వచ్చేసింది.. వర్చువల్‌ ట్రెండ్‌!

అకడమిక్‌ అధ్యయనానికీ, ఉద్యోగానికీ మధ్య వంతెనలాంటిది ఇంటర్న్‌షిప్‌. కాళ్లు అరిగేట్లు కంపెనీల చుట్టూ తిరిగి ఏదో ఇంటర్న్‌షిప్‌ దక్కిందే చాలనుకుని పూర్తిచేసే కాలం మారుతోంది. ఉన్న ఊరి నుంచి కదలకుండా అనుకున్న రంగంలో ఆన్‌లైన్‌లో దేశ, విదేశాల్లో వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లు చేసే ట్రెండ్‌ వచ్చేసింది. ప్రస్తుతం వీటి స్థితి ఎలా ఉంది? ఏయే రంగాలు, ఏయే నగరాలు ఈ ఇంటర్న్‌లను ఆహ్వానిస్తున్నాయి? తదితర తాజా ధోరణులను తెలుసుకుందాం.

ఇంటర్న్‌షిప్‌ పాశ్చాత్య భావనే అయినప్పటికీ గత రెండు దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులూ, సంస్థలూ దీన్ని అక్కున చేర్చుకున్నాయి. ఉద్యోగ యోగ్యత లేమి, నైపుణ్యాల కొరతతో అభ్యర్థులు సతమతమవుతున్న పరిస్థితుల్లో.. కళాశాల నుంచి విద్యార్థులు బయటకు రాకముందే ఇంటర్న్‌షిప్పులు ఆరోగ్యకరమైన పని అనుభవాన్ని కల్పిస్తున్నాయి. ప్రయోగాత్మక పరిష్కారాలుగా నిలుస్తున్నాయి. ఇంటర్న్‌షిప్పుల వేదిక ఇంటర్న్‌శాల వరకే చూసినా 2016-17 సంవత్సరానికి వీటికి దరఖాస్తు చేసేవారి సంఖ్య 35%కు పెరిగింది. మన విద్యార్థులూ, గ్రాడ్యుయేట్లకు వీటిపై పెరుగుతున్న చైతన్యానికిది నిదర్శనం.
హాట్‌ సిటీలివే..!
మొత్తం 36% ఇంటర్న్‌షిప్‌ అవకాశాలతో దిల్లీ ముందంజలో ఉంది. స్టార్టప్‌లే కాదు.. పార్లమెంటేరియన్స్‌, ప్రముఖ సంస్థల ప్రతినిధులూ, పరిశ్రమల ప్రముఖులూ ఇక్కడ ఇంటర్న్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. తరువాతి స్థానాల్లో ముంబయి, బెంగళూరు ఉన్నాయి. వీటి తర్వాత పుణె, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాలు ఎక్కువ స్థాయిలో ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నాయి. మన దేశంలో టయర్‌-1 నగరాలు ఎక్కువ సంఖ్యలో అవకాశాలను అందిస్తున్నాయి. వేసవికాల ఇంటర్న్‌షిప్‌లు చేయాలనుకునేవారు వైవిధ్యభరితమైన ఇంటర్న్‌షిప్‌లకు ఈ నగరాల్లో ప్రయత్నించవచ్చు.
మరికొన్ని గణాంకాలు..
ఇంటర్న్‌షిప్‌లకు ఇచ్చే సరాసరి స్టైపెండ్‌ రూ.7500. అంతేకాకుండా ఈ వేదిక ద్వారా వచ్చే 46% ఇంటర్న్‌షిప్‌లు పీపీఓ లేదా ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌లే. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకుని, తమ కెరియర్‌ను ప్రారంభించాలనుకునే వారికి ఇది ఉత్తేజపరిచే విషయం. ఎందుకంటే.. వారి ఇంటర్న్‌షిప్‌ ఫుల్‌ టైం జాబ్‌గా మారే అవకాశం ఉంటుంది.
ఇంటర్న్‌లను ఆహ్వానిస్తున్నవాటిలో 85% స్టార్ట్‌అప్‌లు, చిన్న, మధ్య తరహా సంస్థలే. ఇంటర్న్‌లను తీసుకుంటున్న అత్యుత్తమ రంగాల కోసం పరిశీలిస్తే.. 14% ప్రధాన రిక్రూటర్లు ఈ-కామర్స్‌ రంగానికి చెందినవారు ఉన్నారు. మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఐఐటీలు, ఐఐఎంలు, ఎఫ్‌ఎంసీజీ వంటి అకడమిక్‌ సంస్థలు తరువాతి ప్రధాన రంగాలు.
వర్చువల్‌... విజయవంతం ఇలా!
అసైన్‌మెంట్లు, ఇంటర్వ్యూ పూర్తిచేశాక మొత్తానికి మిమ్మల్ని వర్చువల్‌ ఇంటర్న్‌గా ఎంపిక చేశారు. ఇంటర్న్‌షిప్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే మీరు ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నపుడు కొన్ని కీలకమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. వర్చువల్‌ ఇంటర్న్‌గా ఇది మీకు మొదటి అనుభవం కాబట్టి, అది విజయవంతమవడానికి ఈ కింది చిట్కాలను పాటించండి.
మొదటిదే కీలకం
మెంటార్‌తో మంచి భావవ్యక్తీకరణ నైపుణ్యాలను ఏర్పరచుకోండి. స్టైపెండ్‌, పని గంటలు, రోజువారీ షెడ్యూల్‌కు సంబంధించిన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోండి. మీ పరీక్షలు, సెమిస్టర్‌ బ్రేక్‌లు, మీరు పాల్గొంటున్న కాలేజ్‌ ఫెస్ట్‌ల సమాచారాన్ని ముందుగానే మీ మెంటార్‌కు తెలియజేయండి. ఫలితంగా ఆయన సమగ్ర పని ప్రణాళికను మీకు అందించే అవకాశం ఉంటుంది.
స్కైప్‌, గూగుల్‌ డాక్స్‌, డ్రాప్‌బాక్స్‌ మొదలైన టూల్స్‌ గురించి తెలుసుకోండి. వీటిని మీ ఇంటర్న్‌షిప్‌లో ఎక్కువ శాతం ఉపయోగించే అవకాశముంది. ఇక్కడ కమ్యూనికేషన్‌కు ప్రాథమిక మాధ్యమం ఈ-మెయిల్‌ అవుతుంది కాబట్టి, దాన్ని ప్రభావవంతంగా ఎలా రాయాలో నేర్చుకోవడమూ తప్పనిసరే.

నిరంతర ఫీడ్‌బ్యాక్‌
వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లో మార్గదర్శకత్వం, మెంటరింగ్‌ పరిమిత స్థాయిలోనే లభిస్తుంది. కానీ ఇంటర్న్‌షిప్‌ సమయంలో మీ వృత్తిగత అభివృద్ధికి అవరోధం కలగకుండా చూసుకోండి. ఈ-మెయిల్‌ ద్వారా మీ మెంటార్‌కి రోజువారీ అప్‌డేట్లను పంపుతూ, తరచూ ఫీడ్‌బ్యాక్‌ తీసుకోండి. అయితే మెంటార్‌కు ఎన్నో పనులుంటాయి కాబట్టి, వెంటనే ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి ఓపికతో ఉండాలి.
బృంద సమావేశాల్లో క్రియాశీలంగా..
వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లు సాధారణంగా పని ప్రదేశానికి దూరంగా జరుగుతాయి. దీంతో సాధారణంగా సంస్థ పని వాతావరణం గురించిన పరిజ్ఞానం పొందే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి బృందంతో పని చేయాల్సిన అవకాశం (వర్చువల్‌/ వాస్తవికం) ఎప్పుడు వచ్చినా క్రియాశీలంగా పనిచేయండి. తద్వారా వారిపై తమదైన ముద్ర వేయండి. ఆవిధంగా మానవ సహ సంబంధాలను మెరుగుపరచుకోవడంతోపాటు మీ నెట్‌వర్క్‌నూ బలోపేతం చేసుకున్నవారు అవుతారు.

చొరవ చూపండి
చెప్పిన పని వరకూ చేస్తూ, ప్రతి కొత్త విషయానికి సంబంధించి మెంటార్‌ నుంచి వచ్చే సూచనల కోసం ఎదురుచూస్తూ ఉంటే.. నేర్చుకునేది పరిమితమే. అదే కొద్దిగా చొరవ చూపి ఒక అడుగు ముందుకు వేస్తే చెరిగిపోని ముద్ర వేయగలుగుతారు. ఉదాహరణకు- మిమ్మల్ని సంస్థ బ్లాగుకు వ్యాసాలు రాయడానికి నియమించుకున్నారనుకుందాం. ఇలస్ట్రేటర్‌ను ఉపయోగించి పర్సనలైజ్‌డ్‌ కవర్‌ ఇమేజెస్‌ తయారు చేయడం, సంబంధిత సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌లను సూచించడం లాంటివి చేయవచ్చు. అలాగే మీ సంస్థ వెబ్‌సైట్‌లో లేని కొన్ని అంశాలను మెంటార్‌కు సూచించవచ్చు.
గడువుకు ముందుగా
వర్చువల్‌ వాతావరణంలో తరచుగా మీ పనిని పరీక్షించేవారెవరూ ఉండరు కాబట్టి గడువులోగా పని పూర్తిచేయడం కొంచెం కష్టమైన పని. కానీ మీరు స్వీయ నిబద్ధత, ప్రేరణతో ఉండాలి. మీ రోజువారీ పనులు, ముఖ్యమైన తేదీలు, అసైన్‌మెంట్ల వివరాలతో సొంత క్యాలెండర్‌ తయారు చేసుకుంటే మంచిది. ఇది వర్చువల్‌ ఇంటర్న్‌షిప్పే అయినప్పటికీ వీలైనంత ఉన్నతంగా పని చేయడానికి ప్రయత్నించండి.
కొంత ప్రణాళిక, ప్రయత్నంతో వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ మీ కెరియర్‌ను ఉన్నతంగా నిలుపగలదు. మీ పనితీరు అత్యుత్తమంగా ఉంటే ఇంటర్న్‌షిప్‌ను మీ వేసవి/ శీతాకాల సెలవుల్లో లేదా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నాక ఆఫీస్‌ ఉద్యోగంగా మార్చుకునే అవకాశమూ దక్కుతుంది.

వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ల పెరుగుదల
కొద్ది సంవత్సరాల క్రితం ‘వర్క్‌ ఫ్రం హోం’, ‘వర్చువల్‌ అవకాశాలు’ వంటి పదాలు అంతగా ప్రాముఖ్యం పొందలేదు. దేశవ్యాప్తంగా ఇవి నెమ్మదిగా ప్రాచుర్యం పొందాయి. గత ఏడాది 24,000కు పైగా వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లు నమోదు కావడమే ఇందుకు ఉదాహరణ. ఆఫీస్‌ ఇంటర్న్‌షిప్‌ల కంటే వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లకే మూడు రెట్లు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. వివిధ ప్రొఫైళ్లకు రిక్రూటర్లు కూడా వర్చువల్‌ ఇంటర్న్‌లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేననే సంకేతమిది. అంతేకాకుండా చదువుతోపాటు ఇంటర్న్‌షిప్‌ చేయాలనుకునే విద్యార్థులకు ఈ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లు మార్గం సుగమం చేస్తాయి.
ప్రతిభావంతులను ఎంపిక చేసుకోవాలనుకునే రిక్రూటర్లకు వేసవి (మే, జూన్‌), శీతాకాలం (డిసెంబరు) సరైన సీజన్లు. ఇంటర్న్‌షిప్‌లను అధిక సంఖ్యలో ఆశిస్తున్నవారు ఎక్కువగా దిల్లీ-ఎన్‌సీఆర్‌, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచే ఉన్నారు.
రిక్రూటర్లు ఏం చూస్తున్నారు?
గత ఏడాది 47% ఇంటర్న్‌షిప్‌లు మేనేజ్‌మెంట్‌ రంగానికి చెందినవే. మేనేజ్‌మెంట్‌ రంగంలో కెరియర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికిది సంతోషించదగ్గ విషయం. రిక్రూటర్లు మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌ ప్రొఫైళ్లకు చెందినవారిని ఎంచుకుంటున్నారు. గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు బి-సూళ్లలో చేరడానికి ముందే ఇంటర్న్‌షిప్‌ను చేయొచ్చు. ఒక్కోసారి ఈ మేనేజ్‌మెంట్‌ ఇంటర్న్‌షిప్‌తోనే ఉద్యోగంలోనూ చేరొచ్చు.
అలాగని ఇంజినీరింగ్‌ విద్యార్థులకేమీ తక్కువ అవకాశాలు లేవు. 22% ఇంటర్న్‌షిప్‌ అవకాశాలతో ఇంజినీరింగ్‌ విభాగం రెండో స్థానంలో ఉంది. రిక్రూటర్లు ఎంపిక చేసుకుంటున్న టాప్‌ ప్రొఫైళ్లలో వెబ్‌ డెవలప్‌మెంట్‌, మొబైల్‌ ఆప్‌ డెవలప్‌మెంట్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉన్నాయి. మొత్తం 19% ఇంటర్న్‌షిప్‌ అవకాశాలతో మీడియా రంగం తరువాతి స్థానంలో ఉంది. కంటెంట్‌ రైటింగ్‌, బ్లాగింగ్‌, జర్నలిజం, వీడియో మేకింగ్‌, ఎడిటింగ్‌ విభాగాలకు చెందినవారిని ఎంపిక చేస్తున్నాయి. సంస్థలు ఎంపిక చేస్తున్న తరువాతి పెద్ద కేటగిరీ డిజైన్‌. దీనిలో గ్రాఫిక్‌ డిజైన్‌, యానిమేషన్‌, యూఐ/యూఎక్స్‌ ప్రొఫైళ్లూ ఉన్నాయి.

- సురేష్ అగ‌ర్వాల్‌, సీఈఓ, ఇంట‌ర్న్‌శాల‌్‌‌‌ ‌‌


Posted on 07-02-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning