ఆరోగ్య రంగ ఆవిష్కరణలకు ఆహ్వానం

ఆరోగ్యం మనిషి జీవితంలో అత్యున్నత ప్రమాణం. నిత్యం ఆసుపత్రుల్లో లేదా చుట్టు పక్కల ఎన్నో ఆరోగ్య సంబంధ సమస్యలను మీరు చూస్తుంటారు. వాటి పరిష్కారానికి మీకేదైనా ఆలోచన వస్తే.. దాన్ని ఆచరణలోకి మార్చి.. మీతో స్టార్టప్‌లు పెట్టించి మిమ్మల్ని సరికొత్త పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌లో ఒక సెంటర్‌ ఉంది. ఇది ప్రస్తుతం మూడో బ్యాచ్‌కి నోటిఫికేషన్‌తో యువ పట్టభద్రులకు ఆహ్వానం పలుకుతోంది.

అప్పుడే పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఏ క్షణం వారికి ఎలాంటి ఆరోగ్య సమస్య వస్తుందో తెలియదు. మరి రోజంతా జాగ్రత్తగా ఉండటం వీలవుతుందా? చిన్న పరికరంతో అనుక్షణం అప్రమత్తత సాధ్యమే అని ఓ యువతి నిరూపించింది.
పక్షవాతం వచ్చి చచ్చుబడిపోయిన అవయవాలకు మళ్లీ కదలిక తెప్పించే ఆలోచనను ఆచరణలో పెట్టి ఒక చక్కటి ఉపకరణాన్ని సిద్ధం చేస్తున్నాడో యువకుడు.
ఈ ఇద్దరే కాదు ఇంకా ఎందరో యువ పట్టభద్రుల ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చి వారిని ఆంత్రప్రన్యూర్‌లుగా మారుస్తోంది హైదరాబాద్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఆంత్రప్రన్యూర్‌షిప్‌ (సీఎఫ్‌హెచ్‌ఈ). వీరికి ఆర్థిక చేయూతను ఫెలోషిప్‌తో మొదలుపెట్టి పరిశ్రమల ఏర్పాటు వరకు ప్రోత్సహిస్తోంది.
ఐఐటీ- బాంబే పూర్వ విద్యార్థులు రాజ్‌ మస్హ్రూవాలా, అవినాష్‌ల మదిలో నుంచి ఈ సెంటర్‌ ఆవిర్భవించింది. యువతకు వచ్చే ఎన్నో ఆలోచనలకు అవసరమైన ఆర్థిక మద్దతు లేక వృథా అవుతున్నాయని గుర్తించిన వీరు తగిన వేదిక సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఐఐటీలను, ఇతర ప్రసిద్ధ సంస్థలను పరిశీలించి చివరకు హైదరాబాద్‌ ఐఐటీని ఎంచుకొని సీఎఫ్‌హెచ్‌ఈని ఏర్పాటు చేశారు.
హెల్త్‌కేర్‌ పరిష్కారాలు
వైద్యరంగంలో ఎదురవుతున్న ఎన్నో రకాల సమస్యలకు యువత సాయంతో పరిష్కారం అందించడమే లక్ష్యంగా సీఎఫ్‌హెచ్‌ఈని హైదరాబాద్‌ ఐఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. యువ ఆవిష్కర్తల పరిశోధనలకు నిధులను ఏర్పాటు చేయడంతోపాటు, నిపుణుల తోడ్పాటును అందిస్తారు. 2016-17లో మొదటి బ్యాచ్‌ పూర్తయింది. ప్రస్తుతం రెండో బ్యాచ్‌కు చెందిన అభ్యర్థులు తాము గుర్తించిన సమస్యలకు పరిష్కారాన్ని అందించడంలో నిమగ్నమై ఉన్నారు. మూడో బ్యాచ్‌కి ఇప్పుడు ప్రకటన విడుదలైంది.
వివిధ దశల్లో పరీక్షలు
ప్రాథమిక సమాచారంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్టార్టప్‌ అనుభవం ఉంటే క్లుప్తంగా ఆ వివరాలను కూడా పొందుపరచాలి. దరఖాస్తుల స్వీకరణ పూర్తికాగానే తొలిదశలో వీడియో రౌండ్‌ ఉంటుంది. ఇందులో ఆన్‌లైన్‌లో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. ఈ రౌండ్‌లో ఎంపికైనవారిని రెండు రోజుల పాటు ఐఐటీ- హైదరాబాద్‌ ప్రాంగణంలో వివిధ దశల్లో పరీక్షిస్తారు. బృంద చర్చలు, మళ్లీ ముఖాముఖిలు ఉంటాయి. నిపుణలతో కూడిన కమిటీ తుది ఎంపికలు నిర్వహిస్తుంది.
ఉత్సాహంతో మొదలు
వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలనే ఉత్సాహం మొదటి క్వాలిఫికేషన్‌. మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, బీటెక్‌, బీడీఎస్‌, ఎంబీబీఎస్‌, బీడిజైన్‌ తదితరాల్లో ఏదో ఒక కోర్సు చేసి ఉండటం కనీస విద్యార్హత. మెడికల్‌ ఫీల్డ్‌లో ఏదైనా స్టార్టప్‌ను ప్రారంభించిన వారు లేదా ఎవరితో అయినా కలిసి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ రంగంలో ఆవిష్కరణల కోసం పరిశ్రమించేందుకు పట్టుదల ఉన్నట్లు రుజువు చేసుకున్నా అవకాశం ఇస్తారు. ఏటా దరఖాస్తుల సంఖ్య పెరుగుతోందని సీఎఫ్‌హెచ్‌ఈ కో-హెడ్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రేనూ జాన్‌ తెలిపారు. తాజా నోటిఫికేషన్‌ వచ్చింది. ఏప్రిల్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన చెప్పారు.
ఆవిష్కరించాలనే తపనే తొలి అర్హత - జుహీ అహ్మద్‌, సీఈవో, సీఎఫ్‌హెచ్‌ఈ
వైద్యరంగంలో కీలక ఆవిష్కరణలను ప్రోత్సహించాలనేది ప్రధాన లక్ష్యం. సమాజం కోసం, వైద్య రంగానికి తమ వంతుగా ఏదైనా చేయాలనే తపన, ఆంత్రప్రన్యూర్‌గా మారాలనే ఆకాంక్ష ఈ కేంద్రంలో అడుగుపెట్టేందుకు కావాల్సిన ప్రధాన అర్హతలు. కొత్తగా డిగ్రీలను అందుకున్న వారితోపాటు అప్పటికే ఏదైనా స్టార్టప్‌ అనుభవం ఉన్నవారికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. సమస్యను గుర్తించడం నుంచి దానికి పరిష్కారం చూపే ఉత్పత్తిని మార్కెట్లో తెచ్చే వరకు ఈ కేంద్రం వారికి అన్ని విధాలుగా మద్దతుగా ఉంటుంది.
నిపుణుల పర్యవేక్షణ
వడపోతల అనంతరం ఎంపికైన వారికి నెలకు రూ.50 వేలు ఫెలోషిప్‌ ఇస్తారు. హాస్టల్‌ సౌకర్యం కూడా ఉంది. ఏడాదిపాటు ఉండి గుర్తించిన సమస్యలకు తగిన పరిష్కారంగా ఆవిష్కరణలు చేయవచ్చు. అవసరమైతే మరో ఏడాది కూడా ఆర్థిక సాయం అందిస్తారు. తాము ఆవిష్కరించిన సాధనానికి అవసరమైన మార్కెటింగ్‌ మెలకువలు కూడా నేర్పిస్తారు. ఐఐటీలోని అన్ని ప్రయోగశాలలను వీరు 24 గంటలూ వినియోగించుకోవచ్చు. బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని నిపుణులు వీరికి సూచనలు, సలహాలు అందిస్తారు.
వైద్యరంగానికి అవసరమైన ఆవిష్కరణలే లక్ష్యంగా ఉన్న సీఎఫ్‌హెచ్‌ఈ హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రి, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ వంటి వాటితో కలిసి పనిచేస్తోంది. ఫెలోషిప్‌కి ఎంపికైన అభ్యర్థులు మొదటి మూడు నెలలు ఈ ఆసుపత్రుల్లోని వైద్యులు, ఇతర సిబ్బందితో కలిసి పని చేయాల్సి ఉంటుంది. శస్త్ర చికిత్సలు జరిగే తీరు, ఉపయోగిస్తున్న టెక్నాలజీ, ప్రధానంగా ఆపరేషన్ల సమయంలో జరుగుతున్న లోపాలను వీరు గుర్తిస్తారు. పరిశీలన సూక్ష్మస్థాయిలో జరుగుతుంది. ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తారు. సమస్యలకు పరిష్కారాన్ని ఆవిష్కరణల రూపంలో సూచిస్తారు. తక్కువ ఖర్చుతో ఎక్కువమందికి ఉపయోగపడే పరికరాలను రూపొందిస్తారు.
నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యుడికి తెలియజేసే పరికరాన్ని ఈ సెంటర్‌ విద్యార్థిని ప్రత్యూష పారెడ్డి ఆవిష్కరించారు. ‘నిమోకేర్‌’ అంకుర సంస్థను నెలకొల్పి ఈ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకురానున్నారు. అలాగే బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేసిన హబీబ్‌ అలీ మరో ఉపకరణాన్ని తయారు చేశారు. పక్షవాతంతో చచ్చుబడిపోయిన చేతులకు మళ్లీ జీవం పోసే విధంగా వ్యాయామాలు చేసేందుకు ఉపయోగపడే సాధనం అది. దీనికి ‘ఆర్మ్‌ ఏబుల్‌’ అని పేరుపెట్టారు. ‘బీ ఏబుల్‌’ అనే స్టార్టప్‌తో మార్కెట్లోకి రానున్నారు.
ఇలాంటి ఆవిష్కరణలన్నింటికీ అన్ని దశల్లోనూ అవసరమైన ప్రోత్సాహాన్ని సీఎఫ్‌హెచ్‌ఈ అందిస్తుంది. మరిన్ని వివరాల కోసం 9000021386 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: 15 ఏప్రిల్‌, 2018
వెబ్‌సైట్‌: http://hc.iith.ac.in
e-mail: fhe@iith.ac.in

- రాజేందర్‌ సురకంటి, ఈనాడు, సంగారెడ్డి


Posted on 22-02-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning