సరిగా సంధిస్తే విజయమే!

అన్ని అర్హతలు, అద్భుత పర్సంటేజీలు ఉన్నాయి. అలా అప్లై చేస్తే ఇలా జాబ్‌ అనుకున్న నితిన్‌కు అన్ని చోట్లా నో రెస్పాన్స్‌. ఎక్కడ లోపమో ఎంతకీ తేలక నిపుణులను సంప్రదించాడు. నీ గురించి నువ్వు సరిగా చెప్పుకోవడం లేదని వాళ్లు తేల్చేశారు. అంటే రెజ్యూమే వీక్‌ అని వివరించారు. అభ్యర్థులందరి గురించి అంతా ఆరా తీసే సమయం సంస్థలకు ఉండదు. అప్లై చేసిన ఉద్యోగానికి మీరు ఎంత సూటబుల్‌ అనేది మీరే మార్కెట్‌ చేసుకోవాలి. మీరు రెజ్యూమే సంధిస్తే ఆఫర్‌ లెటర్‌ అంతే స్పీడ్‌తో వచ్చేయాలి.

ఉద్యోగం లేదా ఇంటర్న్‌షిప్‌ను కోరుకునేవారిపై సంస్థలకు ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌’ ఏర్పరిచేది.. రెజ్యూమేనే! సాధారణంగా ఆ మొదటి ముద్రే చివరివరకూ కొనసాగుతుంది కూడా. పరిమిత ఉద్యోగాలూ.. భారీ పోటీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రెజ్యూమేనూ, ఫలానా సంస్థలో పనిచేయడానికి తమకున్న ఆసక్తిని తెలిపే కవర్‌ లెటర్‌నూ మెరుగ్గా రాయటం చాలా అవసరం.

ఇంటర్న్‌షిప్‌లకూ, ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్లలో రెజ్యూమే ఒకటి. ఇది 1-2 పేజీల్లో అభ్యర్థి చదువు, ఉద్యోగానుభవం, సాధించిన విజయాలు, స్కిల్స్‌, ప్రాజెక్టుల వివరాల సారాంశం తెలుపుతుంది. ఒకరకంగా అభ్యర్థికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తూ, ఫలానా స్థానానికి అతడు ఎంతవరకూ అర్హుడో సంస్థకు తెలియజేయడంలో ఇది సాయపడుతుంది.

ప్రభావపూరిత రెజ్యూమే తయారీలో కింది మార్గదర్శకాలు సాయపడతాయి.
1 ఫస్ట్‌లుక్‌ అదిరిపోవాలి!
సరాసరిన ఒక రెజ్యూమేను చూడటానికి నియామక సంస్థ ప్రతినిధులు కేటాయించే సమయం పది సెకన్లు మాత్రమే. అభ్యర్థి సంబంధిత ఉద్యోగానికి గొప్ప అర్హతలు కలిగివున్నా, సరిగ్గా ప్రెజెంట్‌ చేయకపోతే దాన్ని సమగ్రంగా చూసే అవకాశాలు తక్కువ.
* సరళంగా, స్పష్టంగా ఉండే టైమ్స్‌ న్యూ రోమన్‌, ఏరియల్‌ వంటి ఫాంట్లను ఎంచుకుంటే మంచిది. అక్షరాలు నలుపు రంగులో, సైజు 12 ఉండేలా చూసుకోవాలి.

* చదివేవారి దృష్టిని ఆకర్షించేలా బోల్డ్‌, ఇటాలిక్‌లను కొన్ని ముఖ్యమైనచోట్ల ఉపయోగించడం లాభిస్తుంది.

* ఫ్యాన్సీ ఫాంట్‌లు, షేడింగ్‌, హైలైటింగ్‌ లాంటి స్పెషల్‌ ఎఫెక్ట్‌లను వాడొద్దు. ఇలాంటి పనులు సమాచార లోపాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగించే ప్రమాదముంది.

* విశేషణాలతో కూడిన అతిశయోక్తుల భాషకు దూరంగా ఉండాలి. అవసరమైతే తప్ప పెద్ద పదాలను ఉపయోగించకపోవడమే మేలు.
* మరింత స్పష్టత కోసం సమాచారాన్ని జాబితాగా, బుల్లెట్‌ పాయింట్ల రూపంలో అందిస్తే బావుంటుంది.

2 ఇవి ఉండాల్సిందే!
దరఖాస్తు చేసుకునే పరిశ్రమను బట్టి రెజ్యూమే మారుతుంది. అయినప్పటికీ.. ఈ కింది అంశాలను మాత్రం రెజ్యూమేలో తప్పనిసరిగా చేర్చాల్సి ఉంటుంది.
*
సంప్రదింపు వివరాలు: ఈమెయిల్‌ చిరునామా, ఫోన్‌ నంబరు
* విద్యార్హతలు * సాంకేతిక/ సాఫ్ట్‌వేర్‌/ సంబంధిత నైపుణ్యాల జాబితా * గత ఉద్యోగ వివరాలు/ వాలంటీరింగ్‌/ వర్క్‌ ప్లేస్‌మెంట్లు * వ్యక్తిగత లక్షణాలు/ విజయాలు
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. ఉద్యోగానికి సంబంధించిన లక్షణాలను ముందు చేర్చాలి. ఉదాహరణకు ఎంపిక చేస్తున్న ఉద్యోగానికీ, మీరు చదివిన చదువుకూ పొంతన లేకపోతే దానికి సంబంధించిన అంశాలను జాబితా చివర్లో చేర్చాలి.

3 లేటెస్ట్‌ విజయాలు ముందు
కాలానుగుణంగా కాకుండా ఇటీవల సాధించిన విజయాలను ముందుగా చేర్చాలి. అంటే.. స్కూల్‌ సమయంలో సాధించిన విజయాలకంటే కళాశాల స్థాయిలో సాధించినవాటికి ప్రాధాన్యమివ్వాలి. అలాగే ప్రతి వివరణలోని సమాచారాన్ని క్లుప్తంగా, ప్రాధాన్యక్రమంలో ఉండేలా చూసుకోవాలి.

4 మంచి ముద్రకు మార్గం!
మీ గురించిన సమాచారాన్ని అంకెలు, గణాంకాల రూపంలో తెలియజేయాలి. సాధారణ అంశాలు, అప్రామాణిక భాష సంస్థ అధికారులకు మీ రెజ్యూమేపై ఆసక్తిని తగ్గించే అవకాశముంది. అలాంటి సమయంలో క్లుప్తంగా నంబర్ల రూపంలో ఇచ్చే సమాచారం రెజ్యూమేను ఆసాంతం చదివేలా చేయడమే కాకుండా, మీపై మంచి ముద్రను వేయడంలోనూ సహకరిస్తుంది.

5 కీ వర్డ్‌లు కీలకం
అవసరమైనచోట సంబంధిత కీ వర్డ్‌లను ఉపయోగించడం ద్వారా తక్కువ సమయంలో అధికారులకు మీ గురించి ఎక్కువ సమాచారాన్ని తెలుసుకునే వీలును కల్పించవచ్చు. చాలావరకూ పెద్ద సంస్థలు రిక్రూట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ అభ్యర్థుల దరఖాస్తుల్లోని కీవర్డ్‌లను స్కాన్‌ చేసి, వారిని ప్రాథమిక పరీక్షలకు ఎంపిక చేస్తోంది. కాబట్టి ఆ కీలక పదాలు రెజ్యూమేలో ఉండే విధంగా చూసుకోవాలి. కానీ అతిగా ఉపయోగించకూడదు. ఉదాహరణకు- రాతకు సంబంధించిన ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేస్తున్నారనుకోండి. మీరు గతంలో రాసిన కథనాలు, వ్యాసాల అనుభవాలను పంచుకోవచ్చు.

6 మీ మార్కెటింగ్‌ మీదే
పరిశ్రమకు మీరు ఎంతవరకూ తగినవారో చూపించడం ద్వారా మీ ఎంపిక తప్పనిసరయ్యేలా చూసుకోండి. ఉదాహరణకు మీరు మైక్రోసాఫ్ట్‌ సంస్థకు ఇంటర్వ్యూకు వెళితే.. ఒకవేళ తాము తీసుకోకపోతే గూగుల్‌ మిమ్మల్ని ఎగురేసుకుపోతుందేమో! పరిశ్రమలో తరువాతి గొప్ప ఆలోచన మీ నుంచే వస్తుందేమో! అన్నంతగా మార్కెట్‌ చేసుకోవాలి. అంటే ఎంపిక చేసుకోకపోతే నష్టపోతామేమో అన్న భావనను మైక్రోసాఫ్ట్‌కు కలిగించాలన్నమాట.

7 స్పష్టంగా నైపుణ్యాల వివరాలు
పేరు, చిరునామా, ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ మినహా మిగతా అన్ని వ్యక్తిగత వివరాలను (పెళ్లి, కుటుంబ వివరాలు లాంటివి) వదిలేయవచ్చు. పదాల సంఖ్య విషయంలో పరిమితి విధించుకుని, స్థలాన్ని వీలైనంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీ నైపుణ్యాల గురించి సూటిగా, స్పష్టంగా రాయండి.

8 భాష బాగుండాలి
టెన్స్‌లు, విరామచిహ్నాలను తప్పుగా ఉపయోగించడం, అసందర్భ వెర్బ్‌ ఫ్రేజ్‌లు ప్రమాదకరం. వాటి పట్ల జాగ్రత్త తప్పనిసరి. అలాగే వ్యాకరణ దోషాలు మీ నిర్లక్ష్య వైఖరిని ప్రతిఫలించేలా చేస్తాయి. అందుకే రెజ్యూమే పూర్తయిన తరువాత మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలి.

9 ఆన్‌లైన్‌ టూల్స్‌తో..
సీవీ మేకర్‌, విజువల్‌ సీవీ, ఆన్‌లైన్‌ రెజ్యూమే జనరేటర్‌ మొదలైన ఎన్నో ఆన్‌లైన్‌ సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక మంచి రెజ్యూమేకు అవసరమైన ఎన్నో రకాల లేఅవుట్లు, టెంప్లేట్లను ఇవి అందిస్తున్నాయి. వీటిని ఉపయోగించి రెజ్యూమేను తయారు చేసుకోవచ్చు. వీటిల్లో చాలావరకూ ఉచితసేవలను అందిస్తున్నాయి. అలాగే రెజ్యూమే పూర్తయ్యాక సేవ్‌ చేసుకోవచ్చు. అవసరమైన మార్పులను చేసుకునే వీలునూ కల్పిస్తున్నాయి.

ఉద్యోగానికి తగిన కవర్‌ లెటర్‌

ప్రతీ సంస్థ ప్రత్యేకమే. కాబట్టి మీ కవర్‌ లెటర్‌ నిర్దిష్టంగా, దరఖాస్తు చేస్తున్న సంస్థ ఉద్యోగ విధులకు తగ్గట్టుగా ఉండాలి. దరఖాస్తు చేస్తున్న సంస్థకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి సమయాన్ని కేటాయించాలి. అలాగే కాపీ- పేస్ట్‌లు చేయవద్దు. సంస్థ గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకున్న తర్వాతే రాయడం ప్రారంభించాలి.

పేరాలవారీగా..
మీ కవర్‌ లెటర్‌ను మూడు పేరాలుగా విభజించుకుని రాస్తే, సంస్థ యాజమాన్యానికి కూడా చదవడానికి అనుకూలం. మొదటి పేరాలో మీ పని గురించి సారాంశాన్ని ఇస్తూ, సంబంధిత ఉద్యోగానికి/ ఇంటర్న్‌షిప్‌కు మీరెంతవరకూ అర్హులో వివరించాలి. రెండో పేరాలో మీ గత అనుభవం, ప్రాజెక్టులు, ఈ కొత్త ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను వివరించాలి. మూడో పేరాలో ప్రత్యేకంగా ఆ సంస్థలో పనిచేయడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారో తెలియజేయండి. అవసరమైన చోట సంబంధిత స్థానానికి అవసరమైన కీవర్డ్‌లనూ ఉపయోగించాలి.

క్లుప్తంగా.. తప్పులు లేకుండా
సరళమైన భాషను ఉపయోగిస్తూ, వాక్యనిర్మాణం సరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే సమాచారం క్లుప్తంగా ఉండాలి. ఎలాంటి వ్యాకరణ దోషాలూ ఉండకూడదు. అందుకుగానూ.. ముందే ఒకసారి తప్పులు సరిచూసుకుని, అవసరమైన ఎడిటింగ్‌ చేసుకుని పంపాలి. ప్రభావశీలమైన కవర్‌ లెటర్‌ను తయారు చేసుకోవడంలో ఆన్‌లైన్‌ టెంప్లేట్ల సాయాన్నీ తీసుకోవచ్చు.

ఈ-మెయిల్‌లో ఇలా..
ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలకు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా కవర్‌ లెటర్‌ను అటాచ్‌ చేయాల్సిన అవసరం లేదు. కవర్‌ లెటర్‌లోని సమాచారాన్ని ఈ-మెయిల్‌ బాడీలో పొందుపరవచ్చు. తద్వారా మీ ఆసక్తులను రిక్రూటర్లు సులభంగా తెలుసుకోగలిగే వీలుంటుంది.

ఒక మంచి రెజ్యూమే, కవర్‌ లెటర్‌ ఇంటర్న్‌షిప్‌/ ఉద్యోగ వేటలో ఒక మంచి పునాది వేయడానికి తోడ్పడతాయి. ఎన్నో ఉద్యోగ ప్రయత్నాల్లో రెజ్యూమే అవకాశాల తలుపులు తెరుస్తుంది. కాబట్టి, దాన్ని సరైన రీతిలో మలిచేలా జాగ్రత్త వహించండి.

ఒక పేజీ చాలు

ఒక ఇంటర్న్‌షిప్‌ లేదా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు రెజ్యూమేతోపాటుగా కవర్‌ లెటర్‌నూ జోడించి పంపాల్సి ఉంటుంది. ఇది ఒక పేజీలో మాత్రమే ఉండాలి. ఈ కవర్‌ లెటర్‌ ద్వారా సంస్థ మిమ్మల్ని ఎందుకు నియమించుకోవాలో వివరించాల్సి ఉంటుంది. ఫలానా ఉద్యోగానికి, సంస్థకు మీరే తగిన అభ్యర్థి ఎలా అవుతారో వివరించే అవకాశం మీకు దీని ద్వారా లభిస్తుంది.

మాదిరి కవర్‌ లెటర్‌

Here is an example of a cover letter:

"Hope you are doing well. I have used the Nxtby previously and was impressed by how a small idea of connecting local merchants, with customers can create one of the largest deal-buying company in the world.

I am interested in Marketing and have worked on different domains including blogging, product marketing and demographic survey. Recently, I volunteered with an NGO in Delhi where I helped in raising funds for the education and healthcare of children through offline marketing. This experience has taught me skills like interpersonal communication, leadership abilities, and helped me become a team player.

In Cool Cloth, I worked on designing and developing clothing and marketing it through social media, eFlyers, and other modes. Both these experiences helped me develop my interest in marketing. Apart from this, I happen to blog for Better World which focuses on issues faced by youth.

Also, I happened to notice that Nxtby has a great work culture and I would love to be a part of your team. I have an active extra curricular record as I am a member of my college's Art Society, Women Development Cell and NSS.

Thank you so much for your time. Look forward to your reply.

Thanks, XYZ"

- స‌ర్వేష్ అగ‌ర్వాల్‌, సీఈఒ, ఇంట‌ర్న్‌శాలPosted on 14-01-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning