ఇంజినీర్‌ కొలువుకు ఇలా సిద్ధమవుదాం!

తెలంగాణ ట్రాన్స్‌కోలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌, సబ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. సామాజికంగా మంచి హోదాను అందించే ఈ ఉద్యోగానికి పోటీ ఎక్కువగానే ఉంటుంది. సంబంధిత సబ్జెక్టుల్లో పట్టు సాధించడంతోపాటు ఎంపికలో కీలకంగా మారుతున్న జనరల్‌ స్టడీస్‌ను సరైన ప్రణాళికతో సమగ్రంగా చదవాలి.

రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ శాఖలోని ఏఈ పోస్టులు పొందినవారికి ఆ సంస్థ సకల వసతులూ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా 330 పోస్టులున్న ఈ పరీక్షకు పోటీ పడుతున్నారంటే దీని ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. పే స్కేలు రూ.41,155 నుంచి రూ.63,600 వరకూ ఉంటుంది.
సిలబస్‌, ప్రశ్నల సరళి
సిలబస్‌లో భారీ మార్పులు జరిగాయి. ప్రస్తుతం ట్రాన్స్‌కో సిలబస్‌ను పరిశీలిస్తే పూర్తిగా గేట్‌ తరహాలోనే ఉంది. కాబట్టి ఈ మార్పులకు అనుగుణంగా అభ్యర్థులు కొత్తగా చేర్చిన విషయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఈ పరీక్ష పత్రంలో 100 ప్రశ్నలుంటాయి. 120 నిమిషాల వ్యవధి, అంటే సగటుగా ఒక ప్రశ్నకు ఒక నిమిషంపైనే ఉంటుంది. కాబట్టి అన్ని ప్రశ్నలకూ జవాబును రాబట్టడం సులువే. కాల్‌క్యులేటర్‌ అనుమతి లేనందువల్ల కఠినమైన న్యూమరికల్‌ ప్రశ్నలు ఉండకపోవచ్చు.గత ట్రాన్స్‌కో పేపర్లతోపాటు పూర్వ గేట్‌ పేపర్లు, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఆబ్జెక్టివ్స్‌కి సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలను కూడా చదివితే ఈ పరీక్ష సులభమవుతుంది. సిలబస్‌లో తొలగించిన, అదనంగా చేర్చిన వాటిని గుర్తించి ప్రిపేర్‌ కావాలి. కొత్తవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
జనరల్‌ స్టడీస్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ: అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌, తెలంగాణ కల్చర్‌ అండ్‌ మూమెంట్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రతి అంశం నుంచి నాలుగు ప్రశ్నలు అడిగారు.ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలు ఉంటాయి. నిత్యం వార్తాపత్రికలను చదువుతూ నోట్‌బుక్‌ను సొంతంగా తయారుచేసుకోవాలి.హైదరాబాద్‌ మెట్రో, టి-హబ్‌, గ్లోబల్‌ ఆంత్రపెన్యూర్‌షిప్‌ విశేషాలకు సంబంధించి ప్రశ్నలను ఆశించవచ్చు. వర్తమానాంశాల్లో తెలంగాణ ప్రాంతీయాంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. ప్రధానమైన అంతర్జాతీయ సంఘటనలపై మాత్రమే దృష్టి పెట్టాలి.
తెలంగాణ సంస్కృతి: ఈ అంశం నుంచి సుమారు 10 ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణలో ప్రాచీన కట్టడాలు వాస్తుశైలి, ముఖ్యమైన జాతరలు, పండుగలు, కొండ జాతుల సంప్రదాయాలు, కళలు వంటి అంశాలపై అభ్యర్థి దృష్టిపెట్టాలి. కాకతీయుల కాలంలో సమాజం, కళలు, వాస్తుశైలి, వేములవాడ చాళుక్యులు, నిజాంలు, కుతుబ్‌షాహీల కళలు, సాహిత్యం, వాస్తుశైలి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమం: ఈ అంశం నుంచి సుమారుగా 8-10 ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా అభ్యర్థి 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం, అనంతరం 1969లో తెలంగాణ ఉద్యమం తొలిదశ ప్రారంభం నుంచి ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకం, జీవో 610, టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం అనంతరం కేసీఆర్‌ పాత్ర జేఏసీ పాత్ర తదితరాలపై దృష్టిపెట్టాలి.
భారతదేశ చరిత్ర: ఐరోపావారు భారతదేశానికి వచ్చి స్థిరపడిన కాలం నుంచి 1947 వరకు జరిగిన ప్రధానమైన సంఘటనలపై దృష్టిపెట్టాలి.
కంప్యూటర్‌ నాలెడ్జ్‌: దీనిలో అభ్యర్థి ప్రాథమిక కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక 100% రాతపరీక్షపైనే ఆధారపడి ఉంటుంది. రాతపరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలూ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి.
సెక్షన్‌-ఎ: 80 ప్రశ్నలు (కోర్‌ సబ్జెక్టు)
సెక్షన్‌-బి: 20 ప్రశ్నలు (జనరల్‌ అవేర్‌నెస్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ).
రాతపరీక్షలో అర్హత సాధించినవారినే కమ్యూనిటీ ప్రకారం ధ్రువపత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలో పిలుస్తారు.ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. http://tstransco.cgg.gov.in
174 సబ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు
ఎలక్ట్రికల్‌ విభాగంలో రెగ్యులర్‌ పద్ధతిలో సబ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌ ట్రాన్స్‌కో) నోటిఫికేషన్‌ విడుదలయింది. సబ్‌ ఇంజినీర్‌/ ఎలక్ట్రికల్‌ విభాగంలో 174 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సబ్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి రూ.20,535 నుంచి రూ.41,155 వరకు వేతనం ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 80 మార్కులు రాతపరీక్షకూ, 20 మార్కులు ఇన్‌ సర్వీస్‌ అవుట్‌సోర్స్‌డ్‌ వర్కర్స్‌గా నియమించి కొన్ని షరతులతో ఇస్తారు. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించరు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. కాబట్టి అన్ని ప్రశ్నలకూ సమాధానాలు గుర్తించవచ్చు.
సెక్షన్‌-ఎ: 65 ప్రశ్నలు (కోర్‌ డిప్లొమా సబ్జెక్టు) సెక్షన్‌-బి: 15 ప్రశ్నలు (జనరల్‌ అవేర్‌నెస్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ).
పరీక్షపత్రంలో 80 ప్రశ్నలుంటాయి. వ్యవధి- 120 నిమిషాలు. అంటే సగటున ఒక ప్రశ్నకు ఒకటిన్నర నిమిషం ఉంటుంది. కాబట్టి సమయం సరిపోతుంది. ఈ 80 ప్రశ్నలను రెండు సెక్షన్లుగా విభజించారు.
సెక్షన్‌-ఎ: దీనిలో కింది సబ్జెక్టులుంటాయి.
1. ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌: ట్రాన్స్‌ఫార్మర్స్‌, డీసీ జనరేటర్స్‌ అండ్‌ మోటార్స్‌, త్రీ ఫేస్‌ ఇండక్షన్‌ మోటార్స్‌, సింగిల్‌ ఫేస్‌ ఇండక్షన్‌ మోటార్స్‌ అండ్‌ కమ్యూటేటర్‌ మోటార్స్‌.
2. స్విచ్‌గేర్‌ అండ్‌ ప్రొటక్షన్‌: ఫాల్ట్‌ అండ్‌ స్విచింగ్‌ అపార్టస్‌, ప్రొటెక్టివ్‌ రిలేయింగ్‌
3. ట్రాన్స్‌మిషన్‌: లైన్‌ కండక్టర్స్‌, లైన్‌ సపోర్ట్స్‌ అండ్‌ సాగ్‌ కాలిక్యులేషన్స్‌, ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ పెరామీటర్స్‌, ఫర్మామెన్స్‌ ఆఫ్‌ లైన్స్‌, ఇన్స్‌లేటర్స్‌ అండ్‌ సబ్‌స్టేషన్స్‌, కేబుల్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌
4. మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ సర్క్యూట్స్‌
5. యుటిలైజేషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఎనర్జీ: ఎలక్ట్రిక్‌ డ్రైవ్స్‌, ఇల్యుమినేషన్‌, ఎలక్ట్రిక్‌ హీటింగ్‌ అండ్‌ వెల్డింగ్‌
సెక్షన్‌-బి: జనరల్‌ అవేర్‌నెస్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ. ఏఈ పోస్టుల మాదిరిగానే దీనిలో సబ్జెక్టులుంటాయి.
ప్రామాణిక పుస్తకాలు
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: జె.బి. గుప్తా (కోర్‌ సబ్జెక్టు), ఆర్‌.కె. రాజ్‌పుత్‌ (కోర్‌ సబ్జెక్టు), సి.ఎల్‌. వాద్వా పుస్తకం చివర్లో ఉన్న బిట్లు (పవర్‌ సిస్టమ్స్‌).
సివిల్‌ ఇంజినీరింగ్‌: ఆర్‌. అఘోర్‌ (కోర్‌ సబ్జెక్టు), డా. పి. జయ రామిరెడ్డి (కోర్‌ సబ్జెక్టు), ఆర్‌.ఎస్‌. ఖుర్మి అండ్‌ జె.కె. గుప్త (కోర్‌ సబ్జెక్టు), ఎస్‌.పి. గుప్త అండ్‌ ఎస్‌.ఎస్‌. గుప్త (కోర్‌ సబ్జెక్టు).
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌: మారిస్‌మానో (కోర్‌ సబ్జెక్టు), సేద్ధ్ర అండ్‌ స్మిత్‌ (కోర్‌ సబ్జెక్టు), ఎం. గోపాల్‌ అండ్‌ నగ్రత్‌ (కోర్‌ సబ్జెక్టు), ఓపెన్‌ హ్యామ్‌ (కోర్‌ సబ్జెక్టు).
న్యూమరికల్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ: ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌ (అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌).

- వై.వి.గోపాల‌కృష్ణ మూర్తి, ACE ఇంజినీరింగ్ అకాడ‌మీ‌Posted on 23-01-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning