అంకురాధిపతి అవతారం!

* విద్యార్థి నుంచి పారిశ్రామికవేత్తగా
* కొత్త పరిశోధనలు, పరిష్కారాలే పెట్టుబడి

ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో దాదాపు అన్నీ క్యాంపస్‌ల నుంచే ప్రస్థానాన్ని ప్రారంభించాయి. చదువుకుంటున్నప్పుడే ఉదయించే ఆలోచనలు అంకురాలు (స్టార్టప్‌లు)గా మారి మహావృక్షాలుగా విస్తరిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి ఎన్నో దిగ్గజ సంస్థలు ఇలాంటివే. కాలేజీల్లో చేసే ప్రాజెక్టుల నుంచి ప్రతి నిర్మాణాత్మక ఆలోచనను పెద్ద పెద్ద కంపెనీల ఏర్పాటుకు పునాదులుగా చేసుకోవచ్చు. అందుకే కళాశాలల నుంచే కార్పొరేట్‌ కంపెనీల ఏర్పాటు దిశగా విద్యార్థులు తమ ఆలోచనా పరిధిని పెంచుకోవాలి. ఆంత్రప్రన్యూర్‌లుగా అవతరించేందుకు తగిన మార్గాలను అన్వేషించాలి.

వృత్తి విద్యను అభ్యసించే విద్యార్థులు తమ చదువులు పూర్తయ్యేసరికి ఒక ఉద్యోగం సంపాదించుకోవాలని చూస్తారు. మరికొందరు ఉన్నత చదువులైన మాస్టర్స్‌, పీహెచ్‌డీ, పీడీఎఫ్‌ చేయడానికి సిద్ధమవుతుంటారు. ఈ మార్గాల్లో ప్రయాణించడానికి అవసరమైన సన్నద్ధతను కళాశాల క్యాంపస్‌ నుంచే ప్రారంభిస్తారు. ఇవేకాకుండా మరో మార్గం గురించి కూడా అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. అదే ‘ఆంత్రప్రన్యూర్‌షిప్‌’ లేదా స్వయం ఉపాధి. ఒక విద్యార్థి తన నాయకత్వ, వ్యాపార లక్షణాలను అంచనా వేసుకొని వాటిని సరైన మార్గంలో వినియోగించగలిగితే ‘ఆంత్రప్రన్యూర్‌షిప్‌’ అనేది ఒక మంచి జీవితానికి బాటలు వేస్తుంది. ఉద్యోగాల కోసం ప్రభుత్వం లేదా ఇతర కంపెనీలపై ఆధారపడకుండా తామే ఒక కంపెనీని ఏర్పాటు చేస్తే మరెంతో మందికి ఉపాధి కల్పించవచ్చు. ప్రపంచంలో నేడు దిగ్గజాలుగా వెలుగొందుతున్న కంపెనీల ప్రస్థానం కళాశాలల్లోనే మొదలైంది.
మన దేశంలోనూ..!
మన దేశంలో కూడా గత దశాబ్ద కాలంగా ఐఐటీ, ఎన్‌ఐటీలు ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులను స్వయం ఉపాధి వైపు నడిపిస్తున్నాయి. ఆంత్రప్రన్యూర్‌షిప్‌పై సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ మూడో, నాలుగో సంవత్సరం విద్యార్థులు లేదా మాస్టర్స్‌, పీహెచ్‌డీ అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న రంగంలో తమ మిత్రులతో, అధ్యాపకులతో బృందంగా ఏర్పడి అంకుర సంస్థలకు ప్రాణం పోయాలి.
ఆలోచనను రక్షించుకోవడం హక్కు
ఒక ఆలోచన స్టార్టప్‌గా మారగానే దాన్ని రక్షించుకోవడం అత్యంత ప్రధానం. ఒక ఐడియాను రక్షించుకోడానికి మేధోసంపత్తి హక్కులు వివిధ మార్గాలను సూచిస్తున్నాయి.
* పేటెంట్‌
* ట్రేడ్‌మార్క్‌
* డిజైన్‌
* కాపీరైట్‌
విద్యార్థి దశలోనే మేధో సంపత్తి హక్కులపై అవగాహన కలిగి ఉంటే తమ పరిశోధన, ప్రాజెక్టులను వ్యాపార మార్గంలోకి మళ్లించవచ్చు. కొన్ని సందర్భాల్లో పెద్ద కంపెనీలు సైతం ఆసక్తికరమైన చిన్న ఆలోచనలను, వాటికి సంబంధించిన పేటెంట్‌ హక్కులను కొనుక్కుంటాయి. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఎన్నో ప్రాజెక్టులను డిజైన్ల రూపంలో భద్రపరచుకోవచ్చు. ఇలా రక్షించుకున్న ఆలోచనలను ఇంక్యుబేషన్‌ సెంటర్‌ల ద్వారా వ్యాపారాలుగా మలుచుకోవచ్చు. కొన్ని బహుళజాతి సంస్థలు ఓపెన్‌ ఇన్నోవేషన్‌ విధానంలో విద్యార్థుల నుంచి కొత్త ఆలోచనలను ఆహ్వానిస్తున్నాయి.
* Air bus - Fly your ideas
* Innocentre.com
* Boeing - HorizonX
* TATA - TATA Innoverse
* Yetz.com
* Altair - Altair optimization contest
* Texas Instrument - Texas Instrument Innovation Challenge
ఈ ఓపెన్‌ ఇన్నోవేషన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆయా కంపెనీల సమస్యల పరిష్కారంపై అవగాహన కలుగుతుంది. వీటిలో పాల్గొనడం వల్ల ఇన్నోవేషన్‌, ఆంత్రప్రన్యూర్‌షిప్‌లకు బీజం పడుతుంది. అందుకే సైన్స్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రన్యూర్‌షిప్‌ల వైపు అడుగులు వేయాలి. దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం ద్వారా ఉపాధికి, సంపద అభివృద్ధికి సాయపడవచ్చు. విద్యార్థి స్థాయి నుంచే పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు మార్గాలను ఏర్పరచుకోవచ్చు.
కళాశాలలు చేయాల్సినవి
* ఆవిష్కరణ పోటీలు నిర్వహించడం నీ కళాశాల యాజమాన్యం కావాల్సిన ఆదాయ వనరులు సమకూర్చడం
* విజయవంతమైన లేదా విఫలమైన వ్యాపారవేత్తల ఉపన్యాసాలు నీ కళాశాలలో అంకుర సంస్థల అభివృద్ధి విభాగాల ఏర్పాటు నీ విద్యార్థులకు వ్యాపార నిర్వహణ మీద నమూనా కంపెనీ (Mock company) పోటీలు నిర్వహించడం
* దేశీయ, అంతర్జాతీయ సంస్థల Accelerators మీద అవగాహన కలిగి ఉండటం
* తమ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థుల్లో వ్యాపారవేత్తల సమాచారం అందివ్వడం
* బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థుల ఆలోచనలను మార్కెట్‌కి చేరవేయడం.
* ఆర్థిక నిర్వహణ మీద తగిన కోర్సులు ఏర్పాటు చేయడం.
ఇన్నోవేషన్‌ ఆంత్రప్రన్యూర్‌గా రాణించడానికి విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన లక్షణాలు
*‌ సమస్యలను గుర్తించడం (Problem identification) ‌
* సమస్యలను నిర్వచించడం (Problem definition) ‌
* సమస్యల పరిష్కారం (Problem solving)
* వ్యాపార దృక్పథం (Business acumen)
* నాయకత్వ లక్షణాలు (Leadership qualities) ‌
* నమ్మకంగా ఉండటం. నమ్మకమైన స్నేహబృందాన్ని ఏర్పరచుకోవడం (Trusted Network) ‌
* స్నేహం లేదా కలుపుగోలుగా ఉండే మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం ‌
* ఆర్థిక అవగాహన కలిగి ఉండటం ‌
* విష్యత్తు దృష్టి నైపుణ్యం (Visionary skill)
* విజయాలు సాధించిన పూర్వ విద్యార్థులతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం ‌
* వ్యక్తీకరణ నైపుణ్యం (Presentation skill) ‌
* అమ్మకాల నైపుణ్యం (Sales skill)
* ప్రపంచ పోకడలపై అధ్యయనం (Industry trend analysis)
* మార్గదర్శకులను ఎంచుకోవడం (Mentor selection)‌
*‌ బృంద నిర్మాణం (Team building) ‌
* పెట్టుబడులు రాబట్టడం (Funding attraction)
విజయవంతమైన ప్రతి కంపెనీ వెనుక ఏళ్ల తరబడి కృషి, పట్టుదల, మిత్రుల సహకారం ఉంటుంది. కళాశాల స్థాయి నుంచి మంచి బృందాన్ని నిర్మించుకోవడం నేర్చుకోవాలి.

క్యాంపస్‌ నుంచే ప్రఖ్యాత సంస్థల ప్రస్థానం

*‌ మైఖేల్‌ డెల్‌ వెయ్యి డాలర్లతో కళాశాలలో ప్రారంభించిన డెల్‌ కంప్యూటర్స్‌ నేడు ప్రపంచ వ్యాప్తంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను అందిస్తోంది. ఈ కంపెనీకి బీజం పడింది యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లోనే.
*‌ నేడు మనమంతా మొబైల్స్‌లో విరివిగా వాడుతున్న డ్రాప్‌బాక్స్‌ అనేది ఆరాష్‌ అండ్‌ డ్రూ అనే ఇద్దరు విద్యార్థులు మసాచ్యుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుతున్నప్పుడు రూపొందించిందే.
*‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌, డస్టిన్‌ మోస్కోవిజ్‌ తదితర మిత్రులు ప్రారంభించిన ఫేస్‌బుక్‌ నేడు ప్రపంచంలోని మిత్రులందరినీ ఏకం చేసే వేదికగా మారింది. జుకర్‌ బర్గ్‌ చిన్న ఆలోచనతో ఈ అంకురం హార్వర్డ్‌ యూనివర్సిటీలో పుట్టి గ్లోబ్‌ను ఆక్రమించింది.
*‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ల్యారీపేజ్‌, సెర్జీబ్రిన్‌ అత్యున్నత సెర్చ్‌ఇంజిన్‌ కోసం డిజిటల్‌ లైబ్రరీ పేరుతో చేపట్టిన ప్రాజెక్ట్‌ గూగుల్‌ పేరుతో నేడు విశ్వ సమాచార శోధన యంత్రంగా మారింది.
*‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందిన బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ మహావృక్షం ప్రాణం పోసుకుంది హార్వర్డ్‌ యూనివర్సిటీలోనే.
*‌ పికాబు పేరుతో ప్రారంభమైన ఫొటో షేరింగ్‌ చాట్‌ నేడు స్నాప్‌ చాట్‌ పేరుతో రోజుకి 700 మిలియన్ల ఫొటోలను, వీడియోలను పంపించే ప్లాట్‌ఫాంగా మారింది. ఇవాన్‌ స్పీగల్‌ ప్రారంభించిన ఈ చాట్‌ అప్లికేషన్‌ ఫేస్‌బుక్‌, గూగుల్‌లాంటి కంపెనీల దృష్టిని ఆకర్షించి భారీ మార్కెట్‌ విలువను సంపాదించుకుంది. ఈ ప్రస్థానం స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో మొదలైంది.
*‌ బ్లాగింగ్‌కి అవసరమయ్యే వర్డ్‌ప్రెస్‌ ప్లాట్‌ఫామ్‌ కూడా యూనివర్సిటీ ఆఫ్‌ హూస్టన్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రతి నెలా పదిహేను బిలియన్ల పేజీలను దీని ద్వారా వీక్షిస్తున్నారు.
*‌ జెర్రీయాంగ్‌, డేవిడ్‌ ఫిలో అనే ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ప్రారంభించిన వెబ్‌సైట్‌ యాహూగా మారి ప్రసిద్ధికెక్కింది.


- ర‌వి క‌టుకం, ఇన్నోవేష‌న్ ఇవాంజిలిస్ట్‌‌Posted on 25-01-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning