నేర్చుకుందాం నిర్వహణ నైపుణ్యాలు!

* ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు
* సమయం, ఖర్చు రెండూ తక్కువే

పట్టాలు, పరిజ్ఞానం కంటే నిర్వహణ నైపుణ్యాలకే కొన్ని సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఎలా పెంచుకోవాలి, ఎంతో వ్యయంతో కూడుకున్న వ్యవహారమని ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ఎన్నో ప్రముఖ సంస్థలు తక్కువ ఖర్చుతో, స్వల్ప సమయానికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందిస్తున్నాయి. అందుకే అభ్యర్థులు మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకోడానికి ఈ ఆన్‌లైన్‌ వేదికలను ఆశ్రయించవచ్చు.
మేనేజ్‌మెంట్‌ విద్యను కెరియర్‌గా ఎంచుకుంటున్న విద్యార్థులు, నిపుణుల సంఖ్య బాగా పెరుగుతోంది. గ్రాడ్యుయేట్లూ, వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులు కూడా ఎంబీఏలోని మూడు మేజర్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలైన ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, మార్కెటింగ్‌ల్లో ఏదో ఒకదానిలో నైపుణ్యాన్ని సాధించాలనుకుంటున్నారు. అందుకు మేనేజ్‌మెంట్‌ విద్యను ఎంచుకుంటున్నారు.
కానీ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌ కావడానికి నిజంగా ఎంబీఏ అర్హత అవసరమేనా? అది తప్పనిసరేమీ కాదు. నిశితంగా పరిశీలిస్తే ఎంబీఏ చేయడానికి మనకు రెండు ప్రధాన కారణాలు కనిపిస్తాయి. మొదటిది- ఇదివరకే సంబంధిత రంగంలో పనిచేస్తూ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకోవటం, రెండోది- కెరియర్‌ మార్చుకోవాలనుకోవటం (ఇంజినీర్లు ఎక్కువగా మేనేజ్‌మెంట్‌ దారిలో పయనిస్తున్నారు). కానీ ఎంబీఏ అంటే ఖర్చుతో కూడుకున్నది. సమయమూ తీసుకుంటుంది. ఇక్కడ రెండో ఆప్షన్‌ ఉంది. ఎక్కువ ఖర్చు లేకుండా, సమయం వృథా కాకుండానే పరిజ్ఞానం, కోరుకున్న నైపుణ్యాలను చేజిక్కించుకోవచ్చు.
ఆ అవకాశాన్ని కొన్ని ఆన్‌లైన్‌ శిక్షణలు అందిస్తున్నాయి! 4 వారాల నుంచి 6 వారాల వ్యవధి ఉండే స్వల్పకాలిక కోర్సులుగా ఇవి అందుబాటులో ఉన్నాయి.
నేటి డిజిటల్‌ యుగంలో మన చిన్న చిన్న సమస్యలు, సందేహాల పరిష్కారానికి కూడా ఆన్‌లైన్‌ను సంప్రదిస్తుంటాం. అలాంటిది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలను పొందడానికి మనకు ఎన్నో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. బాగా గిరాకీ ఉండి, సంస్థలు అభ్యర్థుల నుంచి ఆశిస్తున్న అంశాలనే ఆన్‌లైన్‌లో చక్కగా నేర్చుకోవచ్చు.
ఎన్నో సబ్జెక్టులు.. మరెంతో శిక్షణ
ప్రముఖ సంస్థలెన్నో ఈ కోర్సులను అందిస్తున్నాయి.
trainings.internshala.com coursera, khan academy, edX, internshala వాటిలో కొన్ని.
ఇంటర్న్‌శాల శిక్షణ: విద్యార్థులకు అందుబాటులో ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వటం దీని లక్ష్యం. విద్యార్థుల కెరియర్‌కు తోడ్పడేలా థియరీ, ప్రాక్టికల్‌ సమ్మేళనంగా, లోతైన పరిజ్ఞానం అందించేలా శిక్షణ కార్యక్రమాలను రూపొందించారు.
కోర్స్‌ఎరా: ప్రతికోర్సులో రికార్డ్‌ చేసిన వీడియో లెక్చర్లు, ఆటో గ్రేడెడ్‌, పీర్‌ రివ్యూడ్‌ అసైన్‌మెంట్లు, కమ్యూనిటీ చర్చల ఫోరమ్స్‌ ఉంటాయి. కోర్సు పూర్తిచేస్తే ఎలక్ట్రానిక్‌ కోర్స్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది.
ఖాన్‌ అకాడమీ: దీనిలో ప్రాక్టీస్‌ ఎక్సర్‌సైజులు, ఇన్‌స్ట్రక్షనల్‌ వీడియోలు ఉంటాయి. విద్యార్థుల అభ్యాసానికి సహాయపడే లెర్నింగ్‌ డాష్‌ బోర్డు ఉంటుంది. మ్యాథ్స్‌, సైన్స్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ మొదలైన ఎన్నో సబ్జెక్టుల్లో కోర్సులు అందిస్తున్నారు.
ఎడెక్స్‌: 2012లో హార్వర్డ్‌ యూనివర్సిటీ, ఎంఐటీలు స్థాపించిన ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ వేదికగా ప్రాచుర్యం పొందింది. వివిధ యూనివర్సిటీల, విద్యాసంస్థలకు సంబంధించిన వివిధ కోర్సులను అందిస్తోంది.
బిజినెస్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌
మంచి భావవ్యక్తీకరణ (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌) నైపుణ్యాలుంటే కార్పొరేట్‌ ప్రపంచంలో ముందంజలో ఉన్నట్లే. చక్కటి బిజినెస్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అంటే ఆంగ్లభాషా నైపుణ్యం (రాత, మాట్లాడే నైపుణ్యాలు), ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ను కలిగి ఉండటం. ఇది ఉద్యోగసాధనలోనే కాదు (మంచి రెజ్యూమే, కవర్‌ లెటర్‌ను రూపొందించడం, మీ అభిప్రాయాన్ని ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ల్లో తెలియజేసే అవకాశం ఉంటుంది) పనిచేసే చోట మంచి భావవ్యక్తీకరణకూ సాయపడుతుంది. బిజినెస్‌ ఈ-మెయిళ్లను రాయడం, ప్రెజెంటేషన్ల రూపకల్పన, భాగస్వాములు, క్లయింట్లతో వెర్బల్‌ కమ్యూనికేషన్‌ మొదలైనవన్నీ దీనిలోని భాగమే. తద్వారా కెరియర్‌ పురోగతినీ సాధించవచ్చు.
ఎంఎస్‌ ఎక్సెల్‌
మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌గా విజయం సాధించడానికి కావాల్సిన నైపుణ్యాల్లో ఎంఎస్‌ ఎక్సెల్‌ పరిజ్ఞానమూ ఒకటి. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరికీ దీనికి సంబంధించిన అవగాహన ఉంది. అయితే ప్రాథమిక పరిజ్ఞానం ఇక్కడ సరిపోదు. సమాచార నిర్వహణకు, ఆలోచన రూపకల్పనకు, చివరకు వ్యాపార నిర్ణయాలకు కూడా ఎంఎస్‌ ఎక్సెల్‌లో అడ్వాన్స్‌డ్‌ పరిజ్ఞానం అవసరమవుతుంది.
డిజిటల్‌ మార్కెటింగ్‌
మీకు ఏ కొత్త వస్తువు గురించైనా తెలిసిందంటే... అది మార్కెటింగ్‌ కారణంగా అయినా, మేనేజ్‌మెంట్‌ కెరియర్‌ నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా అయినా జరిగివుండాలి. డిజిటల్‌ మార్కెటింగ్‌ చాలా విస్తృతమైన విభాగం. దీనిలో ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, వెబ్‌ అనలిటిక్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, బ్లాగ్‌ క్రియేషన్‌, వీడియో, మొబైల్‌ మార్కెటింగ్‌ వంటి వివిధ విభాగాలుంటాయి.
డేటా అనలిటిక్స్‌
తోటి¨వారికి గట్టి పోటీ ఇవ్వాలంటే మీకు బిజినెస్‌, మార్కెట్‌ అనలిటిక్స్‌పై పరిజ్ఞానం తప్పనిసరి. బిజినెస్‌, మార్కెట్‌ నిర్వహణ, అంతర్‌ దృష్టిని అంచనా వేయడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలను అంచనా వేయడం, విశ్లేషించడం దీనిలోని భాగం. ఎక్సెల్‌, స్టాటిస్టిక్స్‌, మోడలింగ్‌ (రిగ్రెషన్‌, డేటా మానిప్యులేషన్‌, బిజినెస్‌ మోడలింగ్‌) మొదలైనవి డేటా అనలిటిక్స్‌లో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు.
బేసిక్‌ ట్రేడింగ్‌, ఇన్వెస్టింగ్‌ స్కిల్స్‌
మేనేజ్‌మెంట్‌లోని ఫైనాన్షియల్‌ విభాగంపై ఆసక్తి ఉంటే.. మీ సామర్థ్యాలను అంచనా వేసుకోవడానికి ట్రేడింగ్‌, పెట్టుబడిలో బిగినర్స్‌ శిక్షణ తీసుకోవడం మేలు. ఈ శిక్షణ స్టాక్‌లు, స్టాక్‌ ఎక్స్చేంజి, స్టాక్‌ మార్కెట్లు, ఫైనాన్షియల్‌ రేషియోస్‌, టెక్నికల్‌ అనాలిసిస్‌ మొదలైనవాటిపై పరిజ్ఞానాన్ని అందజేస్తుంది.
ఈ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలను ఆన్‌లైన్‌లో నేర్చుకోవడం ద్వారా సమయం ఆదా అవటంతోపాటు ఆర్థికంగా కూడా ఆదా చేసినట్టవుతుంది. మేనేజ్‌మెంట్‌ డిగ్రీ కోసం దీర్ఘకాలం చదవడం కంటే నేరుగా ఇంటర్న్‌షిప్‌కు వెళ్లడం లేదా ఉద్యోగంలోకి ప్రవేశించడం ద్వారా మీ తోటివారికంటే పైచేయి సాధించవచ్చు. తద్వారా వారి కంటే ముందుగా మేనేజ్‌మెంట్‌ కెరియర్‌ను ప్రారంభించవచ్చు కూడా. ఈ శిక్షణ కార్యక్రమాలు లైవ్‌ ప్రాబ్లమ్స్‌పై పనిచేసే అవకాశాన్ని కల్పిస్తాయి. పుస్తక జ్ఞానం కంటే ప్రాక్టికల్‌ పరిజ్ఞానం మేలని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా!


- సురేష్ అగ‌ర్వాల్, సీఈఓ, ఇంట‌ర్న్‌శాల‌


Posted on 27-02-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning