ఇక్కడ ఈసీఈ ప్రత్యేకం!

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ) పూర్తిచేస్తే ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయో అని మీరు అన్వేషిస్తుంటే.. ఒకసారి హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ) అందిస్తున్న ఈసీఈ కోర్సు గురించి కొంత సమాచారం తెలుసుకోవాలి. సంప్రదాయ కోర్సుతో పోలిస్తే కొన్ని ప్రత్యేక లక్షణాలతో దీన్ని రూపొందించారు.

హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ లేదు. వాస్తవానికి ఏ విభాగానికీ డిపార్ట్‌మెంట్లు లేవు. అన్నీ రిసెర్చ్‌ సెంటర్లు లేదా ల్యాబ్‌లే. విద్యార్థి ఏ బ్రాంచిలో చేరినా తనకు నచ్చిన రిసెర్చ్‌ సెంటర్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. పరిశోధనలు చేయవచ్చు. అదే ఇక్కడి ప్రత్యేకత. ఈసీఈకి సంబంధించిన డిస్ట్రిబ్యూటెడ్‌ స్టోరేజ్‌, ఆర్టిఫిషియల్‌ న్యూట్రల్‌ నెట్‌వర్క్స్‌, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఇన్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ రిసెర్చ్‌ సెంటర్లలో కంప్యూటర్‌సైన్స్‌ బ్రాంచి విద్యార్థులు కూడా పరిశోధనలు చేస్తూ కనిపిస్తుంటారు. అలాగే సీఎస్‌ బ్రాంచికి సంబంధించిన కంప్యూటర్‌ విజన్‌ లేదా మెషిన్‌ లెర్నింగ్‌ వంటి విభాగాలను ఈసీఈ అభ్యర్థులు అధ్యయనం చేయడం కూడా చూడవచ్చు.
ఇతర కాలేజీల్లో ఈసీఈ చేరిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో సంప్రదాయ సబ్జెక్టులైన ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌, ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌ తదితర సబ్జెక్టులు చదువుతుంటే ట్రిపుల్‌ఐటీలో మాత్రం కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, డేటా స్ట్రక్చర్స్‌, కంప్యూటర్‌ ఆర్గనైజేషన్‌ తదితరాలు నేర్చుకుంటారు.
ట్రిపుల్‌ఐటీలో సీఎస్‌, ఈసీఈలకు సంబంధించిన కోర్సు నిర్మాణాల్లో కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి. ఇంజినీరింగ్‌ మూడు, నాలుగు సంవత్సరాల్లో ఈసీఈ విద్యార్థులు సీఎస్‌లోని ఎలెక్టివ్స్‌ లేదా సీఎస్‌ అభ్యర్థులు ఈసీఈలోని ఎలెక్టివ్స్‌ను తీసుకోవచ్చు. ఇన్‌ఫర్మేషన్‌ థియరీ, కోడింగ్‌ టు మొబైల్‌ రోబోటిక్స్‌, కంప్యూటర్‌ విజన్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ మెథడ్స్‌ ఇన్‌ ఏఐ వంటి ఎలెక్టివ్స్‌ దాదాపు 20 వరకు అందుబాటులో ఉన్నాయి.
సీఎస్‌ఈ, ఈసీఈ విద్యార్థులు కలిసి పనిచేయడం వల్ల ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించిన సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. దీని వల్ల ఎన్‌విడియా, క్వాల్‌కామ్‌, ఇంటెల్‌ వంటి హార్డ్‌వేర్‌ సంస్థల్లోనూ; ఇంటర్‌నెట్‌ సంబంధిత సోషల్‌ మీడియా సర్వీసెస్‌ అందిస్తున్న గూగుల్‌, ఫేస్‌బుక్‌ల్లోనూ పనిచేయడం తేలికవుతుంది.
అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనే (ఆనర్స్‌, డ్యుయల్‌ డిగ్రీ) పరిశోధనలు చేసే అవకాశాన్ని విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీ కల్పిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధానంగా వీఎల్‌ఎస్‌ఐ అండ్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, రోబోటిక్స్‌, కంప్యూటర్‌ విజన్‌ అండ్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ల్లో వీరు జరిపే పరిశోధనలు వారి ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తున్నాయి. దీంతో ఈ విద్యార్థులు అంతర్జాతీయ సదస్సుల్లో పేపర్లు ప్రజెంట్‌ చేస్తున్నారు. వీరి పరిశోధనలు జర్నల్స్‌లో పబ్లిష్‌ అవుతున్నాయి. ఇలా గుర్తింపు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రోత్సాహకంగా అవార్డులను కూడా ట్రిపుల్‌ఐటీ అందిస్తోంది.
ప్రకటన వచ్చింది
ఈసీఈతోపాటు ఇతర అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి హైదరాబాద్‌ ఐఐఐటీ ప్రకటన జారీ చేసింది. కింది విధానాల ద్వారా ప్రవేశాలు జరుగుతాయి.
* జేఈఈ మెయిన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సీఎస్‌ఈ, ఈసీఈ సింగిల్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లోకి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు.
* డీఏఎస్‌ఏ (డైరెక్ట్‌ అడ్మిషన్‌ ఫర్‌ స్టూడెంట్స్‌ అబ్రాడ్‌) పద్ధతిలో విదేశాల్లోని అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తారు.
* యూజీఈఈ (అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌) పద్ధతిలో పరిశోధనల ప్రధానంగా సాగే డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లోకి అడ్మిషన్‌ ఇస్తారు. ఇందులో ప్రవేశపరీక్షతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ పరీక్షలో పరిశోధనల పట్ల అభ్యర్థుల అభిరుచిని పరిశీలిస్తారు.
ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్‌ ఆన్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ (ఐఓఐ), సైన్స్‌ ఒలింపియాడ్‌, మ్యాథమేటిక్స్‌ ఒలింపియాడ్‌, ఇంటర్నేషనల్‌ లింగ్విస్టిక్స్‌ ఒలింపియాడ్‌ (ఐఓఎల్‌), పాణినీయన్‌ లింగ్విస్టిక్స్‌ ఒలింపియాడ్‌ (పీఎల్‌ఓ)ల్లో ఏ ఒక్కదానిలోనైనా మనదేశం తరఫున పాల్గొన్నవారు యూజీఈఈకి దరఖాస్తు చేసుకుంటే ప్రవేశపరీక్ష లేకుండా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి పిలుస్తారు.
* ఎస్‌సీఏ (స్పెషల్‌ చానెల్‌ ఆఫ్‌ అడ్మిషన్‌) పద్ధతిని ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్తగా ప్రవేశపెట్టారు. అసాధారణ ప్రతిభ ఉన్నవారికి ప్రోత్సాహం ఇవ్వడం దీని లక్ష్యం. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకం ఉడాన్‌కి ఎంపికైన అభ్యర్థులు, ఆర్‌జీయూకేటీ వంటి సంస్థల్లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో చేరి 2018 మే నాటికి రెండో సంవత్సరం పూర్తిచేసుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అభ్యర్థులు ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎస్‌సీఏ పద్ధతి కింద 20 సీట్ల వరకు భర్తీ చేస్తారు.
కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్ష ఏప్రిల్‌ 18, 2018న జరుగుతుంది. యూజీఈఈ, ఎస్‌సీఏ పద్ధతుల కింద ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 5న మొదలైంది. చివరి తేదీ 15 మార్చి, 2018. మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. జూన్‌ మొదటి వారం నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి.
వెబ్‌సైట్‌: iiit.ac.in


Posted on 13-02-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning