నేరుగా... నేర్పుగా!

వివిధ దశల్లో సుదీర్ఘంగా సాగే ఉద్యోగ నియామకాలకు భిన్నంగా స్వల్ప వ్యవధిలోనే తగిన అభ్యర్థులను ఎంచుకునే విధానం- వాక్‌ఇన్స్‌. పెద్ద సంస్థలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఇప్పుడీ విధానం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ తరహా నియామకాల స్వభావం గ్రహించి వాటిలో మెరుగైన ప్రతిభను ప్రదర్శించి నెగ్గటం అభ్యర్థులకు సవాలే!

ముందస్తు అపాయింట్‌మెంట్‌ ఏదీ లేకుండా నేరుగా ఎంపిక ప్రక్రియకు హాజరయ్యే వెసులుబాటును ఇస్తాయి, వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు. ముందుగా ప్రకటించిన తేదీ, సమయాల్లో సంస్థ ప్రతినిధులతో అభ్యర్థుల ముఖాముఖీ జరుగుతుంది.
ఈ తరహా ఇంటర్వ్యూలను చేపట్టడానికి చాలా కారణాలున్నాయి.
* ఒక సంస్థ వ్యాపారాభివృద్ధిలో భాగంగా ప్రాజెక్టుల కోసం చేసిన ప్రయత్నం ఫలించి ప్రాజెక్టు వచ్చినపుడు తక్కువ సమయంలో దాన్ని పూర్తిచేయడానికి కావాల్సిన మానవ వనరులను సమకూర్చుకోవాల్సి వస్తుంది.
* కొన్ని ప్రముఖ సంస్థలకు అవసరమైన ఉద్యోగ స్థానాలకు మామూలు ఎంపిక ప్రక్రియ ద్వారా అభ్యర్థులు దొరక్కపోవచ్చు. అప్పుడు వారు అలాంటి అన్ని స్థానాలకూ ఒకేసారి వాక్‌ఇన్‌ నిర్వహిస్తుంటారు. దీనిద్వారా నిర్ణీత సమయం దాటిపోకముందే ఆ స్థానాలను నింపడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
* నియామకాలకు జరిగే వ్యయం కూడా కంపెనీలకు తగ్గుతుంది.
వివిధ విధానాలు
* ఒక సంస్థ అభ్యర్థులను తమ ప్రాంగణానికే నియామక ప్రక్రియ నిమిత్తం ఆహ్వానించవచ్చు.
* ఒకటికన్నా ఎక్కువ సంస్థలు ఒక ఉమ్మడి వేదికను ఎంపిక చేసుకుని, జాబ్‌ ఫేర్‌ ద్వారా అభ్యర్థులను వాక్‌ఇన్‌కు ఆహ్వానిస్తాయి.
* సంస్థ/ సంస్థలు నిర్వహించే పోటీల్లో పాల్గొన్నవారిలో ఉత్తమ అభ్యర్థులకూ వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇలాంటి ఇవెంట్స్‌ల్లో ఉత్తమ ప్రతిభావంతులు ఎంపికవుతారని సంస్థల అభిప్రాయం.
మామూలు ఇంటర్వ్యూల కంటే వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూల్లో పోటీ ఎక్కువ. ఉద్యోగ అవసరం ఉండి, అర్హత ఉన్న ఏ అభ్యర్థి అయినా పాల్గొనే వీలుండటమే ఇందుకు కారణం. పైగా ఇది ఒక కళాశాలకో, ప్రాంతానికో పరిమితం కాదు. దీంతో ఈ వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలకు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు హాజరైనప్పుడు చాలాసార్లు సంస్థలు మొదటి స్థాయిలోనే షార్ట్‌లిస్ట్‌ చేసి, చివరి రౌండ్‌కు తరువాత పిలుస్తారు.
తక్కువ సమయంలో మెప్పించాలి
ప్రాంగణ నియామకాలైనా, సాధారణ రిక్రూట్‌మెంట్‌ అయినా ఎంపిక కోసం నిర్దేశించిన ఒక సమయం ఉంటుంది. కానీ వాక్‌ఇన్‌ల్లో పోటీ ఎక్కువ కాబట్టి, లభించేది తక్కువ సమయమే. అందుకని వీటికి ప్రత్యేకంగా సన్నద్ధమవ్వాలి.
* రెజ్యూమే చాలా ముఖ్యం. మొదటగా సంస్థ చూసేది దీన్నే. దాన్ని పక్కాగా తయారు చేసుకోవాలి. సంస్థ అవసరాలకు అనుగుణమైన సమాచారాన్ని రెజ్యూమేలో పొందుపరచుకోవాలి. అది నిర్దిష్టంగా, సూటిగా ఉంటే చాలా మంచిది. సంస్థ అడుగుతున్న అర్హతలు, నైపుణ్యాలు, ఇంటర్న్‌షిప్‌లు, అనుభవం మొదలైనవాటిని వరుసలో పొందుపరచాలి. మొత్తంగా రెజ్యూమేని చూడగానే ప్రొఫైల్‌ కళ్లముందు కదిలేలా ఉండాలి.
* వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ అన్నంత మాత్రాన సంస్థలు నేరుగా ఇంటర్వ్యూకు పిలవకపోవచ్చు. రాత పరీక్షలు, గ్రూప్‌ డిస్కషన్‌లు నిర్వహించి, ఆ తరువాత ఇంటర్వ్యూకు పిలవొచ్చు. అందుకు ఆప్టిట్యూడ్‌, వెర్బల్‌, కమ్యూనికేషన్‌ల మీద పట్టు ఏర్పరచుకుని సిద్ధంగా ఉండాలి.
* మొత్తం మీద ప్రధానమైంది- ఇంటర్వ్యూ. ఇక్కడ చాలా అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. పోటీ ఎక్కువ ఉండటం వల్ల ఫస్ట్‌ ఇంప్రెషన్‌ చాలా ముఖ్యం. అభ్యర్థి కనపడే తీరు సరిగా లేకపోతే టీవీలో చానెల్‌ను మార్చినంత సులువుగా తరువాతి అభ్యర్థిని పిలుస్తారు. ఈ ‘విజిబిలిటీ’...రూపమో, అందమో కాదు. ఆహ్లాదకరమైన ముఖకవళికలు, ఆత్మీయమైన పలకరింపు, మర్యాదపూర్వకమైన శరీర భాష.. ఇవన్నీ! ఆ తరువాత ఇంటరాక్షన్‌. ఇది అర్థవంతంగా, బలంగా, ఆశావహంగా ఉండాలి. మొత్తంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ఎదుట ఉన్నది ఆత్మవిశ్వాసమున్న అభ్యర్థి అనిపించాలి.
ఈ లక్షణాలు అభ్యర్థిని నైపుణ్యాల మదింపు కోసం తరువాతి అంచెకు పంపడానికి పునాది. ఇక కంపెనీ ఆశిస్తున్న నైపుణ్యాలను ఒక్కోటీ వివరించగలగాలి. ఇక్కడ గుర్తుంచుకోవల్సిన విషయం ఏమిటంటే.. రెజ్యూమేలో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అభ్యర్థి ఇంకా అదనంగా వివరించగలగాలి. ఉదాహరణకు- విద్యా సంబంధ విషయాలన్నీ రెజ్యూమేలో రాస్తారు. కానీ దానిలో అభ్యర్థి ప్రత్యేకతను వెల్లడించేవాటిని మాత్రమే ప్రస్తావించాలి. అంటే.. తాను కళాశాల్లో ప్రథమ ర్యాంకు సాధించినట్లో.. లేదా మరొకటో. అలాగే నైపుణ్యాలు, పాల్గొన్నవి, సాధించిన విజయాలు, ఇంటర్న్‌షిప్‌లు, అనుభవంలోని ప్రత్యేకతలను ప్రస్తావించవచ్చు.
ఏ విధంగా ఉపయోగకరం?
* జాబ్‌ ఫేర్‌ల ద్వారా వాక్‌ఇన్‌లు నిర్వహించినపుడు ఒకే వేదిక మీద ఒకేసారి వివిధ సంస్థల ఉద్యోగ ఎంపికల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు అభ్యర్థులకు తగిన సంస్థ కానీ, జాబ్‌ ప్రొఫైల్‌ కానీ ఫలానా అని నిర్ధారణకు వచ్చి దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. ఎందుకంటే జాబ్‌ ఫేర్‌ల ద్వారా నిర్వహించే వాక్‌ఇన్‌ల కన్నా ముందు చాలా సంస్థలు అక్కడికొచ్చినవారికి ప్రీ ప్లేస్‌మెంట్‌ టాక్‌ను నిర్వహిస్తాయి. అవి సంస్థ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారు.
* వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలకు అర్హత ఉన్నవారెవరైనా పాల్గొనవచ్చు. కాబట్టి ఉద్యోగార్థులు ఇలాంటి ఓపెన్‌ కాంపిటిషన్‌ల ద్వారా మంచి స్థానాలకు ఎంపికయ్యే అవకాశముంటుంది.
చేయకూడనివి
* రెజ్యూమేను సంస్థకు అవసరంలేని సమాచారంతో నింపకూడదు.
* కాజువల్‌ దుస్తుల్లో వెళ్లకూడదు.
* ఇంటరాక్షన్‌ సమయంలో మాట్లాడే అంశంపైనే దృష్టి ఉండాలి. ఎలా మాట్లాడుతున్నాననే ఆలోచన రానీయకూడదు.
* ఇంటర్వ్యూయర్‌ అడిగిన సమాచారం తెలియకపోయినా, అర్థం కాకపోయినా తెలిసినట్టు మాట్లాడి ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేయకూడదు.
* ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రవర్తన అనాసక్తిగానో, నిర్లక్ష్యం ప్రదర్శితమయ్యేలానో ఉండకూడదు.
* ఇంటర్వ్యూ చేసేవారు మాట్లాడటం పూర్తవకముందే జోక్యం చేసుకోవడం, మొండిగా వాదనకు దిగడం లాంటివి చేయకూడదు.
* ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ఉద్యోగం అత్యవసరమనే భావనను వ్యక్తపరచకూడదు.
* చివర్లో ‘ఏమైనా అడుగుతారా?’ అన్నప్పుడు అత్యుత్సాహంతో అర్థంలేని ప్రశ్నలను వేయకూడదు.
చేయాల్సినవి
* రెజ్యూమేను క్లుప్తంగా.. ఒకటి- రెండు పేజీల్లో తయారు చేసుకోవాలి.
* డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి. ఫార్మల్స్‌ ముఖ్యం.
* ఎవరితో మాట్లాడినా ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి. ముఖ్యంగా మాట్లాడే అంశంపై స్పష్టతతో ఉండాలి.
* ఇంటర్వ్యూకు ముందు ఆ సంస్థ గురించిన సమాచారాన్ని సేకరించాలి.
* కనీసం ఒక అర్ధగంట ముందైనా ప్రాంగణానికి చేరుకోవాలి.
* ఇంటర్వ్యూకు కావాల్సిన డాక్యుమెంట్లు అన్నింటినీ ఒక ఫోల్డర్‌లో క్రమ పద్ధతిలో అమర్చుకుని వెంట తీసుకెళ్లాలి.
* ప్రాంగణంలోకి వెళ్లినప్పటి నుంచి అయిపోయేంతవరకూ అవసరమైనపుడు మౌనంగా, సరైన నడవడికతో ఉండాలి.
* ఎదుటివారు చెప్పేది ఆసక్తిగా ఆలకించే తీరును కనబర్చాలి.

- వెంక‌ట్ కాంచ‌న‌ప‌ల్లి, సీఈఓ, స‌న్‌టెక్ కార్ప్‌
ఆత్మవిశ్వాసమే విజయ సూత్రం! - ఆర్థర్‌ యాష్‌, ప్రసిద్ధ అమెరికన్‌ టెన్నిస్‌ ఆటగాడు, మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత
విజయానికి ఒక ప్రధానమైన సూత్రం ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఒకే ఒక మంత్రం సన్నద్ధత. అందుకే సరైన సన్నద్ధత ఉంటే విజయ సాధన కష్టం కాదు.

Posted on 02-01-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning