మైక్రోసాఫ్ట్‌ సీఈఓ పగ్గాలు సత్య నాదెళ్లకే?

* తెలుగు తేజానికి అరుదైన ఘనత దక్కే అవకాశం

న్యూయార్క్‌ : సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా తెలుగువాడైన సత్య నాదెళ్ల నియమితుడయ్యే అవకాశం ఉంది! ప్రస్తుత సీఈఓ స్టీవ్‌ బామర్‌ స్థానంలో ఆయన కొత్త బాధ్యతలు చేపట్టవచ్చని అమెరికా పత్రికలు విస్తృతస్థాయిలో కథనాలు ప్రచురించాయి. ఒక అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో ఇంతటి అత్యున్నత స్థానానికి ఒక తెలుగువాడు చేరడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న ఆయన పలు క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎంతో వేగంగా విస్తరిస్తున్న వ్యాపార విభాగాలైన ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లలో ఆయన కృషి ఎనలేనిదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌లో ఆయనకున్న విశేష ప్రతిభా పాటవాలే సీఈఓ రేసులో ఇతరులకంటే ఆయన ముందుండే అవకాశాన్ని కల్పించినట్లు వివరించింది. సత్య నాదెళ్ల నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేవారం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన హైదరాబాద్‌ వాస్తవ్యుడు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థి. మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, తర్వాత ఎంఎస్‌ కోసం అమెరికాలోని విస్‌కాసిన్‌ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. తదుపరి చికాగో విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేశారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అంతకుముందు సన్‌ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేశారు.

మైక్రోసాఫ్ట్‌ ప్రస్తుత సీఈఓ స్టీవ్‌ బామర్‌ మార్కెటింగ్‌/విక్రయ విభాగాల నేపథ్యం నుంచి వచ్చారు. అయితే ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉన్న వ్యక్తి సీఈఓ బాధ్యతల్లో ఉండటం కంపెనీకి మేలు చేస్తుందని ఇటీవలి కాలంలో మైక్రోసాఫ్ట్‌లో కీలక స్థానాల్లో ఉన్నవారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సత్య నాదెళ్ల వైపు అందరి దృష్టి పడింది. ప్రస్తుతం సీటెల్‌లో వెంచర్‌ కేపిటలిస్ట్‌గా ఉన్న మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఎఫ్‌ఓ (ముఖ్య ఆర్థికాధికారి) జాన్‌ కానర్స్‌ స్పందిస్తూ.. 'సీఈఓ పదవికి సత్య నాదెళ్ల ఎంపిక ఎంతో అద్భుతమైనదని చెప్పవచ్చు' అన్నారు. ఎంతో ప్రతిభా పాటవాలు, నాయకత్వ ప్రతిభ ఉన్న వ్యక్తి- అని ఆయన పేర్కొన్నారు. ఎన్నో వ్యాపార విభాగాలు ఉన్న మైక్రోసాఫ్ట్‌ను ముందుకు తీసుకువెళ్లటానికి సత్య నాదెళ్ల సమర్ధుడని వివరించారు. వాస్తవానికి స్టీవ్‌ బామర్‌ తర్వాత సీఈఓ ఎవరనే విషయంలో మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ యాజమాన్యం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అయినప్పటికీ రేసులో సత్య నాదెళ్ల ముందు వరుసలో కనిపిస్తున్నారు- అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఆయనతో పాటు మైక్రోసాఫ్ట్‌ యాజమాన్యం కంపెనీలో సేల్స్‌ విభాగంలోని ఉన్నతాధికారి అయిన కెవిన్‌ టర్నర్‌, స్కైపీ ద్వారా మైక్రోసాఫ్ట్‌లోకి వచ్చిన టోనీ బేట్స్‌ను కూడా ఇంటర్వ్యూ చేసింది. వీరితో పాటు నోకియా మాజీ ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన స్టీఫెన్‌ ఎలాప్‌ అభ్యర్థిత్వం కూడా పరిశీలనలో ఉంది. నోకియా మొబైల్‌ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేస్తున్న విషయం విదితమే. ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత మైక్రోసాఫ్ట్‌లో చేరేందుకు తాను సిద్ధమేనని స్టీఫెన్‌ ఎలాప్‌ స్పష్టం చేశారు.

'క్లౌడ్‌ ఓఎస్‌' ఘనత ఈయనదే

మైక్రోసాఫ్ట్‌లో 'క్లౌడ్‌ ఓఎస్‌'ను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్‌నెట్‌ స్కేల్‌ క్లౌడ్‌ సేవలను దీనిమీదే నిర్వహిస్తున్నారు. అంతేగాక పలు ప్రపంచ స్ధాయి కంపెనీలకు కూడా అధునాతన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ల నిర్వహణకు ఇదే కీలకం అయింది. అంతేగాక మైక్రోసాఫ్ట్‌లో 19 బిలియన్‌ డాలర్ల వ్యాపారమైన సర్వర్‌ అండ్‌ టూల్స్‌ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించారు. ఆన్‌లైన సర్వీసెస్‌ డివిజన్‌, బిజినెస్‌ డివిజన్‌లలో ఆయన గతంలో వైస్‌ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సీఈఓగా ఎంపికైన పక్షంలో మైక్రోసాఫ్ట్‌కు ఆయన మూడో సీఈఓ అవుతారు. 38ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పిన బిల్‌ గేట్స్‌, స్టీవ్‌ బామర్‌లే ఇంతవరకూ సీఈఓలుగా పనిచేశారు.

మైక్రోసాఫ్ట్‌ ఇటీవలి కాలంలో వినియోగ వ్యాపారం విభాగంపై అధికంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఎక్స్‌ బాక్స్‌ గేమ్‌ కన్సోల్‌, సర్ఫేస్‌ టాబ్లెట్స్‌ దీనికి ఉదాహరణ. నోకియా మొబైల్‌ యూనిట్‌ను కొనుగోలు చేయటం కూడా ఇందులో భాగమే. అయితే సత్య నాదెళ్లకు ఇటువంటి వ్యాపార విభాగాల్లో పనిచేసిన అనుభవం లేదు. కొత్త సీఈఓను ఎంపిక చేయటానికి మైక్రోసాఫ్ట్‌ దగ్గరైనట్లు, అంతర్గతంగా మొగ్గు సత్య నాదెళ్ల వైపే ఉన్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. బయటి వారిని సీఈఓగా తీసుకోరాదని నిర్ణయించుకోవటం కూడా దీనికొక కారణమని విశ్లేషించింది. మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా సత్య నాదెళ్ల ఎంపికైన పక్షంలో ప్రపంచ స్థాయి కంపెనీలను నిర్వహిస్తున్న అరుదైన భారతీయుల జాబితాలో ఆయన చేరతారు. ప్రస్తుతం పెప్సికో ఛైర్మన్‌, సీఈఓ ఇంద్రా నూయి, మాస్టర్‌కార్డ్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ అజయ్‌ బంగా, డాయిష్‌ బ్యాంక్‌ సహ-సీఈఓ అన్షు జైన్‌ ఈ జాబితాలో ఉన్నారు.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning