అకడమిక్స్‌.. అనుభవం.. స్కోరు!

జాతీయస్థాయిలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్‌ ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. ఈ స్కోరును అన్ని ఐఐఎంలు ఆధారంగా తీసుకుంటున్నప్పటికీ అవి అనుసరించే ప్రవేశ ప్రక్రియలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థలు నిర్దేశించుకున్న వెయిటేజీలు, ఇతర ప్రాతిపదికల వివరాలపై ర్యాంకర్లకు అవగాహన ఉండాలి. ఈ విధానాల్లో ఏటా కొద్దిపాటి మార్పులు జరుగుతుంటాయి.

దేశంలోని 20 ఐఐఎంలలో ఆరు సంస్థలను ‘పాతవి’గా (ఐఐఎం- అహ్మదాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా, లఖ్‌నవూ, ఇండోర్‌, కోజికోడ్‌) పరిగణిస్తారు. ఐఐఎం-షిల్లాంగ్‌ 2008లో స్థాపితమైంది. దీంతోపాటు కాశీపూర్‌, రాయ్‌పూర్‌, రాంచీ, రోహ్‌తక్‌, తిరుచ్చి, ఉదయ్‌పూర్‌లను కొత్తవిగా లెక్కిస్తారు. 2015-16లో మరో 7 ఐఐఎం (అమృత్‌సర్‌, బోధ్‌గయా, జమ్మూ, నాగ్‌పూర్‌, సంబల్‌పూర్‌, సిర్‌మవర్‌, విశాఖపట్నం)లను స్థాపించారు. 2018-20 విద్యాసంవత్సరం ప్రవేశాలనుబట్టి.. ఇంటర్వ్యూ షార్ట్‌లిస్టు, తుది ఎంపికల్లో క్యాట్‌ వెయిటేజీ ఎలా ఉందో పరిశీలిద్దాం.
9 ఐఐఎంలు (షిల్లాంగ్‌, కాశీపూర్‌, రోహ్‌తక్‌, రాంచీ, రాయ్‌పూర్‌, ఉదయ్‌పూర్‌, బోధ్‌గయా, అమృత్‌సర్‌, సంబల్‌పూర్‌) ఇంటర్వ్యూ షార్ట్‌లిస్టులో 100% వెయిటేజిని క్యాట్‌ స్కోరుకు ఇస్తాయి.
2 ఐఐఎంలు(కోల్‌కతా, లఖ్‌నవూ)క్యాట్‌ స్కోరుకు 50% నుంచి 55% వెయిటేజిని ఇస్తాయి.
అయితే ఐఐఎం- బెంగళూరు, ఇండోర్‌, నాగ్‌పూర్‌, విశాఖపట్నం మాత్రం క్యాట్‌ స్కోరు కంటే అకడమిక్స్‌కూ, పని అనుభవానికీ ఎక్కువ వెయిటేజిని ఇస్తాయి. ఇదంతా పరిశీలిస్తే తెలిసేది ఏమిటంటే- 17 ఐఐఎంలలో 11 క్యాట్‌కు 70+ శాతం వెయిటేజి ఇస్తుండగా వాటిలో 9 ఐఐఎంలు క్యాట్‌ స్కోరును మాత్రమే సంపూర్ణంగా పరిగణనలోకి తీసుకుని, ఇంటర్వ్యూ ప్రక్రియకు షార్ట్‌లిస్ట్‌ చేస్తున్నాయి. అంటే- వాస్తవానికి ఎన్నో ఐఐఎంలలో క్యాట్‌ ప్రాధాన్యం పెరిగిందని కచ్చితంగా చెప్పవచ్చు.
కానీ, క్యాట్‌లో మంచి స్కోరు వచ్చి కూడా ఐఐఎంల నుంచి పిలుపురాని విద్యార్థుల అనుభవాలు కొన్ని అలాంటి అపోహలకు దారితీశాయి. ఓవరాల్‌ పర్సంటైల్‌ అత్యధికంగా వచ్చినా, సెక్షనల్‌ కటాఫ్‌లో విఫలం కాకూడదని లేదు. క్యాట్‌ స్కోరు- ఓవరాల్‌, సెక్షనల్‌, అకడమిక్‌ ప్రతిభ, వర్క్‌ అనుభవం, రిజర్వేషన్‌ కేటగిరీ.. ఇవన్నీ కలిసి సీటును ఖరారు చేస్తాయి. పైగా వివిధ ఐఐఎంలకు వివిధ సెలక్షన్‌ ప్రాతిపదికలుంటాయి. సారాంశం చెప్పాలంటే- నిర్దిష్టమైన కొన్ని ఐఐఎంలలో చేరాలంటే మంచి అకడమిక్స్‌/ వర్క్‌ అనుభవం లేకుండా సాధ్యం కాదు. కానీ చాలా ఐఐఎంలలో సీటు రావాలంటే గొప్ప అకడమిక్స్‌/ వర్క్‌ అనుభవం లేకపోయినా క్యాట్‌ స్కోరు అధికంగా ఉంటే సరిపోతుంది (జనరల్‌ కేటగిరీ 95-96 పర్సంటైల్‌; నాన్‌ ఇంజినీరింగ్‌ దీనికంటే తక్కువ).
కనీస అకడమిక్‌ అర్హత
ఐఐఎంలలో ప్రవేశానికి సంబంధించి మరో అదనపు ప్రాతిపదిక- ‘మినిమం అకడమిక్‌ ఎలిజిబిలిటీ’. చాలా ఐఐఎంలు అభ్యర్థికి గ్రాడ్యుయేషన్లో కనీసం 50% మార్కులు ఆశిస్తున్నాయి. కొన్ని అయితే ఇంకా ఎక్కువశాతం ఉండాలని నిర్దేశిస్తున్నాయి. కొన్ని ఐఐఎంలు అభ్యర్థి టెన్త్‌, ఇంటర్మీడియట్‌ మార్కులను కూడా గమనించి ప్రవేశార్హతను నిర్ణయిస్తున్నాయి. ఉదాహరణకు- ఐఐఎం- షిల్లాంగ్‌ టెన్త్‌, ఇంటర్‌ల్లో 80%, ఐఐఎం- కోజికోడ్‌ 60% మార్కులు జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు ఉండాలని నిర్దేశించుకున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మాత్రం మార్కులు తెచ్చుకోవడం సాధారణమైపోయింది కదా!
ఇప్పుడేం చేయాలి?
‘క్యాట్‌’ తరువాతి దశలు- గ్రూప్‌ డిస్కషన్‌/ రిటన్‌ ఎబిలిటీ టెస్ట్‌, పర్సనాలిటీ టెస్ట్‌.. వీటన్నింటిలో ప్రతిభ చూపితేనే ఆశించిన విద్యాసంస్థలో ప్రవేశం దక్కేది. బీ స్కూళ్ల నుంచి సమాచారం అందుకున్న క్యాట్‌ అభ్యర్థులు తరువాతి దశలకు సంసిద్ధం కావాలి. అకడమిక్స్‌, వర్క్‌ అనుభవం కంటే ఈ దశల్లో చూపే ప్రతిభకే వెయిటేజీ అధికమని గ్రహించాలి. ఇంటర్వ్యూలో జనరల్‌ అవేర్‌నెస్‌, వర్క్‌ అనుభవం (ఉంటే)పై గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులపై ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఇంకా తన బలాలూ, బలహీనతలూ, కెరియర్‌ లక్ష్యం, విజయాలు, హాబీలపై స్వీయ విశ్లేషణ చేసుకోవటం ముఖ్యం.
అకడమిక్స్‌+వర్క్‌ అనుభవం వెయిటేజీ

విద్యార్థి ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్‌ అయితే అతడి తుది ఎంపికను ప్రభావితం చేసేవి- క్యాట్‌ స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌/ ఎస్సే/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ప్రదర్శన. ఇవన్నీ సన్నద్ధతతో మెరుగుపరచుకోగలిగినవే.

- రామ్‌నాథ్ క‌న‌క‌దండి, కోర్స్ డైరెక్ట‌ర్ T.I.M.E.‌Posted on 17-01-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning