బ్యాంకింగ్ రంగంలో బీటెక్ దూకుడు!

 • * చాలామంది అభ్యర్థుల కలల కొలువు ఇదే
  * ఈ ఏడాది 30 శాతం వరకు పెర‌గ‌నున్న ఉద్యోగావ‌కాశాలు

       ఒకప్పుడు ఇంజినీరింగ్‌ చదివినవారు సాధారణ పోటీ పరీక్షలకు దూరంగా ఉండే వారు. వారి స్థాయికి ఆ ఉద్యోగాలు తగవన్న భావన ఉండేది! సాధారణ పట్టభద్రులు మాత్రమే బ్యాంకు, రైల్వేల లాంటి ఉద్యోగాలకు పోటీ పడేవారు. ప్రస్తుతం ఈ ధోర‌ణి మారింది. బ్యాంకింగ్‌ రంగ విస్తరణతో ఉద్యోగాలు పెర‌గ‌డం, ఆకర్షణీయ వేతనాలు ల‌భిస్తుండ‌టంతో ఇంజినీరింగ్‌ చదివిన వారు సైతం బ్యాంకు ఉద్యోగాల వైపు ఆకర్షితులవుతున్నారు.


       ఐటీ రంగంలో కొంత అనిశ్చితి నెల‌కొన‌డం, వివిధ కంపెనీలు అభ్యర్థుల‌ను ఆచితూచి ఎంపిక చేసుకోవ‌డంతో ఇంజినీరింగ్ అభ్యర్థులు ఐటీయేత‌ర ఉద్యోగాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఐటీ రంగంలో విధుల‌ప‌రంగా కాస్త ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉండ‌టం, బ్యాంకింగ్ రంగంలో ఈ ప‌రిస్థితి అంత‌గా లేక‌పోవ‌డం బీటెక్ గ్రాడ్యుయేట్లు బ్యాంకు ఉద్యోగాల‌వైపు ఆక‌ర్షితుల‌వ‌డానికి మ‌రో కార‌ణం. ప్రస్తుతం చక్కని పనిగంటలతో అత్యుత్తమ వేతనాలను అందిస్తున్న రంగం ఏదైనా ఉందా అంటే... అది బ్యాంకింగ్ రంగమే. అందుకే చాలామంది అభ్యర్థులు.. ముఖ్యంగా మ‌హిళ‌లు ఈ రంగంపై ఎక్కువ‌గా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.
       బ్రాంచ్‌ల విస్తరణ, ఆధునికీకరణ, వినియోగదారులకు వివిధ‌ రకాల ఆర్థిక సేవలందించాలనే ల‌క్ష్యాల‌తో బ్యాంకుల్లో నియామకాలు ఊపందుకున్నాయి. దీంతోపాటు రెండు వేల జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకులు తమ సేవలు ప్రారంభించాలని ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు పల్లెబాట పడుతున్నాయి. వివిధ ర‌కాల రుణాలు, విద్యార్థుల స్కాలర్‌షిప్స్ మొదలుకొని.. మహిళలకు అందించే డ్వాక్రా రుణాల వరకు ప్రభుత్వం నిర్వహించే అన్ని లావాదేవీలు బ్యాంకులతో ముడిపడి ఉన్నవే. అందువల్ల బ్యాంకుల్లో పనిచేయడానికి నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతోంది.
       బ్యాంకు ఉద్యోగం కోరుకుంటున్న వారిలో అధిక శాతం మంది ఇంజినీరింగ్‌లో పట్టభద్రులైన వారేనని టాలెంట్‌స్ప్రింట్‌ నిర్వహించిన 'బ్యాంకర్స్‌క్రానికల్‌ ఆన్‌లైన్‌' అధ్యయనంలో వెల్లడైంది. ఇంజినీరింగ్‌ అభ్యర్థుల తర్వాత సైన్సు పట్టభద్రులు బ్యాంకు ఉద్యోగాన్ని కోరుకుంటున్నారు. అధ్యయనంలో పాల్గొన్న 78 శాతం మంది ఈ ఉద్యోగాన్ని తమ కలల ఉద్యోగంగా భావిస్తున్నారు.
       ఇందులో సగానికి సగం పైగా అభ్యర్థులు ఇంజినీరింగ్‌ చదివిన వారేనని అధ్యయనం వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న మహిళలలో 80 శాతం మంది బ్యాంకు ఉద్యోగం సాధించడం తమ కలని పేర్కొన్నారు. పురుషుల్లో 77 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబ‌రులో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఈ అధ్యయనంలో 20 నుంచి 30 వయసు మధ్య ఉన్న 1,252 మంది పాల్గొన్నారు.
       పోటీపై యువతకు రోజు, రోజుకు అవగాహన పెరుగుతోందని, పోటీ పరీక్షలో నెగ్గి బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం సంపాదించడానికి సిద్ధం అవుతున్నారని అధ్యయనం పేర్కొంది.
  అధ్యయనంలోని ముఖ్యాంశాలు..
  * ప్రతి నలుగురిలో ముగ్గురు బ్యాంకు ఉద్యోగాన్ని సంపాదించడానికి నిపుణుల‌ శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు.
  * ప్రతి నలుగురిలో ఒకరు తమ సమీప ప్రాంతంలో సరైన శిక్షణ సౌకర్యాలు లేవని పేర్కొన్నారు.
  * తరగతి గదుల్లో ఇచ్చే శిక్షణ కంటే ఆన్‌లైన్‌ శిక్షణ మరింత సమర్థంగా ఉందని 54 శాతం మంది తెలిపారు. 10 శాతం మంది మాత్రం క్లాస్‌రూమ్‌ శిక్షణే మంచిదని అభిప్రాయపడ్డారు.

  ఈ ఏడాది 80 వేలకు పైగా ఉద్యోగాలు..

        బ్యాంకుల నియామకాలు ఈ ఏడాది 30 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల శాఖల, పోర్టుఫోలియో విస్తరణ ఇందుకు దోహదం చేయనుందని ఈ రంగానికి చెందిన ప్రముఖులు చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో నియామకాల తీరు ఎంతో ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. 80 వేల నుంచి లక్ష మంది బ్యాంకు ఉద్యోగాలు పొందే వీలుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 25-30 శాతం అధికం అని టాలెంట్‌స్ప్రింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ శంతను పాల్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకులు 8,000 కొత్త శాఖలను ప్రారంభిస్తున్నాయని, 2013-14 చివరి నాటికి రిజర్వు బ్యాంకు లైసెన్సులు ఇచ్చే కొత్త బ్యాంకులు కార్యకలాపాలు ప్రారంభించగలవని పాల్‌ అన్నారు. పదవీ విరమణ, వలసలు ఏటా సర్వసాధారణమేనని, ప్రస్తుత ఏడాదిలో నికరంగా 5,000-6,000 మందిని నియమించనున్నామని ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈఓ చందా కొచ్చర్‌ తెలిపారు. రిటైల్‌ వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 300 శాఖలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఐడీబీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.ఓ.రెగో పేర్కొన్నారు. దీనికిగాను 2,000 నుంచి 2,200 మందిని నియమించాల్సి ఉంటుందని ఆయ‌న‌ చెప్పారు. "కొత్త బ్యాంకులకు లైసెన్సులు ఇచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోగలరని భావిస్తున్నాం. దీంతోపాటు ఈ ఏడాది 800 మందికి పైగా పదవీ విరమణ చేయనున్నారు. ఈ పరిణామాలను దృష్టిలోపెట్టుకుని అవసరాని కంటే 30 శాతం ఎక్కువ మందిని నియమించుకుంటున్నాం. ఈ ఏడాది మేం 2,000 మంది అధికారులను నియమించుకుంటా"మని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సి.వి.రాజేంద్రన్‌ తెలిపారు.

  ప‌ద‌వీ విర‌మ‌ణ‌ల‌తో అద‌న‌పు ఖాళీలు

       దేశ‌వ్యాప్తంగా వివిధ‌ బ్యాంకుల్లో వచ్చే మూడేళ్లలో పెద్దఎత్తున అధికారులు, సిబ్బంది పదవీ విరమణ చేయ‌నున్నారు. 2016 నాటికి ఒక్కో బ్యాంకులోని అధికారుల్లో మూడో వంతు మంది పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేయటానికి భారీగా నియామకాలు చేపట్టక తప్పదని బ్యాంకింగ్‌ రంగంలో సీనియ‌ర్ అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా కొన్ని బ్యాంకులు కొత్త శాఖలను శరవేగంగా ప్రారంభిస్తున్నాయి. ఎస్‌బీఐని మినహాయిస్తే మిగిలిన అన్ని బ్యాంకులు ప్రధానంగా దేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. ఆయా బ్యాంకులు గత ఏడెనిమిదేళ్లుగా కొత్త ప్రాంతాలకు విస్తరించటంపై దృష్టి సారించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఎస్‌బీహెచ్‌, ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంకు లాంటివి అధికంగా కొత్త శాఖలను ప్రారంభిస్తున్నాయి. ఫలితంగా అధికారులను, సిబ్బందిని పెద్ద సంఖ్యలో భర్తీ చేసుకోవాల్సి వస్తోంది. దాదాపుగా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లోనూ భారీగా ఖాళీలున్నాయి. వీటిలో ప్రొబేషనరీ అధికారులు (పీఓలు), క్లర్కులతో పాటు రాజ్య భాషా అధికారులు, సెక్యూరిటీ అధికారులు, లీగల్‌ ఆఫీసర్ల లాంటి ఖాళీలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు ఇది సువర్ణావకాశంగా మారింది.
       ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 10,000 మందిని నియమించుకోనుంది. ఈ ఏడాది 1,500 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు, ఉద్యోగులను మొత్తం 10,000 మందిని భర్తీచేయ‌నున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ ప్రతీప్‌ చౌధురి తెలిపారు. 2013-14లో దేశంలో మరో 1200 శాఖలను తెరవనున్నట్లు, చైనా, బ్రిటన్‌ సహా విదేశాల్లో 8 శాఖలనూ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. మ‌రోవైపు ఎస్‌బీఐ ప‌రిధిలో ఈ ఆర్థిక సంవత్సరం సుమారు 7,500 మంది పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేర‌కు ఏర్పడ‌నున్న ఖాళీలకు సంబంధించిన భ‌ర్తీ ప్రక్రియ ఏప్రిల్‌లోనే మొదలైంది.

  పెరిగిన అవ‌స‌రాలే కార‌ణం!
       1986 నుంచి 2002 వ‌ర‌కు అడపాదడపా కొద్దిమందిని తీసుకోవడం మినహా బ్యాంకుల్లో పెద్దఎత్తున నియామ‌కాలు చేప‌ట్టలేదు. పెద్దగా విస్తరణలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ త‌ర్వాత‌ కంప్యూటర్లు వచ్చాయి. సిబ్బందిని కంప్యూటరీకరణకు అనుగుణంగా సర్దుబాటు చేయడంతో సరిపోయింది. 2005 తర్వాత‌ బ్యాంకుల్లో ఖాళీలు అధికంగా ఏర్పడ్డాయి. దేశంలో వృద్ధి రేటు పెరగడం బ్యాంకులకు పెద్దఎత్తున అవకాశాలు తెచ్చింది. బ్యాంకింగ్‌ కార్యకలాపాలు బహుముఖంగా విస్తరించాయి. దీంతో సిబ్బంది అవసరాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎస్‌బీల్లో దాదాపు 10 లక్షల మంది అధికార్లు, సిబ్బంది పనిచేస్తున్నారని అంచనా. ఏడాది క్రితం వరకూ అన్ని బ్యాంకుల్లో కలిసి 80,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి ఏటా జరిగే పదవీ విరమణలు అదనం. 2014 మార్చి 31 నాటికి ఎస్‌బీఐలో 7,500 మంది అధికార్లు పదవీవిరమణ చేస్తున్నారు. సిండికేట్‌ బ్యాంకులో వచ్చే మూడేళ్ల వ్యవధిలో దాదాపు 7,000 మంది అధికారులు రిటైర్ కావాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య సిండికేట్‌ బ్యాంక్‌లోని అధికారుల సంఖ్యలో దాదాపు 40 శాతానికి సమానం. మ‌రోవైపు బ్యాంకులు చేపడుతున్న నియామకాలకు హాజరై ఉద్యోగాలు పొందిన అధికార్లలో సగానికి సగం మంది చేరడం లేదని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగాల్లో చేరిన వారిలో కొంతమంది రెండు మూడేళ్లకే మానేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ కొన్ని ఖాళీలు మిగిలిపోతున్నాయి.

  అత్యుత్తమ వేత‌నాలు.. ప‌దోన్నతులు..
       బ్యాంకింగ్ రంగంలో వేత‌నాలు కూడా ఆక‌ర్షణీయంగానే ఉన్నాయి. క్లరికల్ స్థాయి వేతన స్కేలు రూ.6200తో మొదలై రూ.19100 వరకు ఉంది. ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారు నెలకు రూ. 40 వేల వరకు సంపాదించవచ్చు. ప‌దోన్నతులు కూడా బాగానే ఉన్నాయి. పీవోల‌కు బేసిక్ పే నెలకు రూ.14,500 చెల్లిస్తున్నారు. విధులు నిర్వహించే ప్రాంతం ఆధారంగా ప్రారంభంలో కనీసం రూ.21,000 వరకు వేతనం లభిస్తుంది. పదోన్నతుల ఆధారంగా నెలకు రూ.52,000 వరకు అంద‌జేస్తున్నారు. ఫర్నీచర్‌తో కూడిన గృహవసతి కూడా కల్పిస్తున్నారు. ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించినవారు పనితీరు, అనుభవం ఆధారంగా పదవీ విరమణలోపు చైర్మన్, వైస్ చైర్మన్ స్థాయికి చేరుకోవచ్చు. ఇన్ని ప్రత్యేక‌త‌లున్నందువ‌ల్లే ఇంజినీరింగ్ అభ్యర్థులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning