ఆచరణ.. అన్వయాలకు ఆసక్తికర మార్గం!

నాణ్యమైన విద్య దేశ ప్రగతికి ప్రధాన మార్గం. ఈ దృష్టితోనే ఇటీవల ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) ఇంజినీరింగ్‌ విద్యలో పలు మార్పులను ప్రకటించింది. పరిశ్రమకు, సమాజానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో విద్యార్థులకు తెలియజేసే క్రమంలో కనీసం మూడు ఇంటర్న్‌షిప్‌లు తప్పనిసరిగా చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇంటర్న్‌షిప్‌ ఎప్పుడు చేయాలి, ఎలా ఎంచుకోవాలి తదితర అంశాల గురించి తెలుసుకుందాం.

ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరిన విద్యార్థులకు మొదటి సంవత్సరంలో పరిమిత సాంకేతిక నైపుణ్యాలే ఉంటాయి. ఇతరులతో భావాలు సరిగా తెలపటానికి సాయపడే సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్చుకోవడానికి ఇది అత్యుత్తమ సమయం. కెరియర్‌లో విజయానికి ఇవి చాలా ముఖ్యమని అందరికీ తెలిసిందే. కాబట్టి సాఫ్ట్‌స్కిల్స్‌కు ఉపకరించే ఇంటర్న్‌షిప్‌ను ఎలాంటి తటపటాయింపూ లేకుండా ఎంచుకోవాలి.
మేనేజ్‌మెంట్‌, కంటెంట్‌ రైటింగ్‌, సేల్స్‌... ఇలాంటి రంగాల్లో ఇంటర్న్‌షిప్‌ చేస్తే భావప్రసార (కమ్యూనికేషన్‌) నైపుణ్యాలు పెరుగుతాయి.
ఇవి పాటిస్తే చాలు!
ఇంటర్న్‌షిప్‌లో చేరి ఇంటర్న్‌గా ఉన్నపుడు కొన్ని బాధ్యతలు నెరవేర్చాల్సివుంటుంది. అప్పుడే ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు.
1 కచ్చితమైన సమయపాలన: చాలా సంస్థలు సిబ్బంది సమయపాలన చేస్తారో లేదో పట్టించుకుంటాయి. అందుకే కచ్చితంగా నిర్ణీత సమయానికే కార్యాలయానికి గానీ, నిర్దేశించిన కార్యక్రమానికి గానీ హాజరవ్వటం ఎంతో ముఖ్యం.
2 చొరవ, భాగస్వామ్యం: ఇంటర్న్‌షిప్‌ అనేది విద్యార్థులు సంబంధిత నైపుణ్యాలు నేర్చుకోవటానికి వచ్చిన అవకాశం. ఇంటర్న్‌షిప్‌లో ఎంత నేర్చుకుంటున్నారన్నది విద్యార్థులపైనే ఆధారపడివుంటుంది. శిక్షణ సందర్భంగా వారు తమ భావాలూ, దృక్పథాలూ పంచుకోవటానికి సంకోచపడకూడదు.
3 గడువులోపే పని పూర్తి: కళాశాల ప్రాజెక్టు అయితే గడువు తేదీలోగా ముగించకపోయినా పెద్ద సమస్య కాదు. అక్కడ అశ్రద్ధ జరిగినా చెల్లుతుంది. ఇక్కడ అది ఏమాత్రం సరి కాదు. ఒక నిర్ణీత సమయంలో పూర్తవ్వాల్సిన దానిలో జాప్యం జరిగితే అది కంపెనీకి భారీ నష్టం కలుగజేస్తుంది. విద్యార్థి కెరియర్‌కూ ఇది నష్టదాయకమే. అందుకే ఇంటర్న్‌షిప్‌ చేసేటపుడు గడువు తేదీలను సరిగా పాటించాల్సిందే.
4 పరిచయాలతో నెట్‌వర్క్‌: విద్యార్థులు తమ బృందానికే పరిమితం కాకుండా ఇతర సిబ్బంది గురించి కూడా తెలుసుకోవాలి. పరిచయం పెంచుకుని, మాట్లాడుతూ ఉండాలి. ఇలా తాము పనిచేసే పరిశ్రమలో ఒక నెట్‌వర్క్‌ను తయారుచేసుకుని వారితో ఆలోచనలు పంచుకుని, వారి నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నిస్తుండాలి.
5 ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకోవటం: కొత్త అంశాలూ, నైపుణ్యాలూ నేర్చుకోవాలన్నా, వాటిని నిరంతరం మెరుగుపరుచుకోవాలన్నా ఇతరుల సలహాలూ గ్రహించటం అవసరం. సీనియర్లనూ, అధికారులనూ అడిగి మీ వ్యవహార శైలి, పనితీరుపై వారి అభిప్రాయాలూ, సూచనలూ తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటే తిరుగుండదు!
అదే సమయంలో బృందంలో పనిచేయటం అలవడుతుంది. కార్పొరేట్‌ ప్రపంచం ఎలా ఉంటుందో అవగాహన ఏర్పడుతుంది. ఇక ఎన్‌జీవో ఇంటర్న్‌షిప్‌ అయితే మనమేమిటో, మన శక్తియుక్తులు ఎలాంటివో తెలిసేలా చేస్తుంది.
ఆచరణలో అనుభవం
ఇంజినీరింగ్‌ రెండో, మూడో సంవత్సరాల్లో విద్యార్థులకు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలూ, ఈ రంగంపై పెరిగిన అవగాహనతో ఆసక్తి ఉన్న అంశంపై ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ఉదాహరణకు ప్రోగ్రామింగ్‌పై ఆసక్తి ఉంటే ఏదైనా స్టార్టప్‌ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేసి సీ, సీ++, జావా, పీహెచ్‌పీ లేదా వెబ్‌ డిజైనింగ్‌లో లైవ్‌ ప్రాజెక్టులు చేయాలి. రెండో ఇంటర్న్‌షిప్‌ చివరికొచ్చేసరికి ఆ రంగంలో కెరియర్‌ను కొనసాగించగలరా, మరో కొత్త రంగానికి మారాలా అనేదానిపై స్పష్టత వస్తుంది.
ఆ తర్వాత ఆసక్తి ఉన్న రంగంలో ప్రొఫెషనల్స్‌తో నెట్‌వర్క్‌ ఏర్పరచుకుని గతంలో పనిచేసిన బృందాన్ని సంప్రదిస్తూవుంటే వారు మూడో ఇంటర్న్‌షిప్‌కు సాయపడతారు.
తొలి ఉద్యోగ దిశగా...
మొదటి రెండు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా సాధించిన అనుభవం మంచి రెజ్యూమేను నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుంది. వివిధ రకాల ఇంటర్వ్యూ రౌండ్లకూ పనికొస్తుంది. అందుకని మూడో సంవత్సరం తర్వాత విద్యార్థులు తాము పనిచేయటానికి ఆసక్తి చూపే బ్రాండ్లు/సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయటం ఆరంభించాలి. ఒకసారి ఇంటర్న్‌షిప్‌ వచ్చాక తమ పరిజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా అన్వయించటంపైనా, తాజా టెక్నాలజీలపై, టూల్స్‌పై లోతైన అవగాహన సంపాదించటంపైనా దృష్టిపెట్టాలి. ఇలా మూడో ఇంటర్న్‌షిప్‌ విద్యార్థి తన తొలి ఉద్యోగంలో చేరేందుకు సాయపడుతుంది. ఈ రకంగా గ్రాడ్యుయేషన్‌ పూర్తికాకముందే ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ అవకాశం పొందుతారు!
దరఖాస్తుకు ముందు, తర్వాత
ఇప్పుడు విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ను ఎలా ఎంచుకోవాలో చూద్దాం.
* ఆసక్తి దేని మీద?
వందలకొద్దీ ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసేముందు ఈ ప్రశ్నను ఎవరికి వారు వేసుకోవాలి. ప్రొఫైల్‌కు సరిపోయే ఇంటర్న్‌షిప్‌లకే మొగ్గుచూపటం ఎల్లప్పుడూ మంచిది. కొంచెం సమయం తీసుకున్నప్పటికీ చివరకు తమ ఆసక్తి, నైపుణ్యాలకు తగ్గ ఇంటర్న్‌షిప్‌ను ఎంచుకోగలుగుతారు.
*రెజ్యూమేను మెరుగుపరచండి
ఇంటర్న్‌షిప్‌కు కీలకమైన విషయమిది. క్లుప్తమైన విషయంతో, అతి తక్కువ డిజైన్‌తో ప్రొఫెషనల్‌గా రెజ్యూమేను తీర్చిదిద్దాలి. కాంటాక్టు, ఇతర వివరాలను అవసరమైతే మార్చండి. ప్రాజెక్టు లింక్సు జోడించి, నైపుణ్యాలను కూడా ప్రస్తావించాలి.
* కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు మెరుగుపరుచుకోండి
మిగతా అభ్యర్థులను మించిపోవాలంటే విద్యార్థులు తమ ప్రొఫైల్‌తో సంబంధమున్న నైపుణ్యాలను నేర్చుకోవాలి. అదే సమయంలో సాఫ్ట్‌స్కిల్స్‌ను మెరుగుపరచటంపై దృష్టిపెట్టాలి. ఇంకా ఇంగ్లిష్‌ పదజాలం, వ్యాకరణంపై పట్టు పెంచుకుంటే చక్కని దరఖాస్తులూ, కవర్‌ లెటర్లూ, ఈ-మెయిల్స్‌ రాయగలుగుతారు. ఒకసారి ఇంటర్న్‌షిప్‌ పని మొదలైతే రిపోర్టులూ బాగా రాయగలుగుతారు.
* వారం చూసి వాకబు చేయాలి
ఇంటర్న్‌షిప్‌కు ఇంటర్వ్యూ జరిగాక సుమారు ఏడు రోజులు ఎదురుచూడవచ్చు. అప్పటికీ సమాచారమేదీ రాకపోతే ఇంటర్వ్యూ చేసినవారికి ఈ-మెయిల్‌ పంపితే ఎంపిక విషయం తెలుస్తుంది.


- స‌ర్వేష్ అగ‌ర్వాల్, సీఈఓ, ఇంట‌ర్న్‌శాల‌ ‌‌Posted on 31-01-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning