నైపుణ్యాలే కాదు.. అంతకు మించి!

అభ్యర్థి అత్యంత నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ సానుకూలత, సహానుభూతి, సహనం, విశ్వసనీయత, విశాల దృక్పథం లేకపోతే ఏ సంస్థా ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధపడదు. అందుకే ఆ లక్షణాలు లేని వారిని నిరోధించడానికి అనేక రకాల పరీక్షలు పెడుతుంది. అందులో హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ ఒకటి. అందరికీ దాదాపు ఒకే విధమైన ప్రశ్నలు ఉన్నప్పటికీ అభ్యర్థుల స్పందనలను అనుసరించి వారి వారి వైఖరులను పసిగట్టి వడగడతారు. ఈ కేస్‌ స్టడీలో సక్సెస్‌ఫుల్‌ అభ్యర్థి నమూనా సమాధానాలను తెలుసుకుందాం.

హెచ్‌ఆర్‌: మీ గురించి చెప్పి, మా సంస్థలో ఎందుకు చేరాలనుకుంటున్నారో వివరించండి.
మొదటి అభ్యర్థి: నా పేరు రవి. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ నేషనల్‌ కళాశాల నుంచి 2017లో పాసయ్యాను. పదో తరగతి శివ స్కూల్‌ నుంచి 82%తో, ఇంటర్‌ రామా కళాశాల నుంచి 78%తో పాసయ్యాను. నాన్న పేరు సుబ్బారావు, ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ పేరు సీత, గృహిణి. అన్నయ్య ఎంబీఏ చేసి ఒక ప్రైవేటు సంస్థలో రూ.15,000 జీతంతో పనిచేస్తున్నాడు. అక్కయ్యకు పెళ్లి అయింది. తను గృహిణి. ఈమధ్యనే బాబు పుట్టాడు. ఆ బాబంటే నాకు చాలా ఇష్టం. నాకు జావా ప్రోగ్రామింగ్‌ మీద గట్టి పట్టు ఉంది. గొప్ప ఐటీ ఇంజినీర్‌ కావాలని కోరిక.
విశ్లేషణ: అభ్యర్థి తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు. రెజ్యూమేలో ఉన్న వివరాలూ, అప్రస్తుతమైనవీ చెప్పటం అనవసరం. తన ప్రొఫైల్‌ ఏంటో, ఎందుకు దరఖాస్తు చేస్తున్నాడో వివరించలేకపోయాడు.
రెండో అభ్యర్థి: నా పేరు విశాల్‌. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కేకేఐటీ కళాశాల నుంచి 2017లో పాసయ్యాను. స్నేహితులతో కలిసి చిన్న చిన్న గేమింగ్‌ అప్లికేషన్స్‌ రూపొందించాను. ఒక ప్రముఖ సంస్థలో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికై, ఒక ప్రత్యేక గేమింగ్‌ అప్లికేషన్‌ బేసిక్‌ వెర్షన్‌ రూపొందించాను. చదువు పూర్తయ్యాక అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌కు అవసరమైన అదనపు కోర్సులు చేశాను. గత నెల రోజులుగా ఇలాంటి అప్లికేషన్లను రూపొందిస్తున్న ప్రాజెక్టులు ఉన్న సంస్థలకు దరఖాస్తు చేస్తోంటే మీ సంస్థ నుంచి ఇంటర్వ్యూ కాల్‌ వచ్చింది.
విశ్లేషణ: ఇతడు ఈ ఇంటర్వ్యూకు ప్రాస్పెక్టివ్‌ అభ్యర్థి. ప్రొఫైల్‌ ఈ సంస్థలో ఉన్న స్థానానికి దగ్గరగా ఉంది. ఇలాంటి అవకాశం కోసం మాత్రమే వెతకడం అతడి సన్నద్ధత ప్రయాణాన్ని తెలియజేస్తోంది.
హెచ్‌ఆర్‌: మీ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏమిటి?
రవి: రూ.25000తో ఒక మంచి సంస్థలో చేరి మా అమ్మానాన్నలను సంతోష పెట్టడం నా షార్ట్‌టర్మ్‌ ఆబ్జెక్టివ్‌. ఇక ఆ ఉద్యోగంలో ఒక 5-10 సంవత్సరాల్లో మేనేజర్‌ అయ్యి పెద్ద స్థాయికి చేరడం నా లాంగ్‌టర్మ్‌ ఆబ్జెక్టివ్‌.
విశ్లేషణ: భావోద్వేగాలతో డబ్బు, హోదా కోసం చూసే దృష్టి ఇతడిది. తన ప్రొఫైల్‌కు తగ్గట్టు పనిచేస్తే స్థాయి పెరిగి, దాని వల్ల అతడు ఆశించినవి నెరవేరతాయనే పరిణతి లేదు.
విశాల్‌: నాకు గేమింగ్‌ అప్లికేషన్స్‌ మీద పట్టు రావాలంటే మొదట ఆ ప్లాట్‌ఫాంను కల్పించే మీలాంటి ఒక సంస్థలో ఉద్యోగం సాధించి, ఒక మూడేళ్లు అన్ని స్థాయుల అప్లికేషన్స్‌ బిల్డ్‌ చేసి అనుభవం గడించడం నా షార్ట్‌టర్మ్‌ ఆబ్జెక్టివ్‌. ఇక నా ఆలోచనలతో గేమింగ్‌లో వినూత్న ప్రయోగాలను ఆ తరువాత పదేళ్లు చేపట్టి, సంస్థకు ఆర్థికంగా సహకరించడం, వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం నా లాంగ్‌టర్మ్‌ ఆబ్జెక్టివ్‌.
విశ్లేషణ: నాలుగు వాక్యాల్లో తన కెరియర్‌ ప్రయాణాన్నీ, ప్రస్తుత స్థితినీ, భవిష్యత్‌ ప్రణాళికనూ వ్యక్తపరిచాడు. అతడికి ఈ సంస్థ మంచి ప్లాట్‌ఫాం అయితే, సంస్థకు మంచి అసెట్‌ అయ్యే అవకాశం ఉంది.
స్వభావ లక్షణాలు
హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూయర్‌కు వారిద్దరి ప్రొఫైల్‌ కెరియర్‌ జర్నీ, ప్రస్తుత స్థాయి, భవిష్యత్తు గురించి ఒక అవగాహన వచ్చింది. ఇంటర్వ్యూలో ముఖ్యమైన స్వభావ లక్షణాలను అర్థం చేసుకోవడానికి ఇక తరువాతి ప్రశ్నలకు సంసిద్ధమయ్యారు.
హెచ్‌ఆర్‌: మీరు ఇంటర్వ్యూకు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినట్టున్నారు. ఇక్కడ వెయిటింగ్‌ కూడా చాలా ఉన్నట్టుంది. ఏమైనా ఇబ్బంది అనిపించిందా?
రవి: అవును. మా ఇల్లు మీ ఆఫీస్‌కు 30 కి.మీ.ల దూరంలో ఉంది. అక్కడి నుంచి రావడానికి పొద్దున్నే 7 గంటలకు బయల్దేరి, బస్సుల్లో నానా తిప్పలు పడితే 9 గంటలకు చేరుకున్నాను. ఇక్కడ సెక్యూరిటీ అంతా చెక్‌ చేసి లోపలికి పంపించారు. చాలాసేపు వెయిటింగ్‌ హాల్లో ఎదురుచూసిన తరువాత నన్ను ఇంటర్వ్యూకు పిలిచారు.
విశాల్‌: మా ఇల్లు దూరమే. కానీ నా కెరియర్‌కు ప్లాట్‌ఫామ్‌ను ఏర్పరచగలిగే సంస్థ కోసం నేను విదేశాలకైనా వెళ్తాను. ఎందుకంటే సంస్థకు దరఖాస్తు చేసేవారు చాలామంది ఉంటారు. ఇంటర్వ్యూకి సమయం పడుతుంది. నేను దాన్ని ఇబ్బందిగా భావించను.
హెచ్‌ఆర్‌: మీరు అంతసేపు వెయిటింగ్‌ హాల్‌లో ఉన్నారు కదా! మరి ఏం గమనించారు?
రవి: అందరినీ పిలుస్తున్నారు. నన్నెపుడు పిలుస్తారా అనే ఉత్సాహంలో పెద్దగా ఏం గమనించలేదు.
విశాల్‌: నాకు ఆఫీస్‌ చాలా నచ్చింది. ఇంటర్వ్యూకు వచ్చినవారిని నేహ అనే హెచ్‌ఆర్‌ పర్సన్‌ ఒక వరుసలో కూర్చోబెట్టారు. ఇంకో హెచ్‌ఆర్‌ సందీప్‌ అందరికీ సూచనలు ఇచ్చారు. ఇంటర్వ్యూకు వెయిటింగ్‌ ఉంటుంది కాబట్టి, మాకు మంచినీళ్లు, టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌, స్నాక్స్‌ ఒక పక్క కౌంటర్‌లో ఏర్పాటు చేశారు. ఒక క్రమంలో 10 ప్యానెళ్లలోకి పంపిస్తున్నారు. సందేహాలు ఉంటే తీరుస్తున్నారు. అంతా వ్యవస్థీకృతంగా అనిపించింది.
విశ్లేషణ: రెండు ప్రశ్నలకూ రవి భావోద్వేగపరంగా స్పందించాడు. ఇబ్బందిని వ్యక్తపరిచాడు. అతడికి ఓపిక లేదని తెలుస్తోంది. ఉద్యోగంపై శ్రద్ధ లేకపోవడమో, ఇంకేదో కారణాలు కావచ్చు. ఇవన్నీ ప్రతికూల విషయాలే. విశాల్‌ విషయానికి వస్తే అతడికి తనకు కావాల్సిన దానిమీద అవగాహన ఉంది. ప్రశాంతతతో ఉండటం వల్ల అన్నీ శ్రద్ధగా గమనించగలిగాడు. స్పష్టత ఉంది. రేపు ఈ సంస్థలో చేరితే ఏ ప్రాంతానికైనా వెళ్లగలడు, ఉన్నతంగా పని చేయగలడు.
టీం వర్క్‌
హెచ్‌ఆర్‌: మీరు మీ టీం కలిసి ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. మీ నాన్న ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల మీరు చేయాల్సిన పనిని సమయానికి చేయలేకపోతారు. మీతో ఎప్పుడూ పోటీపడే మీ టీం సభ్యుడు దాన్ని అవకాశంగా తీసుకుని మీరు పని చేయలేదని మేనేజర్‌కు చెప్పడం వల్ల మీరో ఇంక్రిమెంట్‌ కోల్పోతారు. తరువాత అదే పరిస్థితి ఆ సభ్యుడికి వచ్చి వాళ్ల తాతయ్యకు బాగాలేక సమయానికి పనిని అప్పజెప్పనపుడు మీరు అతనికి ఎలా బుద్ధి చెబుతారు?
రవి: నేను ఎప్పుడూ గొప్ప పెర్ఫార్మర్‌గా ఉండాలని కోరుకుంటాను. నా బృంద సభ్యుడు నన్ను దెబ్బ తీసినందుకు నాకు అవకాశం వస్తే పూర్తిగా సద్వినియోగపరచుకుంటాను. అతడికి ఇంక్రిమెంట్‌ పోయేలా చేసి బుద్ధి చెబుతాను.
విశాల్‌: నా ఉద్దేశంలో అతడు నన్ను దెబ్బతీయడం మూర్ఖత్వం. వ్యక్తి శక్తి కంటే బృంద శక్తి ఎంతో ఎక్కువ. అందుకే అందరూ కలిసి చేయాలి. ఎవరైనా ఇలాంటి అవగాహన లేక మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే వారికి అవగాహన కల్పిస్తాను. కష్టసమయంలో తోడుగా ఉంటాను. కుదిరితే వారి పని కూడా నేనే చేస్తాను. దానివల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
విశ్లేషణ: రవి ఆంబిషన్‌, స్వార్థచింతన కలిగిన వ్యక్తి. సమైక్య భావాలు లేవు. బృందంలో పని చేయడానికి పనికిరాడు. విశాల్‌కు మెచ్యూరిటీ స్థాయి ఎక్కువ. అందుకే విషయాన్ని విశాల పరిధిలో చూడగలిగాడు, దానికి సరైన పరిష్కారాన్ని చెప్పగలిగాడు. అతడు టీంను నడిపించగలడు. భవిష్యత్తులో మేనేజర్‌ అవగలడు.
ఏ వైఖరి అనుకూలం?
హెచ్‌ఆర్‌ కోణంలో ఇద్దరి ఇంటర్వ్యూల సారాంశం ఇలా ఉంటుంది.
రవి అన్ని రౌండ్లూ క్లియర్‌ చేసి హెచ్‌ఆర్‌ రౌండ్‌ వరకు వచ్చాడంటే అతను నైపుణ్యాల పరంగా బాగానే ఉన్నట్టు. కానీ అతని వైఖరి సంస్థకు అనుకూలమైంది కాదు. అతడు స్కిల్స్‌ను మాత్రమే పెంచుకున్నాడు. ఒక సంస్థలో పని చేయాలంటే కావాల్సిన విషయాలు అతని వద్ద సమృద్ధిగా లేవు. విశాల్‌కు నైపుణ్యాలతోపాటు ఒక సంస్థలో పనిచేయడానికి కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి.
సంభాషించేటప్పుడు దృష్టి సమన్వయం, శరీర భాష విషయంలో కూడా మెరుగ్గా ఉన్నాడు. ఓర్పు, దేన్నయినా స్వీకరించగల తత్వం, విశాల దృక్పథం, విశ్వసనీయత, నిబద్ధత.. వీటన్నిటిలోనూ పైమెట్టులోనే ఉన్నాడు.
అందుకే హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ అధికారి రవి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి, విశాల్‌ను ఎంపిక చేశారు.
విశ్వసనీయత
హెచ్‌ఆర్‌: మీతోపాటు ఇంకో సభ్యుడు, మేనేజర్‌లకు ఒక అరుదైన టెక్నాలజీలో ప్రావీణ్యం ఉంది. మీరు మీ బృంద సభ్యుడు, మేనేజర్‌తో కలిసి ఒక ప్రాజెక్టును దక్కించుకోవడానికి టెక్నికల్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వడానికి క్లయింట్‌ దగ్గరికి వెళతారు. అక్కడ మీలాగే వేరే సంస్థల వాళ్లూ వచ్చారు. అందరికీ మీ ప్రెజెంటేషన్‌ నచ్చింది. క్లయింట్‌ మీ ప్రతిభను గుర్తించారు. ఆ ప్రాజెక్టును మీ సంస్థకు ఇవ్వాలని నిర్ణయానికి వస్తారు. వారం రోజుల్లో నిర్ణయ ప్రకటన ఉంటుంది. ఈలోపు మీ పోటీ సంస్థ ప్రతినిధి మీ ముగ్గురినీ వారి సంస్థలో చేరమని ఆఫర్‌ ఇచ్చారు. ప్రస్తుత జీతభత్యాలకన్నా కొన్ని రెట్లు ఎక్కువగా ఇస్తామనీ, ఆ ప్రాజెక్ట్‌ వారికే వస్తుందన్నారు. మీ మేనేజర్‌, ఇంకో సభ్యుడూ చేరాలనే దృఢ నిర్ణయం తీసుకుని, మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. మీ ప్రస్తుత సంస్థకు ఆ ప్రాజెక్ట్‌ రాకపోతే రూ.50 కోట్ల ఆదాయం పోతుంది. ఆ పరిస్థితిలో మీరు ఏం చేస్తారు?
రవి: ఇది క్లిష్టమైన పరిస్థితి. వారితోపాటు చేరితే నా ఆదాయం పెరుగుతుంది. నా కెరియర్‌లో అదో పెద్ద జంప్‌. నా ప్రస్తుత పరిస్థితి నుంచి నేననుకున్న హోదాకి వెళ్లగలను. కానీ నమ్ముకున్న సంస్థకు నష్టం వస్తుంది. ఒకవేళ నేనొక్కడినే చేరకపోయినా మిగతా ఇద్దరి నిర్ణయం వల్ల ప్రాజెక్ట్‌ రాకపోవచ్చు. అప్పుడు నేనొక్కడినే మిగిలిపోతాను. దానివల్ల సంస్థతోపాటు నేనూ నష్టపోతాను. అలాంటప్పుడు విలువలకు పోకుండా ఆ ఆఫర్‌ను తీసుకోవడం మేలని భావిస్తాను.
విశాల్‌: ఇది సమస్యాత్మక విషయం. కానీ నేను ఆ సమస్యకు కారణాలు వెతుకుతాను. మా ప్రావీణ్యం వల్ల సంస్థకు పెద్ద ఆదాయాన్ని ఇచ్చే ప్రాజెక్ట్‌ ఇది. కానీ పోటీ వల్ల వేరొక సంస్థ దాన్ని దక్కించుకోడానికి ఎత్తుగడ వేసింది. స్వార్థ చింతనతో సహోద్యోగులతో చేతులు కలిపి సంస్థకు నమ్మకద్రోహం చేసి, నా మనసును కలుషితం చేసుకోలేను. ఆ ముద్ర నన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఒక్కసారి విలువలు లేవు అనే ముద్రపడితే మార్కెట్‌లో ఇక నా ప్రొఫైల్‌కి విశ్వసనీయత ఏముంటుంది?
అందుకే పరిష్కారం వెతుకుతాను. మొదట నా హైరార్కీకి జరిగిన విషయాన్ని వివరిస్తాను. నా సహోద్యోగులతో కూడా మాట్లాడుతాను. వారు ఆ సంస్థకే కట్టుబడి ఉండాలంటే ఎక్కువగా ఏం ఆశిస్తారో తెలుసుకుంటాను. ఆ విషయాలను సంస్థకు తెలియజేస్తాను. సంస్థ ప్రాజెక్ట్‌ను కోల్పోవడం కన్నా వారి ఆశలను నెరవేర్చమని అడిగితే మధ్యవర్తిత్వం చేస్తాను. నా సహోద్యోగులు తమ నిర్ణయాన్ని విరమించుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.
విశ్లేషణ: రవిది యథాలాపంగా ఆలోచించే స్వభావం. బాధ్యతాయుతమైన, విలువలు కలిగిన మనస్తత్వం కాదు. దానివల్ల తను నష్టపోవడమే కాకుండా సంస్థను కూడా నష్టపరుస్తాడు. అదే విశాల్‌ మొదట బాధ్యత, తరువాత విలువలు, ఆఖరిగా వివేకమున్న అభ్యర్థి. అతను తన సామర్థ్యంతో సంస్థను ఎత్తుకు తీసుకువెళ్లడమే కాకుండా తను కూడా ఎదిగి లీడ్‌ చేయగలడు. కష్ట సమయాల్లో అండగా నిలబడి సంస్థ అభివృద్ధికి తోడ్పడగలడు.

- వెంక‌ట్ కాంచ‌న‌ప‌ల్లి, సీఈఓ, స‌న్‌టెక్ కార్ప్‌‌‌ ‌‌


Posted on 06-02-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning