ఊహాశక్తి మీకుంటే ఉద్యోగాలు మీవెంటే!

మన జాతీయజెండా, రూపీ సింబల్‌ మొదలు బాహుబలిలోని మాహిష్మతి నగర నిర్మాణం వరకు వచ్చిన ఆవిష్కరణలన్నీ గొప్ప గొప్ప డిజైనర్ల పనితీరుకు నిదర్శనాలు. వీటన్నింటినీ మీరు ఆసక్తిగా పరిశీలిస్తుంటే.. మీ సృజనాత్మక, తార్కిక ఆలోచనలను బొమ్మల రూపంలో ప్రదర్శించగలుగుతుంటే.. మీలోనూ ఒక డిజైనర్‌ ఉన్నాడనే అర్థం. మీలోని ఆ కళాసృష్టికర్తకు ఒక రూపాన్ని ఇచ్చి, దాన్ని మీ వృత్తిగా మార్చుకోడానికి కొన్ని కోర్సులు ఉన్నాయి. మరెన్నో రంగాలు ఉద్యోగాలతో మీలాంటి వారికి ఆహ్వానం పలుకుతున్నాయి.

మన స్నేహితుల్లో కొందరు మొబైల్‌, కారు లేదా ల్యాప్‌టాప్‌ కొనడానికి వెళ్లినప్పుడు బ్రాండ్‌, డిజైన్‌ల పట్ల చాలా పట్టుదలతో ఉంటారు. ఫలానా కంపెనీ ఫోన్‌ లేదా ఫలానా కంపెనీ ల్యాప్‌టాప్‌కి ‘ఫిదా’ అయ్యా.. అదే కావాలంటారు. ఇలా కొన్ని బ్రాండ్‌లకు, కంపెనీలకు ఫిదా అయ్యేలా చేసేది సాంకేతికంగా ఆయా ఉత్పత్తులను ఉన్నత ప్రమాణాలతో డిజైన్‌ చేయడమే. దాంతోపాటు ఆయా వస్తువులను రంగు, రూపు, పరిమాణంలో ముచ్చటగా తీర్చిదిద్దడమే. ఇలా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్తువులను రూపొందించడానికి ప్రత్యేక నిపుణుల బృందం పని చేస్తుంటుంది. అదే ప్రోడక్ట్‌ డిజైన్‌ టీమ్‌.
ఇంజినీరింగ్‌ పరంగా ఎంతో ఉన్నతమైన హార్డ్‌వేర్‌ని, సాఫ్ట్‌వేర్‌ని వినియోగించినప్పటికీ కస్టమర్‌ కంటికి నచ్చకపోవడంతో ఎన్నో ఉత్పత్తులు విఫలమవుతున్నాయి. ఆటోమొబైల్‌, మొబైల్స్‌, ఏరోస్పేస్‌, ఫర్నిచర్‌ రంగాల్లో దిగ్గజ సంస్థల నుంచి కంపెనీలు రూపొందించే వెబ్‌సైట్స్‌, మొబైల్‌ యాప్స్‌ వరకు అన్నింటినీ ఆకర్షణీయంగా తయారుచేయడానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. గత దశాబ్ద కాలంగా ఇది మరింత పెరిగింది. ఎన్నో కంపెనీలు తమ వస్తువులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా ‘ప్రోడక్ట్‌ డిజైనర్‌’లను నియమించుకుంటున్నాయి.
ప్రోడక్ట్‌ డిజైనర్‌ వృత్తిలోకి ప్రవేశించడానికి ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్‌ అభ్యర్థులు, క్రియేటివ్‌ ఆర్ట్స్‌ రంగంలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోడక్ట్‌ డిజైనింగ్‌కి సంబంధించి బ్యాచ్‌లర్స్‌, మాస్టర్స్‌ స్థాయుల్లో కోర్సులు అందించే వృత్తి విద్యాసంస్థలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి.
పీజీ
మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్స్‌ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ పేరుతో దేశవ్యాప్తంగా క్యాంపస్‌లను ఏర్పాటుచేశారు. ఎన్‌ఐడీలో 10+2 అర్హతతోనూ, బ్యాచ్‌లర్‌ డిగ్రీతోనూ ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ప్రధానంగా సీడ్‌- కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (సీఈఈడీ) ద్వారా మాస్టర్స్‌, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లోకి * ఐఐటీ బాంబే * ఐఐటీ దిల్లీ * ఐఐఎస్సీ బెంగళూరు * ఐఐటీ గువాహటి * ఐఐటీ కాన్పూర్‌ * ఐఐటీ హైదరాబాద్‌ * ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌ * యూపీఈఎస్‌ డెహ్రాడూన్‌ విద్యాసంస్థలు- ఎండీఈఎస్‌ (మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌) కోర్సులోకి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దీనికి నాలుగు సంవత్సరాల డిగ్రీ/డిప్లొమా/ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా 10+2 తర్వాత 3+2 డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అర్హులు. గ్రాఫిక్‌ డిజైన్‌ ఆర్ట్స్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ (10+5) లెవెల్‌ చేసిన వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ కాన్పూర్‌లు గేట్‌ స్కోరు ఆధారంగా కూడా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి.
యూజీ
బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులో ప్రవేశానికి యూసీడ్‌ - అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీఈఈడీ) పరీక్ష నిర్వహిస్తున్నారు. 10+2 లేదా తత్సమాన అర్హత కలిగిన అన్ని విభాగాల అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది. వయసుకి సంబంధించిన పరిమితులు కూడా ఉన్నాయి. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
యూసీడ్‌ స్కోర్‌ ఆధారంగా )* ఐఐటీ బాంబే * ఐఐటీ గువాహటి * ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ఈ రెండు పరీక్షలకు నోటిఫికేషన్లు సాధారణంగా ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో వస్తుంటాయి.
ఇతర ప్రముఖ సంస్థలు
మరికొన్ని సంస్థలు ఎన్నో దేశవ్యాప్తంగా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. వాటిలో కొన్ని..
* వాక్సెన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌, హైదరాబాద్‌ - సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌
* ఇంటర్నేషనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ డిజైన్‌, బెంగళూరు - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, విజయవాడ - గాయత్రీ విద్యాపరిషత్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, విశాఖపట్నం
ఉండాల్సిన లక్షణాలు
ప్రోడక్ట్‌ డిజైనర్‌ కావాలనుకునే విద్యార్థులకు ఈ కింది లక్షణాలు ఉండాలి.
* రూపొందించే వస్తువు సాంకేతికతపై పట్టు ఉండాలి. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్‌ అభ్యర్థులకు లేటెస్ట్‌ టెక్నాలజీపైన; మెకానికల్‌, ఏరోస్పేస్‌ వాళ్లకి కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ప్రోడక్ట్‌లపై అవగాహన ఉండాలి.
* ప్రతి వస్తువును కళాత్మక దృష్టితో చూడటం అలవాటు చేసుకోవాలి. వస్తువు రంగుల కలయిక, దానిలో వినియోగదారుడిని ఆకర్షించే అంశాలను గుర్తించగలగాలి.
* మనిషిని, వస్తువులను అనుసంధానం చేసే ఆలోచనలను కలిగి ఉండాలి. ఈ క్రమంలో వస్తువును ఉపయోగించడం వల్ల వినియోగదారుడిపై ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి.
* సృజనాత్మకతను జోడించి ప్రాజెక్టులు చేయాలి.
* మహిళలకు, పిల్లలకు ఉండే ప్రత్యేక అవసరాలను గుర్తించి వాటిని తీర్చే విధంగా పరిష్కారాలను ఆలోచించగలగాలి.
* కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ రంగాల్లోని విద్యార్థులు యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ (యూఎక్స్‌) లేదా యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)పై ఆసక్తిని కలిగి ఉండాలి.
డిజైన్‌ థింకింగ్‌
రాబోయే రోజుల్లో మనిషి కేంద్రంగా ప్రతి ఉత్పత్తినీ రూపొందించడానికి కంపెనీలు ‘డిజైన్‌ థింకింగ్‌’ అనే విధానాన్ని అవలంబిస్తున్నాయి. ప్రోడక్ట్‌ డిజైనర్‌గా రాణించాలనుకునే విద్యార్థులు డిజైన్‌ థింకింగ్‌ కోర్సులు చేయడం ద్వారా ఉత్తమమైన ప్రోడక్ట్‌ పరికల్పన విధానాలను తెలుసుకోవచ్చు. కళాశాల స్థాయిలో డిజైన్‌ థింకింగ్‌ వర్క్‌షాప్‌ల్లో పాల్గొని తమ సృజనాత్మకతకు పదును పెట్టుకోవచ్చు.
డిజైన్‌ ఆలోచనా విధానాన్ని కళాశాల స్థాయిలో మినీ ప్రాజెక్ట్‌గా చేయాలి. కళాశాలలు కూడా ఈ కోర్సులను ఒక ఎలెక్టివ్‌గా చేయవచ్చు. దీనిపై గెస్ట్‌ లెక్చర్లను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. డిజైన్‌ థింకింగ్‌పై ప్రసిద్ధి చెందిన సంస్థల ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులు చేయడం మంచిది.
కోర్స్‌ఎరా వంటి ప్రముఖ వెబ్‌సైట్లు ఈ కింది విభాగాలపై ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి.
* డిజైన్‌ థింకింగ్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ‌* యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్‌ ‌* యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డిజైన్‌ ‌* గ్రాఫిక్‌ డిజైన్‌ ‌* హ్యూమన్‌ సెంటర్డ్‌ డిజైన్‌ ‌* ఇంజినీరింగ్‌ డిజైన్‌.
కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌
ప్రస్తుతం అన్ని రంగాల్లో కంప్యూటర్స్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది. అందుకే విద్యార్థులు కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైనింగ్‌ టూల్స్‌ని నేర్చుకోవాలి. కొత్త ఆలోచనలను, ఊహలను కంప్యూటర్‌ బేస్‌డ్‌ టూల్స్‌ అయిన కాటియా, ఆటోక్యాడ్‌, ప్రో-ఈ వంటివి కొత్త ఉత్పత్తులను కంప్యూటర్‌ మోడల్స్‌గా మార్చడానికి ఉపయోగపడతాయి. ఇంజినీరింగ్‌ మొదలు ఆర్కిటెక్చర్‌ వరకు విద్యార్థులు కనీసం ఒక డిజైన్‌ టూల్‌పైన అయినా పట్టు కలిగి ఉండాలి. కళాశాలలో క్యాడ్‌ లేదా క్యామ్‌ పరికరాలపై జరిగే వర్క్‌షాప్‌ల్లో పాల్గొనాలి.
ఉద్యోగావకాశాలు
ప్రోడక్ట్‌ డిజైన్‌ లేదా ఇండస్ట్రియల్‌ డిజైన్‌లో డిగ్రీ చేసిన వారికి ఈ కింది విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
ఆటోమొబైల్‌ రంగం: కారు, బైక్‌, బస్సు, ఏర్‌ క్రాఫ్ట్‌ లాంటి ఉత్పత్తులకు బాహ్య, అంతర నిర్మాణాలను ప్రయాణికులకు సౌకర్యంగా, ఆకట్టుకునేలా, పూర్తి రక్షణతో రూపకల్పన చేయడం.
వినియోగదారుల ఉత్పత్తులు: నిత్యజీవితంలో ఉపయోగించే గృహోపకరణాలైన మిక్సీ, ఫ్రిజ్‌, టీవీలకు డిజైన్‌లు చేయడం.
* ఫర్నిచర్‌ కంపెనీల్లోనూ సౌకర్యవంతమైన డిజైన్లు చేయడం.
* ఇళ్లు, ఆఫీసుల్లో ఇంటీరియర్‌ డిజైనింగ్‌.
* ఎలక్ట్రానిక్స్‌ రంగంలో మొబైల్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లను వినియోగదారులకు నచ్చేలా రూపకల్పన చేయడం.
* ఉత్పత్తి సంస్థలు, పరిశ్రమల్లోని డిజైన్‌ విభాగాలు
* కన్సల్టింగ్‌ కంపెనీలు
* సిరామిక్‌ పరిశ్రమల్లోని టేబుల్‌ వేర్‌, శానిటరీ వేర్‌ తదితర డిపార్ట్‌మెంట్‌లు
* లైట్‌ ఫిటింగ్స్‌, డెకొరేటివ్‌ విభాగాల వంటివి ఉండే ఎలక్ట్రికల్‌, ఇతర పరిశ్రమలు.
ప్రధాన రిక్రూటర్లలో జనరల్‌ మోటార్స్‌ డిజైన్‌, హైడిజైన్‌, హోండా, డిజైన్‌ డాకు, ఎల్జీ, ఓజీఎస్‌ యానిమేషన్‌, ఓనియో వంటి సంస్థలు ఉన్నాయి. అర్హతలు, అనుభవాల ఆధారంగా సంవత్సరానికి జీతం రూ.రెండున్నర లక్షల నుంచి రూ.పన్నెండు లక్షల వరకు ఉంటుంది.
ఒక సంస్థ ఉత్పత్తి చేసిన కారు లేదా మొబైల్‌ ఫోన్‌ సాంకేతికంగా ఉన్నతంగా ఉండటంతోపాటు, ఉపయోగించే క్రమంలో మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలి. అప్పుడే ఆ సంస్థను వినియోగదారులు ఎక్కువ కాలం ఆదరిస్తారు. నిత్యజీవితంలో మనం ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఒక అనుభవజ్ఞుడైన ప్రోడక్ట్‌ డిజైనర్‌ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆ రూపకర్త మీరే కావచ్చు. సంవత్సరానికి దాదాపు ఇరవై వేల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోందని ఒక అంచనా.


- ర‌వి క‌టుకం, ఇన్నోవేష‌న్ ఇవాంజిలిస్ట్‌‌ ‌‌Posted on 01-02-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning