ఒత్తిడికి దూరం.. ఓర్పే మంత్రం

* ప్రాంగణ నియామకాల్లో గెలుపునకు సూత్రాలు

* విజేతల మనోగతం

పొన్నూరు, న్యూస్‌టుడే : విద్యార్థిలో మేధస్సును వికసింపజేసి వారిలో సృజనను పెంచి ఉజ్వల భవితకు దోహదం చేసేది సాంకేతిక విద్య. వివిధ విభాగాల్లోని ఇంజినీరింగ్ విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ ప్రణాళిక బద్దంగా శ్రమిస్తే ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవచ్చని నిరూపించారు. ఇటీవల వడ్లమూడి విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో టీసీఎస్, వర్చ్యూస్ తదితర కంపెనీలకు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందుకు వారెలా సాధన చేసిందీ.. తోటి విద్యార్థులు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలను 'న్యూస్‌టుడే'తో పంచుకున్నారు.
అన్నింటిలో పాల్గొనాలి
పాఠాలతోపాటు అదనపు విజ్ఞానం అవసరం. కళాశాలలో జరిగే సెమినార్లలో కానీ, బృందచర్చల్లో పాల్గొనడం వల్ల అనేక అంశాలపై అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా భాషా నైపుణ్యం అవసరం. వీటన్నిటిపై పట్టు సాధిస్తే ప్రాంగణ ఎంపికల్లో గెలుపు సులభమే. టీసీఎస్‌కు ఎంపికవడంలో ఇవన్నీ దోహదపడ్డాయి. కళాశాలలో జరిగే అన్ని అవగాహన సదస్సులు, బృంద చర్చలు, అన్నింటిలో పాల్గొనాలి.
- స్వాతి చౌదరి, సీఎస్ఈ నాలుగో సంవత్సరం
మూడు అంశాలపై దృష్టి సారించా
సాంకేతిక రంగంలో రాణించాలంటే విద్యార్థులు మూడు అంశాలపై దృష్టి సారించాలి. భాషా నైపుణ్యం, ఆప్టిట్యూడ్, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి. కళాశాలలో ఉన్న వనరులను సద్వినియోగపర్చుకోవడం వల్లనే టీసీఎస్ కంపెనీకి ఎంపికయ్యా. ఇష్టపడి చదవడం వల్ల మంచి మార్కులు సాధించా.
- వాసవి ప్రియాంక, సీఎస్ఈ, నాలుగో సంవత్సరం
విజయానికి క్రీడలే దోహదం
ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు విద్యతోపాటు క్రీడలపై కూడా ప్రత్యేక దృష్టి సారించా. క్రమం తప్పకుండా ప్రతి రోజు బాస్కెట్‌బాల్ ఆడా. ఒత్తిడికి దూరమయ్యా. దీనివల్లే కంపెనీ ప్రతినిధులు వేసిన ప్రతి ప్రశ్నకు సులభంగా సమాధానాలు ఇస్తూ వారిని ఆకర్షించా. ఒత్తిడిని జయిస్తే విద్యార్థులు సులభంగా ఉద్యోగాన్ని సంపాదించొచ్చు.
- విజయ్, ఈసీఈ, నాలుగో సంవత్సరం
మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగా...
ఇటీవల టీసీఎస్ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో పాల్గొన్నా. కంపెనీ ప్రతినిధులు అడిగిన ప్రతి ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం ఇచ్చా. మొదటి నుంచి ప్రణాళికబద్ధంగా వ్యవహరించడం వల్లే విజయంసాధించా. కళాశాలలో నిర్వహించిన శిక్షణ తరగతులు, బృంద చర్చలు, తన ఎంపికకు దోహదపడ్డాయి.
- యశస్విని, ఈసీఈ నాలుగో సంవత్సరం
క్రమశిక్షణకు తోడు ఓర్పు అవసరం
విద్యలో రాణించాలంటే ముఖ్యంగా ఆ విద్యార్థికి క్రమశిక్షణతోపాటు ఓర్పు ఎంతో అవసరం. ఓర్పు ఉంటే ఎంతటి విజయాన్నయినా సులభంగా జయించవచ్చు. టీసీఎస్ కంపెనీకి ఎంపిక కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. చిన్నతనం నుంచి పడ్డ కష్టానికి మంచి ఫలితం దక్కడం వూహించిందే. భయపడకుండా మాట్లాడినప్పుడే ప్రతి విద్యార్థి ఏ రంగంలోనైనా రాణించవచ్చు.
- సుమన్, సీఎస్ఈ, నాలుగో సంవత్సరం

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning