చెయ్యండి..వెళ్లండి..

* శాశ్వతం వద్దు.. తాత్కాలికమే ముద్దు
* ‘కాంట్రాక్టు’వైపు మొగ్గు చూపుతున్న ఐటీ కంపెనీలు
* ఇప్పటికే 45% మంది వారే!
* ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెరుగుతాయ్‌
* నష్ట భయం తగ్గుతుంది

ఈనాడు - హైదరాబాద్‌: సుధీర్‌కు ఐటీ రంగంలో ఏడేళ్ల అనుభవం ఉంది. ఏడాదిన్నర కాలంలో మూడు ఐటీ కంపెనీలు మారాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని.. అందరూ చెబుతుంటే.. మూడు కంపెనీలు ఎలా మారగలిగాడు. ఆ కంపెనీలు ఎలా ఉద్యోగం ఇచ్చాయన్నది మిత్రుల సందేహం. తీరా ఆరా తీస్తే.. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాలు సంపాదిస్తూ.. అధిక వేతనంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నాడు. థర్డ్‌ పార్టీ ద్వారా నియామకం పొందిన సుధీర్‌ ఆయా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పని చేసి మళ్లీ కొత్త కంపెనీలోకి వెళ్తున్నాడు.
సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఇటీవల ఇటువంటి ధోరణి బాగా ప్రాచుర్యం పొందుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరగనుంది. అవసరమైనప్పుడు (గిరాకీని బట్టి), తమకు లభించిన ప్రాజెక్టుకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్యాలున్న నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో కంపెనీలు నియమించుకుంటున్నాయి. తమ అవసరాలను థర్డ్‌ పార్టీకి చెబితే.. (సిబ్బంది కంపెనీలు) అవి ఐటీ కంపెనీకి అవసరమైన నైపుణ్యాలున్న నిపుణులను సరఫరా చేస్తున్నాయి. థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు పద్ధతిలో నిపుణులను నియమించుకుంటుంది. గతంలో ఐటీ కంపెనీల నియామకాల్లో కాంట్రాక్టు నిపుణులు 10 శాతం కంటే తక్కువ ఉండేవారు. ఇప్పుడు ఇది దాదాపు 45 శాతానికి చేరింది. కనీస వేతనాలు ఇస్తున్నారా? నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించి థర్డ్‌ పార్టీ నుంచి నిపుణులను ఐటీ కంపెనీలు తీసుకుంటున్నాయి. ఐటీ కంపెనీలు తాము ఎంత చెల్లించడానికి ఇష్టపడుతున్నాయో చెబితే.. నైపుణ్యాలను బట్టి 5-20 శాతం తమకు మిగిలే విధంగా కాంట్రాక్టు పద్ధతిలో థర్డ్‌ పార్టీ కంపెనీలు నిపుణులను నియమించి ఐటీ కంపెనీలకు అందిస్తున్నాయి. ప్రాజెక్టు ఉన్నంత వరకే ఉద్యోగి ఉండడంతోపాటు ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వారికి ఎక్కువ మొత్తం చెల్లించడానికి కూడా ఐటీ కంపెనీలు ఇష్టపడుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలే కాక అంకుర కంపెనీలు సైతం కాంట్రాక్టు పద్ధతిలోనే తమకు అవసరమైన నైపుణ్యాలున్న నిపుణులను నియమించుకుంటున్నాయి. నిపుణుడు మధ్యలో వెళ్లిపోయినా.. బదులుగా మరో నిపుణుడ్ని అందించే బాధ్యత నియామక కంపెనీదే.
శాశ్వత ఉద్యోగులకు జీతభత్యాలు, భవిష్య నిధి, గ్రాట్యుటీ, బీమా వంటి అనేక ప్రయోజనాలను కల్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులు లేనప్పుడు, వచ్చిన ప్రాజెక్టుల్లో ఉన్న ఉద్యోగులకు నైపుణ్యాలు లేనప్పుడు వారికి పని లేకుండానే జీతం చెల్లించాలి. ఉద్యోగులను భరించలేని పరిస్థితులు ఎదురు కావచ్చు. ఉద్యోగులను తొలగిస్తే.. చట్టపరంగా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలి. సామాజిక మీడియాలో అనవసర ప్రచారం జరుగుతుంది. ఇటువంటి నష్టభయాలను భరించడానికి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇష్టపడడం లేదు. ఈ రిస్క్‌లు లేకుండానే. అవసరం ఉన్నంత వరకే ఉద్యోగులను ఉంచుకోవడానికి వీలుగా ‘కాంట్రాక్టు’ వైపు మొగ్గు చూపుతున్నాయని, కాంట్రాక్టు ఉద్యోగుల వల్ల ఉద్యోగుల నైపుణ్యాలు ఎప్పటికప్పుడు పెరుగుతాయని, శాశ్వత ఉద్యోగులతో పోలిస్తే క్రమశిక్షణతో పని చేస్తారని నియామకాల నిపుణులు చెబుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం వల్ల ఐటీ కంపెనీలకు సమయం ఆదా కావడమే కాక దీర్ఘకాలంలో నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. ప్రాజెక్టు అభివృద్ధికి ప్రత్యేక నైపుణ్యాలున్న కాంట్రాక్టు నిపుణులను వినియోగించుకుని, దాని నిర్వహణకు సొంత ఉద్యోగులను కంపెనీలు నియమిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ముందు కాంట్రాక్టు పద్ధతిలో నిపుణులను నియమించుకుని వారి పనితీరు బాగా ఉంటే.. ప్రాజెక్టు కొనసాగుతుందనుకుంటే కాంట్రాక్టు ఉద్యోగులనే సొంత ఉద్యోగులుగా నియామకం చేసుకుంటున్నాయి. ఈ ధోరణి ఇప్పుడిప్పుడే బాగా పుంజుకుంటోంది.
పెరుగుతున్న ఆఫర్‌ డ్రాప్‌ అవుట్లు..
ప్రస్తుతం నైపుణ్యాలు ఉన్న వారి వెంట కంపెనీలు పడుతున్నాయి. ఇది ‘అభ్యర్థుల ప్రపంచం’. కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ వంటి విభాగాల్లో ఉద్యోగాలున్నా అందుకు తగ్గ నైపుణ్యాలున్న నిపుణులు లేరు. ఇటువంటి విభాగాల్లో నైపుణ్యాలున్న వారు వరుసగా నాలుగైదు కంపెనీల నుంచి ఆఫర్లు తీసుకుని చివరకు అధిక వేతనం చెల్లించే కంపెనీలో చేరుతున్నారు. ముందు ఒక కంపెనీలో ఆఫర్‌ తీసుకుని, అక్కడ ఆఫర్‌ చేసిన వేతనంతో రెండో కంపెనీలో ఎక్కువ వేతనాన్ని కోరుతున్నారు. చివరివరకూ మీ కంపెనీలోనే చేరుతామని చెబుతూ.. చివరకు పత్తా లేకుండా పోతున్నారు. ఎక్కువ వేతనం చెల్లించే కంపెనీలో చేరుతున్నారు. ఇటువంటి వారి వల్ల కంపెనీలకు సమయం, శ్రమ, ఎంపికకు అయ్యే ఖర్చు అంతా వృథా అవుతోంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ‘ఆఫర్‌ డ్రాప్‌అవుట్ల’ సమస్య పెరుగుతోందని నియామకాల కంపెనీ హ్యాపీ మైండ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ లీలాధర్‌ రావు చెబుతున్నారు. గతంలో పది మంది ఆఫర్లు తీసుకుంటే.. ముగ్గురు వచ్చే వారు కాదని.. ఇప్పుడు ఆఫర్‌ డ్రాప్‌అవుట్ల సంఖ్య 5-6 మందికి చేరిందంటున్నారు. నిపుణుల కొరత ఉన్న విభాగాల్లో ఇది 70% వరకూ ఉందన్నారు. ‘నిజానికి నైపుణ్యాలున్న వారు ఆఫరు తీసుకుని కంపెనీలో వచ్చి చేరితే.. నియామక సిబ్బంది ఎంతో భారం తగ్గినట్లు భావిస్తున్నారు. ఆఫర్లు తీసుకుని అభ్యర్థులు రాకపోవడంలో ఖాతాదారులను పోగొట్టుకున్న కంపెనీలూ ఉన్నాయన్నా’రు. ఈ సమస్యను అధిగ మించడానికి హ్యాపీ మైండ్స్‌ ‘ఇంటర్వ్యూఫ్యాక్ట్‌’ పేరుతో ఒక ఓపెన్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో నియామక కంపెనీలు తమ వద్ద ఆఫర్‌ తీసుకుని చేరని వారి వివరాలను ఉంచుతారు. దీని వల్ల అతని సమాచారం నియామక కంపెనీలందరికీ తెలుస్తుందని, అటువంటి వారిని కంపెనీలు దూరంగా ఉంచుతాయని చెప్పారు. కంపెనీలకు సమయం సహా అన్నీ ఆదా అవుతాయని, ఉద్యోగార్థులు ఇష్టం వచ్చినట్లు కంపెనీల వద్దకు వెళ్లరని లీలాధర్‌ అన్నారు. చాలా మంది నకిలీ అనుభవ ధ్రువ పత్రాలు పెట్టి ఇంటర్వ్యూ వరకూ వచ్చి ఆఫర్‌ పత్రాలు పొందుతారు. చివరకు కంపెనీ అభ్యర్థి గత చరిత్రను తెలుసుకుంటోందని తెలిస్తే.. అఫర్‌ డ్రాప్‌ అవుట్లుగా మారతారు. ‘ఇంటర్వ్యూ ఫ్యాక్ట్‌’ వల్ల ఇటువంటి వారు కూడా తగ్గుతారని చెప్పారు.
అమెరికాలో 80% కాంట్రాక్టు పద్ధతిలోనే..
కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై నైపుణ్యాలు సంపాదించుకున్న వారు కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేయడానికి ఇష్టపడతారు. అధిక ప్రతిఫలాన్ని కోరతారు. అమెరికాలో 80 శాతం మంది కాంట్రాక్టు పద్ధతిపైనే పని చేస్తారు. కంపెనీలు శాశ్వత ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగులకే అధిక వేతనాలు చెల్లిస్తాయి. భారత్‌లో ఇంకా ఉద్యోగ భద్రత అనే భావన అధికంగా ఉంది. భవిష్యత్తులో ఇది క్రమంగా తగ్గొచ్చు. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో జరిగే నియామకాల్లో అతిపెద్ద 10 కంపెనీల నియామకాలే 60 శాతం వరకూ ఉంటాయి. సాధారణంగా ఒక కంపెనీ ఎటువంటి పద్ధతులు, ధోరణిని అనుసరిస్తే.. మిగిలినవి కూడా అదే విధానాన్ని అనుసరిస్తాయి. భవిష్యత్తులో భారత ఐటీ కంపెనీల నియామకాల్లో కూడా కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. - శ్రీధర్‌ శర్మ, సహ వ్యవస్థాపకుడు, హ్యాపీ మైండ్స్‌
వారి నుంచి ఆదాయం లేకపోతేనే..
ఒకరి నుంచి కంపెనీకి ఎటువంటి ఆదాయం లేనప్పుడే సాధారణంగా కంపెనీలు ఆ ఉద్యోగిని తొలగించాలనుకుంటాయి. తొలగింపునకు ముందు నైపుణ్యాలను పెంచుకోవడానికి అవకాశం ఇస్తాయి. బాగా పని (పెరఫార్మెన్స్‌) చేసే వారు, మధ్య స్థాయిలో పని చేసే వారు, పని చేయనివారిని కంపెనీ ఎప్పుడు గుర్తిస్తునే ఉంటుంది. మధ్య స్థాయిలో పనితీరు బాగా ఉన్న వారికి కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. తక్కువ పనితీరు ఉన్న వారిని ఎప్పటికప్పుడు వదిలించుకోవడానికి చూస్తాయి. వాళ్ల వల్ల కంపెనీకి వచ్చే విలువ తగ్గుతుంది. పనితీరు బాగా ఉంటే వారిని వదులుకోవడానికి ఇష్టపడదు. అలా తొలగిస్తే కంపెనీకి ఆదాయం పోతుంది. అయిదారేళ్ల తర్వాత ఒక ప్రాజెక్టు ముగిస్తే.. అదే తరహా నైపుణ్యాలు అవసరమైన ప్రాజెక్టులు రాకపోతే.. నిపుణుడికి వేరే నైపుణ్యం లేనప్పుడే బయటకు పంపే పరిస్థితి వస్తుంది. కొత్త వారిని తీసుకురావడానికి కంపెనీలు సమయం, డబ్బును వెచ్చించాలి. - లీలాధర్‌ రావు, సీఈఓ, హ్యాపీ మైండ్స్‌


Posted on 14-01-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning