్‌కేర్‌ టెక్నాలజీ వినియోగం బాగా ఎక్కువైంది. రకరకాల రోగ నిర్ధారణ పరీక్షలు, రిపోర్ట్‌ జనరేషన్లలో యంత్రాల వాడకం అధికమైంది. అప్పటికప్పుడు మెదడు ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేని చోట యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వీటి నిర్వహణ నైపుణ్యాలు ఉన్నవారికి ఉద్యోగాలు ఎక్కువవుతున్నాయి.
ఇంతకుముందు వరకు ఉద్యోగానికి అప్లికేషన్‌ పెడితే దాని పరిస్థితేంటో తెలిసేది కాదు. కానీ 2018లో నియామక ప్రక్రియలో మరింత పారదర్శకతను ఉద్యోగార్థులు ఆశించవచ్చు. అప్లికేషన్‌ పెట్టడం మొదలు వివిధ దశల్లో దాని స్టేటస్‌ ఏమిటో రియల్‌టైమ్‌లో తెలుసుకునే విధానాలు కొత్త సంవత్సరంలో జోరందుకోబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన సాధనం సోషల్‌ మీడియా ‌
ఉద్యోగాల, ఉద్యోగుల అన్వేషణకు ఇప్పుడు సోషల్‌ మీడియా ప్రధాన సాధనంగా మారింది. కంపెనీలు ఉద్యోగాల ప్రకటనలను న్యూస్‌ పేపర్లలో ఇవ్వడం తగ్గించేశాయి. అభ్యర్థులు జాబ్‌ నోటిఫికేషన్ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. నియామక సంస్థలు కూడా తమకు తగిన సామర్థ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం లింక్డ్‌ఇన్‌, ఇతర ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను వెతుకుతున్నాయి. మిలెనియల్స్‌ (1980-2000 మధ్య పుట్టిన వాళ్లు) సమాచారం ఇప్పుడు ఎక్కువగా సోషల్‌ మీడియాలోనే లభ్యమవుతోంది. దాని నుంచి నాణ్యమైన నైపుణ్యం ఉన్నవారిని తేలిగ్గా ఎంపిక చేసుకుంటున్నారు.
మీ మార్కెటింగ్‌ మీదే!
సంస్థలు అడిగినప్పుడు ఆ అర్హతలు మీకున్నాయని చెప్పుకునే రోజులు పోయాయి. మీకు మీరే మార్కెటింగ్‌ చేసుకునే ట్రెండ్‌ రిక్రూట్‌మెంట్‌లో మొదలైంది. 2018 చివరినాటికి ఇది మరింత వూపందుకోబోతోంది. కమ్యూనికేషన్‌, కంటెంట్‌ రైటింగ్‌, ప్రోగ్రామింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ తదితర మీ నైపుణ్యాలను బ్రాండింగ్‌ చేసుకోవడం ఇప్పుడు సాధారణ సంప్రదాయ టాలెంట్‌ ప్రదర్శనలో భాగంగా మారాయి.
ఫైరింగ్‌... హైరింగ్‌!‌
అభ్యర్థుల్లో అసలైన సామర్థ్యాలను వెలికి తీయడానికి సంస్థలు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. కావాల్సిన నైపుణ్యాలు ఉన్నవారిని వెతికి మరీ హైర్‌ చేసుకుంటున్నాయి. ఇంకా కొత్త స్కిల్స్‌ నేర్చుకోవడంలో ఎవరైనా బద్ధకిస్తే వారిని ఫైర్‌ చేస్తున్నాయి. తగిన నైపుణ్యాలతో వస్తే మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఉద్యోగంలో చేరిపోయాం ఇక చాలు అని స్థిమితపడితే మీరు ఫైరింగ్‌ లిస్ట్‌లో చేరిపోతారు.
కొత్త ఉద్యోగాల్లో 9 శాతం మంది!
ఆటోమేషన్‌ వేగంగా విస్తరిస్తోంది. మార్కెట్‌ అవసరాలకు దీటుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని, మార్కెటింగ్‌ పరిధిని పెంచుకోడానికి సంస్థలు టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఫిక్కీ-నాస్కామ్‌ నివేదిక ప్రకారం 2022 నాటికి భారతీయ ఉద్యోగుల్లో 9 శాతం మంది కొత్త ఉద్యోగాల్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్నవి కాకుండా కొత్తరకం ఉద్యోగాలు రానున్నాయన్నమాట. కొత్త నైపుణ్యాలను నేర్చుకుని సిద్ధంగా ఉన్నవారికి అధిక వేతనాలు లభించే అవకాశం కూడా ఉంది.
రిక్రూట్‌మెంట్‌లోనూ టెక్నాలజీ!
ఇటీవలి కాలం వరకు అవసరమైతే రాత పరీక్ష, తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ. అంతే ఉద్యోగం ఇవ్వాలో లేదో తేల్చేసేవారు. కానీ ఇప్పుడు పద్ధతి మారింది. కొత్త స్కిల్స్‌ నేర్చుకున్నవాళ్లకు, సరికొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికే ఆఫర్‌ లెటర్లు అందుతున్నాయి. అందుకోసం రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌లో టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. కొంత క్లిష్టంగా సాగే ఈ ప్రక్రియలో సైకోమెట్రిక్‌ టెస్ట్‌లు, పర్సనాలిటీ పరీక్షలు, గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లు, కేస్‌ స్టడీస్‌, రిటెన్‌ రిపోర్ట్‌లు, ప్రజెంటేషన్‌ తదితరాలను వినియోగిస్తున్నారు. ఈ ట్రెండ్‌ 2018లో మరింత పెరగనుంది. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లు వీటిని తేలిగ్గా అందిపుచ్చుకోవచ్చు. ఇతర డిగ్రీల అభ్యర్థులు కూడా కొంత టెక్నికల్‌ నైపుణ్యాన్ని సంపాదించడం అవసరం.
జాబ్‌ మార్కెట్‌తో పాటుగా!
రాబోయే రోజుల్లో టెక్నాలజీ ప్రభావం ప్రతి ఒక్కరిపై తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగం చేస్తూ నేర్చుకోవచ్చు అనేది ఇక ముందు చెల్లదు. అప్పటికి లేదా భవిష్యత్తు అవసరాలకు తగిన స్కిల్స్‌ మీ దగ్గర ఉంటేనే రిక్రూటింగ్‌ ఏజెన్సీలు మీ గురించి ఆలోచిస్తాయి. ఉదాహరణకు కార్లు, ట్రక్కుల డ్రైవర్ల నియామకాలు ఇక ముందు జరగకపోవచ్చు. రిటైల్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌, టికెట్‌ సెల్లింగ్‌ తదితర ఉద్యోగాల భర్తీ భవిష్యత్తులో ఉండదేమో. కానీ ఏ టెక్నాలజీ ప్రభావం ఎలా ఉన్నా, కొత్త స్కిల్స్‌ నేర్చుకోవడంలో అభ్యర్థులు ఎప్పుడూ ముందుండాలి. జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌ని ముందే గుర్తించి జాగ్రత్త పడితేనే పోటీలో నిలబడగలుగుతారు. అందుకే కొత్త సంవత్సరం... కొత్త నిర్ణయాల్లో భాగంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని సంకల్పించండి. 2018ని నైపుణ్యనామ సంవత్సరంగా మార్చుకోండి.
హ్యాపీ న్యూ ఇయ‌ర్‌!

Posted on 01-01-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning