గేట్‌ దాటితే ఇదిగో రూటు!

ఉన్నత విద్యకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు గేట్‌ ఇప్పుడు ప్రధాన ప్రవేశ మార్గంగా మారింది. ఇందులో మంచి ర్యాంక్‌ సాధిస్తే ఉత్తమ విద్యాసంస్థల్లో ఉపకారవేతనంతో పీజీ చేసుకోవచ్చు. చక్కటి జీతంతో జాబ్‌లో చేరిపోవచ్చు. గేట్‌ నిర్వహణ ఇటీవల ముగిసింది. కొత్త అభ్యర్థులు, మెరుగైన ర్యాంక్‌ కోసం మళ్లీ పరీక్ష రాసినవారు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గేట్‌ ర్యాంక్‌ ఆధారంగా అందుబాటులో ఉన్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల గురించి అభ్యర్థులు తగిన అవగాహన ఏర్పరచుకోవాలి. అప్పుడే గేట్‌ తర్వాత ఏం చేయాలనే ప్రశ్నకు సరైన సమాధానం లభిస్తుంది. ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోడానికి వీలుంటుంది.

గేట్‌ రాసే అభ్యర్థులు రెండు ప్రయోజనాలను ఆశిస్తారు. మొదటిది ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావకాశాల కోసం అనుకుంటే రెండోది ఉన్నత స్థాయి చదువుల కోసం (ఎంటెక్‌/ ఎంఎస్‌, పీహెచ్‌డీ).
గేట్‌ ఫలితాల ఆధారంగా అనేక ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూస్‌) తమ సంస్థల్లోని ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఈ సంస్థలు గేట్‌ స్కోరు/ ర్యాంకుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి, తరువాత గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి.
చాలామంది ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలపై ఆసక్తి పెంచుకోవడానికి ప్రధాన కారణం ఉద్యోగ భద్రతగా చెప్పవచ్చు. ఇక్కడ జీతభత్యాలు ఏడాదికి రూ.12 లక్షల వరకు లభిస్తాయి. తమకు సంబంధించిన రంగాల్లో (కోర్‌ సెక్టార్‌) పనిచేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఉత్సాహపరిచే పని వాతావరణం వీటిలో ఉంటుంది. ఇంజినీరింగ్‌ కోర్సులో సంపాదించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం రావటం మరో అనుకూలాంశం.
ప్రభుత్వరంగ సంస్థలు గేట్‌కు 70% నుంచి 85% వరకు వెయిటేజీని ఇస్తున్నాయి. మిగతా వెయిటేజీని గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకు ఇస్తాయి. ఎన్‌టీపీసీలో 85% వెయిటేజీ గేట్‌ స్కోరుకు, 5% వెయిటేజీ గ్రూప్‌ డిస్కషన్‌కు, 10% వెయిటేజీని ఇంటర్వ్యూకు ఇస్తున్నారు. బీహెచ్‌ఈఎల్‌లో 75% వెయిటేజీ గేట్‌ స్కోరుకూ, 25% ఇంటర్వ్యూకూ కేటాయిస్తున్నారు.
ఉపకార వేతనం
సంబంధిత సబ్జెక్టుల్లో లోతైన అవగాహన, ఉన్నత విద్యార్హతల కోసం విద్యార్థులు ఎంటెక్‌/ఎంఎస్‌లో చేరాలనుకుంటారు. మంచి ప్రాంగణ నియామకాలూ, ఉన్నత పరిశోధన (పీహెచ్‌డీ) అవకాశాల కోసం, అధ్యాపక రంగంలో ప్రవేశం కోసం కూడా పీజీపై మొగ్గు చూపిస్తుంటారు. గేట్‌ స్కోరు ఆధారంగా ఎంటెక్‌ ఎక్కడ చేసినా ఉపకార వేతనంగా నెలకు రూ.12,400 ఇస్తారు.
పీజీకి దరఖాస్తు చేస్తున్నారా?
పీజీకి దరఖాస్తు చేసుకునే ముందు ఈ కింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.
* ఎంచుకునే కళాశాల విశిష్టత
* ఎంచుకునే బ్రాంచి/ స్పెషలైజేషన్‌ ప్రాముఖ్యం.
* ప్రాంగణ నియామక అవకాశాలు
* ఏవిధమైన ఉద్యోగాన్ని చేయాలనుకుంటున్నారు? (సాఫ్ట్‌వేర్‌/ ప్రాడక్ట్‌ డెవలప్‌మెంట్‌/ కోర్‌) విశ్వవిద్యాలయం/ కళాశాల ఉండే ప్రదేశం, నివాస, రవాణా సౌకర్యాలు
* పారిశ్రామిక సంస్థలతో పరిశోధన, కన్సల్టింగ్‌ సంబంధాలు
* ఎంటెక్‌ ప్రోగ్రాం ఐఐఎస్‌సీ, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, విశ్వవిద్యాలయాలు, కొన్ని ప్రైవేటు కళాశాలల్లో ఉంటుంది. ఈ కళాశాలల్లో మెరిట్‌ పద్ధతిలో గేట్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.
* గేట్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులు నాణ్యమైన కళాశాలలను ఎంచుకునే ప్రాధాన్య క్రమాన్ని పరిశీలిస్తే మొదట ఐఐఎస్‌సీ తర్వాత వరుసగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు కళాశాలలు ఉంటాయి.
ఏ పీఎస్‌యూ? ఏ బ్రాంచి?
కొన్ని పీఎస్‌యూలు నిర్దిష్ట ఇంజినీరింగ్‌ బ్రాంచిల అభ్యర్థుల గేట్‌ స్కోరునే ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అవేమిటంటే..
‌పవర్‌గ్రిడ్‌: ఈఈ, ఈసీ, సీఈ, సీఎస్‌. ‌ వైజాగ్‌ స్టీల్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌): ఈఈ, ఎంఈ, ఎంటీ. ‌సెయిల్‌: ఎంఈ, ఎంటీ, ఈఈ, సీహెచ్‌, ఐఎన్‌, ఎంఎన్‌. ‌ఐఓసీఎల్‌: సీహెచ్‌, సీఈ, సీఎస్‌ఐటీ, ఈఈ, ఈసీ, ఐఎన్‌, ఎంఈ, ఎంటీ. ‌ఓఎన్‌జీసీ: ఎంఈ, సీఈ, ఈఈ, ఈసీ, ఫిజిక్స్‌, ఐఎన్‌, సీహెచ్‌, కెమిస్ట్రీ, మేథ్స్‌, పీఈ, సీఎస్‌ఐటీ ‌ ఎన్‌టీపీసీ: ఈఈ, ఎంఈ, ఈసీ, ఐఎన్‌, ఎంఎన్‌ ‌ బీహెచ్‌ఈఎల్‌: ఎంఈ, ఈఈ గెయిల్‌: ఎంఈ, ఈఈ, ఐఎన్‌, సీఈ, సీహెచ్‌ ‌ఎంటీఎన్‌ఎల్‌: సీఈ, ఈఈ, ఈసీ ‌ హెచ్‌ఏఎల్‌: ఎంఈ, ఈఈ, ఈసీ
ఐఐఎస్‌సీ/ ఐఐటీల్లో..
* సహజంగా ఎంటెక్‌ చేయాలనుకునేవారి మొదటి ప్రాధాన్యం ఐఐఎస్‌సీ/ ఐఐటీలు.
‌‌* కొన్ని ఐఐటీల్లో గేట్‌ స్కోరుతోపాటు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక విధానం స్పెషలైజేషన్‌ బట్టి మారే అవకాశముంది.
‌‌* గత సంవత్సరం కటాఫ్‌ స్కోరులను ఆధారంగా చేసుకుని ప్రతి ఐఐటీకీ వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వివరాలకు, గత సంవత్సర కటాఫ్‌ స్కోరు కోసం ఆయా కళాశాలల వెబ్‌సైట్‌లను పరిశీలించవచ్చు.
‌‌* ఐఐటీ/ ఎన్‌ఐటీలు, కొన్ని విశ్వవిద్యాలయాల్లో కొన్ని సీట్లు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాలో కూడా ఉంటాయి. వీటిని కూడా మెరిట్‌ పద్ధతిలో గేట్‌ స్కోరు ఆధారంగా ఇస్తారు. ఈ పద్ధతి ద్వారా సీటు పొందిన విద్యార్థులకు ఉపకారవేతనం లభించే అవకాశం ఉండదు. కానీ, ఈ పద్ధతిలో సీటు పొందే అభ్యర్థులు తక్కువగా ఉండటం వల్ల మంచి కళాశాలలో చేరే వీలుంటుంది. ఆర్థిక వనరులు ఉన్నవారు ఈ విధంగా కోరుకున్న స్పెషలైజేషన్‌ను మంచి కళాశాలలో పొందవచ్చు.
చాలా ఐఐటీల్లో గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంఎస్‌ విద్యార్థులను ఎంపిక చేస్తారు. దీని కాలవ్యవధి రెండేళ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. కానీ ఉద్యోగావకాశాలు సమానంగానే ఉంటాయి. కాబట్టి, ఎంటెక్‌ సీటు సరైన కళాశాలలో రానివారు దీనికి ప్రాధాన్యమిస్తారు. రిసెర్చ్‌ మీద అభిరుచి ఉండి, భవిష్యత్తులో పీహెచ్‌డీ చేయాలనుకున్న విద్యార్థులకు ఇదో మంచి అవకాశం.

ఇది కొందరు పూర్వ విద్యార్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించింది. ఇది ఏటా మారే అవకాశం ఉంది. రిజర్వేషన్‌ ఉన్నవారికి స్కోర్‌ తేడాలు ఉంటాయి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 10,000 ర్యాంకు వరకు ఐఐటీల్లో సీటు పొందే వీలుంది.
* ఎన్‌ఐటీఐఈ (ముంబయి) కళాశాలలో పీజీడీఐఈ, పీజీడీఎంఎం, పీజీడీపీఎం కోర్సులు (రెండేళ్లు) చేయడానికి గేట్‌ స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మేనేజ్‌మెంట్‌లో అభిరుచి ఉన్న ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ కళాశాలలో కోర్సు చేస్తే మంచి ఉద్యోగావకాశం (సంవత్సరానికి సరాసరి రూ.16 లక్షలు) లభిస్తుంది. ఈ సంస్థ ఐఐఎంలకు సమానం.
ఎన్‌ఐటీల్లో సీటు పొందడమెలా?
దేశంలో ఉన్న ఎన్‌ఐటీలకు అనేక ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో సీసీఎంటీ (సెంట్రలైజ్‌డ్‌ కౌన్సెలింగ్‌ ఫర్‌ ఎంటెక్‌) పద్ధతి ద్వారా ఏటా ఎంటెక్‌ ప్రవేశాలను నిర్వహిస్తారు. ఈ సీసీఎంటీ రిజిస్ట్రేషన్‌ ఏప్రిల్‌ రెండో వారంలో మొదలయ్యే అవకాశముంది.
* సీసీఎంటీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అయిన తర్వాత ఎంచుకున్న విద్యాసంస్థలను ప్రాధాన్యం ఆధారంగా వరుసక్రమంలో నింపాలి. ఈ ఎంపికను మూడు విడతల్లో నిర్వహిస్తారు. ఈ మూడు విడతల్లో సీటు లభించకపోయినా, నచ్చిన సీటు రాకపోయినా స్పాట్‌ రౌండ్‌కు వెళ్లే అవకాశముంది. ఈ రౌండ్‌ను ఆయా ఎన్‌ఐటీలు వేర్వేరుగా నిర్వహిస్తాయి. ఇది ఒక అదృష్ట అవకాశం. కొన్నిసార్లు తగిన స్కోర్‌ లేకపోయినా మంచి కళాశాలలో సీటు లభించే అవకాశం ఉంది.

* కొన్ని విశ్వవిద్యాలయాలు గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకోకుండా ప్రత్యేకంగా పరీక్ష పెట్టి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తాయి. అలాంటి వాటిలో దిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఐఐఐటీలు, పుదుచ్చేరి యూనివర్సిటీ మొదలైనవి ఉన్నాయి.
* ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులు గేట్‌ను ఉద్యోగం కోసం మాత్రమే రాస్తున్నారు. పైగా ఈ స్కోరు మూడేళ్ల వరకు చెల్లుబాటు ఉంటుంది. కాబట్టి రాసే ప్రతి అభ్యర్థీ ఎంటెక్‌లో చేరడం లేదు. కాబట్టి పైన తెలిపిన కటాఫ్‌ ర్యాంకులు 25% వరకు మారే అవకాశముంది.
* గేట్‌ స్కోరు ఆధారంగా కొన్ని ఇతర దేశాల్లో (సింగపూర్‌, జర్మనీ) ఎంటెక్‌/ ఎంఎస్‌ కోర్సులో చేరే అవకాశం కూడా ఉంది.
* అభ్యర్థులకు ఐఐటీ/ ఎన్‌ఐటీల్లో కచ్చితంగా సీటు లభిస్తుందని నమ్మకం లేకపోతే ఐఐఐటీలు, యూనివర్సిటీలకు కూడా దరఖాస్తు చేసుకుంటే మంచిది. అన్నా యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ), బిట్స్‌, పీఎస్‌జీ (కోయంబత్తూరు) మొదలైన వాటిని పరిశీలించవచ్చు.
* తెలుగు రాష్ట్రాల్లో జేఎన్‌టీయూహెచ్‌, జేఎన్‌టీయూకే, జేఎన్‌టీయూఏ, ఓయూ, ఎస్‌వీయూ, కేయూ, ఆంధ్రా యూనివర్సిటీల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.
* గేట్‌ ఉత్తీర్ణత సాధించనివారికి పీజీఈసెట్‌ (తెలుగు రాష్ట్రాలు), టాన్‌సెట్‌ (తమిళనాడు) రాసే అవకాశం కూడా ఉంది. వీటి ద్వారా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక కళాశాలలో ఎంటెక్‌ సీటు పొందవచ్చు. కానీ ఉపకార వేతనం లభించదు.
* ఒకటో రెండో కళాశాలలకు కాకుండా సుమారు పది కళాశాలలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. అలా చేస్తే మంచి కళాశాలలో, నచ్చిన స్పెషలైజేషన్‌ లభించే అవకాశం ఉంటుంది.
* కౌన్సెలింగ్‌ సమయంలో సీనియర్ల నుంచీ, తెలిసిన అధ్యాపకుల నుంచీ సలహా తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది.

- వై.వి.గోపాల‌కృష్ణ‌మూర్తి, ACE ఇంజినీరింగ్ అకాడ‌మీ


Posted on 21-02-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning