అడ్మినిస్ట్రేషన్‌.. ఐటీల్లోకి సరాసరి ప్రవేశం!

ప్రతి సంస్థలోనూ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్కిల్స్‌కి ప్రాధాన్యం పెరిగింది. వీటికి ఉద్యోగావకాశాలూ ఎక్కువగా ఉన్నాయి. ఇంజినీరింగ్‌ తర్వాత కూడా విద్యార్థులు ఎంబీఏ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అలాగే సాధారణ డిగ్రీ చేసిన వారు ఐటీ ఉద్యోగాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అటు వ్యాపార నిర్వహణ నైపుణ్యాల్లో పట్టా పుచ్చుకోవాలనుకునే అభ్యర్థులకు, ఇటు ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించడానికి పీజీ చేయాలనుకునే వారికి తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్‌ ఒక చక్కటి అవకాశం. ఈ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే ఎంబీఏ లేదా ఎంసీఏ పూర్తి చేసుకొని కలల కొలువులో చేరిపోవచ్చు.

బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ లేదా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పీజీ చేయాలనుకునేవారు రాష్ట్రస్థాయిలో రాయాల్సిన పరీక్ష.. ఐసెట్‌ (ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌). ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌ ఫిబ్రవరి చివరన ఇవ్వనుంది. పరీక్షల షెడ్యూల్‌ను రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ పరీక్షను వేర్వేరుగా నిర్వహిస్తున్నప్పటికీ సిలబస్‌ ఒకేలా ఉంటుంది. పరీక్ష స్వరూపాన్ని పరిశీలిస్తే ఐసెట్‌లో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. కేటాయించిన మార్కులు 200. గరిష్ఠ మార్కులు 150. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-ఎ డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సెక్షన్‌-బి మేథమేటికల్‌ ఎబిలిటీ, సెక్షన్‌-సి కమ్యూనికేషన్‌ ఎబిలిటీ.
ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు అకడమిక్‌ పరీక్షకూ, పోటీపరీక్షకూ తేడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గరిష్ఠ సంఖ్యలో మార్కులను సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సమయపాలన చాలా కీలకం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాల్సి ఉంటుంది. అందుకే సన్నద్ధత నుంచే ఆ కసరత్తు చేయాల్సి ఉంటుంది. కేవలం చదివితే సరిపోదు, పోటీ పరీక్షలకు ముఖ్యంగా నమూనా పరీక్షలను రాయాల్సి ఉంటుంది.
సన్నద్ధతను రెండు దశల్లో పూర్తి చేస్తే మేలు. ఒకటి సిలబస్‌లో ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవడం, ఆ తరువాత మాక్‌ పరీక్షలు రాయడం. ప్రాథమిక అంశాలను మార్చి 15 లేదా 20 నాటికి పూర్తిచేయాలి. ఆ తరువాత పరీక్షలు రాసేందుకు పూర్తి సమయం కేటాయించాలి.
ప్రత్యేక పదజాలం
సెక్షన్‌ -సిలో పదసంపద (ఒకాబ్యులరీ), బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెర్మినాలజీ, ఫంక్షనల్‌ గ్రామర్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ తదితర అంశాలు ఉంటాయి. ఇందులో ఫంక్షనల్‌ గ్రామర్‌ అకడమిక్‌ సబ్జెక్టుల్లో భాగంగా ఉండేదే. అయితే పదసంపద కూడా ఏదో రూపంలో ఉంటుంది. ఇందులో పదాలకు సమాన, వ్యతిరేక అర్థాలతోపాటు ఇడియమ్స్‌, సామెతలు తదితర అంశాలను కూడా చూడాలి. సందర్భోచితంగా వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడం కీలకం. నిత్యం ఆంగ్ల దినపత్రికలను చదువుతూ వాటిలో వచ్చే కొత్త పదాల అర్థాలను సందర్భాన్నిబట్టి ఊహించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెర్మినాలజీకి సంబంధించి పాత ప్రశ్నపత్రాలను చూడటం ద్వారా పరీక్ష కోణాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇందులో కాంప్రహెన్షన్‌ చాలా కీలకం. నిత్యం ఆంగ్ల దినపత్రికల్లో వచ్చే వ్యాసాలపై సొంతంగా ప్రశ్నలు వేసుకుంటూ చదివితే ప్రయోజనం ఉంటుంది. రచయిత ఏం చెప్పదలచుకున్నాడు? మొత్తం సారాంశం ఉద్దేశం ఏంటి.. తదితర ప్రశ్నలు వేసుకుంటే పరీక్షలో వచ్చే కాంప్రహెన్షన్‌ను తేలికగా చేయవచ్చు.
ప్రాథమికాంశాలను తెలుసుకోవడంతో సన్నద్ధత అయిపోదు. సాధ్యమైనన్ని మాదిరి పరీక్షలు రాసి, కీ సరిచూసుకోవాలి. ఆ తరువాత తరచూ తప్పులు చేసే అంశాలకు సంబంధించి ప్రాథమికాంశాలను మరోసారి అధ్యయనం చేయాలి.
వివిధ సెక్షన్ల మార్కుల విభజన
సెక్షన్‌ ఎ (డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్‌సాల్వింగ్‌)- 75 ప్రశ్నలు, 75 మార్కులు
సెక్షన్‌ బి (మేథమేటికల్‌ ఎబిలిటీ) - 75 ప్రశ్నలు, 75 మార్కులు
సెక్షన్‌ సి (కమ్యూనికేషన్‌ ఎబిలిటీ) - 50 ప్రశ్నలు, 50 మార్కులు
కాంప్రహెన్షన్‌ సాధన
* రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ను రోజూ కనీసం రెండు లేదా మూడుసార్లు సాధన చేయాలి. పరీక్ష వరకూ ఇది కొనసాగుతూనే ఉండాలి.
* సన్నద్ధతలో ఎక్కువ సమయం సెక్షన్‌- బికి కేటాయించాలి. దీనిపైనే సెక్షన్‌- ఎ ఆధారపడి ఉంది కాబట్టి ప్రాధాన్యం తప్పనిసరి.
* పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. కేటాయించిన సమయం 150 నిమిషాలు. అంటే సగటున ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధి ఉంది. ఈ నేపథ్యంలో వేగంగా చదవడం, అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అభ్యర్థులు నిత్యం సాధన చేయడం ద్వారానే ఇందులో మంచి స్కోరు సాధించే వీలుంటుంది.
* పరీక్షలోనూ సమయపాలన ముఖ్యం. సమయాన్నంతా ఒకే సెక్షన్‌కు కేటాయించకుండా వేరువేరు సెక్షన్లకు ప్రశ్నల కఠినత్వం ఆధారంగా కేటాయించుకోవాలి. ఎక్కువ సంఖ్యలో పూర్తిస్థాయి మాక్‌ పరీక్షలు రాయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.
మేలు చేసే మాక్‌ టెస్టులు
ఐసెట్‌లో మంచి ర్యాంకు రావాలంటే.. మాక్‌ పరీక్షలను రాయడం తప్పనిసరి. ప్రతిసారి విధిగా కీని పరిశీలించాలి. అలాగే అయిదు మాదిరి పరీక్షలు పూర్తయిన తరువాత మరోసారి ఆ అయిదింటిలో ఏ విభాగంలో ఎక్కువ తప్పులు చేస్తున్నారో పరిశీలించాలి. దీన్ని స్థూల విశ్లేషణగా చెప్పవచ్చు. మూడు సెక్షన్లలో ఎక్కువ తప్పులు జరిగిన విభాగంలో మరోసారి ప్రాథమికాంశాలను చదవాలి. రెండో దశలో సూక్ష్మ విశ్లేషణ జరపాలి. తరచూ ఏ అధ్యాయంలో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయో గుర్తించాలి.
ఉదాహరణకు..
స్థూల విశ్లేషణలో భాగంగా ఎక్కువ తప్పులు సెక్షన్‌-ఎలో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌లో చేస్తున్నట్లు గుర్తిస్తే ఇందులో ఉండే ప్రాథమికాంశాలను బాగా చదవాలి. ఇందులో కోడింగ్‌-డీకోడింగ్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, ఆల్ఫాబెట్‌ బేస్‌డ్‌ టెస్ట్‌, డైరెక్షన్స్‌.. తదితర అధ్యాయాలుంటాయి. వీటిని అధ్యాయాల వారీగా మళ్లీ సాధన చేయడం మంచిది.
ఆ తరువాత సూక్ష్మ విశ్లేషణకు వెళ్లాలి. మొత్తం అయిదు పరీక్షల్లో ఎక్కువ తప్పులు ఏ అధ్యాయంలో చేస్తున్నారో పరిశీలించుకుంటే మంచిది. ఉదాహరణకు- జామెట్రీ అనే అధ్యాయం నుంచి ఎక్కువ తప్పులు చేస్తుంటే, దానికి సంబంధించి మరోసారి ప్రాథమికాంశాలను పరిశీలించడంతోపాటు జామెట్రీ ప్రశ్నలు మాత్రమే ఉండే మాక్‌ పరీక్షలను సాధ్యమైనన్ని ఎక్కువ రాయడం ద్వారా గరిష్ఠంగా లబ్ధి పొందవచ్చు.
ముఖ్యమైన తేదీలు
తెలంగాణ షెడ్యూల్‌
నోటిఫికేషన్‌ విడుదల: ఫిబ్రవరి 22
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: మార్చి 6
దరఖాస్తు చివరితేదీ: ఏప్రిల్‌ 30
పరీక్ష తేదీలు: మే 23, 24
ఆంధ్రప్రదేశ్‌లో...
నోటిఫికేషన్‌: ఫిబ్రవరి చివరి వారం
పరీక్ష తేదీ: మే 2
ఏ విభాగాన్ని ఎలా చదవాలి?
సన్నద్ధతను మేథమేటికల్‌ ఎబిలిటీ నుంచి ప్రారంభించాలి. ఇందులో కొనసాగే సన్నద్ధత, సెక్షన్‌-ఎలోని డేటా సఫిషియన్సీకి కూడా ఉపయోగపడుతుంది. సెక్షన్‌-బిలో అరిథ్‌మెటిక్‌ ఎబిలిటీ, ఆల్జీబ్రా, జామెట్రీ, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాన్సెప్ట్‌కు ప్రాధాన్యమిస్తూ వీటికి సమాధానం కనుక్కునే విధంగా సిద్ధం కావాలి. పాఠశాల స్థాయిలో ప్రాథమికాంశాలను నేర్చుకుంటే సరిపోతుంది. అయితే వేగంగా చేయాలి కాబట్టి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలను సాధన చేయాల్సి ఉంటుంది.
సెక్షన్‌- ఎలో నేర్చుకున్న అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీలోని నిష్పత్తులు, శాతాలు, సరాసరి ఇక్కడ కూడా ఉపయోగపడతాయి. అంశాలు అవే అయినా అడిగే విధానంలో కొంచెం తేడా ఉంటుంది. అయితే వీటికి కూడా పాఠశాల స్థాయి పుస్తకాలపై పట్టు ఉంటే చాలు. ఇందులోనే ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ఉంటుంది. ఇందులో సాధారణంగా అకడమిక్‌ పరీక్షలో భాగం కాని అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానం తార్కికంగా ఆలోచించాలి. అప్పుడే నాలుగు సమాధానాల్లో తగిన ఆప్షన్‌ను గుర్తించ గలుగుతాము. కాబట్టి, అభ్యర్థులు పాత ప్రశ్నల సరళిని జాగ్రత్తగా పరిశీలించాలి.


- పి. గోపాల‌కృష్ణ‌, డైర‌క్ట‌ర్‌, కౌటిల్య కెరియ‌ర్స్‌‌


Posted on 28-02-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning